smitha sabarval
-
స్మితా సబర్వాల్‌కు హైకోర్టులో ఊరట
సాక్షి,హైదరాబాద్ : ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్‌కు తెలంగాణ హైకోర్టులో ఊరట దక్కింది. స్మితా సబర్వాల్‌పై దాఖలైన పిటిషన్లను హైకోర్టు కొట్టి వేసింది. పూజా ఖేద్కర్ వ్యవహారం నేపథ్యంలో.. దివ్యాంగులపై ఆ మధ్య ఆమె చేసిన ఎక్స్ పోస్టులు వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో ఆమె పెట్టిన పోస్ట్‌లను తొలగించాలని, దివ్యాంగులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు చర్యలు తీసుకోవాంటూ హైకోర్టులో దాఖలైన పిటిషన్లో పేర్కొన్నారు. అయితే ఆ పిటిషన్లకు విచారణ అర్హత లేదని తేలుస్తూ తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. దీంతో ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్‌కు ఊరట లభించినట్లైంది.గతంలో స్మిత సబర్వాల్ ఏం మాట్లాడారు?ఈ ఏడాది జులై నెలలో మాజీ ట్రైనీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్ ఉదంతం, యూపీఎస్సీ ఛైర్మన్ రాజీనామాపై స్మితా సబర్వాల్ ఎక్స్ వేదికగా స్పందించారు.ఈ చర్చ మరింత విస్తృతమవుతున్న నేపథ్యంలో.. దివ్యాంగులను గౌరవిస్తూనే.. విమానయాన సంస్థ దివ్యాంగులను పైలట్‌గా నియమిస్తుందా? వైకల్యం కలిగిన సర్జన్‌ను మీరు నమ్మకంతో విశ్వసిస్తారా? ఆలిండియా సర్వీసులైన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌వోఎస్‌లు క్షేత్రస్థాయిలో పనిచేయాల్సినవి. ఎక్కువ గంటలు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ప్రజల ఫిర్యాదులను ఓపికగా వినాల్సి ఉంటుంది. ఈ పనులకు శారీరక దృఢత్వం అవసరం. ఇలాంటి అత్యున్నత సర్వీసులో అసలు ఈ కోటా ఎందుకవసరం? నేను కేవలం అడుగుతున్నా అని పేర్కొన్నారు.సబర్వాల్ తన వ్యక్తిగత ఎక్స్ ఖాతాలో చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో దుమారం రేపాయి. దివ్యాంగులను అవమానించేలా, వారి శక్తిసామర్థ్యాలను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ విమర్శలు వెల్లువెత్తాయి. పలువురు స్మితా సబర్వాల్‌కు వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. తాజాగా, ఆ పిటిషన్లను హైకోర్టు కొట్టి వేసింది. -
కారణాలు చెప్పొద్దు..
పరిగి వికారాబాద్ : ఎలాంటి కారణాలు చెప్పకుండా ఆగస్టు 15వ తేదీలోపు ఇంటింటికీ తాగునీరు సరఫరా చేయాలని ముఖ్యమంత్రి కార్యాలయ అదనపు కార్యదర్శి స్మితాసబర్వాల్ అధికారులను ఆదేశించారు. ఆగస్టు 14లోపు భగీరథ పనులు పూర్తి చేసి, 15న నీటి సరఫరా ప్రారంభించాలని సీఎం కేసీఆర్ డెడ్‌లైన్ విధించిన నేపథ్యంలో.. జాపర్‌పల్లిలో నిర్మించిన వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్‌ను మంగళవారం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా నీటి శుద్ధి ప్రక్రియలను పరిశీలించారు. ఇప్పటి వరకు పూర్తయిన పనులు, ఇంకా చేయాల్సిన వాటిపై పలువురు ఇంజినీర్లు ఆమెకు వివరించారు. పరిగి మండల జాపర్‌పల్లి, రాఘవాపూర్ నుంచి కొడంగల్ వరకు వేస్తున్న ప్రధాన పైప్‌లైన్ పనులను పరిశీలించారు. సమన్వయంతో పనిచేయాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డబ్ల్యూఎస్ సీఈ శ్రీనివాస్‌రెడ్డి, ఈఈ ఆంజనేయులు, ఆర్డీఓ విశ్వనాథం, తహసీల్దార్ అబీద్‌అలీ, స్థానిక డీఈ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. సమన్వయంతో సాగండి.. కొడంగల్ రూరల్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకంలో కాంట్రాక్టర్లు, అధికారులు సమన్వయంతో వ్యవహరిస్తూ నిర్దేశిత సమయానికి పనులు పూర్తి చేయాలని చర్యలు తీసుకోవాలని సీఎంఓ కార్యదర్శి స్మితాసబర్వాల్ ఆదేశించారు. 23 ఎంఎల్డీ సామర్థ్యంతో మండల కేంద్రం సమీపంలో నిర్మిస్తున్న నీటి శుద్ధి కేంద్రాన్ని, పైప్‌లైన్ పనులను పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. పరిగి సమీపంలోని జాపర్‌పల్లి(రాఘవాపూర్) 39 కి.మీ. నుంచి రా వాటర్ సరఫరా అవుతుందని, గ్రావిటీ లేకుండా నియోజకవర్గంలోని కొడంగల్, దౌల్తాబాద్, బొంరాస్‌పేట మండలాల్లోని 216 గ్రామాలకు నీటి సరఫరా అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పరిగి నుంచి కొడంగల్‌కు వేసిన పైప్లైన్లలో లకేజీలు ఉన్నాయని, కూలీల సమస్య ఉందని పలువురు అధికారులు ఆమెకు వివరించారు. పెండింగ్‌లో ఉన్న రూ.7 కోట్ల బిల్లులను మూడు రోజుల్లో విడుదలయ్యేలా చర్యలు తీసుకుంటానని తెలిపారు. కూలీల కొరతపై అసహనం వ్యక్తంచేస్తూ అదనంగా.. ఒక్కో బ్యాచ్‌లో 5గురు చొప్పున 47 బ్యాచ్‌లను ఏర్పాటుచేసుకొని సకాలంలో పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఆగష్టు 15వ తేదీ లోపు 216 గ్రామాలకు నీరందించేలని అధికారులను ఆదేశించారు. బీమాపై అవగాహన కల్పించండి... రైతుబంధు, బీమాపై అవగాహన కల్పించాలని సీఎంఓ కార్యదర్శి స్మితాసబర్వాల్.. ఆర్డీఓ వేణుమాధవ్‌కు సూచించారు. డివిజన్ పరిధిలో పరిష్కారం కాని పాస్‌పుస్తకాలు, చెక్కుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. క్షేత్ర స్థాయిలో వీఆర్ఓలు రైతులకు అవగాహన కల్పిస్తూ రైతుబంధు, బీమా వివరాలను తెలియజేయాలని చెప్పారు. భూవివాదాల కారణంగా నిలిచిన పాస్‌బుక్కులు, చెక్కుల వివరాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి రైతులకు న్యాయం చేయాలన్నారు. మిషన్ భగీరథ ప్రాంతంలో మొక్కలను నాటాలని, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలిపారు. కార్యక్రమంలో మిషన్ భగీరథ ఈఈ పద్మలత, ఈఎన్సీ కృపాకర్‌రెడ్డి, సీఈ చెన్నారెడ్డి, ఆర్డీఓ వేణుమాధవ్, సీఈ శ్రీనివాస్‌రెడ్డి, వికారాబాద్ ఈఈ నరేందర్, తహసీల్దార్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. -
మిషన్ భగీరథ పనులు వేగవంతం చేయాలి
అశ్వాపురం: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మిషన్ భగీరథ పనులు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వేగవంతం చేయాలని సీఎం కార్యాలయ ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్ అధికారులను ఆదేశించారు. మిషన్ భగీరథ పథకంలో భాగంగా మండల పరిధిలోని మిట్ట గూడెం రథంగుట్ట వద్ద నిర్మిస్తున్న 40 ఎంఎల్డీ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంటు, రథంగుట్టపై నిర్మిస్తున్న 900 కేఎల్, 3900 కేఎల్ రిజర్వాయర్ల పనులను మిషన్ భగీరథ ఉన్నతాధికారులతో కలిసి స్మితాసబర్వాల్ శుక్రవారం పరిశీలించా రు. అధికారులతో మాట్లాడి పనుల పురోగతిని తెలుసుకున్నారు. అనంతరం వాటర్ ట్రీట్మెం ట్ ప్లాంటు ఆవరణలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మిషన్ భగీరథ పనుల పురోగతిపై భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల మిషన్‌భగీరథ అధికారులతో సమీక్ష సమవేశం నిర్వహించారు. ఈ నెల 25 నాటికి మిట్టగూడెం రథంగుట్ట పైన నిర్మిస్తున్న రిజర్వాయర్ల ద్వారా రావాటర్‌ను పాల్వంచ మండలం తోగ్గూడెంలో నిర్మిస్తున్న 140 ఎంఎల్డీ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంటు వరకు నీరు విడుదల చేయాలన్నారు. ఈ నెల చివరి కల్లా కుమ్మరిగూడెం ఇంటెక్ వెల్, మిట్టగూడెం రథంగుట్ట వద్ద నిర్మిస్తున్న వాటర్ ట్రీట్మెంటు ప్లాంటు, రిజర్వాయర్ల పనులు పూర్తి చేయాలన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చేపడుతున్న మిషన్ భగీరథ పనులు ఈ నెల చివరినాటికి పూర్తి చేసి మే నెలలో ఇంటింటికి తాగునీరు అందించేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. పనుల్లో అలసత్వం తగదు.. ఇప్పటికే పనులను మూడు సార్లు పరిశీలించామని పనుల్లో పురోగతి లేదని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో నిర్మిస్తున్న వాటర్ ట్యాంక్‌లు, పైపులైన్ల పనులు త్వరిత గతిన పూర్తి చేయాలన్నారు. పనుల్లో అలస త్వం వహించవద్దని పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇంటింటికి నల్లా ద్వారా ప్రజలకు తాగునీరు అందించేందుకు మిషన్ భగీరథ పథకాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతుందని అధికారులు పనుల వేగవంతానికి చిత్తశుద్ధితో కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు, భద్రాచలం సబ్‌కలెక్టర్ పమెలా సత్పథి, మిషన్‌భగీరథ ఈఎన్సీ సురేందర్‌రెడ్డి, చీఫ్ ఇంజనీర్ విజయ్‌పాల్‌రెడ్డి, ఎస్ఈ శ్రీనివాస్, ఈఈలు సదాశివరావు, రవీందర్, డీపీఆర్ఓ శ్రీనివాసరావు, తహసీల్దార్ కే.విజయ్‌కుమార్, రెండు జిల్లాల డీఈలు, ఏఈలు పాల్గొన్నారు. -
జిల్లాను ఆదర్శంగా నిలపాలి
కలెక్టరేట్, న్యూస్‌లైన్: ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న మెతుకు సీమను దేశంలోనే ఆదర్శవంతమైన జిల్లాగా తీర్చిదిద్దాలని సీఎం అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్ పిలుపునిచ్చారు. తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాల్లో భాగంగా శనివారం సమీకృత కలెక్టరేట్ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య ఆవిష్కరించారు. అనంతరం ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న స్మితా సబర్వాల్ మాట్లాడుతూ, మెదక్ జిల్లాలో కేవలం 8 నెలలే కలెక్టర్‌గా పనిచేసినా, ఈ ప్రాంత ప్రజలిచ్చిన సహకారం తనకు ఎల్లప్పుడు గుర్తుంటుందన్నారు. ఇదే స్ఫూర్తితో నవ తెలంగాణ నిర్మాణానికి కృషి చేస్తానన్నారు. ఎంతో పుణ్యం చేస్తేకాని కలెక్టర్‌గా ప్రజలకు సేవ చేసే అవకాశం రాదని, అంతటి భాగ్యం తనకు లభించినందుకు ఎప్పుడూ గర్వంగా ఉంటుందన్నారు. కలెక్టర్‌గా ఉన్న వ్యక్తి బాధ్యతతో పనిచేస్తేనే ప్రజలకు మేలు జరిగి ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందన్నారు. అర్హులందరికీ ప్రభుత్వ సేవలందినప్పుడే బంగారు తెలంగాణ కల సాకారమవుతుందన్నారు. అందుకు ప్రభుత్వ ఉద్యోగులంతా కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు. తాను జిల్లాలో ప్రవేశపెట్టిన పథకాలను ఇన్చార్జి కలెక్టర్ హోదాలో శరత్ సమర్ధవంతంగా నిర్వహిస్తారన్న నమ్మకం