maternity services
-
ప్రసవాల్లో తిరుపతి బోధనాస్పత్రి టాప్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని బోధనాస్పత్రుల ప్రసూతి సేవల్లో తిరుపతి మెటర్నిటీ ఆస్పత్రి మొదటి స్థానంలో నిలిచింది. గతేడాది ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు అన్ని బోధనాస్పత్రుల్లో 83,493 ప్రసవాలు జరగ్గా.. అత్యధికంగా తిరుపతిలో 9,952 ప్రసవాలు చేశారు. 7,426 ప్రసవాలతో విజయవాడ జీజీహెచ్ రెండో స్థానంలో, 7,424 ప్రసవాలతో కర్నూలు జీజీహెచ్ మూడో స్థానంలో ఉన్నాయి. బోధనాస్పత్రుల్లో రోగుల సేవలను మరింత మెరుగుపరచడంతో పాటు ఎక్కువ మందికి సేవలందించేలా ప్రతి ఆస్పత్రికి లక్ష్యాలను నిర్దేశిస్తున్నారు. ఇందులో భాగంగా ఆస్పత్రుల్లోని మెటర్నిటీ వార్డుల్లో పడకల సామర్థ్యం ఆధారంగా నిర్వహించాల్సిన ప్రసవాలపై లక్ష్యాలను నిర్దేశించారు. 2023–24వ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బోధనాస్పత్రుల్లో 1.08 లక్షల ప్రసవాలు నిర్వహించాలని లక్ష్యం పెట్టుకోగా.. ఇప్పటివరకు 77.3 శాతం ప్రసవాలు చేశారు. రాజమండ్రి జీజీహెచ్‌లో 2,063 ప్రసవాలు చేయాలని లక్ష్యంగా నిర్దేశించగా.. 3,227 ప్రసవాలను నిర్వహించి లక్ష్య ఛేదనలో రాష్ట్రంలోనే ముందంజలో నిలిచింది. అలాగే 4,125 ప్రసవాలకు గాను 5,523 ప్రసవాలు నిర్వహించి లక్ష్య ఛేదనలో కడప జీజీహెచ్ రెండో స్థానంలో, 2,063కు గాను 2,683 ప్రసవాలతో మచిలీపట్నం జీజీహెచ్ మూడో స్థానంలో నిలిచాయి. మహిళలకు అండగా ప్రభుత్వం మాత, శిశు ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్న వైఎస్ జగన్ ప్రభుత్వం.. మారుమూల గ్రామాల్లో ప్రసవ వేదనతో ఉన్న గర్భిణులను 108 అంబులెన్స్‌లలో సకాలంలో బోధనాస్పత్రులకు తరలిస్తోంది. విశ్రాంత సమయానికి రూ.5 వేలు చొప్పున ఆరోగ్య ఆసరా అందిస్తోంది. అంతేకాకుండా ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తల్లీ, బిడ్డలను.. వైఎస్సార్ తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాల్లో క్షేమంగా స్వగ్రామాలకు చేరుస్తోంది. -
నిరుపేదల డాక్టరమ్మ.. ఈ అపర్ణ
అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో డాక్టర్ అపర్ణకు ఒక ఎమర్జెన్సీ కాల్ వచ్చింది 25 ఏళ్ల గర్భిణి అరుణకు ప్రసవం చేయడానికి వెంటనే రావాలని. హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు అపర్ణ. కానీ అప్పటికే గర్భంలో ఉన్న శిశువు మరణించింది. కనీసం తల్లినైనా కాపాడాలనుకున్నారామె. కానీ మూడు రోజుల తరవాత తల్లి కూడా మరణించింది. ఈ దుర్ఘటనను అపర్ణ మర్చిపోలేకపోయారు. ఇలాంటి పరిస్థితి మరెవ్వరికి రాకూడదన్న ఉద్దేశ్యంతో ఆమె ‘ఆర్మాన్’ పేరిట 2008లో ఎన్జీవోను స్థాపించారు. నిరుపేద, అణగారిన వర్గాలకు చెందిన గర్భిణులు, పిల్లల ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే లక్ష్యంగా... దేశంలోని మారుమూల ప్రాంతాల్లో మొబైల్ ఆధారిత వైద్యాన్ని ఆర్మాన్ ద్వారా అందిస్తున్నారు. కోవిడ్ సమయంలోనూ ప్రభుత్వ ఆసుపత్రులు, ఇతర ఎన్జీవోలతో కలిసి ఆర్మాన్ అనేక సేవలందించింది. ఆర్మాన్ కృషిని గుర్తించిన ఫార్చ్యూన్ సంస్థ.. తాజాగా ఈ ఏడాది ప్రకటించిన ‘వరల్డ్స్ 50 గ్రేటెస్ట్ లీడర్స్’ జాబితాలో డాక్టర్ అపర్ణ హెగ్డే పేరును చేర్చింది. ప్రతిష్టాత్మక ఫార్చ్యున్ 50 గ్రేటెస్ట్ లీడర్స్ జాబితాలో ఇద్దరు భారతీయులకు చోటు దక్కగా.. వారిలో ఒకరైన డాక్టర్ అపర్ణ హెగ్డే 15వ స్థానంలో నిలిచారు. స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ, క్లీవ్స్లాండ్ క్లినిక్‌లో చదువుకున్న డాక్టర్ అపర్ణ హెగ్డేకు అంతర్జాతీయ యూరో గైనకాలజిస్టుగా మంచి పేరుంది. ఆర్మాన్ ఎన్జీవో వ్యవస్థాపక మేనేజింగ్ ట్రస్టీగా వ్యవహరిస్తూ మరోపక్క ముంబైలోని కామా ఆసుపత్రిలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తూ పేదలకు ఉచితంగా వైద్యసేవలు అందిస్తున్నారు. దాదాపు రెండున్నర కోట్లమందికి.. ఆర్మాన్.. లెవరేజ్ టెక్నాలజీతో తక్కువ ఖర్చుతో తల్లి పిల్లలకు మంచి ఆరోగ్యాన్ని అందించే పరిష్కారాలను చూపుతుంది. కేంద్ర కుటుంబ ఆరోగ్య సంక్షేమ మంత్రిత్వ శాఖ భాగస్వామ్యంతో పనిచేస్తూ.. మొబైల్ ఆధారిత ‘మెటర్నల్ మెస్సేజింగ్ ప్రోగ్రామ్(కిల్కరీ), ఫ్రంట్‌లైన్ వర్కర్స్కు ట్రైనింగ్ ఇచ్చేందుకు మొబైల్ అకాడమీని నిర్వహిస్తోంది. ఇప్పటిదాకా దేశవ్యాప్తంగా 17 రాష్ట్రాల్లో దాదాపు 2.40 కోట్ల మంది మహిళలు పిల్లలు, 17 వేల మంది ఫ్రంట్‌లైన్ హెల్త్ కార్యకర్తలకు అర్మాన్ సేవలందించింది. ఆర్మాన్ సేవలను గుర్తించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ, బ్రిటీష్ మెడికల్ జర్నల్, జీఎస్కే సేవ్ ది చిల్డ్రన్ వంటి సంస్థలు అవార్డులతో సత్కరించాయి. గతేడాది ప్రపంచవ్యాప్తంగా 700 సంస్థలు ప్రతిష్టాత్మక ‘స్కోల్’ అవార్డుకు పోటీపడగా.. ఆసియా నుంచి ఆర్మాన్ ఈ అవార్డును దక్కించుకుంది. లాక్‌డౌన్‌లోనూ.. ‘ద ప్యాన్ ఇండియా ఫ్రీ వర్చువల్ ఓపీడి క్లినిక్‌ల ద్వారా 14వేలకు పైగా గర్భిణులు, పిల్లలకు ఉచితంగా వైద్యసాయం చేసింది. 