సంగారెడ్డి మున్సిపాలిటీ, న్యూస్‌లైన్: విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించే ప్రభుత్వ ఉద్యోగులను ఇప్పటి వరకు హెచ్చరిస్తూ వచ్చిన కలెక్టర్ స్మితా సబర్వాల్ ఇక చర్యలకు ఉపక్రమించారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కొండాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి హరిప్రసాద్‌ను ప్రభుత్వానికి సరెండర్ చేయాలని శుక్రవారం ఆమె డీఎంహెచ్‌ఓ రంగారెడ్డికి ఆదేశాలు జారీ చేశారు. హరిప్రసాద్ సరిగా విధులకు హాజరు కాకపోవడంపై కొండాపూర్ వాసులు ఫిర్యాదులు చేయడంతో కలెక్టర్ అతని పనితీరుపై విచారణ జరిపించారు. గ్రామస్తుల ఆరోపణలు నిజమని తేలడంతో అతన్ని సరెండర్ చేయాలని ఆదేశించారు. అంతేకాకుండా మండల ప్రాథమిక ఆరోగ్య వైద్యుడి పోస్టు ఖాళీగా చూపిస్తూ కొత్త వైద్యాధికారిని నియమించేలా చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్‌ఓకు పంపిన ఆదేశాల్లో పేర్కొన్నారు. విధుల్లో నిర్లక్ష్యాన్ని ఏమాత్రం సహించనంటూ ఇప్పటికే తేల్చిచెప్పిన కలెక్టర్, డాక్టర్ హరిప్రసాద్‌ను సరెండర్ చేయడం ద్వారా ప్రభుత్వ ఉద్యోగులందరికీ మరోసారి హెచ్చరికలు పంపారు