తనకుందన్నారు. తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాల నిర్వహణలో, ప్రజాభివృద్ధి కార్యక్రమాల అమలులోనూ జిల్లా యంత్రాంగం అందించిన సహకారానికి హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఇన్చార్జి కలెక్టర్ శరత్ మాట్లాడుతూ, పేదలకు సేవ చేయాలన్న తపన కల్గిన అధికారుల జాబితాలో స్మితా సబర్వాల్ ముందుంటారన్నారు. ప్రజలకోసం పనిచేసే అధికారి దగ్గర పనిచేయడం తనకు గర్వకారణంగా ఉందన్నారు. స్మితా సబర్వాల్ జిల్లాలో అమలు చేస్తున్న ‘మార్పు’, ‘సన్నిహిత’ కార్యక్రమాలు అనతి కాలంలోనే ప్రజలకు చేరువయ్యాయన్నారు. మెదక్ ఆర్డీఓ వనజాదేవి మాట్లాడుతూ, భారతీయ మహిళకు ప్రతిరూపంగా నిలిచిన స్మితా సబర్వాల్ యువతకు మార్గదర్శకంగా ఉన్నారన్నారు. కేవలం జిల్లాకు మాత్రమే పరిమితమైన సబర్వాల్ సేవలను రాష్ట్రంలోని ప్రజలకు అందిచాలన్న ప్రభుత్వ నిర్ణయం చాలా మంచిదన్నారు. ఆమె రాష్ట్రస్థాయిలో పనిచేయడం వల్ల సన్నిహిత, మార్పు లాంటి కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా అమలవుతాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. సమావేశంలో జిల్లాలోని వివిధ శాఖల అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ప్రజలు, ఉద్యోగులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు పదోన్నతి పొందిన స్మితా సబర్వాల్‌కు పూర్ణకుంభం, బోనాలు, బతుకమ్మలతో స్వాగతం పలికారు. -
ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాన్పులయ్యేలా చూడాలి
కలెక్టరేట్, న్యూస్‌లైన్: ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన ప్రసూతి సౌకర్యాలు కల్పించడంతో పాటు గర్భిణుల నమోదుతో పాటు రెండవ, నాల్గవ వైద్య పరీక్షలు నిర్వహించడంలో జిల్లా రాష్ట్రంలోనే మొద టి స్థానంలో నిలిచిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతి కలెక్టర్ స్మితా సబర్వాల్‌ను అభినందించారు. బుధవారం హైదరాబాద్ నుంచి వైద్య ఆరోగ్యంపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మార్పు కార్యక్రమం ద్వారా క్లస్టర్ పరిధిలో స్వయం సహాయక సభ్యులు, అంగన్వాడీ, ఆర్డబ్ల్యూఎస్, ఐకేపీ, ఐసీడీఎస్ వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంతో సమావేశాలు నిర్వహించడంతో పాటు గర్భిణుల నమోదు, క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. హైరిస్క్ ప్రసవాలను ముందే గుర్తించి గర్భిణుల పట్ల అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. సిద్దిపేట సీహెచ్‌సీలో ప్రత్యేకంగా డెడికేటెడ్ హై రిస్క్ కేంద్రం ఏర్పాటు చేసి సుఖై ప్రసవాలు జరిగేలా వైద్య సదుపాయాలు, స్త్రీ వైద్య నిపుణులను అందుబాటులో ఉంచేలా ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ నెల 24న ప్రారంభించే కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి, కమిషనర్లను కలెక్టర్ ఆహ్వానించారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచేలా చర్యలు తీసుకోవడంలో భాగంగా 46 మంది స్టాఫ్ నర్సులను నియమించామన్నారు. గతేడాది అక్టోబర్ వరకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో నెలకు 1600 ప్రసవాలు జరగగా నవంబర్ నాటికి 2000 వేలకు పైగా నమోదవుతున్నాయన్నారు. పుట్టిన పిల్లలకు టీకాలు వేయడంలో ప్రత్యేక చొరవ చూపి మెరుగు పర్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. 19న పల్స్ పోలియో పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ కార్యక్రమంలో 0 నుంచి ఐదేళ్లలోపు చిన్నారులకు 100 శాతం పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. కాన్ఫరెన్స్‌లో జిల్లా నుంచి డీఎంహెచ్ఓ డాక్టర్ పద్మ, డీసీహెచ్ఎస్ డాక్టర్ వీణాకుమారి, ఎన్ఆర్హెచ్ఎం పి.జగనాథ్‌రెడ్డి, డీఆర్డీఏ పీపీ రాజేశ్వర్‌రెడ్డి, ఐసీడీఎస్ పీడీ శైలజ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
76 పనులు రద్దు
సాక్షి, సంగారెడ్డి: వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధుల(బీఆర్జీఎఫ్) వినియోగంలో నిర్లక్ష్యంపై కలెక్టర్ స్మితా సబర్వాల్ చర్యలకు శ్రీకారం చుట్టారు. ఏళ్ల తరబడిగా అటకెక్కిన పనులకు మంగళం పాడారు. బీఆర్జీఎఫ్, సాధారణ నిధుల కింద మంజూరైన పనుల్లో వివిధ కారణాలతో సుధీర్ఘకాలంగా ప్రారంభానికి నోచుకోని 76 పనులను రద్దు చేస్తూ జిల్లా కలెక్టర్ స్మితా సబర్వాల్ బుధవారం ఆదేశాలు జారీ చేశారు. ఈ పనుల అంచనా వ్యయం రూ.41.23 లక్షలు. రద్దయిన పనుల స్థానంలో ఆ నిధులతోనే ఇతర పనుల ప్రతిపాదనలు పంపించాలని అధికారులను సూచించారు. సంబంధిత గ్రామం/ మండలంలోనే కొత్త పనులు చేపట్టాలని జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారికి ఆదేశించారు. బీఆర్జీఎఫ్ నిధుల వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించిన కలెక్టర్ స్మితా సబర్వాల్ 2010-11 నుంచి 2013-14 మధ్య కాలంలో మంజూరైన నిధులతో చేపట్టిన పనుల పురోగతిపై నెల రోజుల కిందే సమగ్ర నివేదికలు తెప్పించుకున్నారు. 