BC hostels
-
అంగట్లో హాస్టల్ సీట్లు..!
సాక్షి, నిజామాబాద్: మొన్నటి వరకు బీసీ పోస్టు మెట్రిక్ హాస్టళ్లలో సీట్ల కోసం మంత్రులు, ఎమ్మెల్యేల రికమండేషన్ లేఖలు ఇవ్వడంతో చాల మంది పేద విద్యార్థులకు సీట్లు దక్కని పరిస్థితి నెలకొంది. కానీ తాజాగా బీసీ సంక్షేమ శాఖ మరో కొత్త కోణం వెలుగు చూసింది. హాస్టల్ సీట్లకు డిమాండ్ పెరగడంతో సీట్లు ఇప్పిస్తానంటూ ఓ అధికారి వసూళ్ల దందాకు తెరలేపినట్లు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. నిబంధనలను తుంగలో తొక్కి హాస్టళ్లలో సీట్లు ఇప్పించడానికి తెలిసిన వారితో భేరసారాలకు దిగినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. డబ్బులకైతే ఓకే.. నందిపేట్ నూత్పల్లి గ్రామానికి చెందిన ఓ విద్యార్థిని ఇంటర్ 940 మార్కులతో పాసైంది. జిల్లా కేంద్రాంలోని గిరిరాజ్ కళాశాలలో సీటు రావడంతో బీసీ హాస్టల్లోనే ఉండి చదువుకోవడానికి తనకు తెలిసిన ఓ హాస్టల్ వర్కర్‌తో వెళ్లి దరఖాస్తు చేసుకుంది. ఇంటర్ ప్రైవేటు కళాశాలలో చదవడంతో సీటు ఇవ్వడం సాధ్యం కాదని చెప్పిన ఓ అధికారి డబ్బులకైతే సీటు వస్తుందని హాస్టల్ వర్కర్‌తో భేరం కుదిర్చాడు. ఆ విద్యార్థని తల్లిదండ్రులు నుంచి కొంత డబ్బులు తీసుకొని సదరు అధికారికి ముట్టజెప్పాడు. కానీ ఇంత వరకు హాస్టల్లో సీటు ఇవ్వలేదు. అక్రమంగా జేబులు నింపుకుంటున్న అధికారిసీటు కోసం కార్యాలయానికి వచ్చిన చాల మంది దగ్గర డబ్బులకు సీట్లు ఇచ్చారనే ఆరోపణలు ఆ అధికారిపై ప్రచారంలోకి వస్తున్నాయి. అందినకాడికి దండుకుని అక్రమంగా జేబులు నింపుకుంటున్న సదరు అధికారిపై తీరుపై శాఖలోని ఉద్యోగులు కూడా చర్చించుకుంటున్నారు. జిల్లా కేంద్రంలో డిమాండ్ ఎక్కువ జిల్లాలో బీసీ పోస్టు మెట్రిక్ హాస్టళ్లు 7 బాలికల, 6 బాలుర మొత్తం 13 హాస్టళ్లున్నాయి. ఒక్కో హాస్టల్లో ప్రభుత్వం నుంచి 100 సీట్లు మాత్రమే మంజూరు ఉంటాయి. అయితే జిల్లా కేంద్రంలో కళాశాలలు అధికంగా ఉండడంతో జిల్లా కేంద్రంలోని హాస్టళ్లకు డిమాండ్ బాగా పెరిగిపోవడంతో సీట్ల సమస్యగా ఎక్కువగా ఉంది. జిల్లా కేంద్రంలో రెండు బాలికలు, రెండు బాలుర హాస్టళ్లు మాత్రమే ఉన్నాయి.దీంతో సీట్ల విషయంలో అక్రమాలకు పాల్పడుతున్నట్లు సమాచారం. ఆందోళనలో వార్డెన్లు జిల్లా కేంద్రంలో ఉన్న బీసీ హాస్టళ్లలో అదనంగా సీట్లు మంజూరు చేసుకుని భర్తీ చేసుకుంటున్న వార్డెన్లకు సదరు అధికారి వైఖరిపై గుబులు పట్టుకుంది. అదనంగా మంజూరు ఇస్తున్న సదరు అధికారి ఆర్డర్ కాపీలపై సంతకాలు లేకుండా వార్డెన్లకు ఇస్తున్నారు. సంతకాలు లేకుండా సీట్ల కేటాయింపులు చేయడంతో వార్డెన్లు ఆందోళన చెందుతున్నారు. జరిగిన సీట్ల కేటాయింపులో రేపటినాడు ఏదైనా తేడా వస్తే తామే బాధ్యులవుతామని భయంలో ఉన్నారు. -
వసతి గృహాల్లో సమస్యలకు చెక్!
సాక్షి, హైదరాబాద్: వెనుకబడిన తరగతుల సంక్షేమ వసతి గృహాల్లో సమస్యలకు చెక్ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. జూన్ 1 నుంచి హాస్టళ్లు పునఃప్రారంభం కానుండటం తో ఆలోపే అక్కడి సమస్యలను పరిష్కరిం చే దిశగా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశా లు జారీ చేసింది. ప్రస్తుతం బీసీ సంక్షేమ వసతి గృహాలకు సెలవులు ఉన్నందున.. వీలైనన్ని ఎక్కువ హాస్టళ్లను సందర్శించాలని బీసీ సంక్షే మ శాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించారు. ఈ విజిట్‌లో భాగంగా చేపట్టాల్సిన కార్యక్రమా లు, పరిశీలన తీరును వివరించారు. సందర్శన అనంతరం బీసీ సంక్షేమ శాఖ కమిషనర్‌కు నివేదికలు ఇవ్వాలని, ప్రాధా న్యతలను బట్టి నిధులు విడుదల చేస్తే సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వ్యక్తిగత పరిశీలనకే ప్రాధాన్యత బీసీ హాస్టళ్ల పరిశీలన వ్యక్తిగతంగా చేపట్టాలని జిల్లా అధికారులకు ప్రభుత్వం ఆదేశించింది. తాగునీరు, పరిసరాల పరిశుభ్రత తదితరాలను పరిశీలించాలి. ప్రస్తుతం హాస్టల్ కొనసాగుతున్న భవనం, నిర్మాణం తీరు, కరెంటు సరఫరా, బల్బులు, కరెంటు వైరింగ్, కిటికీలు, తలుపుల పరిస్థితి, హాస్టల్ పరిసరాల్లో చెత్త తొలగింపు, యూనిఫాం పంపిణీ, స్టాకు, పుస్తకాలు, కాపీల పంపిణీ వివరాలన్నీ క్షుణ్ణంగా పరిశీలించాలి. ఇటీవల బీసీ వసతిగృహాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన నేపథ్యంలో.. వాటి వినియోగం, పనితీరు ఎలా ఉందనే దాన్ని పరిశీలించాలి. రాష్ట్రవ్యాప్తంగా 700 బీసీ హాస్టళ్లలో 634 వసతిగృహాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇందులో 362 హాస్టళ్లు ప్రభుత్వ భవనాల్లో కొనసాగుతుండగా.. మిగతా 272 హాస్ట ళ్లు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. హాస్టల్లోని పరిస్థితిని ఎప్పటికప్పుడు ఆన్లైన్లో రాష్ట్ర కార్యాలయం నుంచి పరిశీలించేందుకు హైస్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ కనెక్షన్ సౌకర్యాన్ని కల్పించారు. నిర్ణీత ప్రొఫార్మాలో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం సూచించింది. వచ్చిన నివేదికలను ప్రభుత్వం పరిశీలించి ప్రాధాన్యతలకు అనుగుణంగా చర్యలు చేపడుతుంది. -
శిథిల భవనాలు.. గాలిలో ప్రాణాలు!
ఇందూరు(నిజామాబాద్ అర్బన్): హాస్టల్ భవనా లు శిథిలావస్థకు చేరాయి.. విద్యార్థుల ప్రాణాలు గాలిలో దీపంలా మారాయి! ఇటీవల బోధన్‌లోని ప్రభుత్వ బీసీ బాలికల కళాశాల వసతిగృహంలో పైకప్పు కూలి ముగ్గురు విద్యార్థినులకు తీవ్ర గాయాలైన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో ప్రస్తు తం శిథిలావస్థకు చేరిన ప్రభుత్వ వసతిగృహాల్లో ఉండేందుకు విద్యార్థులు జంకుతున్నారు. తమ వసతిగృహం పైకప్పు కూడా కూలి తమపై పడుతుందని భయం భయంతో కాలం వెళ్లదీస్తున్నారు. అయితే, హాస్టళ్లకు మరమ్మతులు చేయించాలని జిల్లా నుంచి ఎస్సీ, బీసీ సంక్షేమ శాఖల అధికారులు ప్రభుత్వానికి పలుమార్లు ప్రతిపాదనలు పంపినా సర్కారు.. వాటిని బుట్టదాఖలు చేస్తోంది. దీంతో నిధులు లేక హాస్టళ్లలో మరమ్మతు కరువయ్యాయి. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా బోధన్‌లోని బీసీ హాస్టల్లో పైకప్పు కూలిపోయి విద్యార్థినులపై పడిందని తల్లిదండ్రులు విమర్శిస్తున్నారు. ప్రభుత్వం నిధులిస్తే హాస్టల్‌కు మరమ్మతులు చేయించి ఉంటే ఈ ఘటన జరిగేది కాదని వారు చెబుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో కొనసాగుతున్న ప్రీ మెట్రిక్, పోస్టు మెట్రిక్ హాస్టళ్లలో చాలా వరకు సౌకర్యాలు సక్రమంగా లేవు. స్లాబు లీకేజీ, బోరు రిపేర్, విరిగిన కిటికీలు, తలుపులు, డ్రైనేజీ వసతులు అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఫ్యాన్లు, విద్యుత్ దీపాలు, పైపులైన్లు, సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్, టాయిలెట్స్, బాత్రూంలు, వాటర్ ప్లాంటు, ఫ్లోరింగ్, ఇతర పనులు చేయించాల్సి ఉంది. ఆయా పనుల కోసం నిధులు మంజూరు చేయాలని చాలా సార్లు అంచనాలు వేసి ప్రతిపాదనలు జిల్లా శాఖల నుంచి రాష్ట్ర శాఖల ద్వారా ప్రభుత్వానికి వెళ్లాయి. ప్రస్తుతం జిల్లాలో ఎస్సీ ప్రీ మెట్రిక్ హాస్టళ్లు, పోస్టు మెట్రిక్ కలిపి 39 ఉన్నాయి. అన్ని హాస్టళ్లలో కలిపి దాదాపు రూ.2 కోట్ల వరకు మరమ్మతులకు ప్రతిపాదనలు గతేడాది వెళ్లాయి. బీసీ హాస్టళ్ల విషయానికి వస్తే 19 ప్రీ మెట్రిక్, 4 పోస్టు మెట్రిక్ కలిపి మొత్తం 23 హాస్టళ్లు ఉండగా, 4 వేలకు పైగా విద్యార్థులు వసతి పొందుతున్నారు. అయితే, వీటిలో మరమ్మతుల కోసం బీసీ సంక్షేమ శాఖ నుంచి రూ.1.25 కోట్ల అంచనాతో గతేడాది ప్రతిపాదనలు పంపించారు. మొత్తం హాస్టళ్లకు కలిపి జిల్లాకు దాదాపు రూ.3.50 కోట్ల వరకు నిధులు అవసరం ఉండగా, ఆ ప్రతిపాదనలను ఈ ఏడాది జనవరిలో ప్రభుత్వం తిరస్కరించింది. మరోసారి ప్రతిపాదనలు.. బోధన్‌లో బీసీ బాలికల కళాశాల హాస్టల్ పైకప్పు కూలి ముగ్గురు విద్యార్థినులకు తీవ్ర గాయాలు కావడంతో మరమ్మతులు ఏయే హాస్టళ్లకు అత్యవసరమో గుర్తించారు. నిజామాబాద్‌లో బాలికలు, బాలుర హాస్టళ్లు, ఆర్మూర్‌లో బాలుర, బాలికల వసతి గృహాలు, రెంజల్ బాలికల హాస్టల్, బోధన్ బాలికల హాస్టళ్లు రెండు, మోపాల్ బాలుర హాస్టల్, కుద్వాన్పూర్ బాలుర హాస్టల్, బాల్కొండ బాలుర, బాలికల వసతిగృహాలు, చౌట్పల్లి బాలుర హాస్టల్, పడగల్ బాలుర హాస్టల్, కోటగిరి బాలుర హాస్టల్, మాక్లూర్ బాలుర హాస్టల్ కలిపి 15 హాస్టళ్లలో మరమ్మతులు అత్యవసరమని, ఇందుకు రూ.55.65 లక్షలు అవసరమని ప్రతిపాదనలను ఇటీవల బీసీ సంక్షేమ శాఖ నుంచి వెళ్లాయి. ఇటు కలెక్టర్ రామ్మోహన్రావు కూడా నిధుల కోసం రాష్ట్ర శాఖలకు లేఖ రాయడానికి సిద్ధమైనట్లు సమాచారం. మరీ ఈ నిధులనైనా ప్రభుత్వం మంజూరు చేస్తుందో లేదో..? -
హాస్టల్స్‌లో ఏసీబీ తనిఖీలు
