ఇందూరు, న్యూస్‌లైన్ : జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ వసతి గృహాలు 116 ఉన్నాయి. వీటిలో విద్యార్థులకు కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పన కోసం రెండు నెలల క్రితం కలెక్టర్ ప్రద్యుమ్న రాత్రి బస కార్యక్రమం చేపట్టారు. జిల్లాస్థాయి అధికారులందరూ నెలలో ఒకరోజు హాస్టళ్లలో బస చేసి విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు, కావాల్సిన మౌలిక వసతులు తెలుసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం ప్రత్యేక ప్రొఫార్మా తయారు చేశారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందుతుందా, వసతిగృహాల్లో తాగునీరు, టాయిలెట్లు, విద్యుత్ సౌకర్యాలున్నాయా అన్న వివరాలను ప్రొఫార్మాలో పొందుపర్చాలి.
రెండు సార్లు హాస్టళ్లలో బస చేసిన అధికారులు 209 సమస్యలను గుర్తించి కలెక్టర్‌కు నివేదిక అందించారు. అయితే ఇప్పటివరకు సౌకర్యాల కల్పనకు ఏ వసతి గృహంలోనూ చర్యలు చేపట్టకపోవడం గమనార్హం. నిధులు లేకపోవడంతో వసతులు కల్పించలేకపోయామని సంక్షేమ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. కాగా మౌలిక సదుపాయాల కల్పనను పక్కన పెట్టి ప్రస్తుతానికి వసతి గృహల పరిసరాల్లోని అపరిశుభ్ర వాతావరణాన్ని తొలగించడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా ఈ పనులను త్వరలో చేపట్టనున్నారు. అయితే కలెక్టర్ స్పందించి హాస్టళ్లలోని ప్రధాన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు.
త్వరలో పరిష్కారం
జిల్లాలోని వసతి గృహాల్లో అధికారులు రెండు సార్లు బస చేశారు. పలు సమస్యలను గుర్తించి కలెక్టర్‌కు నివేదిక ఇచ్చారు. కొన్ని వసతి గృహాల్లో సదుపాయాల కల్పనకు నిధులు వచ్చాయి. మరికొన్నింటికి త్వరలో నిధులు మంజూరవుతాయి. హాస్టళ్లలోని సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తాం.
-విమలాదేవి, జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి
ఫలితమివ్వని ‘బస’
Published Mon, Oct 28 2013 3:55 AM | Last Updated on Sat, Sep 2 2017 12:02 AM
Advertisement
Advertisement