2010-11 నుంచి 2012-13 మధ్య కాలంలో రూ.87.86 కోట్ల అంచనా వ్యయంతో మొత్తం 10,188 పనులు మంజూరైతే అందులో 8,523 పనులు పూర్తయ్యాయని జడ్పీ సీఈఓ కలెక్టర్‌కు నివేదించారు. 1,524 పనులు పురోగతిలో ఉండగా 143 పనులు ఇంకా ప్రారంభం కాలేదు. ప్రారంభానికి నోచుకోని పనుల్లో 76 పనులు వివిధ కారణాలతో కార్యరూపం దాల్చడం కష్టమని అధికారులు తేల్చడంతో ఆ పనులను కలెక్టర్ రద్దు చేశారు. రద్దయిన పనుల్లో బీఆర్‌జీఎఫ్‌కు సంబంధించినవి 72 ఉండగా సాధారణ నిధుల కింద చేపట్టినవి 4 ఉన్నాయి. ముంచుకొస్తున్న గడువు 2010-13 మధ్య కాలానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న మరో 78 పనులు పూర్తి చేయడానికి మరో 15 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. పెండింగ్‌లో ఉన్న పనులన్నీ ఈ నెలాఖరు నాటికి పూర్తి కావాలని ఇప్పటికే కలెక్టర్ విధించారు. మరోవైపు 2013-14లో రూ.25 కోట్ల నిధులతో మంజూరైన 2,470 పనులను మార్చి 31లోగా పూర్తి చేయాల్సి ఉంది. ఆర్.ఆర్ చట్టం ప్రయోగం పనులు చేయకుండానే నిధులు స్వాహా చేసిన పలువురు సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులపై రెవెన్యూ రికవరీ చట్టం(ఆర్ఆర్ యాక్ట్) అమలుకు జిల్లా యంత్రాంగం సమాయత్తమవుతోంది. టేక్మాల్, పాపన్నపేట, కౌడిపల్లి తదితర పంచాయతీల్లో రూ.23 లక్షల బీఆర్జీఎఫ్ నిధులు స్వాహా చేసిన వ్యవహారంలో ఇప్పటికే మాజీ సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులకు నోటీసులు జారీ చేశారు. స్వాహా చేసిన నిధులను తిరిగి వసూలు చేయడానికి త్వరలో రెండో నోటీసు జారీ చేసి ఆర్ఆర్ చట్టాన్ని ప్రయోగించనున్నట్లు జడ్పీ అధికారులు తెలిపారు. -
రూ. కోట్లాది విలువైన ప్రభుత్వ భూమి స్వాధీనం
సంగారెడ్డి మున్సిపాలిటీ, న్యూస్‌లైన్: జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలోని మహిళా ప్రాంగణం పక్కన గల కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని అధికారులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. ఆ భూమిలో కొందరు వ్యక్తులు వెంచర్ వేసి విక్రయాలు జరిపారు. అది ప్రభుత్వ భూమి అని తెలియడంతో ప్లాట్లు కొనుగోలు చేసిన వారు గగ్గోలు పెడుతున్నారు. సంగారెడ్డి పట్టణంలోని సర్వే నంబర్ 203లోగల 11 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం 1982లో ఆల్విన్ పరిశ్రమకు అప్పగించింది. అనంతరం పరిశ్రమ మూతపడటంతో గత కొన్నేళ్లుగా నిరుపయోగంగా ఉంది. పట్టణం వేగంగా విస్తరించడంతో కొందరు వ్యక్తులు ఈ స్థలాన్ని స్వాధీనంలోకి తీసుకొని వెంచర్ వేశారు. అంతర్గత రోడ్లు, విద్యుత్ స్తంభాలు, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేసి పలువురికి ప్లాట్లు విక్రయించారు. స్మితా సబర్వాల్ కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన తరువాత ఈ వెంచర్‌పై ఫిర్యాదులు అందడంతో సంగారెడ్డి ఆర్డీఓ ధర్మారావును విచారణకు ఆదేశించారు. ఆర్డీఓతోపాటు తహశీల్దార్ గోవర్ధన్ ఈ భూములను సర్వే చేయగా ఆల్విన్ పరిశ్రమకు చెందినట్టుగా రికార్డులున్నట్టు కలెక్టర్‌కు నివేదిక సమర్పించారు. ఇందుకు స్పందించిన ఆమె సర్వే నంబర్ 203లోగల 11 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వ భూమిగా నిర్ధారించారు. ఇక్కడ ఎలాంటి కట్టడాలు జరపరాదని ఆదేశించారు. ఈ మేరకు రెవెన్యూ అధికారులు బుధవారం అక్కడ హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. ఇది ప్రభుత్వ స్థలమని, క్రయవిక్రయాలు జరపకూడదని అందులో పేర్కొన్నారు. ఈ స్థలం విలువ సుమారు రూ.11 కోట్లు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. తమకు నోటీసులు ఇవ్వకుండానే హెచ్చరిక బోర్డు ఎలా ఏర్పాటు చేస్తారంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారి రెవెన్యూ సిబ్బందిని నిలదీశాడు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశామని, ఇందులో తమ ప్రమేయం లేదని వారు పేర్కొన్నారు. ఇది ప్రభుత్వ స్థలం కాదని, తమ వద్ద అన్ని పత్రాలు ఉన్నాయని సదరు రియల్ ఎస్టేట్ వ్యాపారి చెబుతున్నాడు. -
జవాబుదారీతోనే సత్ఫలితాలు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: స్మితాసబర్వాల్ జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన కొద్ది రోజుల్లోనే పాలన యంత్రాంగాన్ని గాడిలో పెట్టారు. సమీక్షలు, క్షేత్ర స్థాయి పర్యటనలతో అధికారులు, సిబ్బందికి బుల్లెట్ వేగంతో దిశానిర్దేశం చేస్తున్నారు. విద్య, ఆరోగ్యం తన ప్రాధాన్యతలని చెప్తున్నా, అన్ని విభాగాల పనితీరుపై సమ స్థాయిలో దృష్టి సారించారు. ప్రజావాణిని ప్రక్షాళన చేయడంతో పాటు ‘మార్పు’, ‘సన్నిహిత’ వంటి కార్యక్రమాలతో ప్రజలు, అధికార యంత్రాంగాన్ని పాలనలో భాగస్వాములను చేస్తున్నారు. సమయపాలన, సమస్యల పరిష్కారంలో అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటూ చొరవతో పనిచేయాలని నిక్కచ్చిగా చెప్తున్నారు. సుమారు రెండు నెలల్లోనే జిల్లా పాలన యంత్రాంగంపై తనదైన ముద్ర వేసిన కలెక్టర్‌తో ‘సాక్షి ప్రతినిధి’ ముఖాముఖి. సాక్షి: ‘గ్రీవెన్స’లో పరిష్కారం కాకుంటేనే మీ వద్దకు రావాలనడం ఎంతవరకు సమంజసం? కలెక్టర్: ‘గ్రీవెన్స సెల్’లో వచ్చే సమస్యల పరిష్కారానికి ఇంతకంటే మెరుగైన మార్గం లేదని భావిస్తున్నా. నేరుగా కలెక్టర్‌ను కలిస్తేనే సమస్యలు పరిష్కారమవుతుందనేది తప్పుడు అభిప్రాయం. వ్యక్తి కేంద్రంగా నడిచే వ్యవస్థ ఎప్పుడూ ఆరోగ్యకరంగా ఉండదు. అన్ని ప్రభుత్వ విభాగాలు కలిసి కట్టుగా, జవాబుదారీతనంతో పనిచేయాలి. బృందంగా పనిచేయలేక పోతే ఫలితాలు సాధించలేం. ప్రజావాణిలో వచ్చిన విజ్ఞాపన 30 రోజుల్లో పరిష్కారం కాలేదంటే అధికారి ఫెయిల్యూర్‌గానే భావించాల్సి ఉంటుంది. అప్పుడు నేను కలెక్టర్‌గా సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఇద్దరు, ముగ్గురిని మినహాయిస్తే అందరూ విజ్ఞాపనల పరిష్కారం మీద దృష్టి పెడుతున్నారు. నాతో పాటు జాయింట్ కలెక్టర్, అదనపు జేసీ కూడా ఠమొదటిపేజీ తరువాయి ఎప్పటికప్పుడు ప్రజావాణి విజ్ఞప్తుల పరిష్కారంపై సమీక్ష చేస్తున్నాం. మండల స్థాయిలోనూ ఎంపీడీఓ, తహశీల్దార్ తదితరులు ఒకేచోట నుంచి విజ్ఞాపనలు తీసుకుంటున్నారు. ప్రజలు మండల స్థాయిలోనే ‘గ్రీవెన్స సెల్’కి వెళ్లాల్సిందిగా సూచిస్తున్నాం. మండల స్థాయిలో పరిష్కారం కానిపక్షంలోనే కలెక్టరేట్‌కు రావాలన్నది నా ఉద్దేశం. సాక్షి: ‘గ్రామదర్శిని’ మొక్కుబడిగా జరుగుతుందనే ఫిర్యాదులున్నాయి? కలెక్టర్: క్షేత్ర స్థాయిలో నెలకొన్న అనేక సమస్యలు గ్రామదర్శిని ద్వారా మా దృష్టికి వస్తున్నాయి. గ్రామాలకు వెళ్తున్న బృందాల నుంచి నివేదికలు తీసుకుని విశ్లేషిస్తున్నాం. దీర్ఘకాలంగా నెలకొన్న సమస్యలు, నిధుల విడుదలతో ముడిపడిన అంశాలకు తక్షణ పరిష్కారం వస్తుందని చెప్పలేం. గ్రామదర్శినిలో లేవనెత్తిన సమస్యలను సంబంధిత విభాగాలకు పంపిస్తున్నాం. ప్రజలు లేవనెత్తిన సమస్యలు పరిష్కారమయ్యాయా లేదా అనే అంశంపై ప్రతీ వారం సమీక్ష జరుపుతున్నాం. సాక్షి: ‘మార్పు’పై క్షేత్రస్థాయిలో ఇంకా అవగాహన ఏర్పడినట్లు లేదు? కలెక్టర్: మొదటిసారిగా స్వయం సహాయక సంఘాలను భాగస్వాములను చేస్తూ ‘మార్పు’ను చేపడుతున్నాం. ప్రస్తుతం అవగాహన కలిగించే దిశలో అనేక శిక్షణ కార్యక్రమాలు చేపట్టాం. అధికారుల స్థాయిలో సమావేశాలు ముగిశాయి. నెలాఖరుకు గ్రామస్థాయిలో అవగాహన సమావేశాలు ముగిసేలా షెడ్యూలు రూపొందించాం. జనవరి, పిబ్రవరి వరకు ‘మార్పు’ ఫలితం కనిపించడం ప్రారంభమవుతుంది. గర్భిణుల నమోదు, ప్రసూతికి ఎక్కడకు వెళ్తున్నారు. టీకాలు, చిన్నారుల పెరుగుదల, అభివృద్ధి తదితర అంశాలపై మహిళలకు విస్తృతస్థాయిలో అవగాహన కల్పించాలన్నదే ఉద్దేశం. ప్రజలు, ప్రభుత్వ విభాగాల సమన్వయంతోనే మెరుగైన ఫలితాలు సాధ్యమవుతాయి. సాక్షి: ‘సన్నిహిత’పై మీ అంచనాలేమిటీ? కలెక్టర్: ప్రాథమికంగా సంక్షేమ హాస్టళ్ల పనితీరు మెరుగుపరిచేందుకే ‘సన్నిహిత’ అమలు చేస్తున్నాం. కొత్తగా నిధులు, నిర్మాణాలు చేపట్టడం ఈ కార్యక్రమం ఉద్దేశం కాదు. విద్యాపరంగా, సౌకర్యాలపరంగా హాస్టళ్లను మెరుగుపరచడమే ఈ కార్యక్రమం లక్ష్యం. వార్డెన్లు స్థానికంగా ఉంటున్నారా; మెనూ సక్రమంగా అమలవుతోందా, ప్రత్యేక తరగతులు జరుగుతున్నాయా, విద్యార్థుల హాజరు శాతం, ఫలితాల సాధన ఎలా ఉందనే కోణంలో సన్నిహిత అధికారులు చొరవ చూపుతారు. సాంఘిక సంక్షేమ శాఖ జేడీ సన్నిహిత కార్యక్రమం సమన్వయకర్తగా వ్యవహరిస్తారు. హాస్టళ్లలో పారిశుద్ధ్యం, విద్యార్థుల ఆరోగ్యం, చదువుల్లో రాణింపు వంటి అంశాలు మెరుగవుతాయని ఆశిస్తున్నా. పరిశ్రమల నుంచి వచ్చే కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ ఫండ్ ద్వారా సౌకర్యాలను మెరుగుపరుస్తాం. సాక్షి: పరిశ్రమల నుంచే సీఎస్ఆర్ నిధిసక్రమంగా వసూలు కావడం లేదు కదా? కలెక్టర్: గడిచిన రెండు, మూడేళ్లుగా సీఎస్ఆర్ నిధి సక్రమంగా వసూలు కావడం లేదు. ప్రస్తుత డిమాండు ప్రకారం కోట్లాది రూపాయలు పరిశ్రమల నుంచి రావాల్సి వుంది. కొన్ని పరిశ్రమలు సొంతంగా ఖర్చు చేసి సీఎస్ఆర్ కింద చూపుతున్నారు. ఇకపై కలెక్టర్ నేతృత్వంలోని కమిటీ అనుమతి మేరకు పరిశ్రమలు సీఎస్ఆర్ నిధులు ఖర్చు చేయాలి. మార్గదర్శకాలు కూడా సిద్ధం చేశాం. సాక్షి: ప్రత్యేక పారిశుద్ధ్య వారోత్సవాలు, అర్బన్డేపై దృష్టి పెట్టారు. కానీ నిధుల కొరత ఉందని సర్పంచ్‌లు చెప్తున్నారు? కలెక్టర్: గ్రామ పారిశుధ్య నిధుల కోసం ప్రత్యేక అకౌంట్ ఉందనే విషయం చాలామందికి తెలియదు. జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ నుంచి చిన్న పంచాయతీలకు పది వేల రూపాయలు ఇస్తున్నాం. మేజర్ పంచాయతీలకు అంతకంటే ఎక్కువే వస్తుంది. నిధుల కొరత ఎక్కడా లేదు. కూలీ చెల్లింపు, బ్లీచింగ్ కొనుగోలు వంటివి వీటితో చేయొచ్చు. నిధులు వినియోగించాల్సిన తీరుపై జిల్లా పంచాయతీ అధికారి ద్వారా అప్రమత్తం చేయడం జరిగింది. వున్న నిధులు సక్రమంగా వినియోగిస్తే మరిన్ని నిధులు కూడా ఇస్తాం. సాక్షి: సబ్సెంటర్లలో సిబ్బంది అందుబాటులో ఉండటం లేదనే ఫిర్యాదులున్నాయి? కలెక్టర్: సబ్ సెంటర్లో వైద్య సిబ్బందిలో ఎవరో ఒకరు అందుబాటులో ఉండాల్సిందే. సబ్ సెంటర్లతో పోలిస్తే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వెళ్లేందుకు ఎక్కువమంది మొగ్గు చూపుతున్నారు. ఏఎన్ఎంల కొరత వుంది. పీహెచ్‌సీల్లో ప్రసవాలపై దృష్టి సారించాం. 45 మంది స్టాఫ్ నర్సులను ఇటీవలే నియమించాం. వచ్చే రెండు మూడు నెలల్లో ఫలితాలు కనిపిస్తాయి. సాక్షి: ఆస్పత్రులు, హాస్టళ్లలో ‘స్కైప్’ పర్యవేక్షణ ఎందాక వచ్చింది? కలెక్టర్: ఇంటర్నెట్ సమస్య వున్న ఆస్పత్రులు మినహాయిస్తే 51 పీహెచ్‌సీలు, సీహెచ్‌సీల్లో స్కైప్ విధానంలో పర్యవేక్షణ జరుగుతోంది. 255 సంక్షేమ హాస్టళ్లు ఉన్నా 30 నుంచి 40 బా లికల హాస్టళ్లలో స్కైప్ ప్రవేశపెట్టాలనుకుంటున్నాం. అయితే కంప్యూటర్ల కొరత వల్ల ఆలస్యమవుతోంది. కంప్యూటర్లు కొనుగోలు బాధ్యత జాయింట్ కలెక్టర్ శరత్ చూస్తున్నారు. సాక్షి: ఇంజినీరింగ్ విభాగాల పనితీరుపై అంతగా సమీక్ష లేదెందుకు? కలెక్టర్: నేను రాకమునుపు జిల్లాలో ఆదర్శ పాఠశాలల నిర్మాణం, జడ్పీ, మండల పరిషత్ ద్వారా చేపట్టిన పనులు పెండింగులో ఉన్నాయి. ఎందుకు అమలు కాలేదనే అంశంపై లోతైన సమీక్ష చేశాం. 2010-11 నుంచి మంజూరైన పనులు కూడా నేటికీ పూర్తి కాలేదు. ఇందుకు సంబంధించిన లెక్కలు ఉన్నాయి. గడిచిన ఐదేళ్లలో 25వేలకు పైగా పనులు చేపడితే, జిల్లా, మండల పరిషత్ పరిధిలో ఇంకా మూడు వేలకు పైగా పనులు ప్రారంభమే కాలేదు. డిసెంబర్ ఆఖరుకల్లా 2010-11 నుంచి 2012-13 మధ్యకాలంలో చేపట్టిన పనులు పూర్తి చేయాలి. 2013-14 పనుల పూర్తికి ఏప్రిల్ నెలాఖరు గడువు విధించాం. గడువులోగా మోడల్ స్కూళ్ల నిర్మాణం పూర్తి చేయాల్సిందిగా ఆదేశించాం. పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, ఆర్ అండ్ బీ, ఇరిగేషన్ తదితర విభాగాల్లో వివిధ పథకాల కింద చేపట్టిన పనుల పురోగతిపైనా సమీక్ష జరుగుతోంది. వారు లేవనెత్తిన సమస్యలు పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నాం. సాక్షి: అధికారుల హాజరును మెరుగు పరిచేం దుకు ఏమేరకు చర్యలు తీసుకుంటున్నారు? కలెక్టర్: జిల్లాస్థాయి అధికారుల పనితీరు ఎంత ముఖ్యమో మండలస్థాయిలో అంతే ప్రాధాన్యత ఉంటుంది. అధికారులు పనిచేసే చోట ఎవరు ఉంటున్నారో లేదో అనే అంశాలను పరిశీలిస్తున్నాం. మండల స్థాయి అధికారులకు సంబంధించి ఇప్పటికే సమాచారం సేకరించాం. జిల్లా అధికారి స్థానికంగా లేనపుడు కింద స్థాయిలో పని ఎలా జరుగుతుంది. ముఖ్యమైన ప్రభుత్వ శాఖల అధికారులు స్థానికంగా ఉండాలన్నదే నా భావన. ఈ మేరకు అధికారులకు అడ్వైజరీ మెమోలు కూడా జారీ చేశాం. అధికారుల పనితీరుకు సంబంధించి వివిధ మార్గాల్లో సమాచారం సేకరించాం. పనిచేసే అధికారులకు ఎప్పుడూ నా ప్రోత్సాహం ఉంటుంది. కొందరు అధికారులను పనిగట్టుకుని పంపిస్తున్నాననే ప్రచారంలో వాస్తవం లేదు. -
ఇక మెరుగైన ప్రసూతి సేవలు
గజ్వేల్, న్యూస్‌లైన్: జిల్లాలోని ప్రభుత్వాస్పత్రుల్లో ఇకనుంచి మెరుగైన ప్రసూతి సేవలను అందించడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పలు ఆస్పత్రుల్లో ఎత్తివేసిన సీమాంక్ (సమగ్ర అత్యవసర ప్రసూతి, శిశు ఆరోగ్యం) కేంద్రాలను పునరుద్ధరించడానికి జిల్లా యంత్రాంగం ప్రయత్నిస్తోంది. గర్భిణులకు ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసూతి సేవలు ఇక శాశ్వతంగా దూరం కానున్నాయనే భావన నెలకొన్న ప్రస్తుత తరుణంలో కేంద్రాల పునరుద్ధరణకు చర్యలు తీసుకోవడంతో పేదల్లో ఆశలు చిగురించాయి. వాస్తవ విషయానికి వెళితే... జిల్లాలోని ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసూతి సేవలందకపోవడం పేదలకు శాపంగా మారింది. ఆస్పత్రుల్లో నిర్వహిస్తున్న సీమాంక్ నామ్‌కేవస్తేగా మిగిలిపోయాయి. జిల్లాలోని సిద్దిపేటలో ఈ కేంద్రం సేవలు సజావుగా నడుస్తోంది. గజ్వేల్, మెదక్, నారాయణఖేడ్, సదాశివపేట పట్టణాల్లోని ప్రభుత్వాసుపత్రుల్లోనూ ఈ కేంద్రాలున్నాయి. వీటిలో శిశువు జననం తర్వాత బయటి వాతావరణాన్ని తట్టుకునేలా వార్మర్ యంత్రం, ఇంక్యుబేటర్లు తదితర అధునాతన సదుపాయాలున్నా.. సిబ్బందిని తొలగించడం వల్ల వసతులు నిరుపయోగంగా మారాయి. 24 గంటలూ డ్యూటీలో ఉండే గైనకాలజిస్ట్, ఇతర సిబ్బంది లేరనే కారణంతో అతి తక్కువగా డెలివరీలను చేస్తున్నారు. ఈ వ్యవహారంపై కలెక్టర్ స్మితాసబర్వాల్ ఈ కేంద్రాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఆయా కేంద్రాల్లో దశలవారీగా సిబ్బందిని నియమించి అభివృద్ధి చేయడం ద్వారా పేదలకు ప్రభుత్వపరంగా ప్రసూతి సేవలను చేరువలోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ విషయమై జిల్లా వైద్యాధికారి పద్మ ‘న్యూస్‌లైన్’తో మాట్లాడుతూ దశలవారీగా సీమాంక్ కేంద్రాలను అభివృద్ధి చేసి ప్రసూతి సేవలు పేదలకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. -
మేళా బే‘ఖాత’ర్!
