online method
-
ఆన్లైన్ మోసానికి గురయ్యారా? వెంటనే ఈ నెంబర్‌కు కాల్ చేయండి
పాత వస్తువులను అమ్మకానికి పెట్టాలన్నా... చవగ్గా కొనాలన్నా ఇప్పుడు ఆన్లైన్ పద్ధతినే చాలా మంది ఎంచుకుంటున్నారు. ఇది సులువైన ప్రక్రియ కావడం కూడా ఇందుకు కారణం. ఇటీవల ఆన్లైన్ మార్కెట్‌ప్లేస్ ఓఎల్ఎక్స్లో తమ పాత మనీ కౌంటింగ్ మిషన్‌ను రూ.5000కు అమ్మకానికి పెట్టింది శ్రీజ(పేరు మార్చడమైనది). ఇమేజ్ అప్లోడ్ చేసిన గంట లోపు ఓ వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. తనను తాను పరిచయం చేసుకున్న ఆ వ్యక్తి డబ్బును ట్రాన్స్ఫర్ చేస్తాను, తన అడ్రస్‌కు కొరియర్ చేయమని సూచించాడు. అందుకు సరే అంది శ్రీజ. అతను తనకు ఆర్మీ అకౌంట్ ఉందని, ముందుగా డబ్బు ట్రాన్స్ఫర్ చేయలేనని, శ్రీజ నే రూ.100 లు ట్రాన్స్ఫర్ చేయమన్నాడు. సరే అనుకున్న శ్రీజ అతను చెప్పిన అకౌంట్‌కు ఆన్లైన్ పే యాప్స్ ద్వారా రూ.100 ట్రాన్స్ఫర్ చేసింది. అతను తిరిగి రూ.200 ట్రాన్స్ఫర్ చేశాడు. ఆ తర్వాత తన ఖాతా నుంచి డబ్బు సెండ్ అవడం లేదని, ఇతరుల నుంచి డబ్బు తన ఖాతాకు రావడం లేదని మరోసారి శ్రీజ నే కొంత డబ్బును ట్రాన్స్ఫర్ చేయమన్నాడు. అలా ఫోన్ మాట్లాడుతూనే అతను చెప్పిన సూచనలతో తనకు తెలియకుండానే డబ్బు ట్రాన్స్ఫర్ చేసింది శ్రీజ. ఆ తర్వాత ఫోన్ కట్ అయ్యింది. ట్రాన్సాక్షన్స్ మెసేజ్‌లు చూసుకున్నాక శ్రీజకు దిమ్మతిరిగిపోయింది. తన అకౌంట్ జీరో బ్యాలెన్స్ చూపిస్తోంది. తిరిగి ఆ వ్యక్తికి ఫోన్ చేస్తే, స్విచ్డాఫ్ వస్తోంది. చివరకు తను మోసపోయానని అర్ధమైంది. ఆన్లైన్ మోసం.. హెల్ప్‌లైన్ కరోనా కారణంగా ఆన్లైన్ షాపింగ్‌లు కూడా ఇటీవల కాలంలో బాగా పెరిగాయి. అలాగే, ఆన్లైన్ మోసాలు కూడా పెరిగాయి. సైబర్ నేరగాళ్లు ఏదో ఒక మార్గంలో వినియోగదారులు/అమ్మకందారుల ఆశను ఎరగా చేసుకొని స్మూత్‌గా డబ్బు దోపిడీకి పాల్పడుతున్నారు. ఆన్లైన్ చీటింగ్ కేసుల్లో మోసపోయిన వ్యక్తులకు సాయం అందించడానికి 155260 హెల్ప్‌లైన్ అందుబాటులో ఉంది. ఈ నెంబర్‌కు ఫోన్ చేసి, ఫిర్యాదు చేస్తే బాధితులు సత్వర న్యాయం పొందే అవకాశం ఉంటుంది. ► ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పనిచేసే ఈ హెల్ప్‌లైన్ ఆన్లైన్, ఆఫ్‌లైన్... రెండు విధాలా సేవలు అందిస్తుంది. ► సూచించిన పోర్టల్‌లో .. మోసం లావాదేవీ వివరాలు (ఖాతా నంబర్, వాలెట్, యుపిఐ, లావాదేవీ జరిపిన