‘అన్‌లైన్’ అవస్థలు!
- కొందరు వార్డెన్లకు అవగాహన లోపం
- పూర్తిస్థాయిలో నమోదు కాని వివరాలు
- కొన్ని హాస్టళ్లకు నిలిచిపోయిన బిల్లులు
నర్సీపట్నం, న్యూస్‌లైన్ : హాస్టళ్ల నిర్వహణ మరింత పారదర్శకంగా ఉండేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన ఆన్‌లైన్ విధానం వార్డెన్ల కొంపముంచుతోంది. దీనిపై కొందరికి పూర్తిస్థాయిలో అవగాహన లేకపోవడంతో వివరాల నమోదు సక్రమంగా జరగడం లేదు. ఈ పరిస్థితుల్లో జిల్లాలో సగం హాస్టళ్లకు రెండు నెలలుగా బిల్లులు మంజూరు నిలిచిపోయింది. గతేడాది అక్టోబరు నుంచి బీసీ హాస్టళ్లకు దీనిని విస్తరించింది. విస్తృతమైన సమాచారాన్ని ఈ విధానంలో పొందుపరిచే విధంగా ప్రణాళికలు చేసింది.
జిల్లాలోని 68 బీసీ హాస్టళ్లలో సుమారు ఏడువేల మంది విద్యార్థుల సమాచారంతో పాటు వ్యాపారుల నుంచి కొనుగోలు చేసే వంట సరకుల వివరాలను సైతం నమోదు చేయాలి. వాటిని హైదరాబాద్ కేంద్ర కార్యాలయం అధికారులు వెబ్‌సైట్‌లో పరిశీలించాకే సంబంధిత ట్రెజరీలకు బిల్లుల చెల్లింపునకు గ్రీన్ సిగ్నల్ వస్తుంది. ఈ వివరాలను ప్రతి నెలా 3 నుంచి 12, 20 నుంచి 24 లోపున నమోదు చేయాలని నిబంధన ఉంది. అక్రమాలను అరికట్టాలని భావించి తెరపైకి తెచ్చిన కొత్త విధానంపై వార్డెన్లకు పూర్తిస్థాయిలో ఉన్నతాధికారులు అవగాహన కల్పించలేదు. దీంతో కొందరు పూర్తిస్థాయిలో వివరాలు నమోదు చేయలేకపోతున్నారు.
వివరాలు అప్‌లోడ్ చేసినా పరిశీలనకు సంబంధించి ఎటువంటి సమాచారం రావడం లేదు. ఈమేరకు జిల్లాలో 40 శాతం హాస్టళ్లకు రెండు నెలలుగా బిల్లులు మంజూరు నిలిచిపోయింది. విద్యార్థులకు ప్రతి నెలా మంజూరు చేయాల్సిన కాస్మొటిక్ చార్జీలు, అప్పుగా తెచ్చిన సరుకులకు బిల్లులు చెల్లింపులు నిలిచిపోయాయి. దీనిపై జిల్లా స్థాయి అధికారులకు సైతం పూర్తిస్థాయిలో అవగాహన లేకపోవడం వల్లే ఈ పరిస్థితి అని వార్డెన్లు వాపోతున్నారు.
అదేవిధంగా ఈ వివరాల నమోదుకు వార్డెన్లకు ఎటువంటి కంఫ్యూటర్లు మంజూరు చేయకపోవడం వల్ల వారంతా గంటల తరబడి ఇంటర్‌నెట్ సెంటర్లోనే గడపాల్సి వస్తోంది. ఇంతచేసినా తీరా బిల్లులు రాకపోయేసరికి ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు దీనిపై దృష్టిసారించి పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని వారంతా కోరుతున్నారు.