సాక్షి, సంగారెడ్డి: ‘‘జిల్లాలోని అన్నీ బ్యాంకులు తమ శాఖల వద్ద ఈనెల 26, 27వ తేదీల్లో ప్రత్యేక మేళాలు ఏర్పాటు చేసి ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకు జీరో బ్యాలెన్స్ ఖాతాలు తెరవాలి. విద్యార్థులు, వంట గ్యాస్ వినియోగదారులు, బంగారుతల్లి, జననీ సురక్ష యోజన, ఇన్పుట్ సబ్సిడీ పథకాల లబ్ధిదారుల కోసం ప్రత్యేకంగా ఈ మేళాలు నిర్వహించాలి..’’ - కలెక్టర్ స్మితా సబర్వాల్ ఆదేశాలు. కానీ జిల్లాలో చాలా చోట్ల కలెక్టర్ ఆదేశాలు అమలు కాలేదు. కొత్త బ్యాంకు ఖాతాలు తెరవడానికి వచ్చిన వినియోగదారులతో బ్యాంకర్లు చెడుగుడు ఆడుకున్నారు. అడ్డగోలు నిబంధనలు, సూటిపోటి మాటలతో వినియోగదారులను బెదరగొట్టి తిప్పి పంపారు. జిల్లా కలెక్టర్ స్మితా సబర్వాల్ ఆదేశాల మేరకు మంగళ, బుధవారాల్లో జిల్లాలోని అన్నీ బ్యాం కులు ప్రత్యేక మేళాలు ఏర్పాటు చేసి మూకుమ్మడిగా భారీ సంఖ్యలో జీరో బ్యాలెన్స్(నో ఫ్రిల్) ఖాతాలు తెరవాల్సి ఉంది. ఈ రెండు రోజులు బ్యాంకులన్నీ రోజువారీ వ్యాపార లావాదేవీలను నిలిపివేసి ఈ మేళాలపై పూర్తి దృష్టి సారించాలని కలెక్టర్ ఆదేశించగా.. బ్యాంకర్లు ఎప్పటిలాగే రోజువారీ లావాదేవీల్లో తీరిక లేకుండా గడిపారు. కొన్ని బ్యాంకు లు మాత్రం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి మేళాలు నిర్వహించగా..ఇంకొన్ని బ్యాంకులు ఎలాంటి ప్రత్యేక ఏర్పాట్లు లేకుండానే తూతూ మంత్రంగా పనిని కానిచ్చాయి. ఈ బ్యాంకుల వద్ద మూసివేత సమయానికి సైతం దరకాస్తుదారులు బారులు తీరి కనిపించారు. జిల్లాలో 28 బ్యాకింగ్ సంస్థలు, వీటికి సంబంధించిన 282 శాఖలు వ్యాప్తంగా విస్తరించి ఉన్నాయి. ఎస్బీహెచ్, ఎస్బీఐ, ఆంధ్రాబ్యాంకు సంస్థలకు సంబంధించిన కొన్ని శాఖలు మాత్రమే తొలి రోజు మేళాలు నిర్వహించాయి. మిగిలిన శాఖలు ఎప్పటిలాగే మొండికేశాయి. మిగిలిన ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులు, వాటి బ్రాంచీలు అసలు మేళాల నిర్వహణ ఊసే ఎత్తలేదు. కలెక్టర్ ప్రకటన చూసి కొత్త ఖాతా కోసం వళ్లిన వినియోగదారులపై నానా ప్రశ్నలు సంధించి వెనుతిరిగేలా చేశాయి. ఆధార్ ఉంటేనే .. కొత్త ఖాతాలు తెరవడానికి బ్యాంకులు నిబంధనలతో కొర్రీలు వేశాయి. మంగళవారం ఖాతాల కోసం సమీపంలోని బ్యాంకుకు వెళ్లిన వారికి నిరాశే ఎదురైంది. ప్రభుత్వ రాయితీ, ప్రోత్సాహక పథకాల లబ్ధిదారులకు జీరో బ్యాలెన్స్ (నో ఫ్రిల్) ఖాతాలు తెరవాలని ఆర్బీఐ నుంచి స్పష్టమైన ఆదేశాలూ ఉన్నా యి. కానీ, కొన్ని బ్యాంకులు రూ.500 నుంచి రూ.వెయ్యి డిపాజిట్ చెల్లించనిదే ఖాతా తెరచేది లేదని భిష్మించుకుని కూర్చున్నాయి. అద్దె ఇళ్లల్లో ఉండేవాళ్లు నివాస గుర్తింపుగా ఇంటి విద్యుత్ బిల్లును సమర్పిస్తే స్వీకరించలేదు. అదే విధంగా సంగారెడ్డి బైపాస్ రోడ్డులోని ఎస్బీఐ తదితర బ్యాంకులు ఆధార్ కార్డు ఉంటేనే కొత్త ఖాతా తెరుస్తామన్నాయి. -
విద్యార్థి గణేష్ మృతిపై విచారణ
సదాశివపేట/సంగారెడ్డి మున్సిపాలిటీ, న్యూస్‌లైన్ : పట్టణంలోని కృష్ణవేణి టెక్నో స్కూల్లో సోమవారం ఎల్కేజీ విద్యార్థి గణేష్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటనపై బుధవారం విద్యాశాఖ అధికారులు విచారణ చేపట్టారు. కలెక్టర్ స్వితా సబర్వాల్, డీఈఓ రమేష్‌ల ఆదేశాల మేరకు బుధవారం డిప్యూటీ ఈఓ శోభరాణి, ఎంఈఓ సురేష్‌లు కృష్ణవేణి టెక్కో స్కూల్‌ను సందర్శించారు. మొదట పాఠశాల ప్రిన్సిపాల్ రవీందర్‌ను విచారించారు. ఎల్కేజీకి తరగతులు