ఐడీ, తేదీ, డెబటి/క్రెడిట్ కార్డ్ నంబర్లు.. మొదలైనవి), వ్యక్తిగత ప్రాథమిక సమాచారాన్ని నమోదు చేయాలి. ► బాధితుల బ్యాంక్ లేదా మోసం చేసి డబ్బు జమ అయిన బ్యాంక్/వాలెట్.. వంటివి నోట్ చేయాలి. ► మోసానికి సంబంధించిన పూర్తి వివరాలను పోర్టల్‌లో 24 గంటల్లోగా ఉంచాలి. ఆ వెంటనే బాధితుడు నమోదు చేసిన ఫోన్ నెంబర్‌కి మెసేజ్ వస్తుంది. ► పోర్టల్‌లో సంబంధిత బ్యాంక్, అంతర్గత సిస్టమ్‌ల వివరాలను తనిఖీ చేస్తుంది. ► బాధితుడి డబ్బు ఏ ఖాతాకు బదిలీ అయ్యిందో చూసి, ఆ డబ్బును హోల్డ్‌లో ఉంచుతుంది. అంటే, మోసగాడు ఆ డబ్బును పొందలేడు. మోసగాళ్ల చేతికి డబ్బు చేరకుండా తిరిగి పొందేంతవరకు ఈ ప్రక్రియ పునరావృతం అవుతూనే ఉంటుంది. ► సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్స్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా సూచించిన అనేక బ్యాంకుల ఖాతాల నుంచి డబ్బు విత్‌డ్రా చేసినట్లయితే, తదుపరి ప్రక్రియ కోసం సమీపంలోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలి. భద్రతా సూచనలు... ► ఫోన్ సంభాషణల్లో ఉన్నప్పుడు ఎలాంటి బ్యాంకింగ్ లావాదేవీలు చేయకూడదు. ► క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేయడం లేదా ఓటీపీ, యుపీఐఎన్, బ్యాంక్ కార్డ్ సీవీవీ నంబర్లు షేర్ చేయడం అంటే మీ ఖాతా నుండి డబ్బును మీరే వదులుకుంటున్నారని అర్ధం. ► కస్టమర్ కేర్ నంబర్ల కోసం గూగుల్ ఇంజిన్లలో ఎప్పుడూ శోధించవచ్చు. సరైన కస్టమర్ కేర్ నంబర్ కోసం సంబంధిత యాప్ లేదా అప్లికేషన్ వెబ్‌సైట్‌ను ఓపెన్ చేసి, తెలుసుకోవాలి. ► అన్ని ఇ–మెయిల్, సోషల్ మీడియా ఖాతాల కోసం రెండు రకాల ఫోన్ నంబర్లు వాడటం శ్రేయస్కరం. అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ -
రూ. 300 టికెట్‌పై ఫొటో రద్దు
సాక్షి,తిరుమల: తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం కోసం ఆన్లైన్ పద్ధతిలో కేటాయించే రూ.300 టికెట్లను ఫొటో లేకుండా కేవలం గుర్తింపు కార్డు నంబర్ ఆధారంగా జారీ చేయాలని టీటీడీ నిర్ణయించింది. ఈ విధానం జనవరి 1 నుంచి అమల్లోకి రానుంది. ప్రస్తుతం శ్రీవారి దర్శనం కోసం రోజూ దాదాపు 30 వేల మందికి రూ.300 టికెట్లు కేటాయిస్తున్నారు. ఇందుకోసం సంబంధిత భక్తుడు తన ఫొటోను ఆన్లైన్ పద్ధతిలో అప్లోడ్ చేయాల్సి ఉంది. దీనివల్ల సామాన్య భక్తులు టికెట్లు పొందలేకపోతున్నారని గుర్తించిన టీటీడీ ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు ఫొటో విధానాన్ని రద్దు చేయాలని సూచించారు. -
‘స్మార్ట్’గా లబ్ధి
⇒ ఇక అన్ని పథకాలూ ఆన్లైన్లోనే ⇒ రేషన్‌కు రూపే కార్డు ద్వారా చెల్లింపులు ⇒ ఆధార్’తో సంక్షేమ పథకాల అనుసంధానం ⇒ పారదర్శకతే లక్ష్యంగా వినూత్న కార్యక్రమం సాక్షి, రంగారెడ్డి జిల్లా: సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వం వినూత్న విధానాన్ని ప్రవేశపెట్టబోతోంది. పారదర్శకతతోపాటు అర్హులకు మరింత వేగంగా లబ్ధి చేకూర్చేలా ప్రణాళిక రూపొందిస్తోంది. ఈ క్రమంలో అన్ని సంక్షేమ పథకాలకు ఆధార్ వివరాలను జతచేయనున్నారు. ఆసరా పథకం ద్వారా అందించే పింఛన్లు మొదలు.. గ్యాస్ సిలిండర్ రాయితీ, విద్యార్థుల ఉపకారవేతనాలు, ఉపాధి హామీ కూలీ డబ్బులు, రేషన్ సరుకులు తదితర అన్ని పథకాలకు ఈ పద్ధతినే అనుసరించాలని భావిస్తోంది. ఈ క్రమంలో ప్రయోగాత్మకంగా రేషన్ పంపిణీలో దీన్ని అమలు చేసేందుకు పౌరసరఫరాల శాఖ చర్యలు మొదలుపెట్టింది. వివరాలన్నీ క్రోడీకరిస్తూ.. పథకాలకు సంబంధించి లబ్ధిదారులకు ప్రస్తుతం మ్యాన్యువల్ పద్ధతిలో ఫలాలు అందిస్తున్నా రు. కొత్త విధానంతో మ్యాన్యువల్ పద్ధతికి చెల్లుచీటీ ఇవ్వడంతోపాటు అన్నింటా ఆన్లైన్ పద్ధతిని అనుసరించనున్నారు. ఇందుకు లబ్ధిదారుల ఆధార్ సంఖ్యను ఖచ్చితంగా నమోదు చేయనున్నారు. ఈ క్రమంలో బోగస్‌ను అరికట్టడంతోపాటు లబ్ధిదారుడికి త్వరితంగా ఫలా ల్ని అందించవచ్చ. ఈ నేపథ్యం లో జిల్లాలో సంక్షేమ పథకాలకు సంబంధించి లబ్ధిపొందుతున్నవారి ఆధార్ వివరాలను వేరువేరుగా సేకరిస్తున్నారు. జిల్లాలో ఈ ప్రక్రియ దాదాపు పూర్తి చేసినప్పటికీ.. పొరపాట్లకు తావులేకుండా మరోమారు పరిశీలించి ఖరారు చేస్తున్నారు. ‘రూపే’ రేషన్ ఆహార భద్రత పథకానికి సంబంధించి ప్రస్తుతం ఎఫ్ఎస్ (ఫుడ్ సెక్యూరిటీ) కార్డుల ద్వారా సరుకులు పంపిణీ చేస్తున్నారు. లబ్ధిదారులు రేషన్ డీలరుకు డబ్బులు చెల్లించి సరుకులు తీసుకుంటున్నారు. ఈ పద్ధతిలో అక్రమాలు జరిగే అవకాశం లేకపోలేదు. ఈ పరిస్థితిని అధిగమించి అర్హులకు మాత్రమే రేషన్ సరుకులు ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ క్రమంలో ఆన్లైన్ పద్ధతిలో సరుకులు తీసుకునే విధానాన్ని ప్రవేశపెట్టబోతోంది. లబ్ధిదారులు న గదును నేరుగా డీలరుకు చెల్లించకుండా బయోమెట్రిక్ పద్ధతిలో చెల్లింపులు చేసిన తర్వాతే సరుకులు