
ప్రద్యుమ్న, కాటమనేని భాస్కర్
ముఖ్యమంత్రి కార్యదర్శిగా ప్రద్యుమ్న
సీఆర్‌డీఏ కమిషనర్‌గా కాటమనేని భాస్కర్
శ్రీలక్ష్మి, రజత్ భార్గవ, ప్రవీణ్ ప్రకాశ్ జీఏడీకి అటాచ్
మురళీధర్‌రెడ్డి కూడా..
ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి, ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ, విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, ఏపీ మెడికల్ సర్వీసెస్ వీసీ–ఎండీ డి.మురళీధర్‌రెడ్డిలను తదుపరి పోస్టింగ్ కోసం సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ)కు రిపోర్టు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్యమంత్రి కార్యదర్శిగా ప్రద్యుమ్నను నియమించారు.
జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సాయిప్రసాద్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి ముఖ్య కార్యదర్శిగా శశిభూషణ్ కుమార్, రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్‌డీఏ) కమిషనర్‌గా కాటమనేని భాస్కర్ నియమితులయ్యారు. తిరుపతి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్‌ను బదిలీ చేసి గనులు, భూగర్భ వనరుల శాఖ కమిషనర్, డైరెక్టర్‌గా నియమించారు. తిరుపతి జాయింట్ కలెక్టర్‌కు ఆ జిల్లా కలెక్టర్‌గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న అనిల్‌కుమార్ సింఘాల్‌ను పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించారు. వ్యవసాయ శాఖ ప్రత్యేక సీఎస్‌గా బి.రాజశేఖర్‌కు బాధ్యతలు అప్పగించారు.