జిల్లాలోని తిరువూరు, గుడ్లవల్లేరు బీసీ బాలికల హాస్టల్స్‌లో ఏసీబీ అధికారులు సోమవారం తనిఖీలు నిర్వహించారు. తిరువూరులో మెనూ ప్రకారం భోజనం, అల్పాహారం అందట్లేదని, నాసిరకంగా ఆహారపదార్థాలుంటున్నాయని అందిన ఫిర్యాదుల మేరకు ఏసీబీ డీఎస్పీ ప్రసాద్ ఆధ్వర్యంలో వసతి గృహాన్ని పరిశీలించారు. కృష్ణా, తిరువూరు: విద్యార్థినులకు సరిపడా ఆహారం అందించకపోవడం, రికార్డుల నిర్వహణలో అవకతవకలకు పాల్పడటంతో పాటు హాస్టలును అధ్వానంగా నిర్వహిస్తున్న తిరువూరు బీసీ కళాశాల బాలికల వసతిగృహ మేట్రన్ రమాదేవిపై ఏసీబీ అధికారులు వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖకు ఫిర్యాదు చేశారు. సోమవారం ఏసీబీ డీఎస్పీ ప్రసాద్ ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీ చేసిన అధికారులు పలు లోపాలను కనుగొన్నారు. సోమవారం 23 మంది విద్యార్థినులు మాత్రమే హాజరవగా, 27మందికి రేషన్ వినియోగించినట్లు రికార్డులో నమోదు చేసి నిధులు మేట్రన్ దుర్వినియోగం చేసినట్లు ఏసీబీ డీఎస్పీ విలేకరులకు తెలిపారు. హాస్టలు ఆవరణ పరిశుభ్రంగా లేనందున విద్యార్థినులు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందని, మేట్రన్ ఇన్చార్జి బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించక, విధులకు గైర్హాజరవుతుండటంతో హాస్టలు నిర్వహణ సరిగా లేదని పేర్కొన్నారు. మెనూ ప్రకారం విద్యార్థినులకు చికెన్, గుడ్లు, పెరుగు, పండ్లు సరఫరా చేయకుండానే రిజిస్టర్లో నమోదు చేస్తున్నారని, పలు రిజిస్టర్ల నిర్వహణలో అశ్రద్ధ వహిస్తున్నారని తెలిపారు. విద్యార్థినులకు కాస్మోటిక్స్ కూడా ఇవ్వట్లేదని, వాస్తవంగా ఉన్న స్టాకుకు, రికార్డులకు పొంతన లేదని కూడా ఏసీబీ డీఎస్పీ ప్రసాద్ వెల్లడించారు. గుడ్లవల్లేరు బీసీ బాలికల హాస్టల్లో.. గుడ్లవల్లేరు: గుడ్లవల్లేరులోని బీసీ బాలికల హాస్టల్లో ఏసీబీ పోలీసులు సోదాలు నిర్వహించారు. హాస్టల్లో విద్యార్థునులే సమాచారం ఇవ్వటంతో సోమవారం వేకువజాము నుంచే ఏసీబీ సీఐలు కె.వెంకటేశ్వర్లు, జి.కెనడీ తమ బృందంతో కలసి హాస్టల్లో సోదాలు చేపట్టారు. హాస్టల్లో తొమ్మిదిమంది విద్యార్థునులను సీఐలు విచారించగా అన్నం నాణ్యత ఉండటం లేదన్నారు. చపాతీలను మెనూ ప్రకారం ఇవ్వటం లేదని, పనులు చేయిస్తున్నారని ఫిర్యాదు చేశారు. రోజుకు 10లీటర్ల పాలకు గానూ ఆరు లీటర్లు మాత్రమే వాడుతున్నట్లు చెప్పారు. ఈ మేరకు సీఐలు వార్డున్ వి.వి.శివలక్ష్మిని విచారించగా తమకు సిబ్బంది తక్కువగా ఉన్నారని, వంట మనిషి విద్యార్థినులతో కూరగాయలను కోయించిన మాట వాస్తవమేనని చెప్పారు. బాత్ రూమ్‌లు కూడా బాగోలేనట్లుగా విచారణలో తేటతెల్లమైంది. విద్యార్థునులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐలు వెంకటేశ్వర్లు, కెనడీ నమోదు చేసుకున్నారు. ఈ మేరకు నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించనున్నామని చెప్పారు. తతిరువూరు బీసీ హాస్టల్లో.. తిరువూరు: స్థానిక పాతతిరువూరులోని వెనుకబడిన తరగతుల బాలికల కళాశాల వసతిగృహంలో సోమవారం ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. మెనూ ప్రకారం భోజనం, అల్పాహారం అందట్లేదని, నాసిరకంగా ఆహారపదార్థాలుంటున్నాయని అందిన ఫిర్యాదుల మేరకు ఏసీబీ డీఎస్పీ ప్రసాద్ ఆధ్వర్యంలో సిబ్బంది హాస్టల్లోని రికార్డులు స్వాధీనం చేసుకుని తనిఖీ నిర్వహించారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం వరకు తనిఖీలు కొనసాగాయి. మేట్రన్ రమాదేవి స్థానికంగా నివసించట్లేదని, అప్పుడప్పుడు వచ్చి వెళుతున్నారని విద్యార్థినులు అధికారుల విచారణలో వెల్లడించినట్లు తెలిసింది. అనారోగ్య కారణంగా గానీ, సెలవురోజుల్లో గానీ ఇళ్లకు వెళ్ళిన విద్యార్థినులకు హాజరు వేసి వారి పేరిట రేషన్ కూడా ఖర్చు చేసినట్లు చూపినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇటీవల సవరించిన మెనూ ప్రకారం మాంసాహారం, కోడిగుడ్లు విద్యార్థినులకు అందట్లేదని తెలిపారు. -
బీసీ వసతిగృహాల్లో విందు భోజనం
వికారాబాద్ అర్బన్: ఉడికి ఉడకని అన్నం పెట్టడంతో విద్యార్థులు రోడెక్కిన దాఖలాలు ఉన్నాయి. వారంలో ఒకే రకమైన వంటకాలు పెట్టడంతో తినలేక కడుపులు మాడ్చుకున్న విద్యార్థులు ఎందరో ఉన్నారు. ప్రస్తుతం ఆ పరిస్థితులను మార్చేందుకు జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. గతంలో ప్రతి వసతి గృహానికి రోజు వారీగా మెనూ పాటించాలనే నిబంధనలున్నా అక్కడ పనిచేసే వార్డెన్లు పెద్దగా పట్టిచుకునే వారుకాదు. మెనూ నిబంధనలు గోడమీద రాతలకు మాత్రమే పరిమితమయ్యేవి. వార్డెన్లకు ఏది ఇష్టం వస్తే అది వండించి పెట్టేవారు. పైగా ఉదయం, సాయంత్రం పెట్టాల్సిన అల్పహారం పిల్లలు ఏనాడు ఎరుగరు. విద్యార్థులకు కూరగాయలు పెట్టకుండానే వార్డెన్లు బిల్లులు తీసుకునేవారు. ఇప్పుడు విద్యార్థుల భోజనానికి అవసరమైన కూరగాయలు, వంట సామగ్రి, గుడ్లు, చికెన్ వార్డెన్లు కొనాల్సిన అవసరంలేదు. జిల్లాలోని 21 బీసీ పాఠశాల స్థాయి వసతి గృహాలకు, 7 కళాశాల స్థాయి వసతి గృహాలకు విడివిడిగా టెండర్ల ద్వారా కాంట్రాక్టర్లకు అప్పగించారు. వారు తెచ్చిచ్చిన వస్తువులను వార్డెన్లు దగ్గరుండి వండించి విద్యార్థులకు సరిపడా భోజనం పెట్టించాలి. అధికారుల నిర్ణయంతో బీసీ వసతిగృహాల్లో ఉండే పాఠశాల, కళాశాల విద్యార్థులు ఇక మీదట విందు భోజనం చేయనున్నారు. కళాశాల విద్యార్థులకు ఉదయం టిఫిన్.. బీసీ కళాశాల స్థాయి విద్యార్థులకు ప్రతి రోజు ఉదయం 7గంటలకు చాయ్‌తో పాటు పార్లేజీ బిస్కెట్ ప్యాకెట్ ఒకటి ఇస్తారు. ప్రతి సోమవారం 8 గంటలకు టిఫిన్ చెట్నితో పాటు ఉప్మా, ఒక అరటి పండు ఇస్తారు. మంగళవారం పులిహోరా అరటి పండు, బుధవారం ఆలు బాత్ సాంబర్, అరటి పండు, గురువారం కిచిడి సాంబర్, అరటి పండు, శుక్రవారం ఉప్మా చెట్ని, అరటి పండు, శనివారం జీరా రైస్, అరటి పండు, ఆదివారం ఇడ్లి చెట్ని లేదా సాంబర్ ఇస్తారు. మధ్యాహ్నం భోజనం.. ప్రతీ సోమవారం మధ్యాహ్న భోజనంలో అన్నంతో పాటు ఆకుకూర పప్పు, రసం, మంగళవారం కూరగాయలు, సాంబర్, బుధవారం ఆకుకూర పప్పు, రసం, గురువారం కూరగాయ లు, సాంబర్, శుక్రవారం ఆకుకూర పప్పు, రసం, శనివారం కూరగాయలు, సాంబర్, ఆదివారం బిరియాని, చికెన్ కర్రి, రైతా, సాంబర్ ఇస్తారు. రాత్రి భోజనంలో.. ప్రతీ సోమవారం అన్నంతో పాటు కూరగాయలు, పెరుగు, సాంబర్, గుడ్డు, మంగళవారం ఆకుకూర పప్పు, రసం, పెరుగు, గుడ్డు, బుధవారం చికెన్ కర్రి, సాంబర్, రైతా, గురువారం ఆకుకూర పప్పు, సాంబర్, గుడ్డు, శుక్రవారం కూరగాయలు, పెరుగు, సాంబర్, గుడ్డు, శనివారం ఆకుకూర పప్పు, రసం, పెరుగు, గుడ్డు, సేమియా స్వీట్, ఆదివారం ఆకుకూర పప్పు, రసం, గుడ్డు. పాఠశాల స్థాయి విద్యార్థులకు.. సోమవారం నుంచి ఆదివారం వరకు ప్రతి రోజు ఉదయం పాలు చక్కెరతో రాగి మాల్ట్ ఇస్తారు. కళాశాల విద్యార్థులకు ఇచ్చే మెనూ ప్రకారమే పాఠశాలకు విద్యార్థులకు అల్పహారం ఇవ్వనున్నారు. ఆదివారం మాత్రం వసతిగృహంలోనే బిర్యాని, చికెన్ కర్రి పెట్టనున్నారు. సాయంత్రం 5గంటలకు సోమవారం తాలింపుతో అటుకులు, మంగళవారం ఉడికించిన బొబ్బర్లు, బుధవారం ఉడికించిన శనగలు, గురువారం ప్యార్లేజీ బిస్కెట్ ప్యాకెట్, శుక్రవారం తాలింపుతో అటుకులు, శనివారం సేమియా స్వీట్, ఆదివారం పల్లిపట్టి ఒకటి. రాత్రి భోజనంలో కళాశాల విద్యార్థుల మెనూ ప్రకారంగానే రోజు అన్నంతో పాటు, ఆకు కూరలు, కూరగాయలు, గుడ్డు పెట్టనున్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు విద్యార్థులకు పెట్టే భోజనంలో వార్డెన్లు ఏమాత్రం నిబంధనలు అతిక్రమించినా, నిర్లక్ష్యం చేసినా కఠినంగా వ్యవహరిస్తాం. విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టాలనే తపన కలెక్టర్, జేసీకి ప్రగాడంగా ఉంది. ప్రతి వసతి గృహంలో తప్పకుండా మెనూ పాటించాలి. కూరగాయలు, ఇతర సామగ్రికి టెండర్లు పొందిన వారు సక్రమంగా సరఫరా చేయాలి. లేనిపక్షంలో వారి స్థానంలో మరొకరిని నియమిస్తారు. వార్డెన్లు తప్పు చేస్తే శాఖపరమైన చర్యలు ఉంటాయి. – ఏ.పుష్పలత, జిల్లా బీసీ వెల్పేర్ అధికారి -
సంక్షేమ హాస్టళ్లను వణికిస్తున్న చలిపులి
సాక్షి, అమరావతి బ్యూరో: రాష్ట్రాన్ని చలిపులి వణికిస్తోంది. సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థులు చలికి గజగజ వణుకుతున్నారు. చలికాలం వచ్చినా దుప్పట్లు, రగ్గులు, పరుపులు ఇంకా పూర్తిస్థాయిలో పంపిణీ చేయకపోవడం, చాలా హాస్టళ్లకు కిటికీలు, తలుపులు లేకపోవడమే ఇందుకు కారణం. మరోవైపు దోమలు విజృంభిస్తున్నాయి. ఈ సమస్యలతో విద్యార్థులు రాత్రిళ్లు నిద్రకు దూరమై చదువుపై శ్రద్ధ చూపలేకపోతున్నారు. మరికొందరు చలికి, దోమలకు తట్టుకోలేక ఇంటి బాట పడుతున్నారు. సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాల్సిన ప్రభుత్వ యంత్రాంగం మాత్రం మిన్నకుంటోంది. శీతాకాలం వచ్చినా.. రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ హాస్టళ్లు 2,020 ఉన్నాయి. వీటిల్లో 1,88,917 మంది విద్యార్థులు ఉన్నారు. ఆయా హాస్టళ్లలో దాదాపు 500పైగా ప్రైవేటు భవనాలతోపాటు శిథిల భవనాల్లో కొనసాగు తున్నాయి. హాస్టళ్లను తగ్గించుకుంటూ వస్తున్న ప్రభుత్వం కనీసం ఉన్న హాస్టళ్ల లోనైనా సదుపా యాలను కల్పించడం లేదు. ఏటా శీతా కాలంలో విద్యార్థులు చలికష్టాలు ఎదుర్కొం టున్నారు. ఇంకా వసతి గృహాల్లో దుప్పట్లు, పరుపులు పంపిణీ చేయలేదు. ఆగస్టులో పంపిణీ చేశామని చెబుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం ఒక్కో పరుపుపై ముగ్గురు చొప్పున విద్యార్థులు నిద్రిస్తున్నారు. కప్పుకోవడానికి దుప్పట్లు కూడా లేక ఇద్దరేసి ఒక దుప్పటితో సరిపెట్టుకుంటున్నారు. కిటీకీలు, తలుపులు లేని హాస్టల్స్‌లో చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో నిద్ర పట్టక చలిమంటలతో జాగారం చేస్తున్న సంఘటనలున్నాయి. దోమల బెడద తీవ్రంగా ఉంది. దోమతెరలు ఇస్తామని గతంలోనే ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే ఇంతవరకు ఆ హామీ నెరవేరలేదు. విద్యార్థులు ఇటు చలి, అటు దోమల బెడదతో నిద్రకు దూరమై అనారోగ్యం బారినపడుతున్నారు. స్కూలుకెళ్లినా నిద్రలేమితో చదువుపై శ్రద్ధచూపలేకపోతున్నారు. రాష్ట్రంలో పరిస్థితి ఇలా.. - తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలం కోటీకేశ్వరం బీసీ హాస్టల్ పరిస్థితి దయనీయంగా ఉంది. శిథిల భవనంలో వసతి గృహాన్ని నిర్వహిం చలేక స్థానిక హైస్కూల్లోనే మూడు గదులను హాస్టల్ కింద నిర్వహిస్తున్నారు. అందు లోనూ కిటికీలు, తలు పులు లేక చలితో విద్యార్థులు సతమతమవుతున్నారు. కిర్లంపూడి, అద్దరిపేట, ములకపూడి బీసీ హాస్టల్స్ ప్రైవేటు భవనాల్లో నిర్వహిస్తున్నారు. - కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలులోని స్థానిక బీసీ బాలుర వసతి గృహం అద్దె భవనంలో ఉంది. అందులో 85 మంది విద్యార్థులు ఉంటే మూడు గదులు మాత్రమే ఉన్నాయి. ఆ గదులు చాలక వరండాలోనే నిద్రిస్తున్నారు. ఈ చలికాలంలో వారి పరిస్థితి దయనీయంగా ఉంది. ఇదే జిల్లాలో పెడనలో కూడా ఇదే పరిస్థితి ఉంది. - కర్నూలులో బి క్యాంపులో ఉన్న బీసీ హాస్టల్లో 220 మంది విద్యార్థులు ఉన్నారు. భవనం శిథిలావస్థకు చేరుకుంది. కిటికీలు, తలుపులు లేకపోవడంతో విద్యార్థులు దుప్పట్లను, గోనె సంచులను అడ్డుపెట్టుకుని చలిగాలుల నుంచి రక్షించుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు. కప్పుకునేందుకు దుప్పట్లు చాలక అల్లాడుతున్నారు. ఇందులో విచిత్రం ఏమిటంటే.. ఆ హాస్టల్ జిల్లా ఉన్నతాధికారులకు కూతవేటు దూరంలోనే ఉంది. అయినా హాస్టల్ వైపు తొంగిచూసినవారు లేరు. -
వసతి.. తరగతి ఒకే గది!
