brgf works
-
రూ. 25.34 కోట్ల బీఆర్జీఎఫ్ పనులకు ఆమోదం!
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: బీఆర్జీఎఫ్ (2014-15) పనుల కార్యాచరణ ప్రణాళికకు ఆమోదముద్ర పడింది. రూ.25.34 కోట్లతో 1,934 పనులు చేపట్టేందుకు నిర్దేశించిన తీర్మానాన్ని జడ్పీ సర్వ సభ్య సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది. జిల్లా పరిషత్ సమావేశమందిరంలో సోమవారం చైర్మన్ దఫేదార్ రాజు అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. మధ్యాహ్న భోజనం తరువాత జడ్పీ చైర్మన్ చాంబర్లో పది నిముషాలపాటు జరిగిన జిల్లా ప్రణాళిక కమిటీ సమావేశం కూడా బీఆర్జీ ఎఫ్ పనుల తీర్మానాన్ని ఆమోదించింది. జడ్పీ, డీపీసీ సమావేశాలు ఒకటి తర్వాత ఒకటి జరిగినా రెండు గంటలలో ము గిశాయి. అత్యవసర సమావేశమని ముందే ప్రకటించినా, ప్రధాన సమస్యలపై చర్చ జరుగుతుందని సభ్యులు భావిం చారు. కానీ, గడువు మించిపోతున్న కారణంగా బీఆర్జీఎఫ్ పనుల ఆమోదానికే ప్రాధాన్యం ఇచ్చారు. జాప్యమెందుకు జరిగిందో చెప్పండి పలువురు జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు వివిధ సమస్యలను సభ దృష్టికి తెచ్చారు. బీఆర్జీఎఫ్ ప్రణాళిక ఆమోదంలో ఆలస్యం జరగడంపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. పనుల ప్రతిపాదనలలో జాప్యం ఎందుకు జరిగిందో తెలపాలని నిజామాబాద్ జడ్పీటీసీ పుప్పాల శోభ కోరారు. తీర్మానాన్ని ఆలస్యంగా పంపడం మూలంగా కేంద్ర ప్రభుత్వ నిధులు వచ్చే విషయంలో ఇబ్బందులు తలెత్తుతాయని పేర్కొన్నారు. తాము ఎన్నిక అయిననాటి నుంచి సర్వసభ్య సమావేశాలు సక్రమంగా జరగడం లేదన్నారు. ఇలా అయితే, అసలు జిల్లా పరిషత్ అంటే ఏమిటి? సమావేశాల ఎజెండా ఎలా ఉంటుంది? తదితర వివరాలు తమకు ఎలా తెలుస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. జక్రాన్‌పల్లి ఎంపీపీ రాజన్న మాట్లాడుతూ తమ మండలం నుంచి బీఆర్జీఎఫ్ పనులను ఆమోదించి జడ్పీకి పంపామని, ఇప్పుడు ఇందులో చూస్తే అవి కని పించడం లేదన్నారు. ఎందుకు మార్పులు చేస్తున్నారో తెలియడం లేదని విచారం వ్యక్తం చేశారు. సమావేశం రెండు రోజుల పాటు నిర్వహించి పూర్తి అంశాలను చర్చిస్తామని మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి హామీ ఇచ్చినా అమలు కావడం లేదని పలువురు సభ్యులు పేర్కొన్నారు. అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి బీఆర్జీఎఫ్ పనుల ఆమోదమంటూ తమ మెడపై కత్తి పెట్టారని వాపోయారు. జడ్పీ చైర్మన్ దఫేదార్ రాజు, సీఈఓ రాజారాం ఇందుకు