సాక్షి, మచిలీపట్నం : బీసీ హాస్టళ్లలో ఆన్‌లైన్ పద్ధతి అమలులోకి రానుంది. దీని ద్వారా పారదర్శకతకు పెద్దపీట వేసే ప్రయత్నం జరుగుతోంది. ప్రభుత్వ వసతి గృహాల్లో బయోమెట్రిక్ పద్ధతిని అమల్లోకి తేవడం ద్వారా హాస్టల్ వార్డెన్లు కచ్చితంగా రోజువారీ విధులకు హాజరయ్యే అవకాశం ఉంది. ఇతర వ్యాపకాలతో ఆదాయ మార్గాలను ఎంచుకున్న కొందరు హాస్టల్ వార్డెన్లు వసతి గృహాలకు అప్పుడప్పుడు చుట్టపుచూపుగా వస్తారన్న విమర్శలు ఉన్నాయి. జిల్లాలోని పలు హాస్టళ్లలో దిగువస్థాయి సిబ్బందే విధులు నిర్వర్తించడం, ఏదైనా అవసరమై వార్డెన్‌కు ఫోన్ చేస్తే రావడం జరుగుతోంది. దీంతో వసతి గృహాల్లో విద్యార్థులను పట్టించుకునే నాథుడే ఉండటం లేదు. బయోమెట్రిక్ పద్ధతి ప్రవేశపెడితే వార్డెన్ తన చేతివేళ్లను బయోమెట్రిక్ మిషన్‌పై పెడితేనే హాజరుపడుతుంది. దీంతో విధిగా హాస్టల్ వర్కింగ్ సమయాల్లో హాజరుకావాల్సి ఉంటుంది.
హాజరును బట్టే చెల్లింపులు..
ఆన్‌లైన్ పద్ధతి అమలులోకొస్తే విద్యార్థులకు అవసరమైన సరకులు, వస్తువుల చెల్లింపులన్నీ వారి హాజరును బట్టే ఉంటాయి. ఇందుకోసం హాస్టళ్లలోని విద్యార్థుల పూర్తి వివరాలు ఆన్‌లైన్ చేస్తారు. జిల్లాలో బీసీ హాస్టళ్లు పాఠశాల స్థాయిలో 62 ఉండగా, వాటిలో 4,644 మంది, కళాశాల స్థాయిలో 32కు గాను 1,490 మంది విద్యార్థులు ఉన్నారు. పాఠశాల హాస్టళ్లు 62 ఉండగా వార్డెన్లు 46 మంది, కళాశాలలు 32 ఉండగా 26 మంది ఉన్నారు. ఖాళీలు ఉన్నచోట్ల ఇన్‌చార్జిలను నియమించారు.
ఎక్కడి నుంచైనా.. ఏ సమాచారమైనా..
ఆన్‌లైన్ పద్ధతితో హాస్టళ్ల సమాచారాన్ని సంబంధిత వెబ్‌సైట్‌లో ఎక్కడి నుంచైనా చూసుకునే అవకాశం ఉంటుంది. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ. ఇపిఎఎస్‌ఎస్. బిసిహెచ్‌ఒఎస్‌టిఇఎల్‌ఎస్. సిజిజి. జివొవి.ఇన్ అనే వెబ్‌సైట్‌లో హాస్టళ్లకు సంబంధించిన పూర్తి సమాచారం అందుబాటులో ఉంచుతారు. వసతి గృహాల వివరాలు, వసతి గృహ భవనం సొంతమా అద్దెదా, ఏయే సమస్యలున్నాయి, విద్యార్థులు ఎంతమంది, వారి హాజరు ఎలా ఉంది, మెనూ పాటిస్తున్నారా, మౌలిక వసతులు ఎలా ఉన్నాయి, హాస్టల్‌లో ఎంతమంది పనిచేస్తున్నారు, ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి తదితర పూర్తి సమాచారాన్ని ఆన్‌లైన్‌లో పొందుపర్చనున్నారు.
ఆన్‌లైన్‌తో అంతా పారదర్శకం..
ప్రభుత్వ వసతి గృహాల్లో ఆన్‌లైన్ పద్ధతి ప్రవేశపెట్టడం ద్వారా పారదర్శకతకు అవకాశముంటుందని బీసీ సంక్షేమ శాఖ జిల్లా డెప్యూటీ డెరైక్టర్ చినబాబు తెలిపారు. ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు ఈ పద్ధతిని ప్రవేశపెట్టేలా అవసరమైన సమాచారం సేకరిస్తున్నట్టు చెప్పారు. ఈ పద్ధతి ద్వారా ఎక్కడినుంచైనా ఏ హాస్టల్ సమాచారమైనా తెలుసుకోవచ్చని వివరించారు. ఈ విధానంతో సిబ్బంది పనితీరు మెరుగుపడటంతో పాటు విద్యార్థులకు మరింత మేలు కలుగుతుందని చినబాబు తెలిపారు.
హాస్టళ్లలో బయోమెట్రిక్ పద్ధతి!
Published Sun, Sep 1 2013 2:10 AM | Last Updated on Fri, Sep 1 2017 10:19 PM
Advertisement
Advertisement