సాక్షి,హైదరాబాద్ : ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్‌కు తెలంగాణ హైకోర్టులో ఊరట దక్కింది. స్మితా సబర్వాల్‌పై దాఖలైన పిటిషన్లను హైకోర్టు కొట్టి వేసింది. పూజా ఖేద్కర్ వ్యవహారం నేపథ్యంలో.. దివ్యాంగులపై ఆ మధ్య ఆమె చేసిన ఎక్స్ పోస్టులు వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే.
సోషల్ మీడియాలో ఆమె పెట్టిన పోస్ట్‌లను తొలగించాలని, దివ్యాంగులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు చర్యలు తీసుకోవాంటూ హైకోర్టులో దాఖలైన పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే ఆ పిటిషన్లకు విచారణ అర్హత లేదని తేలుస్తూ తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. దీంతో ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్‌కు ఊరట లభించినట్లైంది.
గతంలో స్మిత సబర్వాల్ ఏం మాట్లాడారు?
ఈ ఏడాది జులై నెలలో మాజీ ట్రైనీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్ ఉదంతం, యూపీఎస్సీ ఛైర్మన్ రాజీనామాపై స్మితా సబర్వాల్ ఎక్స్ వేదికగా స్పందించారు.
ఈ చర్చ మరింత విస్తృతమవుతున్న నేపథ్యంలో.. దివ్యాంగులను గౌరవిస్తూనే.. విమానయాన సంస్థ దివ్యాంగులను పైలట్‌గా నియమిస్తుందా? వైకల్యం కలిగిన సర్జన్‌ను మీరు నమ్మకంతో విశ్వసిస్తారా? ఆలిండియా సర్వీసులైన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌వోఎస్‌లు క్షేత్రస్థాయిలో పనిచేయాల్సినవి. ఎక్కువ గంటలు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ప్రజల ఫిర్యాదులను ఓపికగా వినాల్సి ఉంటుంది. ఈ పనులకు శారీరక దృఢత్వం అవసరం. ఇలాంటి అత్యున్నత సర్వీసులో అసలు ఈ కోటా ఎందుకవసరం? నేను కేవలం అడుగుతున్నా అని పేర్కొన్నారు.
సబర్వాల్ తన వ్యక్తిగత ఎక్స్ ఖాతాలో చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో దుమారం రేపాయి. దివ్యాంగులను అవమానించేలా, వారి శక్తిసామర్థ్యాలను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ విమర్శలు వెల్లువెత్తాయి. పలువురు స్మితా సబర్వాల్‌కు వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. తాజాగా, ఆ పిటిషన్లను హైకోర్టు కొట్టి వేసింది.
Comments
Please login to add a commentAdd a comment