బీసీ గురుకుల పాఠశాలలు ఇరుకు గదులు, అరకొర వసతుల మధ్య కొనసాగుతున్నాయి. సొంత భవనాలు లేకపోవడంతో అద్దె భవనాల్లో తరగతులు నిర్వహిస్తున్నారు. విద్యార్థుల సంఖ్యకు సరిపడా గదులు లేనందున ఒకే గదిలో వసతి, తరగతులు నడుస్తున్నాయి. ప్రభుత్వం సొంత భవనాలు నిర్మిస్తే ఇక్కట్లు తప్పుతాయని విద్యార్థులు అంటున్నారు. మోర్తాడ్(బాల్కొండ): వెనుకబడిన తరగతుల విద్యార్థుల కోసం 2017–18 విద్యా సంవత్సరానికి గాను రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గానికి ఒక గురుకుల పాఠశాలను ప్రారంభించింది. ఇందులో భాగం గా జిల్లాలోని ఐదు నియోజకవర్గాలకుగాను మూడు బాలుర, రెండు బాలికల గురుకుల పాఠశాలలు ప్రారంభమయ్యాయి. బాలుర కో సం బాల్కొండ నియోజకవర్గానికి సంబంధిం చిన మోర్తాడ్‌లో, ఆర్మూర్ నియోజకవర్గానికి సంబంధించి ఖుద్వాన్పూర్లో, బోధన్ నియోజకవర్గానికి సంబంధించి ఎడపల్లిలో పాఠశాలలు ఏర్పాటు చేశారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గానికి సంబంధించి బాలికల పాఠశాలను చీమన్‌పల్లిలో ఏర్పాటుకు నిర్ణయించగా, అనువైన వసతులు లేని కారణంగా ప్రస్తుతం నిజామాబాద్‌లోని ఒక అద్దె భవనంలో కొనసాగిస్తున్నారు. నిజామాబాద్ అర్బన్ గురుకులకు కంజరలో సొంతభవనం నిర్మిస్తుండగా ప్రస్తుతం నగరంలోని అద్దె భవనంలో కొనసాగిస్తున్నారు. వసతులు కరువు.. బీసీ గురుకుల పాఠశాలలకు సొంత భవనాలు లేకపోవడంతో వినియోగంలో లేని వసతి గృహాలు, అద్దె భవనాల్లో తరగతులు నిర్వహిస్తున్నారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా గదులు లేకపోవడం, మూత్రశాలలు, మరుగుదొడ్లు, నీటి సౌకర్యం ఆశించిన మేర లేకపోవడంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. ప్రతి పాఠశాలలో ఐదు, ఆరు, ఏడు తరగతులలో విద్యార్థులకు అడ్మిషన్లు ఇచ్చారు. ఒక్కో తరగతికి రెండు సెక్షన్లను కేటాయించగా, ఒక్కో తరగతిలో 80 సీట్లను భర్తీ చేశారు. అంటే ఒక గురుకుల పాఠశాలలో మూడు తరగతులకు కలిపి 240 సీట్లను భర్తీ చేశారు. ⇔ మోర్తాడ్‌లోని పాఠశాలకు వినియోగంలో లేని బీసీ విద్యార్థి వసతి గృహాన్ని కేటాయించారు. అయితే ఈ వసతిగృహంలో వందమంది విద్యార్థులు ఉండడానికి మాత్రమే వీలుంది. కానీ 240 మంది విద్యార్థులను ఉండడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఆరు గదుల్లోనే వసతితో పాటు, తరగతులు నిర్వహిస్తున్నారు. అంతేగాకుండా విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా మరుగుదొడ్లు, మూత్రశాలలు, నీటివసతి సరిపోక విద్యార్థులు రోగాల బారిన పడుతున్నారు. ⇔ ఖుద్వాన్పూర్ పాఠశాలలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. అయితే ఇక్కడ వసతికి ఇబ్బంది ఉన్నా.. వసతి గృహం ఎదురుగా ఉన్న ఉన్నత పాఠశాలలో తరగతులు నిర్వహిస్తున్నారు. ⇔ ఎడపల్లి పాఠశాలలో విద్యార్థులు ఉండలేక ఇంటిముఖం పడుతున్నారు. దీంతో వచ్చే విద్యా సంవత్సరం ఈ పాఠశాలను బోధన్‌కు తరలించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ⇔ నిజామాబాద్ రూరల్ నియోజకవర్గానికి సంబంధించి పాఠశాలను చీమన్‌పల్లికి తరలించడానికి సన్నాహాలు చేస్తున్నారు. చీమన్‌పల్లిలోని ఒక ప్రైవేటు భవనాన్ని అద్దెకు తీసుకుని విద్యార్థినులకు అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పించినట్లు అధికారులు చెబుతున్నారు. చీమన్‌పల్లిలో గురుకుల పాఠశాల నిర్వహణ కోసం రూ.30 లక్షల వరకు ఖర్చు చేసి సౌకర్యాలను మెరుగుపరిచారు. ఒక్క చీమన్‌పల్లి పాఠశాలకు సంబంధించి సమస్య పరిష్కారం అయినా మిగిలిన పాఠశాల పరిస్థితి మాత్రం అంతంత మాత్రంగానే ఉంది. పెరుగనున్న విద్యార్థుల సంఖ్య.. ఈ విద్యా సంవత్సరానికి గాను ఒక్కో పాఠశాలలో 240 మంది విద్యార్థులు ఉండగా, వచ్చే ఏడాది మరో తరగతి పెరుగనుంది. ఇప్పుడు ఏడో తరగతిలో ఉన్న విద్యార్థులు వచ్చే సంవత్సరం ఎనిమిదో తరగతిలో చేరనున్నారు. అలాగే మిగిలిన రెండు తరగతుల విద్యార్థులు పై తరగతులకు ప్రమోట్ కానున్నారు. దీంతో ఐదో తరగతిలో కొత్తగా విద్యార్థులు చేరడానికి అవకాశం ఉంది. అంటే మరో 80 మంది విద్యార్థుల సంఖ్య పెరగనుంది. ఇప్పుడు 240 మంది విద్యార్థులకు వసతి కల్పించడానికి ఇబ్బందులు ఉండగా విద్యార్థుల సంఖ్య మరింత పెరిగితే కష్టాలు తప్పేలా లేవనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. క్రీడలకూ దూరం.. బీసీ గురుకుల పాఠశాలల విద్యార్థులు క్రీడలకూ దూరమవుతున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న పాఠశాలల్లో అనువైన క్రీడా స్థలం లేకపోవడంతో ఆటలకు సమయం కేటాయించలేకపోతున్నారు. విద్యార్థులకు చదువుతోపాటు క్రీడలు ఎంతో ముఖ్యం. క్రీడాకారులు తయారు కావడానికి పాఠశాలల్లోనే పునాదులు ఏర్పడతాయి. అయితే గురుకుల పాఠశాలల్లోని విద్యార్థుల పరిస్థితి భిన్నంగా తయారైంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి గురుకుల పాఠశాలలకు స్థల సేకరణ పూర్తి చేసి సొంత భవనాల నిర్మాణం వేగంగా చేపట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ఇబ్బందులు తొలగించడానికి కృషి చేస్తున్నాం.. బీసీ గురుకుల పాఠశాలల్లోని విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం. కొత్తగా ప్రారంభించిన పాఠశాలలకు అనువైన భవనాలు దొరకడం కష్టమే. సొంత భవనాలు నిర్మించే వరకు కొంత ఇబ్బంది తప్పదు. అయితే ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో విద్యార్థులకు సౌకర్యాలను మెరుగుపరచడానికి కృషి చేస్తున్నాం. – గోపిచంద్, బీసీ గురుకుల పాఠశాలల కన్వీనర్ సరైన సౌకర్యాలు లేవు.. గురుకుల పాఠశాలలో సరైన వసతి కల్పించడం లేదు. నీటి సమస్య తీవ్రంగా ఉంది. అలాగే మరుగుదొడ్లు, మూత్రశాలల సంఖ్య తక్కువగా ఉంది. చదువుకోవడం, నిద్రపోవడం ఒక్కటే చోట కావడం, సామగ్రి కూడా గదుల్లోనే ఉంచడంతో ఇబ్బందిగా ఉంది. – విజయ్‌కుమార్, విద్యార్థి, మోర్తాడ్ కొత్త భవనాలను నిర్మించాలి బీసీ గురుకుల పాఠశాలలకు కొత్త భవనాలను వెంటనే నిర్మించాలి. స్థలం లేక ఎలాంటి ఆటలు ఆడలేకపోతున్నాం. ప్రభుత్వం స్థల సేకరణ చేసి కొత్త భవనాలను నిర్మిస్తేనే మాకు ప్రయోజనం కలుగుతుంది. ఇరుకు గదుల్లో చదవాలంటే ఇబ్బందిగా ఉంటోంది. – అచ్యుత్, విద్యార్థి, మోర్తాడ్ -
బీసీ వసతి గృహాల్లో బయోమెట్రిక్
► బాలికల వసతి గృహాల్లో సీసీ కెమెరాలు కూడా.. ► అక్రమాలకు అడ్డుకట్ట ∙సులువుగా అధికారుల పర్యవేక్షణ ► పెరగనున్న విద్యార్థుల హాజరు శాతం కరీంనగర్‌ఎడ్యుకేషన్: ప్రభుత్వ ఎస్సీ వసతి గృహాల్లో రెండేళ్ల క్రితం నుంచే బయోమెట్రిక్ విధానం అమలు చేయడంతో విద్యార్థుల హాజరు శాతంతోపాటు, అక్రమాలకు అడ్డుకట్ట పడింది. ఫలితంగా బీసీ వసతి గృ హాల్లోనూ ఈ విధానం ప్రవేశపెట్టాలని ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయించింది. దీంతో వసతి గృహాల్లో చోటు చేసుకుంటున్న అక్రమాలకు కళ్లెం పడనుంది. ప్రస్తుతం వసతి గృహాల నిర్వాహకులు సమయపాలన పాటించకపోవడంతోపాటు స్థానికంగా ఉండడం లేదు. అధికా రులు పర్యవేక్షణ కొరవడడంతో ఇష్టం వచ్చినప్పుడు వస్తూ వెళ్తున్నారు. ఈ క్రమంలో ఆయా వసతి గృహాల్లో బయోమెట్రిక్ అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోం ది. ఎస్సీ వసతి గృహాల్లో రెండేళ్లుగా అమలులో ఉంది. సత్ఫలితాలు రావడంతో, ఈ విద్యా సంవత్సరం నుంచే బీసీ వసతి గృహాల్లో అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో ఆగస్టు మొదటి వారం నుంచి బయోమెట్రిక్ ప్రారంభించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇందుకోసం అవసరమున్న కంప్యూటర్లు, ప్రింటర్లు, బయోమెట్రిక్ యంత్రాలు జిల్లాకు చేరుకున్నాయి. వసతి గృహాల్లో విద్యార్థులు తక్కువగా ఉన్నా, హాజరు శాతం ఎక్కువగా చూపించి కాస్మోటిక్ చార్జీలు, దుప్పట్ల నిధులు కాజేసేవారు. ఉద్యోగులు సక్రమంగా విధులకు హాజరుకాకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించేవారు. బయోమెట్రిక్ విధానంతో వసతి గృహాల్లో ఇలాంటి అక్రమాలకు తెరపడనుంది. జిల్లాలో 1,740 మంది విద్యార్థులు.. జిల్లాలో 5 ప్రీమెట్రిక్, 2 పోస్ట్‌మెట్రిక్ వసతి గృహాలుండగా, గతేడాది 1600 మంది విద్యార్థులు వసతి పొందారు. వీటిలో పోస్ట్‌మెట్రిక్ వసతి గృహాల్లో 740 మంది, ప్రీమెట్రిక్ వసతి గృహంలో 860 మంది ఉండేందుకు అవకాశం కల్పించారు. ఈ ఏడాది ఇప్పటివరకు 180 మంది విద్యార్థులు చేరారు. ఇప్పుడిప్పుడే ప్రవేశాలు జరుగుతున్నాయి. వీటిపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వసతి గృహాల వార్డెన్లు ఇష్టారాజ్యంగా వ్యవహరించడంతోపాటు చాలా చోట్ల మెనూ ప్రకారం భోజనం అందించడం లేదు. ప్రవేశం పొందిన విద్యార్థులు రోజుల తరబడి వసతి గృహాలకు హాజరుకాకున్నా, నిర్వాహకులు పూర్తి స్థాయిలో హాజరు శాతం నమోదు చేస్తూ నిధులు కాజేస్తున్నారు. కాస్మోటిక్ చార్జీలు, దుప్పట్లతోపాటు తప్పుడు లెక్కలు చూపుతూ అక్రమాలకు పాల్పడుతున్నారు. వసతి గృహాలు పర్యవేక్షించాల్సిన ఉన్నతాధికారులు‘మామూలు’గా వ్యవహరించడంతో అక్రమాలకు అడ్డూ అదుపులేకుండా పోతోంది. పలువురు వార్డెన్లు విధులకు హాజరు కాకుండా, అటెండర్లు, కుక్లే వసతి గృహాలను నిర్వహిస్తున్నారు. ఇలాంటి పరిస్థితులకు అడ్డుకట్ట వేసేందుకు వసతి గృహాల్లో బయోమెట్రిక్‌తో పాటు కంప్యూటర్, ప్రింటర్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అక్రమాలకు తెర.. వసతి గృహాల్లో బయోమెట్రిక్ విధానం అమలుతో అక్రమాలకు తెరపడనుంది. బయోమెట్రిక్ విధానంలో వేలిముద్రతో యంత్రాన్ని ఓపెన్ చేస్తారు. విద్యార్థులు ప్రతిరోజూ ఉదయం అల్పాహారం చేసే ముందు, మధ్యాహ్న భోజనానికి ముందు రెండుసార్లు బయోమెట్రిక్ యంత్రంపై వేలిముద్రలు నమోదు చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్లో హాజరుశాతం నమోదవుతుంది. మండలస్థాయి నుంచి రాష్ట్రస్థాయి అధికారులకు ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. దీంతో వసతి గృహాల నిర్వాహకులు సమయపాలన పాటించడంతోపాటు విద్యార్థుల హాజరు శాతం పెరగనుంది. విద్యార్థులకు అందించే భోజనం, ఇతర సామగ్రి లెక్కలు పక్కాగా ఉంటాయి. త్వరలోనే అమలు చేస్తాం.. జిల్లాలోని బీసీ వసతి గృహాల్లో బయోమెట్రిక్ విధానం అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే బయోమెట్రిక్ మిషన్లు, సీసీ కెమెరాలు జిల్లాకు చేరుకున్నాయి. జిల్లాలోని వసతి గృహాల్లో అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ విధానం అమలైతే వసతి గృహ నిర్వాహకుల్లో జవాబుదారీతనం పెరగడంతోపాటు విద్యార్థుల హాజరు శాతం పెరుగుతుంది. ఉన్నతాధికారులకు రోజూవారీ విద్యార్థుల హాజరుశాతం అందుబాటులో ఉంటుంది. జిల్లా వ్యాప్తంగా బీసీ వసతి గృహాల్లో ఆర్వో ప్లాంట్లు, ఇన్వ్ర్టర్లు అమలు చేసేందుకు నిధులు వచ్చాయి. ట్రంకు పెట్టేలు సైతం కొత్తగా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. – బి.