సమాధానమిస్తూ, అన్ని అంశాలపై కూలంకషంగా చర్చించేందుకు దసరా తర్వాత రెండు రోజులపాటు సర్వసభ్య సమావేశం నిర్వహిద్దామని సూచించారు. అధికారుల బ్లాక్మెయిల్ రాజకీయాలు గర్హనీయం జిల్లావ్యాప్తంగా వివిధ శాఖలకు చెందిన కొందరు అధికారులు, ఉద్యోగుల తీరుపై సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. విధులను విస్మరించే అధికారులను మందలించే ప్రయత్నం చేస్తే అక్రమ కేసులు నమోదు చేసి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడే పరిస్థితి ఉందన్నారు. మోర్తాడ్ ఎంపీపీ చిన్నయ్య మాట్లాడుతూ తాను ధర్మోర పాఠశాలను తనిఖీ చేసినపుడు హెచ్ఎం లేకపోవడంతో ఫోన్ చేసానని, తాను సెలవులో ఉన్నానని ఆయన సమాధానం చెప్పారని సభ దృష్టికి తెచ్చారు. కానీ, టీఆర్ఎస్ నాయకులు అక్కడకు వచ్చి హెచ్ఎంకు మద్దతుగా గొడవ చేసి తిరిగి తనపైనే కేసుపెట్టారని వాపోయారు. జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ సింధే మాట్లాడుతూ చాలా చోట్ల అధికారులు విధులను విస్మరిస్తున్నారని, నిలదీస్తే ప్రజాప్రతినిధులపై కేసులు పెట్టి బ్లాక్మెయిల్ చేయడం పరిపాటిగా మారిం దని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటివారిపై కఠి నంగా వ్యవహరించాలని కోరారు. జడ్పీటీసీ సభ్యులకు మాత్రమే అత్యవసర సమావేశం ఎ జెండా కాపీలను సరఫరా చేసి, ఎంపీపీలను ఎందుకు విస్మరించారని, మాచారెడ్డి ఎంపీపీ నర్సింగారావు ప్రశ్నించారు.ఇంకా పలు అంశాలను సభ్యులు ప్రస్తావించేందుకు యత్నించగా, పూర్తిస్థాయి సమావేశంలో చర్చిద్దామని, ప్రభుత్వం ఇప్పుడిప్పుడే గాడిన పడుతున్నందున ప్రజాప్రతినిధులు సహకరించాలని ఎమ్మెల్యేలు బిగాల గణేష్‌గుప్తా, ఏనుగు రవీందర్‌రెడ్డి, హన్మంత్ సింధే పేర్కొన్నారు. బీఆర్జీఎఫ్ పనులు ఇలా రూ. 25.34 కోట్ల బీఆర్జీ నిధులను 20 శాతం పట్టణాలకు, 80 శాతం గ్రామ పంచాయతీలు, మండల పరిషత్, జిల్లా పరిషత్‌కు కేటాయించాలని నిర్ణయించారు. గ్రామ పంచాయతీలకు 1,255 ప నులకు రూ.1012.40 లక్షలు, మండల పరిషత్‌లకు 346 పనులకు రూ.607.30 లక్షలు, జిల్లా పరిషత్ 174 పనులకు రూ.405 లక్షలు, మున్సిపాల్టీలలో 135 పనులకు రూ.509.30 లక్షలు ఖర్చు చేయడానికి సమావేశంలో ప్రతిపాదించారు. 50 శాతం అదనపు నిధుల కింద 1,171 పనులకు రూ.1132. 