24 గంటలు అందుబాటులో ఉండే ఫ్రీ కాల్ సెంటర్ ద్వారా 60 వేలమందికి పైగా గర్భిణులు, పిల్లలకు సేవల్ని అందించారు. ముంబైలోని మురికివాడల్లో నివసించే మూడు లక్షలమంది మహిళలకు వారం వారం ‘ఆటోమేటెడ్ వాయిస్ కాల్స్’ ద్వారా కోవిడ్–19కు సంబంధించిన సమాచారాన్ని అందించారు. ఫోన్‌కాల్స్, ఎస్ఎమ్ఎస్ సదుపాయాలతో లక్షలాది మంది గర్భిణులకు చేరువైంది. ఆర్మాన్ తరపున వర్చువల్ వైద్య సేవలు, వీడియోకాల్స్ ద్వారా అపర్ణతోపాటు మరికొందరు డాక్టర్లు గర్భిణులకు వైద్యం అందిస్తున్నారు. -
ఇక మెరుగైన ప్రసూతి సేవలు
గజ్వేల్, న్యూస్‌లైన్: జిల్లాలోని ప్రభుత్వాస్పత్రుల్లో ఇకనుంచి మెరుగైన ప్రసూతి సేవలను అందించడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పలు ఆస్పత్రుల్లో ఎత్తివేసిన సీమాంక్ (సమగ్ర అత్యవసర ప్రసూతి, శిశు ఆరోగ్యం) కేంద్రాలను పునరుద్ధరించడానికి జిల్లా యంత్రాంగం ప్రయత్నిస్తోంది. గర్భిణులకు ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసూతి సేవలు ఇక శాశ్వతంగా దూరం కానున్నాయనే భావన నెలకొన్న ప్రస్తుత తరుణంలో కేంద్రాల పునరుద్ధరణకు చర్యలు తీసుకోవడంతో పేదల్లో ఆశలు చిగురించాయి. వాస్తవ విషయానికి వెళితే... జిల్లాలోని ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసూతి సేవలందకపోవడం పేదలకు శాపంగా మారింది. ఆస్పత్రుల్లో నిర్వహిస్తున్న సీమాంక్ నామ్‌కేవస్తేగా మిగిలిపోయాయి. జిల్లాలోని సిద్దిపేటలో ఈ కేంద్రం సేవలు సజావుగా నడుస్తోంది. గజ్వేల్, మెదక్, నారాయణఖేడ్, సదాశివపేట పట్టణాల్లోని ప్రభుత్వాసుపత్రుల్లోనూ ఈ కేంద్రాలున్నాయి. వీటిలో శిశువు జననం తర్వాత బయటి వాతావరణాన్ని తట్టుకునేలా వార్మర్ యంత్రం, ఇంక్యుబేటర్లు తదితర అధునాతన సదుపాయాలున్నా.. సిబ్బందిని తొలగించడం వల్ల వసతులు నిరుపయోగంగా మారాయి. 24 గంటలూ డ్యూటీలో ఉండే గైనకాలజిస్ట్, ఇతర సిబ్బంది లేరనే కారణంతో అతి తక్కువగా డెలివరీలను చేస్తున్నారు. ఈ వ్యవహారంపై కలెక్టర్ స్మితాసబర్వాల్ ఈ కేంద్రాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఆయా కేంద్రాల్లో దశలవారీగా సిబ్బందిని నియమించి అభివృద్ధి చేయడం ద్వారా పేదలకు ప్రభుత్వపరంగా ప్రసూతి సేవలను చేరువలోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ విషయమై జిల్లా వైద్యాధికారి పద్మ ‘న్యూస్‌లైన్’తో మాట్లాడుతూ దశలవారీగా సీమాంక్ కేంద్రాలను అభివృద్ధి చేసి ప్రసూతి సేవలు పేదలకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.