జవాబుదారీతోనే సత్ఫలితాలు | Panchayats do not have a shortage of funds | Sakshi
Sakshi News home page

జవాబుదారీతోనే సత్ఫలితాలు

Published Mon, Dec 9 2013 12:20 AM | Last Updated on Sat, Sep 2 2017 1:24 AM

Panchayats do not have a shortage of funds

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి:  స్మితాసబర్వాల్ జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన కొద్ది రోజుల్లోనే పాలన యంత్రాంగాన్ని గాడిలో పెట్టారు. సమీక్షలు, క్షేత్ర స్థాయి పర్యటనలతో అధికారులు, సిబ్బందికి బుల్లెట్ వేగంతో దిశానిర్దేశం చేస్తున్నారు. విద్య, ఆరోగ్యం తన ప్రాధాన్యతలని చెప్తున్నా, అన్ని విభాగాల పనితీరుపై సమ స్థాయిలో దృష్టి సారించారు. ప్రజావాణిని ప్రక్షాళన చేయడంతో పాటు ‘మార్పు’, ‘సన్నిహిత’ వంటి కార్యక్రమాలతో ప్రజలు, అధికార యంత్రాంగాన్ని పాలనలో భాగస్వాములను చేస్తున్నారు.

సమయపాలన, సమస్యల పరిష్కారంలో అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటూ చొరవతో పనిచేయాలని నిక్కచ్చిగా చెప్తున్నారు. సుమారు రెండు నెలల్లోనే జిల్లా పాలన యంత్రాంగంపై తనదైన ముద్ర వేసిన కలెక్టర్‌తో ‘సాక్షి ప్రతినిధి’ ముఖాముఖి.
 సాక్షి: ‘గ్రీవెన్‌‌స’లో పరిష్కారం కాకుంటేనే మీ వద్దకు రావాలనడం ఎంతవరకు సమంజసం?
 కలెక్టర్: ‘గ్రీవెన్‌‌స సెల్’లో వచ్చే సమస్యల పరిష్కారానికి ఇంతకంటే మెరుగైన మార్గం లేదని భావిస్తున్నా. నేరుగా కలెక్టర్‌ను కలిస్తేనే సమస్యలు పరిష్కారమవుతుందనేది తప్పుడు అభిప్రాయం. వ్యక్తి కేంద్రంగా నడిచే వ్యవస్థ ఎప్పుడూ ఆరోగ్యకరంగా ఉండదు. అన్ని ప్రభుత్వ విభాగాలు కలిసి కట్టుగా, జవాబుదారీతనంతో పనిచేయాలి. బృందంగా పనిచేయలేక పోతే ఫలితాలు సాధించలేం. ప్రజావాణిలో వచ్చిన విజ్ఞాపన 30 రోజుల్లో పరిష్కారం కాలేదంటే అధికారి ఫెయిల్యూర్‌గానే భావించాల్సి ఉంటుంది. అప్పుడు నేను కలెక్టర్‌గా సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఇద్దరు, ముగ్గురిని మినహాయిస్తే అందరూ విజ్ఞాపనల పరిష్కారం మీద దృష్టి పెడుతున్నారు. నాతో పాటు జాయింట్ కలెక్టర్, అదనపు జేసీ కూడా ఠమొదటిపేజీ తరువాయి
 ఎప్పటికప్పుడు ప్రజావాణి విజ్ఞప్తుల పరిష్కారంపై సమీక్ష చేస్తున్నాం. మండల స్థాయిలోనూ ఎంపీడీఓ, తహశీల్దార్ తదితరులు ఒకేచోట నుంచి విజ్ఞాపనలు తీసుకుంటున్నారు. ప్రజలు మండల స్థాయిలోనే ‘గ్రీవెన్‌‌స సెల్’కి వెళ్లాల్సిందిగా సూచిస్తున్నాం. మండల స్థాయిలో పరిష్కారం కానిపక్షంలోనే కలెక్టరేట్‌కు రావాలన్నది నా ఉద్దేశం.
 సాక్షి: ‘గ్రామదర్శిని’ మొక్కుబడిగా జరుగుతుందనే ఫిర్యాదులున్నాయి?
 కలెక్టర్: క్షేత్ర స్థాయిలో నెలకొన్న అనేక సమస్యలు గ్రామదర్శిని ద్వారా మా దృష్టికి వస్తున్నాయి. గ్రామాలకు వెళ్తున్న బృందాల నుంచి నివేదికలు తీసుకుని విశ్లేషిస్తున్నాం. దీర్ఘకాలంగా నెలకొన్న సమస్యలు, నిధుల విడుదలతో ముడిపడిన అంశాలకు తక్షణ పరిష్కారం వస్తుందని చెప్పలేం. గ్రామదర్శినిలో లేవనెత్తిన సమస్యలను సంబంధిత విభాగాలకు పంపిస్తున్నాం. ప్రజలు లేవనెత్తిన సమస్యలు పరిష్కారమయ్యాయా లేదా అనే అంశంపై ప్రతీ వారం సమీక్ష జరుపుతున్నాం.