50 లక్షల విడుదలకు తీర్మానించారు. ఇక్కడ స్వల్ప మార్పులు డీపీసీ సమావేశంలో బీఆర్జీఎఫ్ పనులలో స్వల్ప మార్పులు చేశారు. గ్రామ పంచాయతీలకు 1,260 పనులు, మండల పరిషత్‌లకు 365 పనులు, జిల్లా పరిషత్‌కు 174, మున్సిపాల్టీలకు 135, మొత్తం 1,934 పనులను ఆమోదం కోసం ప్రభుత్వానికి పంపుతున్నట్లు జడ్పీ చైర్మన్ వెల్లడించారు. ఆరు మండలాల నుంచి వచ్చిన ఎన్ ఆర్ఈజీఎస్ పనుల ప్రతిపాదనలనూ ఆమోదించామన్నారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోస్, జడ్పీ సీఈఓ రాజారాం, నగర మేయర్ ఆకుల సుజాత, ఎమ్మెల్సీ వి.గంగాధర్ గౌడ్, ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, ఏనుగు రవీందర్‌రెడ్డి, బిగాల గణేష్ గుప్తా, షకీల్ అహ్మద్, జడ్పీ వైస్ చైర్పర్సన్ గడ్డం సుమనారెడ్డి, డీసీసీబీ చైర్మన్ గంగాధర్‌రావు పట్వారీ తదితరులు పాల్గొన్నారు. -
‘నక్కలగండి’పై రాజకీయ దుమారం
- మంత్రి, ఎంపీ గుత్తా మధ్య వాగ్వాదం - కింద కూర్చొని నిరసన తెలిపిన జెడ్పీటీసీలు - గత ప్రభుత్వ హయాంలోని మంత్రులు, ఎంపీల ఇళ్ల వద్ద ధర్నా చేయండి : మంత్రి - సభలో తీవ్ర గందరగోళం రాంనగర్ : బీఆర్జీఎఫ్ పనుల ఆమోదం కోసం బుధవారం ఉదయాధిత్య భవన్లో నిర్వహించిన జిల్లా పరిషత్ ప్రత్యేక సర్వసభ్య సమావేశం రాజకీయ దుమారానికి వేదికైంది. నక్కలగండి ప్రాజెక్టుపై అధికార పక్షం, విపక్ష పార్టీల సభ్యులు సవాళ్లు ప్రతి సవాళ్లు చేసుకోవడంతో సమావేశంలో తీవ్ర గందరగోళం చోటుచేసుకుంది. సమావేశం ప్రారంభమైన అరగంటకు విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి వచ్చారు. నక్కలగండి ప్రాజెక్డు కోసం అప్పటికే మునుగోడు, దేవరకొండ నియోజకవర్గాలకు చెందిన జెడ్పీటీసీలు, ఎంపీపీలు కింద కూర్చోని నిరసన తెలిపారు. ‘కింద ఎందుకు కూర్చున్నారు. సీట్లలో కూర్చోండి’ అని మంత్రి వారిని కోరారు. నక్కలగండి ప్రాజెక్టుపై స్పష్టమైన ప్రకటన చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ధర్నా చేయాలనుకుంటే గత ప్రభుత్వంలో పని చేసిన మంత్రులు, ఎంపీల ఇళ్ల వద్ద చేయాలన్నారు. ఇది ఎవరు చేయిస్తున్నారో తెలుసని, తమకూ రాజకీయం చేయడం వచ్చని అన్నారు. ‘అవసరమైతే మా వాళ్లూ వచ్చి కింద కూర్చుంటారు. మేమేమీ భయపడం’ అని మంత్రి ఘూటుగా మాట్లాడారు. ‘నక్కలగండి ప్రాజెక్టును సందర్శించి దాని చరిత్ర తీస్తాం, దానికి ఎవరు బాధ్యులో కూడా చెబుతాం’ అంటూ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి వాఖ్యలకు ఎంపీ గుత్తా కూడా తీవ్రంగానే స్పందించారు. మీరు ఇటీవల దేవరకొండ ఎమ్మెల్యే అడిగిన ప్రశ్నకు సరైన సమాధానం చెప్పకపోవడం వల్లే ప్రజల్లో అపోహ నెలకొంది. మంత్రిగా ప్రాజెక్టుపై సవివరమైన సమధానం చెప్పాల్సిన బాధ్యత ఉందనే విషయం మరువరాదన్నారు. మంత్రి జోక్యం చేసుకుంటూ నక్కలగండి