సాక్షి, సంగారెడ్డి: వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధుల(బీఆర్‌జీఎఫ్) వినియోగంలో నిర్లక్ష్యంపై కలెక్టర్ స్మితా సబర్వాల్ చర్యలకు శ్రీకారం చుట్టారు. ఏళ్ల తరబడిగా అటకెక్కిన పనులకు మంగళం పాడారు. బీఆర్‌జీఎఫ్, సాధారణ నిధుల కింద మంజూరైన పనుల్లో వివిధ కారణాలతో సుధీర్ఘకాలంగా ప్రారంభానికి నోచుకోని 76 పనులను రద్దు చేస్తూ జిల్లా కలెక్టర్ స్మితా సబర్వాల్ బుధవారం ఆదేశాలు జారీ చేశారు. ఈ పనుల అంచనా వ్యయం రూ.41.23 లక్షలు. రద్దయిన పనుల స్థానంలో ఆ నిధులతోనే ఇతర పనుల ప్రతిపాదనలు పంపించాలని అధికారులను సూచించారు. సంబంధిత గ్రామం/ మండలంలోనే కొత్త పనులు చేపట్టాలని జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారికి ఆదేశించారు. బీఆర్‌జీఎఫ్ నిధుల వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించిన కలెక్టర్ స్మితా సబర్వాల్ 2010-11 నుంచి 2013-14 మధ్య కాలంలో మంజూరైన నిధులతో చేపట్టిన పనుల పురోగతిపై నెల రోజుల కిందే సమగ్ర నివేదికలు తెప్పించుకున్నారు. 2010-11 నుంచి 2012-13 మధ్య కాలంలో రూ.87.86 కోట్ల అంచనా వ్యయంతో మొత్తం 10,188 పనులు మంజూరైతే అందులో 8,523 పనులు పూర్తయ్యాయని జడ్పీ సీఈఓ కలెక్టర్‌కు నివేదించారు. 1,524 పనులు పురోగతిలో ఉండగా 143 పనులు ఇంకా ప్రారంభం కాలేదు. ప్రారంభానికి నోచుకోని పనుల్లో 76 పనులు వివిధ కారణాలతో కార్యరూపం దాల్చడం కష్టమని అధికారులు తేల్చడంతో ఆ పనులను కలెక్టర్ రద్దు చేశారు. రద్దయిన పనుల్లో బీఆర్‌జీఎఫ్‌కు సంబంధించినవి 72 ఉండగా సాధారణ నిధుల కింద చేపట్టినవి 4 ఉన్నాయి.
ముంచుకొస్తున్న గడువు
2010-13 మధ్య కాలానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న మరో 78 పనులు పూర్తి చేయడానికి మరో 15 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. పెండింగ్‌లో ఉన్న పనులన్నీ ఈ నెలాఖరు నాటికి పూర్తి కావాలని ఇప్పటికే కలెక్టర్ విధించారు. మరోవైపు 2013-14లో రూ.25 కోట్ల నిధులతో మంజూరైన 2,470 పనులను మార్చి 31లోగా పూర్తి చేయాల్సి ఉంది.
ఆర్.ఆర్ చట్టం ప్రయోగం
పనులు చేయకుండానే నిధులు స్వాహా చేసిన పలువురు సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులపై రెవెన్యూ రికవరీ చట్టం(ఆర్‌ఆర్ యాక్ట్) అమలుకు జిల్లా యంత్రాంగం సమాయత్తమవుతోంది. టేక్మాల్, పాపన్నపేట, కౌడిపల్లి తదితర పంచాయతీల్లో రూ.23 లక్షల బీఆర్‌జీఎఫ్ నిధులు స్వాహా చేసిన వ్యవహారంలో ఇప్పటికే మాజీ సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులకు నోటీసులు జారీ చేశారు. స్వాహా చేసిన నిధులను తిరిగి వసూలు చేయడానికి త్వరలో రెండో నోటీసు జారీ చేసి ఆర్‌ఆర్ చట్టాన్ని ప్రయోగించనున్నట్లు జడ్పీ అధికారులు తెలిపారు.
76 పనులు రద్దు
Published Thu, Jan 16 2014 4:59 AM | Last Updated on Sat, Sep 2 2017 2:38 AM
Advertisement
Advertisement