అందించే ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన ‘జన్‌ధన్‌యోజన’ ద్వారా మెజారిటీ ప్రజలు బ్యాంకు ఖాతాలు తెరిచారు. ఈ క్రమంలో బ్యాంకులో నగదును సదరు డెబిట్ కార్డు(రూపే) ద్వారా ఎలక్ట్రానిక్ పద్ధతిలో డీలరుకు చెల్లించి సరుకులు పొందేలా ఏర్పాట్లు చేస్తున్నారు. రూపే కార్డుల ద్వారా చెల్లింపులు స్వీకరించడం, నగదును జమచేసేందుకు ప్రత్యేకంగా ఒక వ్యాపార ప్రతినిధిని ఈ ప్రక్రియలో భాగస్వామ్యం చేస్తారు. ఈ పద్ధతి దేశంలోనే తొలిసారిగా జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నట్లు పౌరసరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు. -
బ్యాంకు ఖాతాలపై నిఘా
కలెక్టరేట్, న్యూస్‌లైన్: సాధారణ ఎన్నికల నేపథ్యంలో బ్యాం కుల లావాదేవీలపై నిఘా పెట్టినట్లు కలెక్టర్ స్మితా సబర్వాల్ తెలిపారు. బ్యాంకు ఖాతాల్లో రూ.10 లక్షలు, అంతకు మించి నగదు జమ చేసినా/విత్ డ్రా చేసినా వారి వివరాలను ఏ రోజుకు ఆరోజు తమ కార్యాలయానికి అందజేయాలని బ్యాంకర్లను ఆదేశించారు. ఎవరైనా ఆన్లైన్ పద్ధతి(ఆర్టీజీఎస్)లో నగదును ఇతరుల ఖాతాల్లోకి బదిలీ చేసినా..సంబంధితుల వివరాలను సైతం అందజేయాలన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు, వారి ఏజెంట్లు, ఆయా రాజకీయ పార్టీల ఖాతాల నుంచి రూ.లక్ష డ్రా చేసినా ఈ వివరాలను తెలపాలని సూచించారు. ఎన్నికల నియమావళి అమలులో భాగంగా శుక్రవారం ఆమె కలెక్టరేట్లోని జ్యుడిషియల్ హాల్లో బ్యాంకుల అధికారులతో సమావేశమై పలు సూచనలు జారీ చేశారు. ఏటీఎంలు, ఇతర బ్రాంచీలకు డబ్బులను రవాణా చేసే వాహనాల్లో ఇతరులకు చెందిన డబ్బును ఎట్టిపరిస్థితిల్లో రవాణా చేయవద్దని సూచించారు. సెక్యూరిటీ వాహనాల్లో డబ్బులను తరలించే సిబ్బందికి గుర్తిం పు కార్డులు అందజేయాలని సూచించారు. అభ్యర్థులు ఖాతా తెరవాలి ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి అభ్యర్థి తన ఏజెంట్ల పేర్లతో ప్రత్యేకంగా జాయింట్ ఖాతాను తెరవాలని కలెక్టర్ సూచించారు. కుటుంబ సభ్యులతో కలిసి ఖాతాలు తెరవడానికి ఎన్నికల నిబంధనలు అంగీకరించవని స్పష్టం చేశారు. అభ్యర్థులందరూ ఎన్నికల ఖర్చులను నగదు రూపంలో చెల్లించకుండా క్రాస్డ్ చెక్కుల ద్వారానే జరపాలని సూచించారు. సమావేశంలో ఎస్పీ శెముషీ బాజ్‌పాయ్, జేసీ, ఏజేసీ, రిటర్నింగ్ అధికారులు పాల్గొన్నారు. -
హాస్టళ్లలో బయోమెట్రిక్ పద్ధతి!
