గడువులోగా పనులు పూర్తిచేయాలి | Deadline to completing the tasks | Sakshi
Sakshi News home page

గడువులోగా పనులు పూర్తిచేయాలి

Published Thu, Dec 12 2013 3:27 AM | Last Updated on Sat, Sep 2 2017 1:29 AM

Deadline to completing the tasks

ఇందూరు,న్యూస్‌లైన్ : గ్రామాల్లో జనవరి పదో తేదీలోగా బీఆర్‌జీఎఫ్ పనులు పూర్తి చేయని సర్పంచుల చెక్ పవర్ రద్దు చేస్తామని, ఈ విషయాన్ని జిల్లాలోని 718 గ్రామ పంచాయతీల సర్పంచులకు సమావేశం ఏర్పాటుచేసి తెలియజేయాలని ఎంపీడీఓలను జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న  దేశించారు. ఇందులో ఉపేక్షించేది లేదని తేల్చి చె ప్పారు. బుధవారం జిల్లాపరిషత్ సమావేశ మందిరంలో జిల్లాలో కొనసాగుతున్న  2012- 13, 2013-14 బీఆర్‌జీఎఫ్ పనుల పురోగతిపై ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్‌లు, ఇంజినీరింగ్ అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.  2013-14 సంవత్సరానికి సంబంధించిన బీఆర్‌జీఎఫ్ పనులు ప్రారంభించని వాటిని వెంటనే ప్రాంభించాలని, ముఖ్యంగా గ్రామాల్లో పనులు పెండింగ్‌లో ఉన్నందున సర్పంచులు చర్యలు తీసుకోవాలన్నారు.
 
 నిర్ణయించిన గడువు తేదీలోగా పనులు పూర్తిచేయని సర్పంచుల చెక్ పవర్‌ను తక్షణమే రద్దు చేయాలని జిల్లా పంచాయతీ అధికారిని, ఎంపీడీఓలను ఆదేశించారు. ఎన్నికల నోటిఫికేషన్‌ను జారీ చేస్తే  పనులను ప్రాంభించడం వీలు పడదన్నారు. దీంతో నిధులు వృథా అవుతాయన్నారు.   లక్షలోపు ఉన్న పనులను జనవరి పదో తేదీలోగా పూర్తి చేయాలని, రూ.లక్ష నుంచి రెండు రూ.లక్షల పనులను ఫిబ్రవరి 10వ తేదీలోగా పూర్తి చేయాలన్నారు. రెండు లక్షల కన్న ఎక్కువగా ఉన్న పనులను మార్చి నెలాఖరులోగా పూర్తి చేయాలని, నిర్ణయించిన గడువు విషయంలో ఎలాంటి మార్పు ఉండబోదన్నారు. నిర్లక్ష్యం చేసిన సర్పంచులపైనే కాకుండా మండలాధికారులపై కూడా చర్యలు తప్పవన్నారు.
 
 ఇసుక క్వారీలు వేరే వ్యక్తులకు వద్దు
 జిల్లాలో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలకు ఇసుక కొరత తీవ్రంగా ఉందని చెబుతున్నారని కలెక్టర్ అన్నారు. ఇందుకు సంబంధిత మండలంలో లేదా పక్క మండలంలో ఎంపీడీఓల పేరుతో వాగుల్లో ఇసుకను తీయడానికి క్వారీని అనుమతిస్తున్నానని, కానీ ఆ క్వారీలు వేరే వ్యక్తుల పేరిటగాని, ఇతర పనులకు ఇసుకను వాడటంగాని జరిగితే ఎంపీడీఓలపై కఠిన చర్యలు తీసుకుంటానని కలెక్టర్ హెచ్చరించారు. వివిధ కారణాలతో మరుగుదొడ్ల నిర్మాణాలు నిలిచిపోతున్నాయని కారణాలు చెప్పి తప్పించుకోవడం కుదరదన్నారు.  మరుగుదొడ్లు నిర్మిస్తున్న నేపథ్యంలో రింగుల తయారీదారులు ఎక్కువ ధరలకు అమ్ముతున్నారని ఓ ఎంపీడీఓ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. స్పం దించిన కలెక్టర్ రింగులను ఎక్కువ ధరకు అమ్మే వారిని తమ కంట్రోల్‌లో పెట్టుకోవాలని, సరైన ధరకే అమ్మే విధంగా చూడాలన్నారు. అలాకాదని ఎక్కువ ధరకు అమ్మిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే రింగుల తయారీ కోసం దరఖాస్తులు చేసుకున్న వారికి త్వరగా సబ్సిడీ రుణాలు ఇప్పించాలని, బ్యాంకు అనుమతి ఇవ్వని వారికి బ్యాంకరుతో మాట్లాడి రుణం వచ్చేలా చేయాలని కలెక్టర్ సూచించారు.  ఈ నెలాఖరులోగా మరుగుదొడ్ల నిర్మాణంలో పురోగతి కనిపించాలన్నారు. సమావేశంలో  జెడ్పీ సీఈఓ రాజారాం, డ్వామా పీడీ శివలింగయ్య, ఐకేపీ పీడీ వెంకటేశం ఇతర అధికారులు పాల్గొన్నారు.
 
 పనిచేసే దమ్ముండాలి.. మెతక వైఖరి పనికిరాదు..
 2012-13 బీఆర్‌జీఎఫ్ పనులను కూడా ఇంతవరకు పూర్తి చేయలేని పరిస్థితిలో అధికారులు ఉన్నారని కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.  ఎంపీడీఓ కార్యాలయానికి సంబంధించిన ప్రహరీ  నిర్మాణానికి ఓ వ్యక్తి అడ్డు తగిలి కోర్టులో కేసు వేశాడని బాన్సువాడ ఎంపీడీఓ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ‘ మీ కార్యాలయానికే ప్రహరీ నిర్మించుకోలేని విధంగా ఉన్నావు.. ఇక ప్రజలకు ఉపయోగపడే పనులు ఎలా చేస్తావు.. నీకు సిగ్గుగా అనిపించడంలేదా..’ అంటూ అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వ అధికారి పనిచేసే దమ్ముండాలని, మెతక వైఖరి పనికిరాదని కలెక్టర్ హితవు పలికారు.
 
 నేటి నుంచి కొత్త పెన్షన్‌దారులు డబ్బులు తీసుకోవచ్చు
 జిల్లాలో రచ్చబండ కార్యక్రమంలో ప్రభుత్వం మంజూరు చేసిన కొత్త పెన్షన్‌లకు సంబంధింత పెన్షన్‌దారులు పోస్టాఫీసుల్లో డబ్బులు తీసుకోవచ్చని కలెక్టర్ తెలిపారు. ఈ విషయం గ్రామాల్లో దండోర వేయించాలని సూచించారు.  రచ్చబండలో మంజూరైన రేషన్ కార్డులు, పెన్షన్, ఇందిరమ్మ ఇళ్లు కొందరికి రెండుసార్లు, మరికొందరు బోగస్ ఉండటం, లబ్ధిదారులు చనిపోయిన వారికి మంజూరైనట్లు చెప్పారు. మంజూరైన వాటిని వివరాలతో సహా తనకు అప్పగించాలని మండలాధికారులను ఆదేశించారు. వాటిని ప్రభుత్వానికి సరెండర్ చేస్తానని కలెక్టర్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement