కలెక్టరేట్, న్యూస్‌లైన్: సాధారణ ఎన్నికల నేపథ్యంలో బ్యాం కుల లావాదేవీలపై నిఘా పెట్టినట్లు కలెక్టర్ స్మితా సబర్వాల్ తెలిపారు. బ్యాంకు ఖాతాల్లో రూ.10 లక్షలు, అంతకు మించి నగదు జమ చేసినా/విత్ డ్రా చేసినా వారి వివరాలను ఏ రోజుకు ఆరోజు తమ కార్యాలయానికి అందజేయాలని బ్యాంకర్లను ఆదేశించారు. ఎవరైనా ఆన్‌లైన్ పద్ధతి(ఆర్టీజీఎస్)లో నగదును ఇతరుల ఖాతాల్లోకి బదిలీ చేసినా..సంబంధితుల వివరాలను సైతం అందజేయాలన్నారు.
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు, వారి ఏజెంట్లు, ఆయా రాజకీయ పార్టీల ఖాతాల నుంచి రూ.లక్ష డ్రా చేసినా ఈ వివరాలను తెలపాలని సూచించారు. ఎన్నికల నియమావళి అమలులో భాగంగా శుక్రవారం ఆమె కలెక్టరేట్‌లోని జ్యుడిషియల్ హాల్‌లో బ్యాంకుల అధికారులతో సమావేశమై పలు సూచనలు జారీ చేశారు. ఏటీఎంలు, ఇతర బ్రాంచీలకు డబ్బులను రవాణా చేసే వాహనాల్లో ఇతరులకు చెందిన డబ్బును ఎట్టిపరిస్థితిల్లో రవాణా చేయవద్దని సూచించారు. సెక్యూరిటీ వాహనాల్లో డబ్బులను తరలించే సిబ్బందికి గుర్తిం పు కార్డులు అందజేయాలని సూచించారు.
అభ్యర్థులు ఖాతా తెరవాలి
ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి అభ్యర్థి తన ఏజెంట్ల పేర్లతో ప్రత్యేకంగా జాయింట్ ఖాతాను తెరవాలని కలెక్టర్ సూచించారు. కుటుంబ సభ్యులతో కలిసి ఖాతాలు తెరవడానికి ఎన్నికల నిబంధనలు అంగీకరించవని స్పష్టం చేశారు. అభ్యర్థులందరూ ఎన్నికల ఖర్చులను నగదు రూపంలో చెల్లించకుండా క్రాస్డ్ చెక్కుల ద్వారానే జరపాలని సూచించారు. సమావేశంలో ఎస్పీ శెముషీ బాజ్‌పాయ్, జేసీ, ఏజేసీ, రిటర్నింగ్ అధికారులు పాల్గొన్నారు.
బ్యాంకు ఖాతాలపై నిఘా
Published Fri, Mar 7 2014 11:43 PM | Last Updated on Sat, Sep 2 2017 4:27 AM
Advertisement
Advertisement