సాక్షి, మచిలీపట్నం : బీసీ హాస్టళ్లలో ఆన్లైన్ పద్ధతి అమలులోకి రానుంది. దీని ద్వారా పారదర్శకతకు పెద్దపీట వేసే ప్రయత్నం జరుగుతోంది. ప్రభుత్వ వసతి గృహాల్లో బయోమెట్రిక్ పద్ధతిని అమల్లోకి తేవడం ద్వారా హాస్టల్ వార్డెన్లు కచ్చితంగా రోజువారీ విధులకు హాజరయ్యే అవకాశం ఉంది. ఇతర వ్యాపకాలతో ఆదాయ మార్గాలను ఎంచుకున్న కొందరు హాస్టల్ వార్డెన్లు వసతి గృహాలకు అప్పుడప్పుడు చుట్టపుచూపుగా వస్తారన్న విమర్శలు ఉన్నాయి. జిల్లాలోని పలు హాస్టళ్లలో దిగువస్థాయి సిబ్బందే విధులు నిర్వర్తించడం, ఏదైనా అవసరమై వార్డెన్‌కు ఫోన్ చేస్తే రావడం జరుగుతోంది. దీంతో వసతి గృహాల్లో విద్యార్థులను పట్టించుకునే నాథుడే ఉండటం లేదు. బయోమెట్రిక్ పద్ధతి ప్రవేశపెడితే వార్డెన్ తన చేతివేళ్లను బయోమెట్రిక్ మిషన్‌పై పెడితేనే హాజరుపడుతుంది. దీంతో విధిగా హాస్టల్ వర్కింగ్ సమయాల్లో హాజరుకావాల్సి ఉంటుంది. హాజరును బట్టే చెల్లింపులు.. ఆన్లైన్ పద్ధతి అమలులోకొస్తే విద్యార్థులకు అవసరమైన సరకులు, వస్తువుల చెల్లింపులన్నీ వారి హాజరును బట్టే ఉంటాయి. ఇందుకోసం హాస్టళ్లలోని విద్యార్థుల పూర్తి వివరాలు ఆన్లైన్ చేస్తారు. జిల్లాలో బీసీ హాస్టళ్లు పాఠశాల స్థాయిలో 62 ఉండగా, వాటిలో 4,644 మంది, కళాశాల స్థాయిలో 32కు గాను 1,490 మంది విద్యార్థులు ఉన్నారు. పాఠశాల హాస్టళ్లు 62 ఉండగా వార్డెన్లు 46 మంది, కళాశాలలు 32 ఉండగా 26 మంది ఉన్నారు. ఖాళీలు ఉన్నచోట్ల ఇన్చార్జిలను నియమించారు. ఎక్కడి నుంచైనా.. ఏ సమాచారమైనా.. ఆన్లైన్ పద్ధతితో హాస్టళ్ల సమాచారాన్ని సంబంధిత వెబ్సైట్లో ఎక్కడి నుంచైనా చూసుకునే అవకాశం ఉంటుంది. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ. ఇపిఎఎస్‌ఎస్. బిసిహెచ్‌ఒఎస్‌టిఇఎల్‌ఎస్. సిజిజి. జివొవి.ఇన్ అనే వెబ్సైట్లో హాస్టళ్లకు సంబంధించిన పూర్తి సమాచారం అందుబాటులో ఉంచుతారు. వసతి గృహాల వివరాలు, వసతి గృహ భవనం సొంతమా అద్దెదా, ఏయే సమస్యలున్నాయి, విద్యార్థులు ఎంతమంది, వారి హాజరు ఎలా ఉంది, మెనూ పాటిస్తున్నారా, మౌలిక వసతులు ఎలా ఉన్నాయి, హాస్టల్లో ఎంతమంది పనిచేస్తున్నారు, ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి తదితర పూర్తి సమాచారాన్ని ఆన్లైన్లో పొందుపర్చనున్నారు. ఆన్‌లైన్‌తో అంతా పారదర్శకం.. ప్రభుత్వ వసతి గృహాల్లో ఆన్లైన్ పద్ధతి ప్రవేశపెట్టడం ద్వారా పారదర్శకతకు అవకాశముంటుందని బీసీ సంక్షేమ శాఖ జిల్లా డెప్యూటీ డెరైక్టర్ చినబాబు తెలిపారు. ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు ఈ పద్ధతిని ప్రవేశపెట్టేలా అవసరమైన సమాచారం సేకరిస్తున్నట్టు చెప్పారు. ఈ పద్ధతి ద్వారా ఎక్కడినుంచైనా ఏ హాస్టల్ సమాచారమైనా తెలుసుకోవచ్చని వివరించారు. ఈ విధానంతో సిబ్బంది పనితీరు మెరుగుపడటంతో పాటు విద్యార్థులకు మరింత మేలు కలుగుతుందని చినబాబు తెలిపారు.