చెప్పే ఉపాధ్యాయులు ఎవరూ గణేష్‌ను కొట్టలేదని తెలిపారు. గణేష్ తల్లిదండ్రులు బీదవారు కావడంతో గతేడాది కూడా ఫీజు చెల్లించలేదని, ఈ ఏడాది కూడా ఫీజు అడగలేదని విచారణ అధికారులకు వెల్లడించారు. సోమవారం భోజనానంతరం ఉదయం 11.30 గంటలకు టిఫెన్ బాక్స్‌ను పెట్టడానికి వెళుతూ కింద పడ్డాడని సిబ్బంది తెలిపారన్నారు. తాను వెంటనే గణేష్‌ను స్థానిక సూర్య నర్సింగ్ హోంకు తీసుకెళ్లినట్లు చెప్పారు. అక్కడి వైద్యులు చిన్న పిల్లల డాక్టరైన బాలాజీ పవార్ వద్దకు తీసుకెళ్లాలని సూచించారన్నారు. దీంతో తాము డాక్టర్ బాలాజీ పవార్ వద్దకు తీసుకెళ్లగా ఆయన బాలుడిని పరీక్షించి పల్స్‌రేటు బాగానే ఉందని తన వద్ద ఆక్సిజన్ లేనందు వల్ల ప్రభుత్వ ఆస్పత్రి డాక్టర్ బాల్‌రాజ్ వద్దకు తీసుకువెళ్లగా సూచించారని తెలిపారు. అనంతరం ఎల్కేజీ తరగతి గదిలోకి వెళ్లి ఉపాధ్యాయురాలు సౌజన్యను విచారించగా గణేష్‌ను తాము ఎవరం కొట్టలేదని తెలిపారు. అనంతరం ఎల్కేజీ చదువుతున్న చిన్నారులను విచారణ అధికారులు విచారించగా.. గణేష్‌ను టీచర్లు కొట్టలేదని, అన్నం తిన్న తరువాత టిఫెన్ బాక్స్‌ను పెట్టడానికి వెళ్లి కింద పడ్డాడని వివరించారు. పాఠశాలలో విచారణ అనంతరం డిప్యూటీ ఈఓ శోభరాణి, ఎంఈఓ సురేష్‌లు సిద్దాపూర్ కాలనీలోని మృతుడు గణేష్ ఇంటికి వెళ్లారు. ఉపాధ్యాయులు కొట్టినందు వల్లనే తమ కుమారుడు గణేష్ మృతి చెందాడని తల్లిదండ్రులు కృష్ణ మాధవీలు రోదిస్తూ తెలిపారు. గణేష్ గతేడాది నుంచి పాఠశాలకు రెగ్యులర్‌గా వస్తాడని, హాజరు పట్టికను పరిశీలించడం వల్ల తనకీ విషయం వెల్లడైందని డిప్యూటీ డీఈఓ శోభ తెలిపారు. విద్యార్థి గణేష్‌కు ఎప్పుడూ మూర్ఛ (ఫిట్స్) రాలేదని పాఠశాల ఉపాధ్యాయులు తెలిపారన్నారు. పాఠశాల యాజమాన్యం, విద్యార్థి సంఘాలు, విద్యార్థి తల్లిదండ్రులతో పాటు వా రి బంధువుల ద్వారా వచ్చిన ఫిర్యాదులను నివేదిక రూపంలో సమర్పించడం జరిగిందని డిప్యూటీ డీఈఓ శోభ తెలిపారు. విద్యార్థి గణేష్ మృతిపై విచారణ వివరాలను తాను డీఈఓ రమేష్‌కు నివేదిక అందజేస్తానన్నారు. పాఠశాలలో విచారణ సమయంలో ఎస్ఎఫ్ఐ డివిజన్ అధ్యక్షుడు అనిల్, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి రహమాన్ తదితరులు ఉన్నారు. -
తొలి వికెట్ పడింది
సంగారెడ్డి మున్సిపాలిటీ, న్యూస్‌లైన్: విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించే ప్రభుత్వ ఉద్యోగులను ఇప్పటి వరకు హెచ్చరిస్తూ వచ్చిన కలెక్టర్ స్మితా సబర్వాల్ ఇక చర్యలకు ఉపక్రమించారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కొండాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి హరిప్రసాద్‌ను ప్రభుత్వానికి సరెండర్ చేయాలని శుక్రవారం ఆమె డీఎంహెచ్ఓ రంగారెడ్డికి ఆదేశాలు జారీ చేశారు. హరిప్రసాద్ సరిగా విధులకు హాజరు కాకపోవడంపై కొండాపూర్ వాసులు ఫిర్యాదులు చేయడంతో కలెక్టర్ అతని పనితీరుపై విచారణ జరిపించారు. గ్రామస్తుల ఆరోపణలు నిజమని తేలడంతో అతన్ని సరెండర్ చేయాలని ఆదేశించారు. అంతేకాకుండా మండల ప్రాథమిక ఆరోగ్య వైద్యుడి పోస్టు ఖాళీగా చూపిస్తూ కొత్త వైద్యాధికారిని నియమించేలా చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్ఓకు పంపిన ఆదేశాల్లో పేర్కొన్నారు. విధుల్లో నిర్లక్ష్యాన్ని ఏమాత్రం సహించనంటూ ఇప్పటికే తేల్చిచెప్పిన కలెక్టర్, డాక్టర్ హరిప్రసాద్‌ను సరెండర్ చేయడం ద్వారా ప్రభుత్వ ఉద్యోగులందరికీ మరోసారి హెచ్చరికలు పంపారు