 సాక్షి: ‘మార్పు’పై  క్షేత్రస్థాయిలో ఇంకా అవగాహన ఏర్పడినట్లు లేదు?
 కలెక్టర్: మొదటిసారిగా స్వయం సహాయక సంఘాలను భాగస్వాములను చేస్తూ ‘మార్పు’ను  చేపడుతున్నాం. ప్రస్తుతం అవగాహన కలిగించే దిశలో అనేక శిక్షణ కార్యక్రమాలు చేపట్టాం. అధికారుల స్థాయిలో సమావేశాలు ముగిశాయి. నెలాఖరుకు గ్రామస్థాయిలో అవగాహన సమావేశాలు ముగిసేలా షెడ్యూలు రూపొందించాం. జనవరి, పిబ్రవరి వరకు ‘మార్పు’ ఫలితం కనిపించడం ప్రారంభమవుతుంది. గర్భిణుల నమోదు, ప్రసూతికి ఎక్కడకు వెళ్తున్నారు. టీకాలు, చిన్నారుల పెరుగుదల, అభివృద్ధి తదితర అంశాలపై మహిళలకు విస్తృతస్థాయిలో అవగాహన కల్పించాలన్నదే ఉద్దేశం. ప్రజలు, ప్రభుత్వ విభాగాల సమన్వయంతోనే మెరుగైన ఫలితాలు సాధ్యమవుతాయి.
 సాక్షి: ‘సన్నిహిత’పై మీ అంచనాలేమిటీ?
 కలెక్టర్: ప్రాథమికంగా సంక్షేమ హాస్టళ్ల పనితీరు మెరుగుపరిచేందుకే ‘సన్నిహిత’ అమలు చేస్తున్నాం. కొత్తగా నిధులు, నిర్మాణాలు చేపట్టడం ఈ కార్యక్రమం ఉద్దేశం కాదు. విద్యాపరంగా, సౌకర్యాలపరంగా హాస్టళ్లను మెరుగుపరచడమే ఈ కార్యక్రమం లక్ష్యం. వార్డెన్లు స్థానికంగా ఉంటున్నారా; మెనూ సక్రమంగా అమలవుతోందా, ప్రత్యేక తరగతులు జరుగుతున్నాయా, విద్యార్థుల హాజరు శాతం, ఫలితాల సాధన ఎలా ఉందనే కోణంలో సన్నిహిత అధికారులు చొరవ చూపుతారు. సాంఘిక సంక్షేమ శాఖ జేడీ సన్నిహిత కార్యక్రమం సమన్వయకర్తగా వ్యవహరిస్తారు. హాస్టళ్లలో పారిశుద్ధ్యం, విద్యార్థుల ఆరోగ్యం, చదువుల్లో రాణింపు వంటి అంశాలు మెరుగవుతాయని ఆశిస్తున్నా. పరిశ్రమల నుంచి వచ్చే కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ ఫండ్ ద్వారా సౌకర్యాలను మెరుగుపరుస్తాం.
 సాక్షి: పరిశ్రమల నుంచే సీఎస్‌ఆర్ నిధిసక్రమంగా వసూలు కావడం లేదు కదా?
 కలెక్టర్: గడిచిన రెండు, మూడేళ్లుగా సీఎస్‌ఆర్ నిధి సక్రమంగా వసూలు కావడం లేదు. ప్రస్తుత డిమాండు ప్రకారం కోట్లాది రూపాయలు పరిశ్రమల నుంచి రావాల్సి వుంది. కొన్ని పరిశ్రమలు సొంతంగా ఖర్చు చేసి సీఎస్‌ఆర్ కింద చూపుతున్నారు. ఇకపై కలెక్టర్ నేతృత్వంలోని కమిటీ అనుమతి మేరకు పరిశ్రమలు సీఎస్‌ఆర్ నిధులు ఖర్చు చేయాలి. మార్గదర్శకాలు కూడా సిద్ధం చేశాం.
 సాక్షి: ప్రత్యేక పారిశుద్ధ్య వారోత్సవాలు, అర్బన్‌డేపై దృష్టి పెట్టారు. కానీ  నిధుల కొరత ఉందని సర్పంచ్‌లు చెప్తున్నారు?
 కలెక్టర్: గ్రామ పారిశుధ్య నిధుల కోసం ప్రత్యేక అకౌంట్ ఉందనే విషయం చాలామందికి తెలియదు. జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ నుంచి చిన్న పంచాయతీలకు పది వేల రూపాయలు ఇస్తున్నాం. మేజర్ పంచాయతీలకు అంతకంటే ఎక్కువే వస్తుంది. నిధుల కొరత ఎక్కడా లేదు. కూలీ చెల్లింపు, బ్లీచింగ్ కొనుగోలు వంటివి వీటితో చేయొచ్చు. నిధులు వినియోగించాల్సిన తీరుపై జిల్లా పంచాయతీ అధికారి ద్వారా అప్రమత్తం చేయడం జరిగింది. వున్న నిధులు సక్రమంగా వినియోగిస్తే మరిన్ని నిధులు కూడా ఇస్తాం.