ప్రాజెక్టుపై తాను అనని మాటలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 60 ఏళ్లుగా జిల్లా అభివృద్ధికి పని చేయని వాళ్లు తమపై తప్పుడు ప్రచారం చేయడం ఏమిటని ప్రశ్నించారు. దీంతో ఎంపీ గుత్తా జోక్యం చేసుకుంటూ పదే పదే 60 ఏళ్లు అనడం, వాడు, వీడు అంటూ మంత్రి హోదాలో ఉన్న వ్యక్తి మాట్లాడడం తగదని హెచ్చరించారు. సభలో తీవ్రగందరగోళం చోటుచేసుకోవడంతో సభ్యులు కూర్చోవాలంటూ జెడ్పీ చైర్మన్ పదే పదే కోరారు. వాడు అని ఉంటే ఉపసంహరించుకోవడానికి అభ్యంతరం లేదని మంత్రి పేర్కొన్నారు. నక్కల గండిని రద్దు చేస్తానని తాను చెప్పలేదని తెలిపారు. ఎవరితో నిరసన చేయించాల్సిన అవసరం తమకు లేదని గుత్తా పేర్కొన్నారు. అందరం కలిసి జిల్లా సమగ్రభివృద్ధికి కలిసి కట్టుగా పని చేద్దామని ఇరువురు నాయకులు అనడంతో సమావేశంలో ప్రశాంత వాతావరణం నెలకొంది. -
స్పెషల్‌గా పంపకాలు!
సాక్షి ప్రతినిధి, విజయనగరం: జెడ్పీలో వర్కుల వేట కొనసాగుతోంది. మంజూరుకాక ముందే బీఆర్జీఎఫ్ పనులు చేతులు మారిపోతున్నాయి. పనుల దక్కని నేతల్లో ఆవేదన పెల్లుబుకుతోంది. మమ్మల్ని విస్మరించారని పలువురు లోలోపల మధనపడుతున్నారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం అమలవుతున్న బీఆర్జీఎఫ్ పథకం కింద 2014-15 సంవత్సరానికి జిల్లాకు రూ.22.94 కోట్లు కేటాయించారు. ప్రాదేశిక ఎన్నికల సమయంలోనే కేంద్ర ప్రభుత్వం ఈ కేటాయింపు ఉత్తర్వులను జారీ చేసింది. ఈ మేరకు పనుల ప్రణాళికను రూపొందించి పంపించాలని జెడ్పీ అధికారులకు ఆదేశాలు కూడా ఇచ్చింది. ఆ సమయంలో స్పెషల్ ఆఫీసర్ల పాలన కొనసాగుతోంది. నిబంధనల మేరకు పంచాయతీల వారీగా గ్రామసభలు ఏర్పాటు చేసి, పనులు గుర్తించి, వాటికి తీర్మానం ద్వారా ఆమోదం తెలిపి, దశల వారీగా జిల్లా అధికారులకు పంపించాలి. ప్రభుత్వం ఇచ్చిన గడువులోపు ఆ పనిచేయలేదు. ఎలాగూ జెడ్పీకి కొత్త పాలకవర్గం వస్తోంది. వారికి చేతికి పనులు అప్పగించి మన్ననలు పొందవచ్చన్న ఉత్సాహంతో ప్రతిపాదనలు రూపొందించలేదని తెలిసింది. అయితే ఈ విషయంలో టీడీపీకి చెందిన కీలక నేతలు దూరదృష్టితో వ్యవహరించారు. పాలకవర్గం సమావేశం ఏర్పాటు చేసి, పనుల ప్రతిపాదన చేస్తే పోటీ పెరుగుతుందని, వైఎస్సార్సీపీ జెడ్పీటీసీలకు ప్రాతినిధ్యం కల్పించాల్సి వస్తుందని, అలా చేస్తే బీఆర్జీఎఫ్ పనులపై గంపెడాశలు పెట్టుకున్న టీడీపీ ముఖ్య నేతలకు ఆశించిన విధంగా న్యాయం చేయలేమని పాలకవర్గంలో చాలామందికితెలియకుండానే కథ నడిపించారు. పాలకవర్గం ఆమోదం జోలికి వెళ్లకుండా, స్పెషల్ ఆఫీసర్ల హయాంలోనే తీర్మానం జరిగినట్టు చూపించారు. తమకు నచ్చిన పనులతో ప్రతిపాదనలు తయారు చేయించారు. కొంతమంది నేతలు చెప్పిన పనులకే ప్రాధాన్యం కల్పించారు. తాము చెప్పిన పనులనే ప్రభుత్వానికి నివేదించాలని మౌఖికంగా అధికారులను ఆదేశించారు. వ్యూహాత్మకంగా ప్రతిపాదనలు కీలక నేతలు చెప్పినట్టే అధికారులు నడుచుకున్నారు. గ్రామ సభలు నిర్వహించకుండా, టీడీపీ ముఖ్య నేతలు సూచించిన పనులకు నాలుగు గోడల మధ్య ప్రతిపాదనలు రూపొందించి, వాటికి ఆమోదం తెలుపుతూ గ్రామసభలు తీర్మానం చేసినట్టుగా కాగితాలు సృష్టించారు. వాటినే దశల వారీగా జిల్లా అధికారులకొచ్చేలా చేశారు. గుట్టు చప్పుడు కాకుండా, పాలకవర్గం సమావేశం పెట్టకుండా, స్పెషలాఫీసర్ పాలనలో జరిగినట్టు ప్రణాళికను రూపొందించి కీలక నేతల కనుసన్నల్లో ప్రభుత్వానికి నివేదించారు. ఈవిధంగా బీఆర్జీఎఫ్ పనులను దాదాపు వాటాలు వేసి పంపకాలు చేసేశారని సమాచారం. త్వరలోనే వీటికి ప్రభుత్వ ఆమోదం రానుంది. ఇదే అడ్డగోలు ప్రక్రియ అనుకుంటే తాజాగా మరో అక్రమానికి తెరలేచింది. విక్రయాలకు పనులు ఇలా పొందిన పనులను సొంతంగా చేసే ఓపికలేని వారు, కష్టపడకుండా డబ్బు సంపాదించుకోవాలనుకున్న వారు వాటిని వేరేవారికి బదలాయించేందుకు సిద్ధమయ్యారు. తమ వాటాకు వచ్చే పనులను... అంచనా విలువలో 10 శాతం కమీషన్‌కు కట్టబెట్టేస్తామని ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఇప్పటికే కొన్ని పనులు చేతులు మారిపోయాయి. మరికొన్ని సంప్రదింపుల దశలో ఉన్నాయి. ఇప్పుడిది అశోక్ బంగ్లాలో చర్చనీయాంశమైంది. తెలుగు తమ్ముళ్లోనూ అసంతృప్తి ఈ నోట, ఆ నోట ఈ వ్యవహారం బయటకు పొక్కడంతో పనులు దక్కని నేతలంతా అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. అంతా వారే పంచేసుకుంటే తమ పరిస్థితి ఏంటని కొందరు టీడీపీ నేతలు మధనపడుతున్నారు. కాంగ్రెస్ మాదిరిగానే వ్యవహారాలు నడుస్తున్నాయని తోటి నాయకుల వద్ద చెప్పుకుని బాధ పడుతున్నారు. ఇక, కొంతమంది టీడీపీ జెడ్పీటీసీలు కూడా అసంతృప్తితో ఉన్నారు. తమకు తెలియకుండా, గుట్టు చప్పుడు కాకుండా పనులను ప్రతిపాదించి, తమ మండలంలో ఉన్న ముఖ్య నేతలకు కట్టబెట్టారన్న అక్కసుతో ఉన్నారు. పాలకవర్గ సమావేశం పెట్టి, ఆమోదం తెలిపి ఉంటే తమ దృష్టికొచ్చేవని అందుకు భిన్నంగా చేయడంతో ఏకపక్షంగా సాగిపోయిందని లోలోపల బాధ పడుతున్నారు. ఇంకొందరు తమకు ప్రాధాన్యం కల్పించాలని అంతా అయిపోయాక పనుల జాబితాను అధికారులకు సమర్పిస్తున్నారు. ఇప్పుడేం చేయగలమని అధికారుల నుంచి సమాధానం వస్తుండడంతో కిమ్మనలేక సతమతమవుతున్నారు. మొత్తానికి పనుల ప్రతిపాదనలే అడ్డగోలుగా జరిగాయనుకుంటే ఇప్పుడా పనులు విక్రయాలకు పెట్టి మరింతంగా అక్రమాలకు తెరలేపారనే వాదన విన్పిస్తోంది. -
