ఉట్నూర్, న్యూస్‌లైన్ : వెనుకబడిన తరగతుల(బీసీ) సంక్షేమ హాస్టళ్లలో అక్రమాలకు చెక్ పడనుంది. విద్యార్థుల హాజరు శాతం అధికంగా చూపిస్తూ, స్థానికంగా ఉండకుండా అవకతవకలకు పాల్పడుతున్న వార్డెన్ల ఆటలు ఇకపై సాగవు. ఎస్సీ, ఎస్టీ హాస్టళ్లలో మాదిరిగానే బీసీ హాస్టళ్లలో కూడా ఆన్‌లైన్ విధానానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ మేరకు హాస్టళ్లలోని విద్యార్థుల హాజరు శాతం పరిగణలోకి తీసుకుని బిల్లులు చెల్లించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హాస్టల్ సంక్షేమాధికారులందరూ ఈ-హాస్టళ్ల సాఫ్ట్‌వేర్‌పై శిక్షణ పొందాలని బీసీ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి రేమండ్ పీటర్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో విద్యార్థుల పూర్తి వివరాలతోపాటు వసతి గృహాలకు అవసరమైన వస్తువులు, సరుకులకు చెల్లింపులు కూడా ఆన్‌లైన్ ద్వారానే జరగనున్నాయి. ఇప్పటికే ఈ ప్రక్రియ ఎస్టీ, ఎస్సీ సంక్షేమ శాఖల హాస్టళ్లలో పూర్తి కావస్తుంది. తాజాగా బీసీ సంక్షేమ శాఖలో కూడా మొదలు పెట్టడంతో త్వరలో ఈ విధానం అమలులోకి రానుంది.
పారదర్శకతకు పెద్దపీట
జిల్లాలో 40 బాలుర, పది బాలికల ఫ్రీ-మెట్రిక్ వసతి గృహాలతోపాటు పది బాలుర, పది బాలికల కళాశాలల వసతి గృహాలు ఉన్నాయి. వీటిలో దాదాపు 5,650 మంది విద్యార్థులున్నారు. 51 మంది రెగ్యులర్ వార్డెన్లు విధులు నిర్వహిస్తుండగా 19 పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఈ హాస్టళ్ల నిర్వహణలో పారదర్శకత తేవడానికి వసతిగృహాల సమాచారం ఆన్‌లైన్‌లో పొందుపరిచేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల సంఖ్య, హాస్టళ్ల మౌలిక వసతుల సమాచారాన్ని ఆన్‌లైన్ చేయడంద్వారా వసతులు, సిబ్బంది పనితీరు, వార్డెన్ల పర్యవేక్షణ వంటి వాటిలో స్పష్టత రానుంది. చాలా వసతి గృహాల్లో వార్డెన్లు విద్యార్థుల హాజరు శాతాన్ని అధికంగా చూపిస్తూ డబ్బులు దండుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇకపై ఈ సమస్య ఉండకుండా విద్యార్థుల హాజరు శాతాన్ని బయోమెట్రిక్ పద్ధతితో తీసుకుంటారు. తద్వారా విద్యార్థుల హాజరు శాతాన్ని బట్టి నిధుల విడుదల, ఖర్చు ఉంటుంది. ఈ పద్ధతితో అక్రమాలకు చెక్ పడే అవకాశం ఉంది.
చెల్లింపులు ఆన్‌లైన్ ద్వారానే..
వెబ్‌సైట్ ద్వారా వసతి గృహాల నిర్వహణ తీరు ఉన్నతాధికారులు వెంటనే తెలుసుకునే అవకాశం ఉంది. ఇప్పటివరకు కాంట్రాక్టర్లకు చెల్లింపులు మాన్యువల్‌గా జరిగేవి. దీనికి బ్రేక్ పడనుంది. వసతి గృహాల సమాచారం ఆన్‌లైన్‌లో పొందుపరచగానే చెల్లింపులు ఆన్‌లైన్ ద్వారా కాంట్రాక్టర్ ఖాతాలోకి నేరుగా జమ అవుతాయి. సరఫరా సక్రమంగా లేకుంటే బిల్లులు తక్షణమే నిలిపివేసే వెసులుబాటు ఉంది. అయితే జిల్లాలో మారుమూల ప్రాంతాల్లో ఉన్న బీసీ వసతి గృహాలకు ఇంటర్‌నెట్ నెట్‌వర్క్ సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉండటంతో అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
బయోమెట్రిక్ విధానం
వార్డెన్లు స్థానికంగా ఉండటం తక్కువ. విద్యార్థులకు అందుబాటులో ఉండకుండా నాలుగైదు రోజులకు ఒకసారి చుట్టపుచూపుగా వచ్చి వెళ్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా సిబ్బంది కూడా సమయపాలన పాటించడం లేదనేది బహిరంగ రహస్యం. విద్యార్థులు హాస్టళ్లలో ఉంటున్నారా? నాణ్యమైన భోజనం అందుతుందా? సక్రమంగా చదువుకుంటున్నారా? అనే వాటిపై అధికారులకు స్పష్టత లేదు. వీటిని అడ్డుకట్ట వేయడానికి మొదట సిబ్బంది కోసం బయోమెట్రిక్ పరికరాలు హాస్టళ్లలో ఏర్పాటు చేయనున్నారు. వేలిముద్రలు సేకరించేలా చర్యలు తీసుకోనున్నారు. తద్వారా పర్యవేక్షణ గాడిలో పడే అవకాశం ఉంది. ఫలితంగా విద్యార్థులకు మౌలిక వసతులతోపాటు నాణ్యమైన భోజనం అందే అవకాశం ఉంది.
ఎక్కడి నుంచి ఏ సమాచారమైనా...
ఆన్‌లైన్ విధానం ద్వారా హాస్టళ్లకు సంబంధించిన సమాచారం ఉన్నతాధికారులు సత్వరంగా తెలుసుకునే అవకాశం ఉంది. బీసీ హాస్టళ్ల సమాచారం ఠీఠీ.్ఛఞ్చటట.ఛఛిజిౌట్ట్ఛ.ఛిజజ.జౌఠి.జీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు. వసతి గృహాల వివరాలు, భవనాలు సొంతమా? అద్దెకా? ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్నాయి? విద్యార్థుల సంఖ్య? హాజరు శాతం? మెనూ పాటిస్తున్నారా? మౌలిక వసతుల కల్పన? ఏ హాస్టల్‌లో ఎన్ని పోస్టులు ఉన్నాయి? ఎంతమంది పనిచేస్తున్నారు? ఖాళీలు ఎన్ని? అనే సమాచారాన్ని నమోదు చేస్తారు. దీంతో ఉన్నతాధికారులు ఎక్కడి నుంచైనా, ఏ సమయంలోనైనా వసతి గృహాల సమాచారాన్ని తెలుసుకునేందుకు వీలుంటుంది.
‘ఆన్‌లైన్’తో వార్డెన్, సిబ్బంది అక్రమాలకు చెక్
Published Wed, Oct 23 2013 3:39 AM | Last Updated on Fri, Sep 1 2017 11:52 PM
Advertisement
Advertisement