సరోజ, జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి -
బీసీ హాస్టళ్లలో ‘సీసీ నేత్రం’
సాక్షి, హైదరాబాద్: వెనుకబడిన తరగతుల సంక్షేమ వసతిగృహాల్లో నిఘాను కట్టుదిట్టం చేయాలని బీసీ సంక్షేమ శాఖ నిర్ణయించింది. అపరిచితుల రాకపోకలపై ఫిర్యాదులు, విధి నిర్వహణలో వసతిగృహ సంక్షేమాధికారి తీరుపై ఆరోపణలు పెరిగిపోతున్న నేపథ్యంలో చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా ముం దుగా బాలికల వసతిగృహాల్లో సీసీ(క్లోజ్డ్ సర్క్యూట్) కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 705 బీసీ సంక్షేమ హాస్టళ్లు ఉన్నాయి. ఇందులో 250 కాలేజీ విద్యార్థి హాస్టళ్లు కాగా, 455 పాఠశాల విద్యార్థి హాస్టళ్లు. వీటిలో 325 బాలికల వసతిగృహాలుండగా, ఈ హాస్టళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు ఆ శాఖ అంచనాలు సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదించింది. వసతిగృహ సంక్షేమాధికారి సమయపాలన పటించకపోవడం, అనధికారిక వ్యక్తులు హాస్టళ్లకు పదేపదే రావడంతో ఏర్పడుతున్న ఇబ్బందులను అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వానికి తెలిపింది. ఈ ప్రతిపాదనను ప్రభుత్వం ఆమోదించడంతో టీఎస్టీఎస్(తెలంగాణ స్టేట్ టెక్నికల్ సర్వీసెస్) ద్వారా కెమెరాలను ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటోంది. ప్రతి వసతిగృహంలో బయోమెట్రిక్ మిషన్లు ఏర్పాటు చేయాలని ఆ శాఖ తాజాగా నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఎస్సీ, ఎస్టీ వసతిగృహాల్లో సత్ఫలితాలు వస్తున్న తరు ణంలో వీటిని బీసీ హాస్టళ్లలో అమలుకు పూనుకుంది. ఇకపై విద్యా ర్థులు, వసతిగృహ సంక్షేమా ధికారి, సిబ్బంది హాజరు కూడా బయోమెట్రిక్ మిషన్ల ద్వారా నమోదు చేస్తే పర్యవేక్షణ సులువవుతుందని అధికారులు చెబుతున్నారు. ఇందుకు రాష్ట్ర కార్యాలయంలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ సెల్‌లోని ఉద్యోగులు వసతిగృహాల్లోని పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించి నివేదికలు తయారు చేస్తారు. -
బీసీ హాస్టళ్లల్లో బయోమెట్రిక్
లేపాక్షి: రాష్ట్రంలోని బీసీ హాస్టళ్లు, బీసీ కళాశాల హాస్టళ్లలో త్వరలో బయోమెట్రి క్ విధానం అమలు చేస్తున్నట్లు అనంతపురం బీసీ సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రమాభార్గవి తెలి పారు. మంగళవారం మధ్యాహ్నం లేపాక్షి ఆలయాన్ని సందర్శించిన అనంతరం ఆమె స్థానిక విలేకర్లతో మాట్లాడారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ బీసీ వసతి గృహాల్లో బయోమెట్రిక్ విధానం అమలు చేస్తున్నామన్నారు. అధికారులకు ఈ విధానంపై త్వరలో శిక్షణ కూడా ఇవ్వనున్నట్లు తెలిపారు. దీనివల్ల వారిలో జవాబుదారీతనం, విద్యార్థుల్లో హాజరు శాతం మెరుగు పడుతుందన్నారు. ఆమె వెంట ఏబీసీడబ్ల్యూఓ కృత్తిక, హాస్టల్ సంక్షేమాధికారి సుభాషిణి ఉన్నారు. -
బీసీ హాస్టళ్ల పునరుద్ధరణ కోసం ఆందోళన
గాలివీడు: వైఎస్సార్ జిల్లా గాలివీడు, చిన్నమండ్యంలలో ఎత్తివేసిన బీసీ హాస్టళ్లను పునరుద్ధరించాలని కోరుతూ రాయచోటిలో విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు. రాయచోటి తహశీల్దార్ కార్యాలయం వరకు విద్యార్థులు ర్యాలీ తీశారు. అనంతరం కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. ఆందోళనకు దిగిన విద్యార్థులకు ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి మద్ధతు తెలిపారు. విద్యార్ధుల సమస్యలపై పభుత్వంతో పోరాడతామని హామీ ఇచ్చారు. -
అధ్వానంగా బీసీ హాస్టళ్లు
సర్కారు చేయించిన సర్వేలో వెల్లడి సాక్షి, హైదరాబాద్: ‘బీసీ సంక్షేమ వసతి గృహాలు అధ్వానంగా ఉన్నాయి... ఎస్సీ, ఎస్టీ వసతి గృహాలతో పోలిస్తే బీసీ హాస్టళ్లు వెనకబడ్డాయి. హాస్టళ్లతో పోలిస్తే రెసిడెన్షియల్ పాఠశాలలు మెరుగ్గా ఉన్నాయి...’ అని తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది. రాష్ట్రంలోని అన్ని సంక్షేమ వసతి గృహాల స్థితిగతులపై ప్రభుత్వం ఇటీవల ప్రత్యేక సర్వే చేయించింది. హాస్టళ్లలో విద్యార్థుల హాజరు శాతం, గత ఏడాది అమల్లో పెట్టిన సన్న బియ్యం పథకం, విద్యార్థుల ఉత్తీర్ణతా శాతం, విద్యా ప్రమాణాలు, హాస్టళ్లలో తాగునీరు, విద్యుత్తు, నిర్వహణ, మౌలిక సదుపాయాలన్నింటిపైనా అధ్యయనం చేయించింది. రెండ్రోజుల కిందటే రాష్ట్ర ప్రణాళికా విభాగం అధికారులు ఈ సర్వేలో గుర్తించిన ప్రధానాంశాలతో పాటు సమగ్ర నివేదికను సీఎం కేసీఆర్‌కు సమర్పించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ విభాగాల పరిధిలో రాష్ట్రంలో మొత్తం 1,394 హాస్టళ్లు ఉన్నాయి. వీటితోపాటు సగం ప్రభు త్వ రెసిడెన్షియల్ స్కూళ్లను ప్రభుత్వం సర్వే చేయిం చింది. హాస్టళ్లతో పోలిస్తే రెసిడెన్షియల్ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలతో పాటు మెరుగైన మౌలిక సదుపాయాలున్నాయనే దృక్పథంతో రెండింటినీ సర్వేకు ఎంచుకుంది. రాష్ట్ర ప్రణాళికా విభాగం.. సెంటర్ ఫర్ సోషల్ డెవలప్మెంట్ అనే సంస్థతో సర్వే చేయించింది. బీసీ హాస్టళ్ల స్థితిగతులు దుర్భరంగా ఉన్నాయని ఈ అధ్యయనంలో తేలింది. దీంతో పాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టళ్లనే తారతమ్యం లేకుండా సమీకృత హాస్టళ్లను నెలకొల్పితే ఎలా ఉంటుంది..? అనే కోణంలోనూ ఈ సంస్థ అధ్యయన ఫలితాలను వెల్లడించినట్లు తెలిసింది. -
బీసీ హాస్టళ్లలో బయో మెట్రిక్ విధానం
కడప రూరల్ : త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ హాస్టళ్లలో బయో మెట్రిక్ విధానాన్ని ప్రవేశ పెడతామని రాష్ట్ర వెనుకబడిన తరగతులు, జౌళి, చేనేత శాఖల మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. వైఎస్ఆర్ జిల్లా కడపలో గురువారం నిర్వహించిన చంద్రన్న రుణ మేళాలో పాల్గొనడానికి వచ్చిన ఆయన నగరంలోని బీసీ హాస్టళ్లను తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 897 ప్రీ మెట్రిక్, 349 పోస్టు మెట్రిక్ హాస్టళ్లతోపాటు 32 రెసిడెన్షియల్ స్కూళ్లలో బీసీ వర్గాలకు చెందిన విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారని తెలిపారు. త్వరలో బీసీ హాస్టళ్లలో బయో మెట్రిక్ విధానాన్ని ప్రవేశ పెట్టడంతోపాటు హాస్టళ్లన్నింటినీ రెసిడెన్షియల్ హాస్టళ్లుగా (విద్యాభ్యాసం, వసతి ఒకేచోట) మారుస్తామన్నారు. అనంతరం ఆయన చంద్రన్న రుణమేళాలో మాట్లాడుతూ.. బీసీ వర్గాల వృత్తిదారుల అభ్యున్నతి కోసం మళ్లీ ఆదరణ పథకాన్ని ప్రవేశ పెడతామన్నారు. ఎస్సీ, ఎస్టీ, సబ్ ప్లాన్ తరహాలోనే రూ.6,640 కోట్లతో బీసీ సబ్‌ప్లాన్‌ను అమలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ మేడా మల్లికార్జునరెడ్డి, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ ఎస్వీ సతీష్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ కేవీ రమణ, బీసీ కార్పొరేషన్ ఎండీ మల్లికార్జున పాల్గొన్నారు. -
హాస్టల్స్‌ను ఎత్తివేయడం అన్యాయం
పాలకొల్లు సెంట్రల్ : విద్యార్థులు లేరని కుంటిసాకులు చెబుతూ జిల్లాలోని ఎస్సీ, బీసీ హాస్టళ్లను తొలగించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వైఎస్సార్ సీపీ ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు చెల్లెం ఆనందప్రకాష్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఖండవల్లి వాసు నివాసంలో శనివారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. జిల్లాలో సుమారు 132 హాస్టళ్లు ఉన్నాయని, వాటిలో దాదాపు 30 హాస్టళ్లను ఎత్తేయాలని అధికారులు ప్రభుత్వానికి నివేదికలు పంపించడాన్ని ఖండిస్తున్నామన్నారు. హాస్టళ్లు ప్రారంభించి రెండు నెలలు కావస్తున్నా విద్యార్థులకు దుస్తులు, దుప్పట్లు ఇప్పటివరకూ ఇవ్వలేదన్నారు. కాస్మోస్టిక్స్, మెస్ చార్జీలకు ఇంతవరకూ నిధులు మంజూరు చేయకపోవడం వల్ల అనేక ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు. హాస్టళ్ల తొలగింపు నిర్ణయం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. -
‘వసతి’కి చెదలు!
- దయనీయ స్థితిలో ఎస్సీ, బీసీ హాస్టళ్లు - మౌలిక సదుపాయాల కల్పనకు నిధుల కొరత - ప్రతిపాదనలు తెప్పించుకుని పట్టించుకోని ప్రభుత్వం - ఒక్కో ఎస్సీ హాస్టల్‌కు రూ. 14,990 కేటాయింపు - ఆ నిధులకూ ట్రెజరీలో అడ్డుకట్ట - ఒక్కో బీసీ హాస్టల్‌కు రూ.30 వేలు ఖర్చు చేసి బిల్లు పెట్టాలని సూచన - డబ్బు లేదని చేతులెత్తేసిన బీసీ హెచ్డ బ్ల్యూఓలు - ఈ నెల 15 నుంచి ప్రారంభం కానున్న ప్రభుత్వ వసతి గృహాలు కడప రూరల్ : జిల్లాలోని సాంఘిక, బీసీ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో నడిచే వసతి గృహాలలో మౌలిక సదుపాయాలు పడకేశాయి. సాధారణంగా పాఠశాలలకు సెలవులు ప్రకటించిన రోజుల్లో ఆయా హాస్టళ్లలో మరుగుదొడ్లు, నీటి సరఫరా, భవనాలకు సున్నం వేయడం, ఫ్లోరింగ్‌ను బాగు చేయడం, విద్యుత్ సరఫరా, తలుపులు, కిటికీలను బాగు చేయడం తదితర పనులు చేపట్టాలి. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకపోవడంతో వసతి గృహాల్లో మౌలిక సదుపాయాలు దయనీయంగా మారాయి. అసౌకర్యాలతో పోరాడుతూనే హాస్టల్ విద్యార్థులు ఇటీవల పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ఫలితాలను సాధించి తమ సత్తాను చాటుకున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆ స్థాయిలో మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు చేపట్టడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఎస్సీ హాస్టళ్లు దయనీయం జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మొత్తం 143 బాలబాలికల హాస్టళ్లు ఉన్నాయి. అందులో 14 వేల మంది వసతి పొందడానికి అవకాశం ఉండగా, గడిచిన 2014-15 విద్యా సంవత్సరంలో ఆ హాస్టళ్లలో పది వేల మంది విద్యార్థులు వసతి పొందారు. మొత్తం 143 హాస్టళ్లకుగాను 102 హాస్టళ్లు ప్రభుత్వ భవనాల్లో, 41 హాస్టళ్లు ప్రైవేటు భవనాల్లో నడుస్తున్నాయి. మొదట రాష్ట్ర ప్రభుత్వం సూచనల మేరకు జిల్లా అధికారులు మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా కొత్తగా ప్రభుత్వ భవనాల్లో నడిచే హాస్టళ్లలో మరుగుదొడ్లు, స్నానపుగదుల కొత్త భవనాల నిర్మాణంతోపాటు నీటి సరఫరా, విద్యుత్ సరఫరా, తలుపులు, కిటికీలు, ఫ్లోరింగ్, శ్లాబ్ తదితర శాశ్వత పనులు, మరమ్మత్తుల కోసం రూ. 6.50 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం మైనర్ పనుల కింద తాత్కాలికంగా అత్యవసరంగా ప్రతిపాదనలు పంపాలని సూచించింది. ఆ మేరకు అధికారులు 82 పనులకు రూ.3.55 కోట్లు అవసరమని ప్రతిపాదనలు పంపా రు. అనంతరం ఈ ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకున్న పాపాన పోలేదు. తాజాగా ప్రభుత్వ భవనాల్లో నడిచే హాస్టళ్లలో తాత్కాలిక, మౌలిక సదుపాయాల కోసం ఒక్కో హాస్టల్‌కు నామమాత్రంగా రూ.14,900 కేటాయించింది. అయితే, ఇందుకు సంబంధించి ట్రెజరీలో బిల్లులు మంజూరు కాకపోవడంతో హెచ్‌డబ్ల్యుఓలు చేసేది ఏమిలేక మిన్నకుండిపోయారు. బీసీ హాస్టళ్లు దారుణం జిల్లా బీసీ సంక్షేమ శాఖ పరిధిలో మొత్తం 59 బాలబాలికల హాస్టళ్లు ఉన్నాయి. అందులో 38 హాస్టళ్లు ప్రభుత్వ భవనాల్లో, 21 హాస్టళ్లు ప్రైవేటు భవనాల్లో కొనసాగుతున్నాయి. ఈ హాస్టళ్లలో గడిచిన విద్యా సంవత్సరం ఏడు వేల మంది వరకు వసతి పొందారు. కాగా, ఈ సెలవుల్లో బీసీ హాస్టళ్లలో మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు చేపట్టాలని ప్రభుత్వం సంకల్పించింది. ఆ మేరకు సంక్షేమ శాఖల ఇంజనీరింగ్ విభాగమైన ఏపీఈడబ్ల్యుఐడీసీకి ఒక్కో హాస్టల్లో రూ.30 వేల వ్యయంతో చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే ఆ శాఖ ఈ పనులకు సంబంధించి టెండర్ల ప్రక్రియను కొనసాగించాలంటే ఆలస్యమవుతుందని సంకల్పించింది. దీంతో ఆయా హాస్టల్ హెచ్డబ్ల్యుఓలే రూ.30 వేలను భరించి తమ హాస్టళ్లలో వసతుల కల్పన కోసం ఖర్చు పెడితే అందుకు సంబంధించిన బిల్లులను సమర్పించిన తర్వాత ఖర్చు మొత్తాన్ని చెల్లిస్తామని తెలిపింది. అయితే, బీసీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లు (హెచ్‌డబ్ల్యుఓలు) తమ వద్ద అంత డబ్బు లేదని చేతులెత్తేసినట్లు తెలిసింది. ఇదివరకే డైట్ బిల్లులను ప్రభుత్వం మంజూరు చేయకపోవడంతో ఆ భారం తమపైన పడిందని, ఇప్పుడు అదనంగా రూ. 30 వేలను ఖర్చు చేయాలంటే ఏ విధంగా చేయాలని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. కాగా, అందులో ఇద్దరు హెచ్‌డబ్ల్యుఓలు మాత్రమే రూ.30 వేలతో మౌలిక సదుపాయాలకు ఖర్చు చేసినట్లు తెలిసింది. నిరుపేదల సంక్షేమం పట్టదా? గతంలో ఏడాదికి రూ. 20 వేల చొప్పున కేటాయింపులు చేపట్టాలనే నిబంధన ఉం డేది. ఇప్పుడు అది కూడా లేదు. పైగా మెటీరియల్, కూలీల ఖర్చుకూడా అమాంతం పెరిగాయి. ఈ తరుణంలో ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్ ఏ మూలకు సరిపోతుందని హెచ్‌డబ్ల్యుఓలు ప్రశ్నిస్తున్నారు. ప్రతిపాదనలు పంపాం: ప్రభుత్వ సూచనల మేరకు హాస్టళ్లలో మౌలిక సదుపాయాల కోసం ప్రతిపాదనలు పంపాం. ఒక్కో ఎస్సీ హాస్టల్‌కు రూ. 14,900 మంజూరు చేసింది. ఆ డబ్బులు హెచ్‌డబ్ల్యుఓలకు అందాల్సి ఉంది. డబ్బులు అందగానే పనులు ప్రారంభిస్తాం. -
అన్ని బీసీ హాస్టళ్లలో స్వచ్ఛ కార్యక్రమం
గోల్నాక (హైదరాబాద్) : తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని కళాశాలల బీసీ హాస్టళ్లలో స్వచ్ఛ కార్యక్రమాన్ని విద్యార్థుల సహకారంతో నిర్వహిస్తున్నట్లు బీసీ సంక్షేమ శాఖ డెరైక్టర్ కె.అలోక్‌కుమార్ అన్నారు. సోమవారం అంబర్‌పేటలోని బీసీ కళాశాల హాస్టల్లో జరిగిన స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... రాష్ట్రంలోని పది జిల్లాల్లో 250 బీసీ హాస్టళ్లు ఉన్నాయని, ఆయా కళాశాలల్లో విద్యార్థుల పరీక్షల షెడ్యూల్‌ను అనుసరించి వారికి వీలైన సమయంలో ఈ స్వచ్ఛ కార్యక్రమాన్ని చేపడతామన్నారు. బీసీ సంక్షేమశాఖ ఉద్యోగులు, విద్యార్థులంతా ఇందులో పాల్గొనాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. -
బీసీ హాస్టళ్ల సౌకర్యాల మెరుగుకు కార్యాచరణ
ప్రభుత్వానికి ప్రతిపాదించిన బీసీ సంక్షేమ శాఖ హైదరాబాద్: ప్రస్తుత విద్యాసంవత్సరంలో బీసీ హాస్టళ్లలో సౌకర్యాల మెరుగుకు, విద్యార్థులకు అదనపు సదుపాయాలకు బీసీ సంక్షేమశాఖ కార్యాచరణ ప్రణాళికలను రూపొందించుకుంది. హాస్టళ్లలోని చిన్న చిన్న మరమ్మతులను రూ.6.46 కోట్లతో పూర్తి చేసేందుకు ప్రణాళికలను రూపొందించింది. విద్యార్థుల కాస్మొటిక్ చార్జీలను పెంచే ందుకు రూ.5.31 కోట్లు కేటాయించింది. పది జిల్లాల్లో ఉన్న 494 బీసీ ప్రి మెట్రిక్ హాస్టళ్లలో 42 వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఈ హాస్టళ్లలో బయోమెట్రిక్ విధానానికి రూ.5 కోట్లకు, 1+1 బెడ్ల ఏర్పాటుకు రూ.28.68 కోట్లకు, సోలార్ ఎనర్జీ వాడకానికి రూ.25.34 కోట్లతో ప్రతిపాదనలు సమర్పించింది. ఇందులో భాగంగా రూ.7.91 కోట్లతో ఆర్వో ప్లాంట్లను ఏర్పాటు చే సేందుకు బడ్జెట్‌ను కేటాయించాల్సి ఉంది. విద్యార్థులకు రూ.4.68 కోట్లతో 4 జతల స్కూలు డ్రస్సులు (ఒక స్పోర్ట్స్ డ్రస్సుతో సహా), బ్లాంకెట్లు/క్విల్ట్‌లు రూ.2.89 కోట్లతో అందజేయాలని ఇదివరకే ప్రతిపాదనలు సిద్ధం చేసింది. వాటిని ముందుగానే అందజేసేందుకు ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. -
బీసీ హాస్టళ్లకు సొంత భవనాలు