76 పనులు రద్దు
సాక్షి, సంగారెడ్డి: వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధుల(బీఆర్జీఎఫ్) వినియోగంలో నిర్లక్ష్యంపై కలెక్టర్ స్మితా సబర్వాల్ చర్యలకు శ్రీకారం చుట్టారు. ఏళ్ల తరబడిగా అటకెక్కిన పనులకు మంగళం పాడారు. బీఆర్జీఎఫ్, సాధారణ నిధుల కింద మంజూరైన పనుల్లో వివిధ కారణాలతో సుధీర్ఘకాలంగా ప్రారంభానికి నోచుకోని 76 పనులను రద్దు చేస్తూ జిల్లా కలెక్టర్ స్మితా సబర్వాల్ బుధవారం ఆదేశాలు జారీ చేశారు. ఈ పనుల అంచనా వ్యయం రూ.41.23 లక్షలు. రద్దయిన పనుల స్థానంలో ఆ నిధులతోనే ఇతర పనుల ప్రతిపాదనలు పంపించాలని అధికారులను సూచించారు. సంబంధిత గ్రామం/ మండలంలోనే కొత్త పనులు చేపట్టాలని జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారికి ఆదేశించారు. బీఆర్జీఎఫ్ నిధుల వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించిన కలెక్టర్ స్మితా సబర్వాల్ 2010-11 నుంచి 2013-14 మధ్య కాలంలో మంజూరైన నిధులతో చేపట్టిన పనుల పురోగతిపై నెల రోజుల కిందే సమగ్ర నివేదికలు తెప్పించుకున్నారు. 2010-11 నుంచి 2012-13 మధ్య కాలంలో రూ.87.86 కోట్ల అంచనా వ్యయంతో మొత్తం 10,188 పనులు మంజూరైతే అందులో 8,523 పనులు పూర్తయ్యాయని జడ్పీ సీఈఓ కలెక్టర్‌కు నివేదించారు. 1,524 పనులు పురోగతిలో ఉండగా 143 పనులు ఇంకా ప్రారంభం కాలేదు. ప్రారంభానికి నోచుకోని పనుల్లో 76 పనులు వివిధ కారణాలతో కార్యరూపం దాల్చడం కష్టమని అధికారులు తేల్చడంతో ఆ పనులను కలెక్టర్ రద్దు చేశారు. రద్దయిన పనుల్లో బీఆర్‌జీఎఫ్‌కు సంబంధించినవి 72 ఉండగా సాధారణ నిధుల కింద చేపట్టినవి 4 ఉన్నాయి. ముంచుకొస్తున్న గడువు 2010-13 మధ్య కాలానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న మరో 78 పనులు పూర్తి చేయడానికి మరో 15 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. పెండింగ్‌లో ఉన్న పనులన్నీ ఈ నెలాఖరు నాటికి పూర్తి కావాలని ఇప్పటికే కలెక్టర్ విధించారు. మరోవైపు 2013-14లో రూ.25 కోట్ల నిధులతో మంజూరైన 2,470 పనులను మార్చి 31లోగా పూర్తి చేయాల్సి ఉంది. ఆర్.