అరకొరకూ ఎసరు
ఇచ్చేది చాలీచాలని జీతం.. అదీ ఏడాదిగా అందని వైనం
గౌరవ వేతనం కోసం ట్యూటర్ల ఎదురుచూపులు
నిధులు విడుదలకు సర్కారు మీనమేషాలు
వారికిచ్చేదే అరకొర వేతనం.. అదీ నెలనెలా ఇవ్వరు. ఏ మూడు నెలలకో ఓ సారిస్తారు. టీడీపీ సర్కారు కొన్నాళ్లుగా అదీ ఇవ్వడం లేదు. అలా ఏడాదికి పైగా అతీగతీ లేదు. ఎప్పుడు చెల్లిస్తారో ఎవరూ చెప్పలేకపోతున్నారు. సంక్షేమ హాస్టళ్లలో పనిచేస్తున్న ట్యూటర్లు గౌరవ వేతనం అందక నానా యాతన పడుతున్నారు.
విశాఖపట్నం: వసతి గృహాల్లో చదువుతున్న పేద విద్యార్థులకు పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించడానికి ప్రభుత్వం ట్యూటర్లను నియమించింది. ఇందు కు సబ్జెక్టుకు రూ.300 చొప్పున వారికి నెలకు రూ.1500 గౌర వ వేతనంగా చెల్లిస్తుంది. వారు సబ్జెక్టుల వారీగా విద్యార్థులకు బోధన చేస్తుంటారు. గతంలో వీరికి సకాలంలోనే వేతనాలు అందేవి. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్నిటి మాదిరిగా నే వీటి నిధుల విడుదలకు కూడా గ్రహణం పట్టించింది. దీంతో చాన్నాళ్లుగా వీరి గౌరవ వేత నం నిలిచిపోయింది. నిరుద్యోగ సమస్యతో సతమత మవుతున్న డిగ్రీ, పీజీలతో పాటు బీఈడీలు పూర్తిచేసిన వారు సైతం ఈ అతి తక్కువ గౌరవ వేతనంతో విద్యా బోధన చేస్తున్నారు. వీరికి బయోమెట్రిక్ విధానం కూడా అమలవుతోంది. ఒకవేళ ఏ రోజైనా విధులకు రాకుంటే ఆ రోజు వేతనంలో కోత విధిస్తారు. ఎంతో అంకితభావంతో పనిచేస్తున్న వీరికి గౌరవ వేతనాల చెల్లిం పుల్లో మాత్రం తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోంది.
400కు పైగా ట్యూటర్లు..
జిల్లాలో 65 సాంఘిక సంక్షేమ (ఎస్సీ) హాస్టళ్లు, 64 బీసీ సంక్షేమ హాస్టళ్లు వెరసి 129 ఉన్నాయి. ఒక్కో వసతి గృహంలో ఐదుగురు చొప్పున ట్యూటర్లు పాఠాలు చెబుతున్నారు. వివిధ హాస్టళ్లలో 400కు పైగా ట్యూటర్లు జిల్లావ్యాప్తంగా బోధన చేస్తున్నారు. ఎస్సీ వసతి గృహాల్లో ట్యూటర్లకు 2014 నవంబరు నుంచి ఇప్పటిదాకా గౌరవ వేతనాలు ఇవ్వలేదు. అలాగే బీసీ సంక్షేమ హాస్టళ్ల ట్యూటర్లకు గత ఏడాది జూలై, ఆగస్టు మినహా ఇప్పటి వరకు చెల్లించలేదు. 2014లో మూడు నెలల గౌరవ వేతనాలను కూడా సంబంధిత అధికారులు ఏవో కుంటిసాకులు చెప్పి నొక్కేశారని ట్యూటర్లు ఆవేదన చెందుతున్నారు. దీనిపై సంక్షేమ శాఖ ఉన్నతాధికారులను ఎన్నిసార్లు అడిగినా ఫలితం ఉండడం లేదని వీరు పేర్కొంటున్నారు. ఉన్నత చదువులు చదివి విధిలేని పరిస్థితుల్లో తాము ట్యూటర్లుగా అతి తక్కువ గౌరవ వేతనాలకు పనిచేస్తున్నామని, ఈ చిన్న మొత్తాల చెల్లింపులకు కూడా ఏడాదిగా ఎదురు చూపులు చూడాల్సి వస్తోందని వాపోతున్నారు. నెలనెలా ఇవ్వకపోయినా మూడు నెలలకోసారైనా చెల్లించాలని కోరుతున్నారు. వీరికి చెల్లించాల్సిన గౌరవ వేతనాలకు బడ్జెట్ రాలేదని సంక్షేమశాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. అయితే ప్రభుత్వం నుంచి వచ్చే బడ్జెట్ సొమ్మును ఇతర అవసరాలకు వినియోగిస్తూ తమకు అన్యాయం చేస్తున్నారని ట్యూటర్లు ఆరోపిస్తున్నారు.
బీసీ సంక్షేమ హాస్టళ్లలో పనిచేసే వారికి చెల్లింపుల్లో మరింత ఇబ్బందికరంగా ఉంటోంది. మరో పక్షం రోజుల్లో పదో తరగతి పరీక్షలు మొదలవుతున్నప్పటికీ తమకు ఇంకెప్పుడు గౌరవ వేతనాలు చెల్లిస్తారని వీరు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు గౌరవ వేతనాలు చెల్లించకపోవడం వ ల్ల ఆర్థిక ఇబ్బందులతో కొన్నిచోట్ల ట్యూటర్లు మానేస్తున్నారు.