* 2, 3 ఏళ్లలో పూర్తి * బీసీ సంక్షేమ శాఖ సమీక్షలో మంత్రి జోగు రామన్న * విద్యార్థులతో ప్రేమగా వ్యవహరించాలని సూచన * సీఎం దృష్టికి చివరి ఏడాది విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ * బీసీల్లో బాగా వెనుకబడిన కులాలకు ‘కళ్యాణలక్ష్మి’ వర్తింపు! సాక్షి, హైదరాబాద్: రాబోయే 2, 3 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రంలోని బీసీ సంక్షేమ హాస్టళ్లన్నింటికీ సొంత భవనాలు నిర్మించనున్నట్లు ఆ శాఖ మంత్రి జోగు రామన్న తెలిపారు. ఇందు కోసం వచ్చే బడ్జెట్లో రూ.360 కోట్లు కేటాయించనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం 10వ తరగతి వరకు ఉన్న రెసిడెన్షియల్ స్కూళ్లను ఇంటర్ వరకు పెంచడం ద్వారా డ్రాపౌట్లను తగ్గించేలా చూస్తామని తెలిపారు. సోమవారమిక్కడ సచివాలయంలో బీసీ సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు, జిల్లా స్థాయి అధికారులతో ఆయన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్య కార్యదర్శి టి.రాధ, బీసీ కమిషన్ మెంబర్ సెక్రటరీ జైస్వాల్, డెరైక్టర్ కె.ఆలోక్‌కుమార్, మల్లయ్యభట్టు, మల్లిఖార్జున్, సీఈ మల్లేశం, జిల్లా సంక్షేమ అధికారులు పాల్గొన్నారు. వెనుకబడిన తరగతుల సంక్షేమం విషయంలో ఏ స్థాయి అధికారి, ఉద్యోగి అయినా నిర్లక్ష్యధోరణితో వ్యవహరించినా.. విధి నిర్వహణలో లోపాలున్నా ఉపేక్షించబోమని హెచ్చరించారు. హాస్టళ్లు, పాఠశాలల్లోని విద్యార్థుల పట్ల మానవతా దృక్పథం, ప్రేమ, కరుణతో వ్యవహరించాలని సూచించారు. ఫీజుల చెల్లింపుపై సానుకూలత.. వృత్తివిద్యా కోర్సులు, డిగ్రీలో చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు(దాదాపు రూ.250 కోట్లు) చెల్లిస్తే బాగుంటుందని కొందరు అధికారులు చేసిన సూచనపై మంత్రి సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. ఈ అంశాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి, తదనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని మంత్రి చెప్పారు. ఫీజులు, ఇతరత్రా అంశాల పరిశీలనకు బీసీ సంక్షేమ శాఖకు సంబంధించి ప్రాజెక్టు మానిటరింగ్ యూనిట్(పీఎంయూ)ను ఏర్పాటుచేయాలని అధికారులు కోరగా, వెంటనే దీనిని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి అన్నట్లు సమాచారం. కొన్ని హాస్టళ్లకు పెద్దమొత్తంలో కరెంట్ చార్జీలు వస్తున్నాయని, వాటిని డొమెస్టిక్ కనెక్షన్‌గా కాకుండా కమర్షియల్‌గా చూడడం వల్లనే ఈ సమస్య ఉత్పన్నమవుతోందని కొన్ని జిల్లాల అధికారులు ప్రస్తావించగా.. దీనిపై జీవో ఉన్నందున తదునుగుణంగా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. ఆధార్ కార్డులు లేనందు వల్ల వేల మంది విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో సమస్యలు తలెత్తుతున్నాయని ఒకరిద్దరు అధికారులు పేర్కొనగా, ఈ పథకానికి ఆధార్‌కార్డుల లింక్ లేకపోవడం అనేది సాధ్యం కాదని మంత్రి స్పష్టం చేసినట్లు సమాచారం. సమీక్ష అనంతరం సచివాలయం మీడియా పాయింట్ వద్ద జోగు రామన్న మీడియాతో మాట్లాడుతూ.. బీసీ కార్పొరేషన్‌లోని 12 ఫెడరేషన్లకు తగు నిధులు, సదుపాయాలు కల్పించడం ద్వారా వాటిని బలోపేతం చేస్తామన్నారు. ‘వచ్చే బడ్జెట్లో వృత్తుల వారీగా ఆయా సమాఖ్యల ద్వారా కేటాయింపులు చేస్తాం. అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు వచ్చే బడ్జెట్ సమావేశాలకు ముందే అఖిలపక్ష భేటీని నిర్వహించి రాష్ట్రంలోని 113 వెనుకబడిన కులాలకు తగిన ప్రాధాన్యం ఇచ్చేలా చర్యలు తీసుకుంటాం’ అని తెలిపారు. తమ శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీని చేపడతామన్నారు. కళ్యాణలక్ష్మి పథకాన్ని బీసీల్లో అందరికీ కాకపోయినా బాగా వెనుకబడిన కులాలకు, సంచార జాతుల(ఏ,బీ,సీ,డీ గ్రూపులు) వారిని గుర్తించి ఇస్తామన్నారు. చలికాలంలో బీసీ హాస్టళ్లలోని విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నందున, వచ్చే ఏడాదినుంచి రూ.500 వ్యయంతో ఒక్కొక్కరికి బ్లాంకెట్లను అందిస్తామని మంత్రి జోగురామన్న వెల్లడించారు. అడవిదొంగలకు ఇక కఠిన శిక్షలు అటవీ సంపద కొల్లగొడుతున్న స్మగ్లర్లపై కొరడా ఝళిపించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది. అడవిదొంగలకు కఠినమైన శిక్షలను విధించేలా అటవీ చట్టంలో మార్పులు తేనున్నారు. సాదాసీదా చట్టాల కారణంగా ఇప్పటికే రాష్ట్రంలో 1.50 లక్షల హెక్టార్ల అటవీ భూములు అన్యాక్రాంతం అయినట్టు అధికారులు గుర్తించారు. ఇక అక్రమంగా తరలిస్తున్న అటవీ సంపదకు లెక్కలేదు. ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం అడవుల్లో నిత్యం వేలాది టన్నుల టేకు అడవి దొంగల పాలవుతోంది. ఒకప్పుడు విస్తృతంగా విస్తరించిన రోజ్‌వుడ్ వృక్షాలు వెతికితే తప్ప కనిపించడం లేదు. అడవిదొంగలకు నామ మాత్ర శిక్షలే పడుతున్నాయి. పట్టుబడిన వారికి రూ. 2 వేల జరిమానా, ఏడాది జైలు శిక్ష మాత్రమే విధిస్తున్నారు. వెంటనే బెయిల్ లభిస్తుండడంతో స్మగ్లర్లు దోపిడీ కొనసాగిస్తూనే ఉన్నారు. దీన్ని అరికట్టేందుకు అటవీ దొంగలపై నాన్‌బెయిల్‌బుల్ సెక్షన్ల కింద కేసులు పెట్టేలా చట్టంలో మార్పులు చేసే విషయమై మంత్రి జోగు రామన్న సోమవారం ఉన్నతాధికారులతో చర్చించారు. స్మగ్లర్లకు కనిష్టంగా 3 ఏళ్ల జైలు శిక్ష, రూ. 30 వేల జరిమానా , దొంగతనం తీవ్రతను బట్టి జైలు శిక్ష, జరిమానాను పెంచేలా విధానాలు రూపొందించనున్నారు. ఇతరరాష్ట్రాల చట్టాలు అధ్యయనం... పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, తమిళనాడులో మన కంటే కఠిన శిక్షలు అమలవుతున్నాయి. వాటిని అధ్యయనం చేసి చట్టంలో నిబంధనలు పొందుపరచాలని ప్రభుత్వం భావిస్తోంది. విజిలెన్స్ వ్యవస్థను బలోపేతం చేసి, జీపీఎస్, వైర్ లెస్ వంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వినియోగించుకోవాలని నిర్ణయించారు. ఎకో టూరిజం ద్వారా అడవుల సంరక్షణతోపాటు, ఆదాయం కూడా పొందచ్చని, ఆ దిశగా విధానాలు రూపొందించాలని మంత్రి అధికారులకు సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి రేమండ్ పీటర్, అటవీ ముఖ్య సంరక్షణాధికారి ఎస్బీఎల్ మిశ్రా, వైల్డ్‌లైఫ్ సంరక్షణాధికారి పీకే శర్మ తదితరులు పాల్గొన్నారు. -
‘సంక్షేమానికి’ సన్న బియ్యం
ఇందూరు : నూతన విధానంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమంలో మార్పులు చేస్తోంది. పేదింటి విద్యార్థులకు ఉచితంగా సన్న బియ్యం అన్నాన్ని అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. జనవరి ఒకటి నుంచి ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలకు దొడ్డు బియ్యం స్థానంలో సన్న బియ్యం సరఫరా కానున్నాయి. ఈ విధానాన్ని జిల్లాలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతి గృహాలతో పాటు కస్తూర్బాగాంధీ ఆశ్రమ పాఠశాలలలో అమలు చేసేం దుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఇందుకోస ంప్రభుత్వం సన్న బియ్యాన్ని కిలో రూ.36 చొప్పు న కొనుగోలు చేస్తుంది. రూ.35 రాయితీతో రూపాయికి కిలో చొప్పున వసతిగృహాలకు అందజేస్తుంది. ఇదీ పరిస్థితి జిల్లాలో బీసీ వసతి గృహాలు 40 ఉన్నాయి. ఇందులో 4,229 మంది విద్యార్థులు వసతి పొందుతున్నారు. రోజూ 400 నుంచి 500 గ్రాముల బియ్యాన్ని వండి పెట్టాలి. ఇందుకోసం నెలకు 510 క్వింటాళ్ల సన్న బియ్యం అవసరమని ఆ శాఖ అధికారులు అంచనా వేశారు. 77 వసతి గృహాలలో ఉంటున్న 6,643 మంది విద్యార్థులకుగాను నెలకు 738 క్వింటాళ్లు బియ్యం కావాలని సాంఘిక సంక్షేమాధికారులు, వసతి గృహాలు, కస్తూర్బా ఆశ్రమ పాఠశాలలు కలిపి 27 చోట్ల ఉంటున్న 4,242 మంది విద్యార్థులకు నెలకు 636 క్వింటాళ్ల సన్న బియ్యం అవసరమని గిరిజన సంక్షేమాధికారులు నివేదిక అందజేశారు. మొత్తంగా జిల్లాలో 146 వసతిగృహాలలలో ఉంటున్న 15,114 మంది విద్యార్థులకు నెలకు 1,884 క్వింటాళ్ల సన్న బియ్యం అవసరం కానుంది. ఈ మొత్తం బియ్యాన్ని వసతి గృహాలకు అందజేయడానికి పౌరసరఫరాల అధికారులు పది రోజుల క్రితమే కలెక్టర్ ఆధ్వర్యంలో మిల్లర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించి ధరను నిర్ణయించారు. మిల్లర్లు సన్న బియ్యం సరఫరాలో నాణ్యత పాటించకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. పక్కదారి పట్టిస్తే సస్పెన్షనే ఇప్పటి వరకు సంక్షేమ వసతి గృహాలకు దొడ్డు బియ్యం ద్వారానే అన్నం వండి పెట్టేవారు. వీటిని కూడా వార్డెన్లు పక్కదారి పట్టించి అమ్ముకుంటున్న సంఘటనలు చా లానే ఉన్నాయి. అలాంటివారు కిలో కు రూ.36 విలువ కలిగిన సన్న బి య్యాన్ని మార్కెట్లో అమ్ముకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సన్న బి య్యాన్ని పక్కదారి పట్టించినట్లు తేలినా, దొ రికినా సంబంధిత వార్డెన్‌ను వెంటనే సస్పెండ్ చేయనున్నట్లు సంక్షేమాధికారులు సంకేతాలు పం పుతున్నారు. పెరగనున్న కాస్మొటిక్‌చార్జీలు వసతి గృహ విద్యార్థులకు త్వరలోనే మెస్ చార్జీలు, కాస్మోటిక్ చార్జీలు పెంచడానికి ప్రభుత్వం ఆలోచి స్తోంది. ఇదివరకు ప్రతీ విద్యార్థికి మెస్ చార్జీలను నెలకు రూ. 780 చెల్లించేవారు. దీనిని పెంచి రుచికరమైన కూరగాయల భోజనంతోపాటు, మాంసాహా రం, పౌష్టికాహారం అందజేయడానికి చర్యలు చేపడుతోంది.బాలికలకు కాస్మోటిక్ చార్జీలు నెలకు రూ. 100 ఉండగా దానిని రూ.120కు పెంచనుంది. బాలురుకు రూ. 70 నుంచి రూ.100కు పెంచే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. -
ఒక్క రూపాయిస్తే ఒట్టు!
వారంతా వెనుకబడిన తరగతులకు చెందిన విద్యార్థులు... ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో కుటుంబసభ్యులకు దూరంగా వసతి గృహాల్లో ఉంటూ చదువుకొంటున్నారు. హాస్టల్లో ఉంటే కాస్త మంచి దుస్తులు, భోజనం లభిస్తుంది, చక్కగా చదువుకోవచ్చని భావించిన విద్యార్థులకు ఇక్కడ కూడా అవస్థలు తప్పడంలేదు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఇక్కట్లకు గురవుతున్నారు. హాస్టళ్ల నిర్వహణకు ఇంతవరకూ ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా విడుదల కాకపోవడంతో వసతి గృహాల అధికారులు బయట అప్పులు చేస్తున్నారు. సాక్షి ప్రతినిధి, విజయనగరం : ‘మాది బీసీల పార్టీ. అధికారంలోకి వస్తే అన్ని విధాలుగా ఆదుకుంటాం. వెనుకబడిన వర్గాల సంక్షేమమే మా ధ్యేయం’ అంటూ ఎన్నికలకు ముందు టీడీపీ నేతలు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చారు. తీరా ప్రభుత్వం ఏర్పాటు చేశాక గాలి కొదిలేశా రు. అందుకు బీసీ హాస్టళ్లే ఉదాహరణ. వసతి గృహాలు తెరిచి నెలరోజులుకావస్తున్నా ఇంతవరకూ ఒక్క రూపాయి బడ్జెట్ కూడా విడుదల చేయలేదు. విద్యార్థులకు కావాల్సిన యూనిఫారాలు, నోటు పుస్తకాలు పంపిణీ చేయలేదు. పాఠశాలలు తెరిచే నాటికే నిధులతో పాటు విద్యార్థులకు అవసరమైనవన్నీ సిద్ధం చేయాలి. కానీ, ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడంతో అటు విద్యార్థులు, ఇటు హాస్టల్ అధికారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత నెల 12న బీసీ హాస్టళ్లు తెరిచారు. కానీ, ఇంతవరకు యూనిఫారాలు ఇవ్వలేదు. గతంలో మాదిరిగా ఒక్కొక్క విద్యార్థికి నాలుగు జతలు కాకుండా మూడు జతలే ఇస్తామని, వాటితో పాటు ఒక ట్రాక్ షూ ఇవ్వనున్నట్టు ప్రకటిస్తూ అందుకనుగుణంగా ప్రతిపాదనలు పంపాలని జిల్లాల వారీగా అధికారులను సర్కార్ కోరింది. దీంతో ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల్లో ఉన్న లక్షా 12వేల మంది విద్యార్థులకు వేర్వేరు రకాలు కలిపి 7లక్షల 97వేల 120మీటర్ల క్లాత్ అవసరం ఉంటుందని అధికారులు నివేదించారు. జిల్లాలో విద్యార్థులకు 46,487.9 మీటర్లు కావాలి. కానీ ఇంతవరకు యూనీఫారాల గురించి పట్టించుకున్న నాథుడే కరువయ్యాడు. ఎప్పుడిస్తారో చెప్పలేని పరిస్థితి నెలకొంది. దీంతో గత ఏడాది వాడిన యూనిఫారాలనే విద్యార్థులు వేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. వాటిలో చాలావరకు చిరిగిపోయినా తప్పని పరిస్థితుల్లో వేసుకుంటున్నారు. అసలు ధరించడానికే అవకాశం లేకపోతే సాధారణ దుస్తులు(సివిల్ డ్రెస్) ధరిస్తున్నారు. ఈ నేపథ్యంలో యూనిఫారాల కోసం రాష్ట్రంలో సుమారు లక్షా 12 వేల మంది విద్యార్థులు నిరీక్షిస్తున్నారు. ఇంకో విశేషమేమిటంటే గత ఏడాది విద్యార్థుల దుస్తులు కుట్టిన దర్జీలకు నేటికీ చెల్లింపులు చేయలేదు. దీంతో భవిష్యత్‌లో విద్యార్థుల దుస్తులు కుట్టేందుకు సిద్ధంగా లేమని దర్జీలు తెగేసి చెప్పేస్తున్నారు. ఒకవేళ ప్రభుత్వం క్లాత్ పంపించినా మూలన పడి ఉండడం తప్ప అధికారులు చేసేదేమీ లేదు. నోటు పుస్తకాల పరిస్థితీ అంతే... ఇంతవరకు ఒక్క హాస్టల్ విద్యార్థికి కూడా నోటు పుస్తకాలు అందజేయలేదు. దీంతో విద్యార్థుల చదువులకు ఆటంకం కలుగుతోంది. జిల్లాలో వసతిగృహాల్లో ఉండి చదువుకుంటున్న 5,715 మంది విద్యార్థులకు 63,839నోటు పుస్తకాలు అవసరం కాగా, ఇప్పటికి ఒక్క పుస్తకం కూడా విద్యార్థికి చేరలేదు. రాష్ట్రంలోని మిగతా 12 జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. హాస్టళ్ల నిర్వహణకు కూడా ప్రభుత్వం బడ్జెట్ విడుదల చేయలేదు. తెరిచి నెలరోజులు కావస్తున్నా ఒక్క రూపాయి కూడా మంజూరుచేయలేదు. దీంతో వసతి గృహాల అధికారులంతా అప్పులు చేసి విద్యార్థులకు భోజనం పెడుతున్నారు. సివిల్ సప్లయిస్ ద్వారా అందిస్తున్న పీడీఎస్ బియ్యం విడిపించుకోవడానికి ప్రభుత్వం నిధులివ్వలేదు. ఈ క్రమంలో విద్యార్థులకు అందించే భోజనం ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ప్రతి ఏడాదీ హాస్టల్ తెరిచే ముందు భవనాలకు మరమ్మతులు చేయాల్సి ఉంది. అవసరమైతే సున్నాలు వేయాల్సి ఉంటుంది. కానీ ఈ ఏడాది నిధులు విడుదల చేయకపోవడంతో వసతి గృహ అధికారులు వాటి జోలికే వెళ్లలేదు. దీంతో మరమ్మతులకు నోచుకోని భవనాల్లోనే విద్యార్థులు కాలం వెళ్లదీస్తున్నారు. -
‘అన్లైన్’ అవస్థలు!
కొందరు వార్డెన్లకు అవగాహన లోపం పూర్తిస్థాయిలో నమోదు కాని వివరాలు కొన్ని హాస్టళ్లకు నిలిచిపోయిన బిల్లులు నర్సీపట్నం, న్యూస్‌లైన్ : హాస్టళ్ల నిర్వహణ మరింత పారదర్శకంగా ఉండేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన ఆన్లైన్ విధానం వార్డెన్ల కొంపముంచుతోంది. దీనిపై కొందరికి పూర్తిస్థాయిలో అవగాహన లేకపోవడంతో వివరాల నమోదు సక్రమంగా జరగడం లేదు. ఈ పరిస్థితుల్లో జిల్లాలో సగం హాస్టళ్లకు రెండు నెలలుగా బిల్లులు మంజూరు నిలిచిపోయింది. గతేడాది అక్టోబరు నుంచి బీసీ హాస్టళ్లకు దీనిని విస్తరించింది. విస్తృతమైన సమాచారాన్ని ఈ విధానంలో పొందుపరిచే విధంగా ప్రణాళికలు చేసింది. జిల్లాలోని 68 బీసీ హాస్టళ్లలో సుమారు ఏడువేల మంది విద్యార్థుల సమాచారంతో పాటు వ్యాపారుల నుంచి కొనుగోలు చేసే వంట సరకుల వివరాలను సైతం నమోదు చేయాలి. వాటిని హైదరాబాద్ కేంద్ర కార్యాలయం అధికారులు వెబ్సైట్లో పరిశీలించాకే సంబంధిత ట్రెజరీలకు బిల్లుల చెల్లింపునకు గ్రీన్ సిగ్నల్ వస్తుంది. ఈ వివరాలను ప్రతి నెలా 3 నుంచి 12, 20 నుంచి 24 లోపున నమోదు చేయాలని నిబంధన ఉంది. అక్రమాలను అరికట్టాలని భావించి తెరపైకి తెచ్చిన కొత్త విధానంపై వార్డెన్లకు పూర్తిస్థాయిలో ఉన్నతాధికారులు అవగాహన కల్పించలేదు. దీంతో కొందరు పూర్తిస్థాయిలో వివరాలు నమోదు చేయలేకపోతున్నారు. వివరాలు అప్లోడ్ చేసినా పరిశీలనకు సంబంధించి ఎటువంటి సమాచారం రావడం లేదు. ఈమేరకు జిల్లాలో 40 శాతం హాస్టళ్లకు రెండు నెలలుగా బిల్లులు మంజూరు నిలిచిపోయింది. విద్యార్థులకు ప్రతి నెలా మంజూరు చేయాల్సిన కాస్మొటిక్ చార్జీలు, అప్పుగా తెచ్చిన సరుకులకు బిల్లులు చెల్లింపులు నిలిచిపోయాయి. దీనిపై జిల్లా స్థాయి అధికారులకు సైతం పూర్తిస్థాయిలో అవగాహన లేకపోవడం వల్లే ఈ పరిస్థితి అని వార్డెన్లు వాపోతున్నారు. అదేవిధంగా ఈ వివరాల నమోదుకు వార్డెన్లకు ఎటువంటి కంఫ్యూటర్లు మంజూరు చేయకపోవడం వల్ల వారంతా గంటల తరబడి ఇంటర్నెట్ సెంటర్లోనే గడపాల్సి వస్తోంది. ఇంతచేసినా తీరా బిల్లులు రాకపోయేసరికి ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు దీనిపై దృష్టిసారించి పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని వారంతా కోరుతున్నారు. -
బీసీ హాస్టళ్లకు ఆన్లైన్ బెంగ!
=అన్ని వివరాలు నమోదు చేయాలని జీవో =రెండు మూడు రోజుల్లో పూర్తిచేయాలని ఆదేశం =హైరానా పడుతున్న వార్డెన్లు నర్సీపట్నం, న్యూస్‌లైన్ : బీసీ హాస్టల్ వార్డెన్లకు ఆన్లైన్ గుబులు పట్టుకుంది. నిర్ణీత గడువు లేకుండా తక్షణం అన్ని వివరాలు నమోదు చేయాలన్న ఆదేశాలతో పాలుపోక తలలు పట్టుకుంటున్నారు. ఈ ప్రక్రియ సకాలంలో పూర్తిచేయకుంటే బిల్లుల మంజూరుపై దాని ప్రభావం పడుతుందని వారంతా ఆందోళన చెందుతున్నారు. హాస్టళ్లలో బిల్లుల జారీ మరింత పారదర్శకంగా ఉండాలని భావించిన ప్రభుత్వం ఆన్లైన్ విధానాన్ని తెరపైకి తెచ్చింది. ఇప్పటికే ఈ విధానం గిరిజన, సాంఘిక సంక్షేమశాఖల్లో అమలవుతోంది. తాజాగా బీసీ హాస్టళ్లకు విస్తరించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేపట్టింది. ఇందులో భాగంగా అన్ని బీసీ హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థుల వివరాలు, ఫొటోలతో జతపరచాలని ప్రత్యేక జీవో గత నెలాఖరున జారీచేసింది. అలాగే భోజన తయారీకి అవసరమైన వస్తువుల కొనుగోలుకు సంబంధించి అన్ని బిల్లుల వివరాలు ఆన్లైన్లో జతపరచాలని పేర్కొంది. జూన్ నెల నుంచి ఇప్పటివరకు జతపరిచి, తక్షణం అప్లోడ్ చేయాలంటూ ఆదేశాలు జారీచేసింది. ఎటువంటి శిక్షణ లేకుండానే... ఏదైనా కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చేటప్పుడు దానిపై సంబంధిత అధికారులు, సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి. అదేవిధంగా వీటికి అవసరమైన మౌలిక సదుపాయాలు,వ్యయంతో పాటు ఇతర అవసరాలను సమకూర్చాల్సి ఉంది. సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో ఈ ప్రక్రియను ప్రారంభించే సమయంలో ఇదే విధానాన్ని ప్రభుత్వం పాటించింది. దీనిని బీసీ హాస్టళ్లకు విస్తరించేటపుడు మాత్రం విస్మరించింది. జిల్లాలోని 68 బీసీ హాస్టళ్లలో సుమారు ఏడువేల మంది విద్యార్థులు ఉన్నారు. వీరి అవసరాలకు సంబంధించి వస్తువుల కొనుగోలు, తదితర వివరాలు నమోదుకు పదిహేను రోజులకు మించి పడుతుంది. ఇలాంటి వ్యవహారాన్ని కేవలం రెండు రోజుల్లో పూర్తిచేయాలంటూ ఆదేశాలు వచ్చాయి. ఇదే కాకుండా జూన్ నెల నుంచి అన్ని వివరాలను వీటిలో అప్లోడ్ చేయాలని ప్రభుత్వం పేర్కొంది. వాస్తవంగా ఒక్కో నెలకు సంబంధించి అన్ని వివరాలు నమోదు చేయాలంటే మూడు నాలుగు రోజులు పడుతుంది. వీటికి అవసరమైన వసతులు ఉంటేనే ఇది సాధ్యమవుతుంది. దీనికి కొంతమేర ఖర్చుపెట్టాల్సి ఉంది. ఇలాంటి వసతుల్లేక వార్డెన్లు మల్లగుల్లాలు పడుతున్నారు. తక్షణం పూర్తిచేయాలని ఆదేశాలు రావడంతో ఏం చేయాలో పాలుపోక హైరానా పడుతున్నారు. ఇవి సకాలంలో పూర్తికాకపోతే బిల్లుల పరిస్థితి ఏమవుతుందోనని వారంతా ఆందోళన చెందుతున్నారు. సాంఘిక సంక్షేమం మాదిరిగానే బీసీ హాస్టళ్లలోని వివరాలు నమోదుకు అన్ని వసతులు కల్పించి, ఆన్లైన్ ప్రక్రియకు సహకరించాలని ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నారు. -
ఫలితమివ్వని ‘బస’