 సాక్షి: సబ్‌సెంటర్లలో సిబ్బంది అందుబాటులో ఉండటం లేదనే ఫిర్యాదులున్నాయి?
 కలెక్టర్: సబ్ సెంటర్‌లో వైద్య సిబ్బందిలో ఎవరో ఒకరు అందుబాటులో ఉండాల్సిందే. సబ్ సెంటర్లతో పోలిస్తే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వెళ్లేందుకు ఎక్కువమంది మొగ్గు చూపుతున్నారు. ఏఎన్‌ఎంల కొరత వుంది. పీహెచ్‌సీల్లో ప్రసవాలపై దృష్టి సారించాం. 45 మంది స్టాఫ్ నర్సులను ఇటీవలే నియమించాం. వచ్చే రెండు మూడు నెలల్లో ఫలితాలు కనిపిస్తాయి.
 సాక్షి: ఆస్పత్రులు, హాస్టళ్లలో ‘స్కైప్’ పర్యవేక్షణ ఎందాక వచ్చింది?
 కలెక్టర్: ఇంటర్నెట్ సమస్య వున్న ఆస్పత్రులు మినహాయిస్తే 51 పీహెచ్‌సీలు, సీహెచ్‌సీల్లో స్కైప్ విధానంలో పర్యవేక్షణ జరుగుతోంది. 255 సంక్షేమ హాస్టళ్లు ఉన్నా 30 నుంచి 40 బా లికల హాస్టళ్లలో స్కైప్ ప్రవేశపెట్టాలనుకుంటున్నాం. అయితే కంప్యూటర్ల కొరత వల్ల ఆలస్యమవుతోంది. కంప్యూటర్లు కొనుగోలు బాధ్యత జాయింట్ కలెక్టర్ శరత్ చూస్తున్నారు.
 సాక్షి: ఇంజినీరింగ్ విభాగాల పనితీరుపై అంతగా సమీక్ష లేదెందుకు?
 కలెక్టర్: నేను రాకమునుపు జిల్లాలో ఆదర్శ పాఠశాలల నిర్మాణం, జడ్పీ, మండల పరిషత్ ద్వారా చేపట్టిన పనులు పెండింగులో ఉన్నాయి. ఎందుకు అమలు కాలేదనే అంశంపై లోతైన సమీక్ష చేశాం. 2010-11 నుంచి మంజూరైన పనులు కూడా నేటికీ పూర్తి కాలేదు. ఇందుకు సంబంధించిన లెక్కలు ఉన్నాయి. గడిచిన ఐదేళ్లలో 25వేలకు పైగా పనులు చేపడితే, జిల్లా, మండల పరిషత్ పరిధిలో ఇంకా మూడు వేలకు పైగా పనులు ప్రారంభమే కాలేదు. డిసెంబర్ ఆఖరుకల్లా 2010-11 నుంచి 2012-13 మధ్యకాలంలో చేపట్టిన పనులు పూర్తి చేయాలి. 2013-14 పనుల పూర్తికి ఏప్రిల్ నెలాఖరు గడువు విధించాం.  గడువులోగా మోడల్ స్కూళ్ల నిర్మాణం పూర్తి చేయాల్సిందిగా ఆదేశించాం. పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యూఎస్, ఆర్ అండ్ బీ, ఇరిగేషన్ తదితర విభాగాల్లో వివిధ పథకాల కింద చేపట్టిన పనుల పురోగతిపైనా సమీక్ష జరుగుతోంది. వారు లేవనెత్తిన సమస్యలు పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నాం.
 సాక్షి: అధికారుల హాజరును మెరుగు పరిచేం దుకు  ఏమేరకు చర్యలు తీసుకుంటున్నారు?
 కలెక్టర్: జిల్లాస్థాయి అధికారుల పనితీరు ఎంత ముఖ్యమో మండలస్థాయిలో అంతే ప్రాధాన్యత ఉంటుంది. అధికారులు పనిచేసే చోట ఎవరు ఉంటున్నారో లేదో అనే అంశాలను పరిశీలిస్తున్నాం. మండల స్థాయి అధికారులకు సంబంధించి ఇప్పటికే సమాచారం సేకరించాం. జిల్లా అధికారి స్థానికంగా లేనపుడు కింద స్థాయిలో పని ఎలా జరుగుతుంది.  ముఖ్యమైన ప్రభుత్వ శాఖల అధికారులు స్థానికంగా ఉండాలన్నదే నా భావన. ఈ మేరకు అధికారులకు అడ్వైజరీ మెమోలు కూడా జారీ చేశాం. అధికారుల పనితీరుకు సంబంధించి వివిధ మార్గాల్లో సమాచారం సేకరించాం.  పనిచేసే అధికారులకు ఎప్పుడూ నా ప్రోత్సాహం ఉంటుంది. కొందరు అధికారులను పనిగట్టుకుని పంపిస్తున్నాననే ప్రచారంలో వాస్తవం లేదు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement