induru
-
ఏకచక్రపురం.. నవనాథపురం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: అశ్మక రాష్ట్రంగా ప్రస్థానాన్ని ప్రారంభించి.. ఇందూరు వరకు నామాంతరం చెందిన నిజామాబాద్ (Nizamabad) చుట్టుపక్కల ప్రాంతాలు పౌరాణిక, ప్రాచీన చారిత్రక నేపథ్యాన్ని ఇముడ్చుకున్నాయి. మంజీర, గోదావరి పరీవాహకంలో ఉండి ప్రాచీన కాలంలో ఏకచక్రపురంగా, బహుధాన్యపురంగా విరజిల్లి, ప్రస్తుతం సాధారణ పట్టణంగా ఉన్న బోధన్ (Bodhan) ఎనలేని ప్రాచీన చరిత్రను కలిగి ఉంది. అయితే దీని చరిత్ర నిరంతరం బయటపడుతూనే ఉంది. తవ్వకాలు చేయడంలో నిర్లక్ష్యం కారణంగా దీని చరిత్ర ఆశించిన స్థాయిలో వెలుగు చూడటం లేదనేది చరిత్రకారుల అభిప్రాయం. ఇక్కడ ఎన్ని తవ్వకాలు జరిపితే అంత చరిత్ర (History) బయటపడే అవకాశముంది. ఈ విషయంలో పాలకులు అంతగా దృష్టి సారించకపోవడంతో.. పట్టణం చుట్టుపక్కల ప్రాంతాల ఘనమైన చరిత్ర బయటకు రావడం లేదని పలువురి వాదన.పౌరాణిక నేపథ్యం ప్రకారం ఈ ప్రాంతాన్ని పరశురాముడు(Parasu Ramudu) తన చక్రంతో రక్షించడంతో పాటు చక్రతీర్థమనే చెరువును నిర్మించడంతో ఏకచక్రపురంగా పేరుపొందినట్లు పలువురు చెబుతున్నారు. పౌరాణిక సాహిత్యంలో, జైన సాహిత్యంలో, బౌద్ధ సాహిత్యంలో బోధన్ ప్రాశస్త్యం ఉంది. మహాభారతంలో వసుమతి, పద్మపురం నామాలతో, జైన సాహిత్యంలో పోదనపురం నామంతో, బౌద్ధ సాహిత్యంలో పోదన నామంతో పేరొందింది. ఇక ప్రాచీన, మధ్యయుగాల్లో ఈ ప్రాంతం ధన సంపదలతో తులతూగడంతో.. బహుధాన్యపురం పేరుతో పిలిచినట్లు చరిత్ర చెబుతోంది. గొప్ప వర్తక కేంద్రంగా వర్ధిల్లినట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి అనేక శాసనాలు, పాత్రలు, శిల్పాలు, నాణేలు(Coins) లభించాయి. అశ్మకుడనే రాజు పాలనలో.. ఈ ప్రాంతాన్ని అశ్మకుడనే రాజు పరిపాలించినట్లు మహాభారతంలో ప్రస్తావన ఉందని పలువురు చెబుతున్నారు. ఇక ఈ ప్రాంతాన్ని శాతవాహనులు, ఇక్ష్వాకులు, విష్ణుకుండినులు, వాకాటకులు, బాదామి చాళుక్యులు, రాష్ట్రకూటులు, కాకతీయులు, విజయనగర రాజులు, మరాఠా రాజులు, బహమనీ సుల్తానులు, గోల్కొండ రాజులు, మొఘలులు పరిపాలించారు. ఏకచక్రపురంగా, బహుధాన్యపురంగా చాలాకాలం పేరొందిన ఈ పట్టణం ప్రస్తుతం బోధన్ పేరుతో స్థిరపడింది. ఈ ప్రాంతం గురించి ఎంత శోధిస్తే అంత చరిత్ర బయటపడే అవకాశముందని చరిత్రకారులు స్పష్టం చేస్తున్నారు.నాటి నవనాథపురం.. నేటి ఆర్మూర్ ప్రస్తుతం పసుపు పంట అత్యధికంగా పండించే ప్రాంతంగా ఉన్న ఆర్మూర్ (Armoor) ప్రాంతం సైతం ఘనమైన చరిత్రను కలిగి ఉంది. నవనాథపురంగా ప్రసిద్ధి చెందిన ఈ పట్టణం.. నేడు ఆర్మూర్ నామాంతరంతో స్థిరపడింది. ఆర్మూర్ పట్టణానికి దక్షిణ నైరుతి భాగంలో కొన్ని కిలోమీటర్ల మేర సిద్ధులగుట్ట విస్తరించి ఉంది. ఈ గుట్టపై నవనాథ సిద్ధులు తపస్సు చేశారు. దీంతో గుట్ట చుట్టూ ఉన్న ప్రాంతానికి నవనాథపురంగా పేరు వచ్చింది. కాలక్రమంలో నవనాథపురం నుంచి ఆర్మూర్‌గా నామాంతరం చెందింది.వందల ఏళ్ల క్రితం దేశం నలుమూలల నుంచి నవనాథులైన గోరఖ్‌నాథ్, జలంధర్నా, చరఫట్‌నాథ్, అపభంగనాథ్, కానీషనాథ్, మచ్చింద్రనాథ్, చౌరంగీనాథ్, రేవనాథ్, బర్తరినాథ్ తదితరులు ఇక్కడికి వచ్చారు. నల్లని రాళ్లు పేర్చినట్లున్న ఈ గుట్టపై ఒక ఇరుకైన గుహలో తమ ఇష్టదైవమైన సిద్ధేశ్వరుడిని ప్రతిష్టించి పూజలు చేశారని ప్రతీతి. వారి పేరిట గుట్టకు నవనాథ సిద్ధుల గుట్టగా పేరు వచ్చింది. దీంతో గుట్టను ఆనుకున్న గ్రామానికి నవనాథపురంగా నామకరణం చేసుకున్నారు. చదవండి: ఆ గుడిలో దేవుడు లేడు.. అయినా జనాల క్యూ!కాలక్రమంలో ఈ తొమ్మిది మంది సాధువుల్లో ఆరుగురు ఇక్కడి నుంచి వెళ్లిపోయారు. మిగిలిన ముగ్గురు సాధువులు ఇక్కడే ఉండి పూజలు చేయడంతో ఆరు.. మూరు.. అంటూ కాలక్రమంలో ఆర్మూర్‌గా పేరు స్థిరపడింది. మరికొందరు చరిత్రకారులు ఆర్మూర్ అనే పదం.. ఆరావం అనే పదం నుంచి వచ్చిందని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ సిద్ధుల గుట్ట ఆధ్యాత్మికతకు చిరునామాగా మారింది. -
నమ్మించి.. రూ.25 కోట్లకు ముంచారు
ఇందూరు (నిజామాబాద్ అర్బన్): నిజామాబాద్ జిల్లాలో ఆన్లైన్ మోసం వెలుగు చూసింది. తమ సంస్థలలో పెట్టుబడి పెడితే కొన్ని రోజులకు రెట్టింపు చేసిస్తామని నలుగురు వ్యక్తులు జిల్లాలోని పలువురు యువకులను నమ్మించి రూ.25 కోట్లు వసూలు చేసి పరారయ్యారు. బాధితులు సోమవారం పోలీస్ కమిషనర్‌తో పాటు జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డికి ఫిర్యాదు చేశా రు. చైన్ స్కీం, ఈగల్ బిట్ కాయిన్, యాడ్స్ స్టూడియో, వరల్డ్ డిజిటల్ గోల్డ్ కాయిన్ సంస్థల పేరుతో చిట్టోజి రాజేశ్, తాటి గంగయ్య, వెంకటేశ్, పుప్పాల శ్రీనివాస్ జిల్లాలో కొంతమంది యువకులను సంప్రదించారు. ఆన్లైన్ ద్వా రా తమ సంస్థల్లో పెట్టుబడి పెడితే రెట్టింపు చేసిస్తామని, సంస్థల్లో ఇంకా కొం తమందిని సభ్యులుగా చేర్చితే కమీషన్ వస్తుందని చెప్పారు. ఈ మాటలను నమ్మిన ఆర్మూర్, నందిపేట్, నిజామాబాద్ నగర ప్రాంతాలకు చెందిన యువకులు ఒక్కొక్కరు రూ.63వేల వరకు నాలుగైదు సార్లు ఆన్లైన్లో చెల్లించారు. వీరు పెట్టుబడి పెట్టినందుకు కొంత లాభం వచ్చిందంటూ రాజేశ్ బృందం ప్రతినెలా రూ.5 వేల వరకు రెండు, మూడు నెలల పాటు ఆ యువకులకు ఇచ్చింది. దీంతో డబ్బులు వస్తున్నాయనే ఆశతో బాధిత యువకులు చాలామందిని సభ్యులుగా చేర్పించి వారితోనూ పెట్టుబడి పెట్టించారు. ఇలా జిల్లా వ్యాప్తంగా 450 మంది సభ్యులుగా చేరగా, రూ.25 కోట్లకు పైగా పెట్టుబడిగా వచ్చింది. ఇటీవల తాటి గంగయ్య, వెంకటేశ్, పుప్పాల శ్రీనివాస్, చిట్టోజి రాజేశ్‌కు పెట్టుబడి పెట్టిన వారు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తడం లేదు. ప్రస్తుతం ఈ నలుగురూ పారిపోయారని, వారిని పట్టుకుని తమ డబ్బులు తిరిగి ఇప్పించి న్యాయం చేయాలని బాధితులు కలెక్టర్‌ను కోరారు. -
దేశానికి ఆదర్శంగా ఇందూరు యువత
సాక్షి, నిజామాబాద్: ఇందూరు యువత కార్యక్రమాలు దేశ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు మాజీ ఎంపీ కవిత. విలేకరులతో మాట్లాడుతూ.. ఇందూరు యువత చేస్తోన్న మంచి కార్యక్రమాలను కొనసాగించాలని కోరారు. యువత చేస్తోన్న కార్యక్రమాలకు తాము అండగా నిలుస్తామన్నారు. ఎంతో మంది అనాథలను మంచి మనసుతో చేరదీస్తున్నారని ప్రశంసించారు. యువత చదువుతో పాటు సమాజ సేవలో కూడా పాల్గొనాలని ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా పిలుపునిచ్చారు. -
ఇందూరులో ఎవరెందాక?
రాష్ట్రకూట చక్రవర్తి ఇంద్రసోముని ఏలుబడిలో ఇందూరుగా, నిజాం ఉల్–ముల్క్ పాలనతో నిజామాబాద్‌గా మారి.. స్త్రీ పురుష జనాభా నిష్పత్తిలో దేశానికే ఆదర్శమై ఆడబిడ్డల అమ్మఒడిగా ప్రత్యేకత చాటుకుంటోన్న ఉమ్మడి నిజామాబాద్ జిల్లా మరో పది రోజుల్లో తీర్పునిచ్చేందుకు సిద్ధమవుతోంది. గోదావరి, దాని ఉపనదులపై కాలువలు, లిఫ్ట్‌లతో పట్టెడన్నం పంచుతున్న ఆర్మూర్, బోధన్, బాల్కొండ, బాన్స్వాడ ఒకవైపు.. వందల కొద్దీ ఫీట్ల బోర్లు, బావులతో సేద్యం చేస్తూ కడుపు నింపుకుంటున్న కామారెడ్డి, ఎల్లారెడ్డి మరోవైపు.. కడుపు చేతబట్టుకుని గల్ఫ్‌బాట పట్టిన పల్లెలు.. ఇందూరు జనజీవనం దేనికదే ప్రత్యేకం. మలి దశ తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలపాత్ర పోషించిన ఈ ప్రాంతం 2014లో జరిగిన ఎన్నికల్లో 9 నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులకు భారీ మెజారిటీతో జైకొట్టి ఏకపక్ష తీర్పునిచ్చింది. ప్రస్తుత ఎన్నికల్లో అభివృద్ధి, సంక్షేమం నినాదంతో టీఆర్ఎస్.. అవినీతి, వైఫల్యం పేరుతో కాంగ్రెస్.. ఒక్క చాన్స్ అంటూ బీజేపీ తలపడుతున్నాయి. అభివృద్ధే ఆసరాగా అధికారపక్షం అభివృద్ధి, సంక్షేమమే ప్రధాన ఎజెండాగా సానుకూల ప్రయాణాన్ని ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర సమితికి ఆ పథకాలే ఓట్లు కురిపించే అవకాశం కనిపిస్తోంది. వ్యవసాయాధారిత జిల్లాలో పెట్టుబడి సహాయంగా ఎకరాకు రూ.4,000 చొప్పున ప్రభుత్వమిస్తున్న ఆర్థిక సాయం రైతుల్లో సానుకూలతను పెంచింది. 24 గంటల విద్యుత్‌ను చిన్నకారు రైతులు కొందరు వ్యతిరేకిస్తున్నా.. మోస్తరు, బడా రైతులంతా స్వాగతిస్తున్నారు. మరోవైపు జిల్లా వ్యాప్తంగా పింఛన్లు అందుకుంటున్న వృద్ధులు, వితంతు, ఒంటరి, వికలాంగులు, బీడీ, కల్లుగీత తదితర వర్గాలకు చెందిన 4,25,728 మంది.. టీఆర్ఎస్కు గంపగుత్త ఓటుబ్యాంక్‌గా మారే అవకాశం ఉంది. ప్రధాన గ్రామాలను కలిపే రహదారులు పూర్తి కావటంతో ఆయా గ్రామాలలో సంతృప్తి వ్యక్తమవుతోంది. అయితే, తిరిగి అన్నిచోట్లా సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్లు ఇవ్వడం టీఆర్ఎస్కు ఒకింత ఇబ్బంది కలిగిస్తోంది. అందరినీ కలుపుకుని పోకపోవడం, గెలిచిన తరువాత అభ్యర్థులు గ్రామాలు, పట్టణాల ముఖం చూడలేదనే విమర్శలు జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో అధికార పార్టీ అభ్యర్థులకు ప్రతిబంధకాలుగా మారిన పరిస్థితి కనిపిస్తోంది. దళితులకు మూడు ఎకరాల భూ పంపిణీ, డబుల్ బెడ్రూం ఇళ్లు, ఉద్యోగాల కల్పన, ఇంటింటికి నల్లా వంటి హామీలు ఇప్పటికీ పూర్తి స్థాయిలో నెరవేరకపోవటం కొంత వరకు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. పాలనలో లోపాలున్నాయంటూ విపక్షం.. జిల్లాలోని అన్ని స్థానాల్లో ప్రజాకూటమి నుంచి కాంగ్రెస్ అభ్యర్థులే బరిలో నిలిచారు. నాలుగున్నరేళ్ల టీఆర్ఎస్ పాలనలో తాజా మాజీ ఎంఎల్ఏలపై అసంతృప్తి ఉందని, అది తమకు అనుకూలమని వారు భావిస్తున్నారు. దళితులకు భూ పంపిణీ, డబుల్ బెడ్రూం ఇళ్లు, కౌలు రైతులకు పరిహారం, ఉద్యోగాల కల్పన, నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ, గల్ఫ్ వెళ్లిన కార్మికులు తిరిగి వస్తే వారు స్థానికంగా వ్యాపారాలు చేసుకునేందుకు ఆర్థిక సహాయం వంటి విషయాల్లో ప్రభుత్వం విఫలమైందంటూ కాంగ్రెస్ జనంలోకి వెళ్తోంది. మేం వస్తే ఇప్పుడు సాగుతున్న అన్ని పథకాలను కొనసాగించటంతో పాటు అదనంగా ఏమేం చేస్తామో వివరిస్తూ టీఆర్ఎస్ అభ్యర్థులకు అన్నిచోట్లా గట్టి పోటీనిచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి తోడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో చేపట్టిన పథకాలు, సంక్షేమాన్ని వివరిస్తూ ముందుకు వెళ్తున్నారు. కామారెడ్డి, బోధన్, ఆర్మూర్, నిజామాబాద్, ఎల్లారెడ్డి, నిజామాబాద్ రూరల్‌లో కాంగ్రెస్ నుంచి రాజకీయ అనుభవం ఉన్న అభ్యర్థులు బరిలో ఉండటం కలిసివస్తోంది. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లే అధికంగా ఉండటంతో వారిని ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ‘పోయినసారి మేం చెయ్యికి వేశాం..ఈమారు ఇంకా నిర్ణయించుకోలే.. మహిళలను పట్టించుకునే పార్టీకే మా మద్దతు... – కర్రోళ్ల ఎల్లవ్వ (రోజు కూలీ) ఇదీ ఇందూరు ఎజెండా - నిజామాబాద్ జిల్లా ప్రాజెక్టుల కింద సరిపడా సాగునీరు - పండించిన పంటలకు కనీస గిట్టుబాటు ధర - వ్యవసాయాధారిత పరిశోధన సంస్థలు, పరిశ్రమల ఏర్పాటు - గల్ఫ్ కార్మిక కుటుంబాల సంక్షేమం, ఉద్యోగాల నిమిత్తం విదేశాలకే వెళ్లే యువతకు శిక్షణ సంస్థల ఏర్పాటు .. ఇవి తమ తక్షణ అవసరాలని నిజామాబాద్ జిల్లా ఓటర్లు చెబుతున్నారు. - ‘సాగునీటి కరువు ఏర్పడ్డ సమయంలో సింగూరు నుంచి శ్రీరాంసాగర్‌కు నీటిని తీసుకుపోవటం వల్ల తమకు నష్టం కలుగుతోంద’ని బాన్స్వాడ నియోజకవర్గం శ్రీనగరం గ్రామానికి చెందిన రైతు కోడూరు గాంధీ వాపోయాడు. - ‘రైతుబంధు వల్ల పెద్దరైతులకే మేలు జరిగింది. గిట్టుబాటు ధరలు కల్పిస్తే మాకు చాలు. ఎవరి సహాయం అవసరం లేదు. ఈ ఎన్నికలు ఏకపక్షం కాదు. ఎవరికి ఓటెయ్యాలో మాకు తెలుస’ని అంకాపూర్‌కు చెందిన రైతు నారాయణరెడ్డి వ్యాఖ్యానించాడు. ‘ఏఆర్పీ క్యాంప్‌ను దత్తత తీసుకున్న ఎంఎల్ఏ షకీల్ సరిగా పని చేయలేకపోయాడు. ఆయనకు ఈమారు మద్దతిస్తామో లేదో ఇంకా నిర్ణయించలేద’ని ఏఆర్పికి చెందిన రామారావు స్పందించాడు. పసుపు బోర్డు కావాలి ప్రభుత్వం అందిస్తున్న రైతుబంధు, 24 గంటల విద్యుత్ వల్ల మేలు జరిగింది. మా మద్దతు మళ్లీ టీఆర్ఎస్కే. ఐతే పదేళ్ల క్రితం పసుపు ధర ఎంతుందో ఇప్పటికీ అంతే ఉంది. పెట్టుబడి మాత్రం రెండింతలైంది. ఎకరంలో సాగుచేస్తే రూ.75 వేలవుతున్నాయి. 25–30 క్వింటాళ్ల దిగుబడి వచ్చినా.. ప్రస్తుతం ధర మాత్రం రూ.6 వేలే పలుకుతోంది. ఇది గిట్టుబాటు కాదు. మా పిల్లలంతా విదేశాల్లో ఉంటూ, నగదు పంపుతుండటం వల్ల వ్యవసాయాలు నడుస్తున్నాయి. లేకపోతే ఇబ్బందే. పసుపు బోర్డు ఏర్పాటు చేసి వెంటనే గిట్టుబాటు ధరలు ప్రకటించాలి. మేం పండించే ఉత్పత్తులను వ్యయప్రయాసలకోర్చి మహారాష్ట్రలోని సాంగ్లీకి వెళ్లి విక్రయించాల్సి వస్తోంది. – రాధాకృష్ణారెడ్డి, అంకాపూర్ కౌలురైతుకు న్యాయం చేయరూ నేను ఏడెకరాలు కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నా. ఏటా కొంత మొత్తాన్ని భూ యజమానికి చెల్లిస్తా. సర్కారు పెట్టిన రైతు బంధు సహాయం నాకు పైసా కూడా రాలేదు. రైతులకు ఇవ్వటం సంతోషమే అయినా.. నాలాంటి నిరుపేద కౌలు రైతులకూ సాయం చేస్తే బాగుండేది. కానీ మమ్మల్ని పట్టించుకోలేదు. మమ్మల్ని పట్టించుకునే పార్టీకే ఓటేస్తాం. – శంకర్, తాడ్వాయి ‘నిజాం షుగర్స్’ తెరిపించాలె.. ‘అధికారంలోకి వస్తే వెంటనే నిజాం షుగర్స్ తెరిపిస్తమని చెప్పిన్రు. ఇంకా తెరవలే. నిజాం షుగర్స్‌లో డ్రైవర్‌గా పనిచేసినా. రూ.19 వేలు వచ్చేవి. కంపెనీ మూతపడ్డాక ఇక్కడే భూమిని కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నా. ఈ ఏజ్‌లో వేరే పని చేయలేను. ఉద్యోగం పోయినవాళ్లంతా హోటళ్లలో సర్వర్లు, సెక్యూరిటీలుగా పనిచేస్తుండ్రు. ఇంకా మేం టీఆర్ఎస్నే నమ్ముకుని ఉన్నాం. ఆ పార్టీ విజయం కోసం పనిచేస్తున్నా. – ఔదరి మోహన్, ఏఆర్పీ క్యాంప్, బోధన్ బాన్స్వాడ: ఎవరికి చాన్స్? ఐదుసార్లు గెలుపొంది వివిధ శా ఖల మంత్రిగా పనిచేసిన పోచా రం శ్రీనివాసరెడ్డి టీఆర్ఎస్ నుంచి మరోసారి పోటీ చేస్తుండగా, ప్రజాకూటమి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా రెండుసార్లు ఓటమి పాలైన కాసుల బాలరాజు అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. క్రితంసారి బాలరాజుపై 24 వేల మెజారిటీ సా«ధించిన పోచారం.. ఈసారి గట్టిపోటీ ఎదుర్కొంటున్నారు. బాన్స్వాడలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే గెలిపిస్తాయన్న ధీమాతో పోచారం సుడిగా లి ప్రచారం చేస్తుండగా, కాంగ్రెస్ ప్రచారం పుంజుకో లేదు. కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడ్డ మల్యాద్రి రెడ్డి.. బాలరాజు కోసం గట్టిగా పనిచేస్తే.. పోచారం ‘కారు’కు బ్రేకులుపడే అవకాశం లేకపోలేదు. రూరల్: గట్టి సవాల్ జిల్లాలో విశేష రాజకీయానుభవం ఉన్న బాజిరెడ్డి గోవర్ధన్ (టీఆర్ఎస్) మరోసారి నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యేగా పోటీచేస్తూ, కాంగ్రెస్ అభ్యర్థి భూపతిరెడ్డి నుంచి గట్టి సవాల్‌ను ఎదుర్కొంటున్నారు. గడిచిన ఎన్నికల్లో బాజిరెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి ధర్మపురి శ్రీనివాస్‌పై 27 వేల మెజారిటీతో గెలుపొందారు. ఇటీవల పరిణామాలతో టీఆర్ఎస్ ఎంఎల్సీ భూపతిరెడ్డి కాంగ్రెస్‌లో చేరి టికెట్ తెచ్చుకుని బాజిరెడ్డిని ఢీకొంటున్నారు. ఇద్దరూ విజయం కోసం శ్రమిస్తున్నారు. ఆర్మూర్: 3 పార్టీల తీన్మార్ జిల్లాలో కీలకమైన ఆర్మూర్ నియోజకవర్గంలో ఈమారు పోటీ హోరాహోరీగా సాగుతోంది. టీఆర్ఎస్ నుంచి తాజా మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి, కాంగ్రెస్ నుంచి ఎంఎల్సీ ఆకుల లలిత, టీఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపడ్డ వినయ్‌రెడ్డి బీజేపీ నుంచి బరిలో ఉన్నారు. జీవన్‌రెడ్డిపై ఒకింత అసంతృప్తి ఉన్నా, ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు వాటిని పట్టించుకోరన్న విశ్వాసాన్ని పార్టీ నాయకులు వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి ఆకుల లలిత నియోజకవర్గంలో తనకున్న విస్తృత సంబంధాలకు తోడు, ప్రభుత్వ వ్యతిరేక వర్గాల్ని కలుపుకొనే విషయంలో చురుగ్గా వ్యవహరిస్తున్నారు. బీజేపీ నుంచి పోటీ చేస్తున్న వినయ్‌కుమార్‌రెడ్డి భారీగా ఓట్లు చీల్చే అవకాశం ఉంది. జుక్కల్: ప్రధాన పార్టీల దంగల్ జుక్కల్ (ఎస్సీ)లో పాత ప్రత్యర్థులే మరోసారి బరిలో నిలిచారు. గత ఎన్నికల్లో 37 వేల మెజారిటీతో గెలుపొందిన హనుమంత్‌షిండే మరోసారి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తుంటే నాలుగుమార్లు ఎంఎల్ఏగా పనిచేసి, గత ఎన్నికల్లో ఓటమి పాలైన గంగారం మరోసారి కాంగ్రెస్ అభ్యర్థిగా, మరో మాజీ ఎమ్మెల్యే అరుణతార బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ప్రధానంగా టీఆర్ఎస్–కాంగ్రెస్ మధ్యే హోరాహోరీ పోటీ ఉంది. అభివృద్ధిని నమ్ముకుని టీఆర్ఎస్, తామొస్తే ఏం చేస్తామో చెబుతూ కాంగ్రెస్ ప్రచారం హోరెత్తిస్తున్నాయి. బాల్కొండ: ఎవరికో దండ! జిల్లాలో కీలకమైన బాల్కొండలో పాత ప్రత్యర్థులే పోటీలో ఉన్నారు. గత ఎన్నికల్లో 37 వేల ఓట్ల మెజారిటీతో గెలిచిన టీఆర్ఎస్ అభ్యర్థి వేముల ప్రశాంత్‌రెడ్డి.. మరోసారి కాంగ్రెస్ అభ్యర్థి అనిల్‌ను ఢీకొంటున్నారు. ఈ టికెట్ ఆశించి భంగపడి బీఎస్పీ అభ్యర్థిగా రంగంలోకి దిగిన ముత్యాల సునీల్‌కుమార్.. టీఆర్ఎస్ ఓటమే లక్ష్యమంటూ ప్రచారం చేస్తుండటం ఆ పార్టీకి ఇబ్బందిగా మారింది. సౌమ్యుడన్న పేరుకు తోడు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే గెలిపిస్తాయని ప్రశాంత్‌రెడ్డి, బీసీ నినాదం అనుకూలిస్తుందని అనిల్ ఆశ పెట్టుకున్నారు. బోధన్: టీఆర్ఎస్, కాంగ్రెస్ ధనాధన్ తాజా మాజీ ఎమ్మెల్యే షకీల్(టీఆర్ఎస్), మాజీ మంత్రి పి.సుదర్శన్‌రెడ్డి (కాంగ్రెస్), అల్జాపూర్ శ్రీనివాస్ (బీజేపీ) పోటీ చేస్తున్నారు. నియోజకవర్గంలో అత్యధికంగా ఉన్న మైనారిటీలకు తోడు సర్కారు పథకాలను షకీల్ నమ్ముకోగా, ఏడోసారి శాసనసభకు పోటీ చేస్తున్న సుదర్శన్‌రెడ్డి.. ని యోజకవర్గంపై తనకున్న పట్టు నిరూపిం చుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ప్రభుత్వ పథకాలందని ఓటర్లతో పాటు పార్టీకి దూరమైన వారిని తన వైపు తిప్పు కుంటూ ముందుకు సాగుతున్నారు. కౌన్ బనేగా నిజామా‘బాద్షా’? నిజామాబాద్ అర్బన్‌లో త్రిముఖ పోరు నెలకొంది. సిట్టింగ్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా (టీఆర్ఎస్), మాజీ ఎంఎల్ఏ యెండల లక్ష్మీనారాయణ (బీజేపీ), తాహెర్‌బిన్ (కాంగ్రెస్) పోటీలో ఉన్నారు. ముగ్గురూ ప్రత్యేక వ్యూహంతో ముందుకెళ్తున్నారు. దీంతో గెలుపు అంచనాలకు తేలిగ్గా అందేలా లేదు. పార్టీ పథకాలు, పట్ట ణాభివృద్ధిపై గణేష్ భరోసాతో ఉండగా, లక్ష్మీనారాయణ వ్యక్తిగత సంబంధాలు, పార్టీ ఇమేజ్‌పై ఆధారపడ్డారు. మైనారిటీ ఓట్లకు తోడు కాంగ్రెస్, టీడీపీ ఓటుబ్యాంక్ చెక్కు చెదరకుంటే విజయం తనదేన న్న ధీమాలో తాహెర్ ఉన్నారు. ఎల్లారెడ్డి: ఎవరికి అడ్డా! నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఏనుగు రవీందర్‌రెడ్డి (టీఆర్ఎస్).. ఈసారి కాంగ్రెస్ అభ్యర్థి నల్లమడుగు సురేందర్ నుంచి గట్టిపోటీ ఎదుర్కొంటున్నారు. వరసగా ఓటమి పాలైన సానుభూతికి తోడు నియోజకవర్గంలో నెలకొన్న కొన్ని ప్రత్యేక పరిస్థితులు టీఆర్ఎస్ అభ్యర్థి కారు స్పీడ్‌కు బ్రేకులు వేస్తున్నాయి. ప్రభుత్వ పథకాలే తనను గెలిపిస్తాయని రవీందర్‌రెడ్డి.. ప్రభుత్వం నెరవేర్చని హామీలకు తోడు రవీందర్‌రెడ్డిపై ఉన్న అసంతృప్తి కలిసొస్తుందని సురేందర్ ధీమాతో ఉన్నారు. ఇక్కడ బీజేపీ నుంచి నాయుడు ప్రకాష్ పోటీలో ఉన్నారు. కామారెడ్డి: ఢీ అంటే ఢీ కామారెడ్డి బరిలో మళ్లీ సీనియర్లు తలపడుతున్నారు. గత ఎన్నికల్లో పోటీపడ్డ గంప గోవర్ధన్ (టీఆర్ఎస్), మహ్మద్ అలీ షబ్బీర్ (కాంగ్రెస్)కు తోడు మాజీ జడ్పీ ఛైర్మన్ వెంకటరమణారెడ్డి (బీజేపీ) మధ్య పోటీ నెలకొంది. గడిచిన ఎన్నికల్లో 8 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించిన గంపా గోవర్ధన్‌ను నిలువరించేందుకు షబ్బీర్ అలీ సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీలో కొనసాగి రాజీనామా చేసిన బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డి సైతం సీరియస్‌గా పనిచేస్తుండటంతో ఫలితంపై ఆసక్తి నెలకొంది. -
బంగారం చోరీ కేసులో టీఆర్ఎస్ నేతలు
-
ఇక అన్ని ప్రాజెక్టుల్లో ‘అమృత హస్తం’!
ఇందూరు : అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం ఇక అందరికీ సమానంగా అందనుంది. గర్భిణులు, బాలింతలు, పిల్లల కోసం ప్రత్యేకంగా ఇందిరమ్మ అమృత హస్తం ద్వారా అందించే పరిపుష్టమైన పౌష్టికాహారాన్ని జిల్లాలోని అన్ని ఐసీడీఎస్ సీడీపీఓ ప్రాజెక్టుల్లో అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ నెల నుంచి అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో మొత్తం పది సీడీపీఓ ప్రాజెక్టుల ద్వారా 2711 అంగన్వాడీ కేంద్రాలు కొనసాగుతున్నాయి. ఇందులో కేవలం ఆరు ప్రాజెక్టులైన బోధన్, బాన్సువాడ, మద్నూర్, ఎల్లారెడ్డి, దోమకొండ, భీమ్‌గల్ ప్రాజెక్టుల్లో మాత్రమే అమృత హస్తం పథకాన్ని గత ప్రభుత్వం అమలు చేసింది. మిగతా నాలుగు ప్రాజెక్టుల్లో అమలు చేయలేదు. ఎందుకు అమలు చేయడం లేదో కూడా అధికారులకు అర్థం కాలేదు. ఆరు ప్రాజెక్టుల్లో ఉన్న అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే గర్భిణులు, బాలింతలు, పిల్లలకు పౌష్టికాహారం, గుడ్లు, పాలు, పోపు దినుసులు, కూరగాయల భోజనం, ఐరన్ మాత్రలు, ఇతరాత్రవి అందేవి. జిల్లాలో పది ప్రాజెక్టులకు గాను ఆరు ప్రాజెక్టుల్లో పథకం అమలు కావడం, మిగతా ప్రాజెక్టుల్లో ఎందుకు అమలు కావడం లేదని జిల్లా ఐసీడీఎస్ పీడీ రాములును రాష్ట్ర ఉన్నతాధికారులు ప్రశ్నించారు. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు జిల్లాలో అమలు జరగుతుందని తెలిపారు. ఒక ప్రాజెక్టు వారికి అలా, మరో ప్రాజెక్టు వారికి ఇలా అమలు చేయడం సరికాదని తారతమ్యం లేకుండా పథకాన్ని వర్తింపజేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇదివరకు అమలు కాని నిజామాబాద్ రూరల్, నిజామాబాద్ అర్బన్, ఆర్మూర్, కామారెడ్డి ప్రాజెక్టుల్లో కూడా పథకాన్ని అమలు చేసి పౌష్టికాహారం అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందజేయాలని తీర్మానిం చారు. దీని మార్గదర్శకాలు, విధి విధానాలు త్వరలోనే ప్రభుత్వం ప్రకటించనుంది. డిసెంబర్ నెల నుంచి పథకాన్ని అమలు చేసేందుకు ఇటు రాష్ట్ర అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఫలితంగా కొత్తగా నాలుగు ప్రాజెక్టుల్లో పథకం అమలు కానున్న సందర్భంగా వాటి పరిధిలో ఉన్న దాదాపు 1050 అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే గర్భిణులు, బాలింతలు, పిల్లలకు లబ్ధి చేకూరనుంది. ప్రతి రోజు గుడ్డు.. జిల్లాలోని పది ఐసీడీఎస్ సీడీపీఓ ప్రాజెక్టుల్లో ఇందిరమ్మ అమృత హస్తం కావడం ఒక విశేషమైతే, పౌష్టికాహారాన్ని పెంచడం మరో విశేషంగా చెప్పవచ్చు. ఇది వరకు గర్భిణులు, బాలింతలు, పిల్లలకు నెలకు 25 గుడ్లు అందించేవారు. కానీ ప్రస్తుతం ఆ సంఖ్యను ప్రతి రోజు అంటే నెల రోజుల పాటు గుడ్లు అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంగన్వాడీ కేంద్రాలకు డిసెంబర్ నెల నుంచి అదనంగా గుడ్లు సరఫరా కానున్నాయి. -
ఫాస్ట్ వెరీ స్లో
ఇందూరు/బాన్సువాడ : తెలంగాణ సర్కారు తీసుకొచ్చిన ‘ఫాస్ట్’ పథ కం అమలులో జాప్యం జరగడం ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఆధారపడిన విద్యార్థులను ఆందోళనకు గురిచేస్తోంది. విద్యా సంవత్సరం గడిచిపోతుండడం తో కళాశాలలు ఫీజుల కోసం ఒత్తిడి చేస్తున్నాయి. ఫాస్ట్ పథకానికి సంబంధించి ఇప్పటికీ దరఖాస్తు తేదీని ప్రకటించకపోవడంతో ఏం చే యాలో తెలియక విద్యార్థులు దిక్కుతోచని స్థితిలోకి పడిపోయారు. సర్కారు తెలంగాణ విద్యార్థుల కోసం ఫాస్ట్ (ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టు స్టూడెంట్స్ ఆఫ్ తెలంగాణ) పథకాన్ని తీసుకువచ్చినా, దానిపై ఇప్పటికీ స్పష్టత ఇవ్వడం లేదు. మార్గదర్శకాలు విడుదలయ్యేలోగా రెవెన్యూ అధికారుల నుంచి కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాలు పొందాలని సర్కారు నెల క్రితం సూచించింది. దరఖాస్తులూ స్వీకరించింది. తీరా అవి పరిష్కారానికి నోచుకోవడం లేదు. అష్టకష్టాలు పడి సర్టిఫికెట్లు పొంది నా, ప్రభుత్వం మళ్లీ ఏ నిబంధనను కొత్తగా తెరపైకి తెస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. 2014-15 ఉపకారవేతనాలు అందుతాయో లేదోనని మానసి క క్షోభకు గురవుతున్నారు. జిల్లాలో ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్‌షిప్‌నకు అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు 74 వేల మంది ఉన్నారు. ఇందులో 38 వేల మంది కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి వేచి చూస్తుండగా మరో 36 వేల మంది తమ స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్లను రెన్యువల్ చేసుకోవడానికి నిరీక్షిస్తున్నారు. దర ఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కాకపోవడంతో కళాశాలల యాజమాన్యాలు ఫీజుల కోసం ఇబ్బంది పెడుతున్నాయని విద్యార్థులు చెబుతున్నారు. గతేడాది ‘నిధులూ’ అర కొరగానే విడుదలయ్యాయి. అవీ కళాశాలలకు చేరలేదు. ‘ఫాస్ట్’ మార్గదర్శకాలు వచ్చిన తర్వాత మిగిలిన నిధులు విడుదలయ్యే అవకాశం ఉందని ఉన్నతాధికారులు చె బుతున్నారు. ఆలస్యమైతే 2014-15 విద్యా సంవత్సరానికిగాను ఫ్రెష్, రెన్యువల్ స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ దరఖాస్తుల స్వీకరణను ప్రభుత్వం ఇప్పటికే ఆలస్యం చేసింది. మరిం త ఆలస్యం చేస్తే విద్యార్థులకు తిప్పలు తప్పవు. విద్యాసంవత్సరం ముగింపునకు కనీసం ఆరు నెలల ముందు దరఖాస్తు చేసుకుంటేనే సరైన సమయంలో స్కాలర్షిప్ గాని, ఫీజు రీయింబర్స్మెంట్ గాని అందే అవకాశం ఉంటుంది. ఆరు నెలల ముందు అంటే సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులకు కుల, ఆదాయ, స్థానికత, ఆధార్, తదితర సర్టిఫికెట్లు జత చేయాల్సి ఉంటుంది. వాటి కోసం మీ సేవ కేంద్రాలలో దరఖాస్తు చేసుకోవాలి. సర్వర్ బిజీతో అవస్థలు అదనం. తర్వాత సర్టిఫికెట్లను ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి. అలా చేసిన తర్వాత కళాశాలల నుంచి హార్డ్ కాపీలు జిల్లా శాఖకు అందడం, అక్కడి నుంచి ప్రభుత్వానికి పంపడం వంటి ప్రక్రియ ముగిసే సరికి నెలన్నర పడుతుంది. గతంలో ఈపాస్ వెబ్సైట్ ద్వారా దరఖాస్తులు స్వీకరించేవారు. కొత్తగా ‘ఫాస్ట్’ పథకం వచ్చిన నేపథ్యం లో ఆ వెబ్‌సైట్‌ను నిలిపివేశారు. ప్రభుత్వం ఇప్పటికీ దరఖాస్తు తేదీలను ప్రకటించలేదు. సర్కారు దరఖాస్తు తేదీలను ఎప్పుడు ప్రకటిస్తుందో కూడా తెలియదు. దీంతో ఆందోళన చెందుతున్న విద్యార్థులు.. నూతన ప్రభుత్వం జారీ చేసే మార్గదర్శకాలకోసం వేచి చూస్తున్నారు. -
డీపీఓ బదిలీ
ఇందూరు : జిల్లా పంచాయతీ అధికారి సురేశ్‌బాబు బదిలీ అయ్యారు. ఆయనను నల్గొండ జిల్లాకు బదిలీ చేస్తూ పంచాయతీ రాజ్ ప్రిన్సిపల్ సెక్రెటరీ రేమండ్ పీటర్ శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాకు నల్గొం డ డీపీఓ కృష్ణమూర్తి బదిలీపై వస్తున్నారు. కృష్ణమూర్తి హైదరాబాద్‌కు చెందినవారు. కలెక్టర్ రొనాల్డ్ రోస్ సెలవు నుంచి రాగానే సురేశ్‌బాబు రి లీవ్ అవుతారు. ఆ తర్వాత కృష్ణమూర్తి జిల్లాకు వచ్చి విధుల్లో చేరుతారు. సురేశ్‌బాబు జిల్లాకు డీపీఓగా 2010 మే 11న వచ్చారు. నాలుగున్నర సంవత్సరాల పాటు పని చేసిన ఆయనకు ముక్కుసూటితనం, నిక్కచ్చి గా వ్యవహరించడం, పైరవీలకు తావిచ్చేవారు కాదని పేరుంది. అసెంబ్లీ, పంచాయతీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో తనదైన శైలిలో పనిచేసి ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. ఎక్కడా కూడా రీ పోలింగ్ జరగకుండా, పొరపాట్లు లేకుండా పనిచేసిన అధికారిగా పేరు తెచ్చుకున్నారు. లోతుగా పరిశీలించి పని చేయడం, క్షుణ్ణంగా చూసిన తరువాతే ఫైళ్లపై సంతకాలు చేయడం ఆయన ప్రత్యేకతలు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కుటుంబ సర్వే, దాని తరువాత పెన్షన్, ఆహార భద్రతా కార్డుల సర్వేలో కీలకంగా వ్యవహరించారు. ముఖ్యంగా నిజామాబాద్ అర్బన్‌లో సర్వే వేగవంతం చేయడానికి తోడ్పడ్డారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించిన వర్క్‌షాపుల్లో పాల్గొన్నారు. పథకాల అమలు, పంచాయతీ రాజ్ నూతన చట్టం తయారీలో ప్రభుత్వానికి సలహాలిచ్చారు. ప్రభుత్వం నుంచి రాష్ట్ర అధికారుల నుంచి ఎన్నో ప్రసంశలు పొందారు. జిల్లాలో అత్యధిక కాలం పని చేసిన జిల్లాస్థాయి అధికారి సురేశ్‌బాబే కావడం గమనార్హం. పలుమార్లు జరిగిన బదిలీల్లో ఈయన పేరు ఉన్నప్పటికీ కలెక్టర్లు నిలిపివేయించారు. -
ఆడపిల్లపై వివక్ష ఎందుకు?
ఇందూరు : ‘ఆడబిడ్డ పుడితే మానసికంగా ఎందుకు బాధపడుతున్నారో అర్థం కావడంలేదు.. బిడ్డను కనే తల్లి కూడా ఒకప్పుడు ఒక తల్లికి పుట్టిన ఆడబిడ్డేనన్న విషయం మరిచిపోయి గర్భంలోనే ఉండగానే ఆడపిల్లలను చంపుకుంటున్నారు..’ అని జిల్లా అదనపు కలెక్టర్ (ఏజేసీ) శేషాద్రి ఆవేదన వ్యక్తం చేశారు. బాలల హక్కుల వారోత్సవాలలో భాగంగా శుక్రవారం ఐసీడీఎస్ అనుబంధ శాఖ జిల్లా బాలల సంరక్షణ విభాగం, తదితర సంబంధిత శాఖల సమన్వయంతో బాలల హక్కుల దినోత్సవ కార్యక్రమాన్ని స్థానిక న్యూఅంబేద్కర్ భవన్లో నిర్వహించారు. ముఖ్య అతిథిగా హా జరైన ఏజేసీ నెహ్రూ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఆడప్లిల పుడితే ఏమవుతుందన్నారు. తల్లి దండ్రులను చివరి వరకు ప్రేమించేది కొడుకు కాదని కూతురేనన్నారు. పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్లినంత మాత్రానా కూతురు తల్లి దండ్రులను మరిచిపోదన్నారు. కానీ ఈ కాలంలో కొడుకులు కన్న తల్లిదండ్రులను పట్టించుకోకుండా వృద్ధాశ్రమంలో ఉంచుతున్నారని అన్నారు. బరువయ్యారని ఆశ్రమంలో ఉంచిన కొడుకు గొప్పవాడా...? చివరి వరకు ప్రేమించి యోగ క్షేమాలు చూసుకునే కూతురు గొప్పదా.? అని ప్రశ్నించారు. ఇంతటి చరిత్ర కలిగిన ఆడబిడ్డను కనే తల్లి ముందస్తు పరీక్షలు చేయించుకుని ఆడబిడ్డ పుడుతుందని తెలుసుకుని కడుపులోనే చంపేయడం దారుణమన్నారు. ప్రతి ఒక్కరికీ జీవించే హక్కు ఉం దని, కానీ ఆడవాళ్లే ఆడవాళ్లకు ఇలా శత్రువులుగా మారడం దారుణమైన విషయమన్నారు. ఆడవాళ్లలో మార్పు వస్తే భ్రూణ హత్యలు తగ్గుతాయన్నారు. ఆడవాళ్లు భారం కాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం కిశోర బాలికలు, కల్యాణ లక్ష్మి లాంటి ఆర్థిక సహాయ పథకాలను ప్రవేశపెట్టిందని వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పిల్లల హక్కులను హరించొద్దు పిల్లల హక్కులను హరించే హక్కు ఎవరికీ లేదని, అలా హరించిన వారెవరైనా, చివరికీ కన్న తల్లిదండ్రులైనా చట్ట ప్రకారం శిక్ష అర్హులవుతారని తెలిపారు. బడీడు పిల్లలను పనిలో పెట్టుకుంటే షాపు యజమానిపై కేసు నమోదుతో పాటు జైలు శిక్ష విధిస్తారనిహెచ్చరించారు. కార్యక్రమం అనంతరం సంతానం కలుగని దంపతులకు ఏడాదిన్నర పాపను ఏజేసీ చేతుల మీదుగా దత్తతనిచ్చారు. ఉపాన్యాస, వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. బాల్య వివాహాల నిరోధకాలపై, బాల స్వచ్ఛ కార్యక్రమానికి సంబంధించిన బ్యానర్లు, కరపత్రాలను ఆవిష్కరించారు. పలువురు విద్యార్థులు ఆట, పాటలతో అలరించారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడీ రాములు, జిల్లా విద్యాశాఖధికారి శ్రీనివాసాచారి, జిల్లా వైద్యాధికారి గోవింద్ వాగ్మారే, ఎన్సీఎల్పీ పీడీ సుధాకర్ రావు తదితరులు పాల్గొన్నారు. ర్యాలీని ప్రారంభించిన ఎస్పీ బాలల హక్కుల వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా ఐసీడీఎస్ ఆధ్వర్యంలో కలెర్టరేట్ నుంచి విద్యార్థులచే ర్యాలీ నిర్వహించారు. ఉదయం 10గంటలకు ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ర్యాలీ కలెక్టరేట్ నుంచి తిలక్‌గార్డెన్ మీదుగా న్యూ అంబేద్కర్ భవన్ వరకు చేరుకుంది. -
సాక్ష్యాలున్నా.. మౌనమేల ?
ఇందూరు: జిల్లా పంచాయతీ అధికారి సురేశ్ బాబు ఎలాంటి వాడో అని ఎవరినీ అడిగినా అమ్మో... ఆయనా... ఎలాంటి అక్రమాలను ప్రోత్సహించడు... అక్రమాలకు పాల్పడిన వారిని విడిచిపెట్టడు.. విధుల్లో, పాలనలో నిక్కచ్చిగా వ్యహరిస్తాడు అని టక్కున చెప్పేస్తారు. జిల్లాలో ఇలాంటి పేరును సంపాదించున్న డీపీఓ ప్రస్తుతం నిజామాబాద్ డీఎల్పీఓ శ్రీకాంత్ అక్రమాలకు పాల్పడ్డాడని, నిబంధనలకు విరుద్ధంగా అపార్ట్మెంట్ నిర్మాణాల అనుమతులకు భారీ మొత్తంలో వసూళ్లకు పాల్పడ్డట్టు సాక్ష్యాలున్నా, ఫిర్యాదులు వచ్చినా ఆయనపై ఎలాంటి చర్యలు చేపట్టకుండా ఎందుకు మౌనంగా ఉన్నారో తెలియడం లేదు. నిజామాబాద్ మండలం గూపన్పల్లి గ్రామ పంచాయతీ ఫేస్-2 లో నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడుతున్నా అపార్ట్‌మెంట్‌ను కూల్చి వేయాలని డీపీఓనే గతంలో డీఎల్పీఓ ద్వారా సంబంధిత గ్రామ కార్యదర్శికి, అపార్ట్మెంట్ నిర్మాణ యజమానికి నోటీసులు జారీ చేయించారు. కాని డీఎల్పీఓ వారితో కుమ్మక్కై అపార్ట్మెంట్ నిర్మాణానికి ప్రోత్సాహం ఇచ్చినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఎందుకంటే అపార్ట్మెంట్ నిర్మాణం ప్రారంభ దశలో ఉన్న సమయంలో అక్రమ కట్టడాలపై గ్రామస్తుడు ఫిర్యాదు చేయడంతో నోటీసు జారీ చేయగా పని నిలిపివేసినట్లు రికార్డుల్లో రాసినట్లుగా తెలిసింది. కానీ ప్రస్తుతం ఆ అపార్ట్మెంట్ నిర్మాణం చివరి దశలో ఉందంటే డీఎల్పీఓ, పంచాయతీ కార్యదర్శులిద్దరూ యజమానికి లొంగిపోయారనే విమర్శలు వస్తున్నాయి. ఇటు అక్రమ కట్టడమేనని తెలిసిన డీపీఓ కూడా ఈ విషయంలో ఎలాంటి జోక్యం చేసుకోకపోవడంతో డీఎల్పీఓ అపార్ట్మెంట్ల నిర్మాణాలకు నిబంధనలకు విరుద్ధంగా అనుమతిలిచ్చి అందినకాడికి దండుకుంటున్నాడని ప్రచారం జరుగుతోంది. డీఎల్‌పీఓపై వచ్చిన ఆరోపణలపై తనకు మూడు రోజుల్లో నివేదిక ఇవ్వాలని మూడు రోజుల క్రితం జిల్లా పంచాయతీ అధికారి సురేశ్‌బాబును కలెక్టర్ ఆదేశించారు. కాని నేటి వరకు డీఎల్‌పీఓపై నివేదిక తయారు చేసి కలెక్టర్‌కు అందజేయలేదు. అక్రమాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకునే డీపీఓ వెనకగుడు వేయడం వెనుక ఆంతర్యమేముందోనని పంచాయతీ అధికారులు, ఉద్యోగులు, పంచాయతీ కార్యదర్శులు సర్వత్రా చర్చించుకుంటున్నారు. అక్రమార్కుడికి అండగా నిలబడటం సరికాదని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ విషయంపై డీపీఓ సురేశ్‌బాబును వివరణ కోరగా అసలు కలెక్టర్ తమను డీఎల్‌పీఓపై నివేదిక ఇవ్వమని ఆదేశాలిచ్చిన విషయం తెలియదని చెప్పారు. గూపన్పల్లిలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న అపార్ట్‌మెంట్‌ను నిలిపివేయాలని నోటీసు ద్వారా తెలిపామని, ప్రస్తుతం పనులు నిలిచిపోయానని తెలిపారు. కానీ నిజానికి అక్కడ పనులు కొనసాగుతున్నాయి. తెరపైకి మరో అక్రమాల కథ! నిజామాబాద్ డీఎల్పీఓ అక్రమాల్లో మరో విషయం బయటకు పొక్కింది. రెండు నెలల క్రితం బాల్కొండ మండలం ముప్కాల్ గ్రామంలో ఓ ప్రజా ప్రతినిధి షాపింగ్ కాంప్లెక్స్, కల్యాణ మండపం నిర్మించడానికి గ్రామ పంచాయతీ నుంచి అనుమతి తీసుకోవాలి. అయితే అనుమతి రావాలంటే ముందుగా జిల్లా టౌన్ ప్లానింగ్ అధికారి నుంచి, అలాగే ఫైర్ శాఖ అధికారుల నుంచి నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్( ఎన్ఓసీ) ఇవ్వాలి. కానీ పై రెండు శాఖల అధికారుల నుంచి అనుమతి లేకుండానే పంచాయతీ కార్యదర్శి లక్పతి పంచాయతీ నుంచి అనుమతినిచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న పలువురు గ్రామస్తులు డీపీఓకు ఫిర్యాదు చేయగా ముప్కాల్ కార్యదర్శిపై విచారణ చేసి నివేదిక అందజేయాలని డీఎల్పీఓను ఆదేశించాడు. విచారణకు వెళ్లిన డీఎల్పీఓ కార్యదర్శితో, నిర్మించే ప్రజా ప్రతినిధితో కుమ్మక్కై సరైన అధారాలు లేవని తప్పుడు నివేదికను డీపీఓకు ఇచ్చాడు. ఆధారాలు లేవనే ఉద్దేశంతో డీపీఓ కూడా ఈ విషయాన్ని పట్టించుకోలేదు. ప్రస్తుతం గ్రామస్తులు డీపీఓ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా పరిష్కారం లభించడం లేదు. -
అంగన్వాడీల్లో ‘బాల స్వచ్ఛ వారోత్సవాలు’