ఇందూరు, న్యూస్‌లైన్ : జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ వసతి గృహాలు 116 ఉన్నాయి. వీటిలో విద్యార్థులకు కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పన కోసం రెండు నెలల క్రితం కలెక్టర్ ప్రద్యుమ్న రాత్రి బస కార్యక్రమం చేపట్టారు. జిల్లాస్థాయి అధికారులందరూ నెలలో ఒకరోజు హాస్టళ్లలో బస చేసి విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు, కావాల్సిన మౌలిక వసతులు తెలుసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం ప్రత్యేక ప్రొఫార్మా తయారు చేశారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందుతుందా, వసతిగృహాల్లో తాగునీరు, టాయిలెట్లు, విద్యుత్ సౌకర్యాలున్నాయా అన్న వివరాలను ప్రొఫార్మాలో పొందుపర్చాలి. రెండు సార్లు హాస్టళ్లలో బస చేసిన అధికారులు 209 సమస్యలను గుర్తించి కలెక్టర్‌కు నివేదిక అందించారు. అయితే ఇప్పటివరకు సౌకర్యాల కల్పనకు ఏ వసతి గృహంలోనూ చర్యలు చేపట్టకపోవడం గమనార్హం. నిధులు లేకపోవడంతో వసతులు కల్పించలేకపోయామని సంక్షేమ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. కాగా మౌలిక సదుపాయాల కల్పనను పక్కన పెట్టి ప్రస్తుతానికి వసతి గృహల పరిసరాల్లోని అపరిశుభ్ర వాతావరణాన్ని తొలగించడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా ఈ పనులను త్వరలో చేపట్టనున్నారు. అయితే కలెక్టర్ స్పందించి హాస్టళ్లలోని ప్రధాన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు. త్వరలో పరిష్కారం జిల్లాలోని వసతి గృహాల్లో అధికారులు రెండు సార్లు బస చేశారు. పలు సమస్యలను గుర్తించి కలెక్టర్‌కు నివేదిక ఇచ్చారు. కొన్ని వసతి గృహాల్లో సదుపాయాల కల్పనకు నిధులు వచ్చాయి. మరికొన్నింటికి త్వరలో నిధులు మంజూరవుతాయి. హాస్టళ్లలోని సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తాం. -విమలాదేవి, జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి -
‘ఆన్లైన్’తో వార్డెన్, సిబ్బంది అక్రమాలకు చెక్
ఉట్నూర్, న్యూస్‌లైన్ : వెనుకబడిన తరగతుల(బీసీ) సంక్షేమ హాస్టళ్లలో అక్రమాలకు చెక్ పడనుంది. విద్యార్థుల హాజరు శాతం అధికంగా చూపిస్తూ, స్థానికంగా ఉండకుండా అవకతవకలకు పాల్పడుతున్న వార్డెన్ల ఆటలు ఇకపై సాగవు. ఎస్సీ, ఎస్టీ హాస్టళ్లలో మాదిరిగానే బీసీ హాస్టళ్లలో కూడా ఆన్లైన్ విధానానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ మేరకు హాస్టళ్లలోని విద్యార్థుల హాజరు శాతం పరిగణలోకి తీసుకుని బిల్లులు చెల్లించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హాస్టల్ సంక్షేమాధికారులందరూ ఈ-హాస్టళ్ల సాఫ్ట్‌వేర్‌పై శిక్షణ పొందాలని బీసీ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి రేమండ్ పీటర్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో విద్యార్థుల పూర్తి వివరాలతోపాటు వసతి గృహాలకు అవసరమైన వస్తువులు, సరుకులకు చెల్లింపులు కూడా ఆన్లైన్ ద్వారానే జరగనున్నాయి. ఇప్పటికే ఈ ప్రక్రియ ఎస్టీ, ఎస్సీ సంక్షేమ శాఖల హాస్టళ్లలో పూర్తి కావస్తుంది. తాజాగా బీసీ సంక్షేమ శాఖలో కూడా మొదలు పెట్టడంతో త్వరలో ఈ విధానం అమలులోకి రానుంది. పారదర్శకతకు పెద్దపీట జిల్లాలో 40 బాలుర, పది బాలికల ఫ్రీ-మెట్రిక్ వసతి గృహాలతోపాటు పది బాలుర, పది బాలికల కళాశాలల వసతి గృహాలు ఉన్నాయి. వీటిలో దాదాపు 5,650 మంది విద్యార్థులున్నారు. 51 మంది రెగ్యులర్ వార్డెన్లు విధులు నిర్వహిస్తుండగా 19 పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఈ హాస్టళ్ల నిర్వహణలో పారదర్శకత తేవడానికి వసతిగృహాల సమాచారం ఆన్లైన్లో పొందుపరిచేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల సంఖ్య, హాస్టళ్ల మౌలిక వసతుల సమాచారాన్ని ఆన్లైన్ చేయడంద్వారా వసతులు, సిబ్బంది పనితీరు, వార్డెన్ల పర్యవేక్షణ వంటి వాటిలో స్పష్టత రానుంది. చాలా వసతి గృహాల్లో వార్డెన్లు విద్యార్థుల హాజరు శాతాన్ని అధికంగా చూపిస్తూ డబ్బులు దండుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇకపై ఈ సమస్య ఉండకుండా విద్యార్థుల హాజరు శాతాన్ని బయోమెట్రిక్ పద్ధతితో తీసుకుంటారు. తద్వారా విద్యార్థుల హాజరు శాతాన్ని బట్టి నిధుల విడుదల, ఖర్చు ఉంటుంది. ఈ పద్ధతితో అక్రమాలకు చెక్ పడే అవకాశం ఉంది. చెల్లింపులు ఆన్లైన్ ద్వారానే.. వెబ్సైట్ ద్వారా వసతి గృహాల నిర్వహణ తీరు ఉన్నతాధికారులు వెంటనే తెలుసుకునే అవకాశం ఉంది. ఇప్పటివరకు కాంట్రాక్టర్లకు చెల్లింపులు మాన్యువల్‌గా జరిగేవి. దీనికి బ్రేక్ పడనుంది. వసతి గృహాల సమాచారం ఆన్లైన్లో పొందుపరచగానే చెల్లింపులు ఆన్లైన్ ద్వారా కాంట్రాక్టర్ ఖాతాలోకి నేరుగా జమ అవుతాయి. సరఫరా సక్రమంగా లేకుంటే బిల్లులు తక్షణమే నిలిపివేసే వెసులుబాటు ఉంది. అయితే జిల్లాలో మారుమూల ప్రాంతాల్లో ఉన్న బీసీ వసతి గృహాలకు ఇంటర్నెట్ నెట్వర్క్ సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉండటంతో అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. బయోమెట్రిక్ విధానం వార్డెన్లు స్థానికంగా ఉండటం తక్కువ. విద్యార్థులకు అందుబాటులో ఉండకుండా నాలుగైదు రోజులకు ఒకసారి చుట్టపుచూపుగా వచ్చి వెళ్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా సిబ్బంది కూడా సమయపాలన పాటించడం లేదనేది బహిరంగ రహస్యం. విద్యార్థులు హాస్టళ్లలో ఉంటున్నారా? నాణ్యమైన భోజనం అందుతుందా? సక్రమంగా చదువుకుంటున్నారా? అనే వాటిపై అధికారులకు స్పష్టత లేదు. వీటిని అడ్డుకట్ట వేయడానికి మొదట సిబ్బంది కోసం బయోమెట్రిక్ పరికరాలు హాస్టళ్లలో ఏర్పాటు చేయనున్నారు. వేలిముద్రలు సేకరించేలా చర్యలు తీసుకోనున్నారు. తద్వారా పర్యవేక్షణ గాడిలో పడే అవకాశం ఉంది. ఫలితంగా విద్యార్థులకు మౌలిక వసతులతోపాటు నాణ్యమైన భోజనం అందే అవకాశం ఉంది. ఎక్కడి నుంచి ఏ సమాచారమైనా... ఆన్లైన్ విధానం ద్వారా హాస్టళ్లకు సంబంధించిన సమాచారం ఉన్నతాధికారులు సత్వరంగా తెలుసుకునే అవకాశం ఉంది. బీసీ హాస్టళ్ల సమాచారం ఠీఠీ.్ఛఞ్చటట.ఛఛిజిౌట్ట్ఛ.ఛిజజ.జౌఠి.జీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నారు. వసతి గృహాల వివరాలు, భవనాలు సొంతమా? అద్దెకా? ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్నాయి? విద్యార్థుల సంఖ్య? హాజరు శాతం? మెనూ పాటిస్తున్నారా? మౌలిక వసతుల కల్పన? ఏ హాస్టల్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి? ఎంతమంది పనిచేస్తున్నారు? ఖాళీలు ఎన్ని? అనే సమాచారాన్ని నమోదు చేస్తారు. దీంతో ఉన్నతాధికారులు ఎక్కడి నుంచైనా, ఏ సమయంలోనైనా వసతి గృహాల సమాచారాన్ని తెలుసుకునేందుకు వీలుంటుంది. -
హాస్టళ్లలో బయోమెట్రిక్ పద్ధతి!
సాక్షి, మచిలీపట్నం : బీసీ హాస్టళ్లలో ఆన్లైన్ పద్ధతి అమలులోకి రానుంది. దీని ద్వారా పారదర్శకతకు పెద్దపీట వేసే ప్రయత్నం జరుగుతోంది. ప్రభుత్వ వసతి గృహాల్లో బయోమెట్రిక్ పద్ధతిని అమల్లోకి తేవడం ద్వారా హాస్టల్ వార్డెన్లు కచ్చితంగా రోజువారీ విధులకు హాజరయ్యే అవకాశం ఉంది. ఇతర వ్యాపకాలతో ఆదాయ మార్గాలను ఎంచుకున్న కొందరు హాస్టల్ వార్డెన్లు వసతి గృహాలకు అప్పుడప్పుడు చుట్టపుచూపుగా వస్తారన్న విమర్శలు ఉన్నాయి. జిల్లాలోని పలు హాస్టళ్లలో దిగువస్థాయి సిబ్బందే విధులు నిర్వర్తించడం, ఏదైనా అవసరమై వార్డెన్‌కు ఫోన్ చేస్తే రావడం జరుగుతోంది. దీంతో వసతి గృహాల్లో విద్యార్థులను పట్టించుకునే నాథుడే ఉండటం లేదు. బయోమెట్రిక్ పద్ధతి ప్రవేశపెడితే వార్డెన్ తన చేతివేళ్లను బయోమెట్రిక్ మిషన్‌పై పెడితేనే హాజరుపడుతుంది. దీంతో విధిగా హాస్టల్ వర్కింగ్ సమయాల్లో హాజరుకావాల్సి ఉంటుంది. హాజరును బట్టే చెల్లింపులు.. ఆన్లైన్ పద్ధతి అమలులోకొస్తే విద్యార్థులకు అవసరమైన సరకులు, వస్తువుల చెల్లింపులన్నీ వారి హాజరును బట్టే ఉంటాయి. ఇందుకోసం హాస్టళ్లలోని విద్యార్థుల పూర్తి వివరాలు ఆన్లైన్ చేస్తారు. జిల్లాలో బీసీ హాస్టళ్లు పాఠశాల స్థాయిలో 62 ఉండగా, వాటిలో 4,644 మంది, కళాశాల స్థాయిలో 32కు గాను 1,490 మంది విద్యార్థులు ఉన్నారు. పాఠశాల హాస్టళ్లు 62 ఉండగా వార్డెన్లు 46 మంది, కళాశాలలు 32 ఉండగా 26 మంది ఉన్నారు. ఖాళీలు ఉన్నచోట్ల ఇన్చార్జిలను నియమించారు. ఎక్కడి నుంచైనా.. ఏ సమాచారమైనా.. ఆన్లైన్ పద్ధతితో హాస్టళ్ల సమాచారాన్ని సంబంధిత వెబ్సైట్లో ఎక్కడి నుంచైనా చూసుకునే అవకాశం ఉంటుంది. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ. ఇపిఎఎస్‌ఎస్. బిసిహెచ్‌ఒఎస్‌టిఇఎల్‌ఎస్. సిజిజి. జివొవి.ఇన్ అనే వెబ్సైట్లో హాస్టళ్లకు సంబంధించిన పూర్తి సమాచారం అందుబాటులో ఉంచుతారు. వసతి గృహాల వివరాలు, వసతి గృహ భవనం సొంతమా అద్దెదా, ఏయే సమస్యలున్నాయి, విద్యార్థులు ఎంతమంది, వారి హాజరు ఎలా ఉంది, మెనూ పాటిస్తున్నారా, మౌలిక వసతులు ఎలా ఉన్నాయి, హాస్టల్లో ఎంతమంది పనిచేస్తున్నారు, ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి తదితర పూర్తి సమాచారాన్ని ఆన్లైన్లో పొందుపర్చనున్నారు. ఆన్‌లైన్‌తో అంతా పారదర్శకం.. ప్రభుత్వ వసతి గృహాల్లో ఆన్లైన్ పద్ధతి ప్రవేశపెట్టడం ద్వారా పారదర్శకతకు అవకాశముంటుందని బీసీ సంక్షేమ శాఖ జిల్లా డెప్యూటీ డెరైక్టర్ చినబాబు తెలిపారు. ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు ఈ పద్ధతిని ప్రవేశపెట్టేలా అవసరమైన సమాచారం సేకరిస్తున్నట్టు చెప్పారు. ఈ పద్ధతి ద్వారా ఎక్కడినుంచైనా ఏ హాస్టల్ సమాచారమైనా తెలుసుకోవచ్చని వివరించారు. ఈ విధానంతో సిబ్బంది పనితీరు మెరుగుపడటంతో పాటు విద్యార్థులకు మరింత మేలు కలుగుతుందని చినబాబు తెలిపారు.