ఆర్ చట్టం ప్రయోగం పనులు చేయకుండానే నిధులు స్వాహా చేసిన పలువురు సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులపై రెవెన్యూ రికవరీ చట్టం(ఆర్ఆర్ యాక్ట్) అమలుకు జిల్లా యంత్రాంగం సమాయత్తమవుతోంది. టేక్మాల్, పాపన్నపేట, కౌడిపల్లి తదితర పంచాయతీల్లో రూ.23 లక్షల బీఆర్జీఎఫ్ నిధులు స్వాహా చేసిన వ్యవహారంలో ఇప్పటికే మాజీ సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులకు నోటీసులు జారీ చేశారు. స్వాహా చేసిన నిధులను తిరిగి వసూలు చేయడానికి త్వరలో రెండో నోటీసు జారీ చేసి ఆర్ఆర్ చట్టాన్ని ప్రయోగించనున్నట్లు జడ్పీ అధికారులు తెలిపారు. -
గడువులోగా పనులు పూర్తిచేయాలి
ఇందూరు,న్యూస్‌లైన్ : గ్రామాల్లో జనవరి పదో తేదీలోగా బీఆర్జీఎఫ్ పనులు పూర్తి చేయని సర్పంచుల చెక్ పవర్ రద్దు చేస్తామని, ఈ విషయాన్ని జిల్లాలోని 718 గ్రామ పంచాయతీల సర్పంచులకు సమావేశం ఏర్పాటుచేసి తెలియజేయాలని ఎంపీడీఓలను జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న దేశించారు. ఇందులో ఉపేక్షించేది లేదని తేల్చి చె ప్పారు. బుధవారం జిల్లాపరిషత్ సమావేశ మందిరంలో జిల్లాలో కొనసాగుతున్న 2012- 13, 2013-14 బీఆర్జీఎఫ్ పనుల పురోగతిపై ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, ఇంజినీరింగ్ అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. 2013-14 సంవత్సరానికి సంబంధించిన బీఆర్జీఎఫ్ పనులు ప్రారంభించని వాటిని వెంటనే ప్రాంభించాలని, ముఖ్యంగా గ్రామాల్లో పనులు పెండింగ్‌లో ఉన్నందున సర్పంచులు చర్యలు తీసుకోవాలన్నారు. నిర్ణయించిన గడువు తేదీలోగా పనులు పూర్తిచేయని సర్పంచుల చెక్ పవర్‌ను తక్షణమే రద్దు చేయాలని జిల్లా పంచాయతీ అధికారిని, ఎంపీడీఓలను ఆదేశించారు. ఎన్నికల నోటిఫికేషన్‌ను జారీ చేస్తే పనులను ప్రాంభించడం వీలు పడదన్నారు. దీంతో నిధులు వృథా అవుతాయన్నారు. లక్షలోపు ఉన్న పనులను జనవరి పదో తేదీలోగా పూర్తి చేయాలని, రూ.లక్ష నుంచి రెండు రూ.లక్షల పనులను ఫిబ్రవరి 10వ తేదీలోగా పూర్తి చేయాలన్నారు. రెండు లక్షల కన్న ఎక్కువగా ఉన్న పనులను మార్చి నెలాఖరులోగా పూర్తి చేయాలని, నిర్ణయించిన గడువు విషయంలో ఎలాంటి మార్పు ఉండబోదన్నారు. నిర్లక్ష్యం చేసిన సర్పంచులపైనే కాకుండా మండలాధికారులపై కూడా చర్యలు తప్పవన్నారు. ఇసుక క్వారీలు వేరే వ్యక్తులకు వద్దు జిల్లాలో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలకు ఇసుక కొరత తీవ్రంగా ఉందని చెబుతున్నారని కలెక్టర్ అన్నారు. ఇందుకు సంబంధిత మండలంలో లేదా పక్క మండలంలో ఎంపీడీఓల పేరుతో వాగుల్లో ఇసుకను తీయడానికి క్వారీని అనుమతిస్తున్నానని, కానీ ఆ క్వారీలు వేరే వ్యక్తుల పేరిటగాని, ఇతర పనులకు ఇసుకను వాడటంగాని జరిగితే ఎంపీడీఓలపై కఠిన చర్యలు తీసుకుంటానని కలెక్టర్ హెచ్చరించారు. వివిధ కారణాలతో మరుగుదొడ్ల నిర్మాణాలు నిలిచిపోతున్నాయని కారణాలు చెప్పి తప్పించుకోవడం కుదరదన్నారు. మరుగుదొడ్లు నిర్మిస్తున్న నేపథ్యంలో రింగుల తయారీదారులు ఎక్కువ ధరలకు అమ్ముతున్నారని ఓ ఎంపీడీఓ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. స్పం దించిన కలెక్టర్ రింగులను ఎక్కువ ధరకు అమ్మే వారిని తమ కంట్రోల్లో పెట్టుకోవాలని, సరైన ధరకే అమ్మే విధంగా చూడాలన్నారు. అలాకాదని ఎక్కువ ధరకు అమ్మిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే రింగుల తయారీ కోసం దరఖాస్తులు చేసుకున్న వారికి త్వరగా సబ్సిడీ రుణాలు ఇప్పించాలని, బ్యాంకు అనుమతి ఇవ్వని వారికి బ్యాంకరుతో మాట్లాడి రుణం వచ్చేలా చేయాలని కలెక్టర్ సూచించారు. ఈ నెలాఖరులోగా మరుగుదొడ్ల నిర్మాణంలో పురోగతి కనిపించాలన్నారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ రాజారాం, డ్వామా పీడీ శివలింగయ్య, ఐకేపీ పీడీ వెంకటేశం ఇతర అధికారులు పాల్గొన్నారు. పనిచేసే దమ్ముండాలి.. మెతక వైఖరి పనికిరాదు.. 2012-13 బీఆర్జీఎఫ్ పనులను కూడా ఇంతవరకు పూర్తి చేయలేని పరిస్థితిలో అధికారులు ఉన్నారని కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎంపీడీఓ కార్యాలయానికి సంబంధించిన ప్రహరీ నిర్మాణానికి ఓ వ్యక్తి అడ్డు తగిలి కోర్టులో కేసు వేశాడని బాన్సువాడ ఎంపీడీఓ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ‘ మీ కార్యాలయానికే ప్రహరీ నిర్మించుకోలేని విధంగా ఉన్నావు.. ఇక ప్రజలకు ఉపయోగపడే పనులు ఎలా చేస్తావు.. నీకు సిగ్గుగా అనిపించడంలేదా..’ అంటూ అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వ అధికారి పనిచేసే దమ్ముండాలని, మెతక వైఖరి పనికిరాదని కలెక్టర్ హితవు పలికారు. నేటి నుంచి కొత్త పెన్షన్‌దారులు డబ్బులు తీసుకోవచ్చు జిల్లాలో రచ్చబండ కార్యక్రమంలో ప్రభుత్వం మంజూరు చేసిన కొత్త పెన్షన్లకు సంబంధింత పెన్షన్‌దారులు పోస్టాఫీసుల్లో డబ్బులు తీసుకోవచ్చని కలెక్టర్ తెలిపారు. ఈ విషయం గ్రామాల్లో దండోర వేయించాలని సూచించారు. రచ్చబండలో మంజూరైన రేషన్ కార్డులు, పెన్షన్, ఇందిరమ్మ ఇళ్లు కొందరికి రెండుసార్లు, మరికొందరు బోగస్ ఉండటం, లబ్ధిదారులు చనిపోయిన వారికి మంజూరైనట్లు చెప్పారు. మంజూరైన వాటిని వివరాలతో సహా తనకు అప్పగించాలని మండలాధికారులను ఆదేశించారు. వాటిని ప్రభుత్వానికి సరెండర్ చేస్తానని కలెక్టర్ తెలిపారు.