ఒక్క రూపాయిస్తే ఒట్టు!
వారంతా వెనుకబడిన తరగతులకు చెందిన విద్యార్థులు... ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో కుటుంబసభ్యులకు దూరంగా వసతి గృహాల్లో ఉంటూ చదువుకొంటున్నారు. హాస్టల్‌లో ఉంటే కాస్త మంచి దుస్తులు, భోజనం లభిస్తుంది, చక్కగా చదువుకోవచ్చని భావించిన విద్యార్థులకు ఇక్కడ కూడా అవస్థలు తప్పడంలేదు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఇక్కట్లకు గురవుతున్నారు. హాస్టళ్ల నిర్వహణకు ఇంతవరకూ ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా విడుదల కాకపోవడంతో వసతి గృహాల అధికారులు బయట అప్పులు చేస్తున్నారు.
సాక్షి ప్రతినిధి, విజయనగరం : ‘మాది బీసీల పార్టీ. అధికారంలోకి వస్తే అన్ని విధాలుగా ఆదుకుంటాం. వెనుకబడిన వర్గాల సంక్షేమమే మా ధ్యేయం’ అంటూ ఎన్నికలకు ముందు టీడీపీ నేతలు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చారు. తీరా ప్రభుత్వం ఏర్పాటు చేశాక గాలి కొదిలేశా రు. అందుకు బీసీ హాస్టళ్లే ఉదాహరణ. వసతి గృహాలు తెరిచి నెలరోజులుకావస్తున్నా ఇంతవరకూ ఒక్క రూపాయి బడ్జెట్ కూడా విడుదల చేయలేదు. విద్యార్థులకు కావాల్సిన యూనిఫారాలు, నోటు పుస్తకాలు పంపిణీ చేయలేదు. పాఠశాలలు తెరిచే నాటికే నిధులతో పాటు విద్యార్థులకు అవసరమైనవన్నీ సిద్ధం చేయాలి. కానీ, ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడంతో అటు విద్యార్థులు, ఇటు హాస్టల్ అధికారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
గత నెల 12న బీసీ హాస్టళ్లు తెరిచారు. కానీ, ఇంతవరకు యూనిఫారాలు ఇవ్వలేదు. గతంలో మాదిరిగా ఒక్కొక్క విద్యార్థికి నాలుగు జతలు కాకుండా మూడు జతలే ఇస్తామని, వాటితో పాటు ఒక ట్రాక్ షూ ఇవ్వనున్నట్టు ప్రకటిస్తూ అందుకనుగుణంగా ప్రతిపాదనలు పంపాలని జిల్లాల వారీగా అధికారులను సర్కార్ కోరింది. దీంతో ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల్లో ఉన్న లక్షా 12వేల మంది విద్యార్థులకు వేర్వేరు రకాలు కలిపి 7లక్షల 97వేల 120మీటర్ల క్లాత్ అవసరం ఉంటుందని అధికారులు నివేదించారు. జిల్లాలో విద్యార్థులకు 46,487.9 మీటర్లు కావాలి. కానీ ఇంతవరకు యూనీఫారాల గురించి పట్టించుకున్న నాథుడే కరువయ్యాడు. ఎప్పుడిస్తారో చెప్పలేని పరిస్థితి నెలకొంది. దీంతో గత ఏడాది వాడిన యూనిఫారాలనే విద్యార్థులు వేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. వాటిలో చాలావరకు చిరిగిపోయినా తప్పని పరిస్థితుల్లో వేసుకుంటున్నారు.
అసలు ధరించడానికే అవకాశం లేకపోతే సాధారణ దుస్తులు(సివిల్ డ్రెస్) ధరిస్తున్నారు. ఈ నేపథ్యంలో యూనిఫారాల కోసం రాష్ట్రంలో సుమారు లక్షా 12 వేల మంది విద్యార్థులు నిరీక్షిస్తున్నారు. ఇంకో విశేషమేమిటంటే గత ఏడాది విద్యార్థుల దుస్తులు కుట్టిన దర్జీలకు నేటికీ చెల్లింపులు చేయలేదు. దీంతో భవిష్యత్‌లో విద్యార్థుల దుస్తులు కుట్టేందుకు సిద్ధంగా లేమని దర్జీలు తెగేసి చెప్పేస్తున్నారు. ఒకవేళ ప్రభుత్వం క్లాత్ పంపించినా మూలన పడి ఉండడం తప్ప అధికారులు చేసేదేమీ లేదు.
నోటు పుస్తకాల పరిస్థితీ అంతే...
ఇంతవరకు ఒక్క హాస్టల్ విద్యార్థికి కూడా నోటు పుస్తకాలు అందజేయలేదు. దీంతో విద్యార్థుల చదువులకు ఆటంకం కలుగుతోంది. జిల్లాలో వసతిగృహాల్లో ఉండి చదువుకుంటున్న 5,715 మంది విద్యార్థులకు 63,839నోటు పుస్తకాలు అవసరం కాగా, ఇప్పటికి ఒక్క పుస్తకం కూడా విద్యార్థికి చేరలేదు. రాష్ట్రంలోని మిగతా 12 జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. హాస్టళ్ల నిర్వహణకు కూడా ప్రభుత్వం బడ్జెట్ విడుదల చేయలేదు. తెరిచి నెలరోజులు కావస్తున్నా ఒక్క రూపాయి కూడా మంజూరుచేయలేదు.
దీంతో వసతి గృహాల అధికారులంతా అప్పులు చేసి విద్యార్థులకు భోజనం పెడుతున్నారు. సివిల్ సప్లయిస్ ద్వారా అందిస్తున్న పీడీఎస్ బియ్యం విడిపించుకోవడానికి ప్రభుత్వం నిధులివ్వలేదు. ఈ క్రమంలో విద్యార్థులకు అందించే భోజనం ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ప్రతి ఏడాదీ హాస్టల్ తెరిచే ముందు భవనాలకు మరమ్మతులు చేయాల్సి ఉంది. అవసరమైతే సున్నాలు వేయాల్సి ఉంటుంది. కానీ ఈ ఏడాది నిధులు విడుదల చేయకపోవడంతో వసతి గృహ అధికారులు వాటి జోలికే వెళ్లలేదు. దీంతో మరమ్మతులకు నోచుకోని భవనాల్లోనే విద్యార్థులు కాలం వెళ్లదీస్తున్నారు.