ఇందూరు : స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా అంగన్వాడీ కేంద్రాలలో ‘బాల స్వచ్ఛ వారోత్సవాలు’ నిర్వహించాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 14వ తేదీ నుంచి 19 వరకు వారోత్సవాలు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి ఐసీడీఎస్ అధికారులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మార్గదర్శకాలు జారీ చేశాయి. ముఖ్యంగా ఆరు అంశాలపై కార్యక్రమాలు నిర్వహించాల ని, రోజు వారీగా ఫోటోలను వెబ్సైట్ లో అప్లోడ్ చేయాలని ఐసీడీఎస్ అధికారులను ప్రభుత్వాలు ఆదేశించాయి. స్వచ్ఛభారత్ కార్యక్రమంపై అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే పిల్లలు, వారి తల్లులకు అవగాహన కల్పించాలని సూచించాలని, గ్రామాల్లో బ్యానర్లు, పోస్టర్ల ద్వారా కార్యక్రమాలపై ప్రచారం చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు ఐసీడీఎస్ పీడీ రాములు జిల్లాలోని పది ప్రాజెక్టుల సీడీపీఓలకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలోని 2,711 అంగన్వాడీ కేంద్రాల్లో పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించడానికి అధికారులు కార్యాచరణ సిద్ధంచేస్తున్నారు. ఆరు కార్యక్రమాలు ఇలా.. 1 అంగన్వాడీల పరిశుభ్రత అంగన్వాడీ కేంద్రాలలోని గదులను, పిల్లలు కూర్చుండే స్థలాన్ని పరిశుభ్రం చేయాలి. గదులకు పట్టిన దుమ్ము, ధూళిని తొలగించాలి. పిల్లలు ఆడుకునే వస్తువులను తుడవాలి. ఆహార ధాన్యాలు నిలువ ఉంచే గదిని శుభ్రం చేయాలి. 2 పరిసరాలు.. అంగన్వాడీ కేంద్రాల ఆరుబయట ప్రాంతాలలో, ఆటలాడుకునే స్థలంలో పిచ్చి మొక్కలు, చెత్త చెదారంలాంటివి లేకుండా చూసుకోవాలి. పిల్లలు కేంద్రానికి వచ్చేందుకు, ఆడకునేందుకు వీలుగా నేలను చదును చేయాలి. కీటకాలు, విష పురుగులు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. 3 వ్యక్తిగత శుభ్రత అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే పిల్లలకు, బాలింతలకు, గర్భిణులకు వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్సించాలి. ముఖ్యంగా పిల్లలను కార్యకర్తలు, ఆయాలు దగ్గరుండి వ్యక్తిగతంగా శుభ్రంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి. భోజనం చేసే ముందు, చేసిన తర్వాత, మల మూత్రాలకు వెళ్లి వచ్చిన తర్వాత చేతులను, కాళ్లను శుభ్రంచేసుకోవాలని సూచించాలి. ఆటలాడిన తర్వాత కూడా చేతులు, కాళ్లు, ముఖం కడుక్కునేలా తయారు చేయాలి. 4 ఆహార పదార్థాలు.. పిల్లలకు, బాలింతలకు, గర్భిణులకు ప్రతి రోజు వండిపెట్టే భోజనం పరిశుభ్రంగా ఉంచాలి. పప్పు లు, బ్యియం, నూనె, ఇతర వస్తువులను పరిశుభ్ర వాతావరణంలో ఉంచాలి. అప్పటికప్పుడు వండిన ఆహారాన్ని పిల్లలకు అందించాలి. అధిక రోజులు నిల్వ ఉన్న గుడ్లను లబ్ధిదారులకు అందించరాదు. 5 తాగునీరు.. తాగునీటిపై ప్రత్యేక శ్రద్ధపెట్టాలి. అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే వారికి క్లోరినేషన్ చేసిన, కాచి వడపోసిన, స్వచ్ఛమైన తాగునీటిని మాత్రమే అందించాలి. తాగునీటి పాత్రలు ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి. ఏ రోజు పట్టిన నీటిని ఆ రోజు మాత్రమే వాడాలి. 6 టాయిలెట్లు.. అంగన్వాడీ కేంద్రాల్లో కచ్చితంగా టాయిలెట్లు ఉండేవిధంగా చూడాలి. టాయిలెట్లలో నీటి సదుపాయం కల్పించాలి. మల విసర్జన తర్వాత నీటిని పోయాలి. దుర్వాసన రాకుండా ఎప్పటికప్పుడు ఆసిడ్‌తో శుభ్రంగా కడగాలి. -
పంచాయతీలకు నిధులు మంజూరు
ఇందూరు : దీర్ఘకాలికంగా పంచాయతీల్లో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం నిధులు మంజూరయ్యాయి. పారిశుధ్య సమస్య పరిష్కారం, టాయిలెట్ల నిర్మాణాలతో పాటు పల్లె ప్రజల చిన్న చిన్న సమస్యలను తీర్చడానికి 2014-15 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం జిల్లాకు 13వ ఆర్థిక సంఘం నిధులు రూ. 7.38 కోట్లు మంజురు చేసింది. ఈ మేరకు రాష్ట్ర పంచాయతీ శాఖ కమిషనర్ జిల్లా పంచాయతీ కార్యాలయానికి ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా ట్రెజరీ శాఖ ద్వారా ఈ నిధులను అలాట్ చేసి బ్యాంకు ఖాతాల్లో వేయడానికి పంచాయతీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఆర్థిక శాఖ నుంచి అనుమతి రాగానే పంచాయతీ ఖాతాల్లో నిధులు పడనున్నాయి. ఈ నిధులతో పంచాయతీల్లో సానిటేషన్ పనులు, తాగునీటి సమస్యల పరిష్కారం, వీధి దీపాలు, అంగన్వాడీలు, పాఠశాలల్లో మరుదొడ్ల నిర్మాణం తదితర పనులు చేపట్టవచ్చు. జడ్పీకి రూ. 2 కోట్లు.. 13వ ఆర్థిక సంఘం నిధులకు సంబంధించి 2014-15 సంవత్సరానికిగాను జిల్లా పరిషత్‌కు రూ. 2 కోట్లు మంజురయ్యాయి. మొత్తం రూ. 23 కోట్లు జిల్లాకు రావాల్సి ఉండగా మొదటి దశగా రూ. 2 కోట్లను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. అలాగే మండల పరిషత్‌లకు కోటి రూపాయల వరకు మంజూరయ్యాయి. ఈ నిధులను కూడా ట్రెజరీ ద్వారా జిల్లా, మండల పరిషత్‌లకు కేటాయించనున్నారు. ఈ నిధులను జిల్లాలోని 718 పంచాయతీల ఖాతాల్లో వేయడానికి వీలుగా నిజామాబాద్, బోధన్, కామారెడ్డి డివిజన్ మూడు డివిజన్ పంచాయతీ కార్యాలయాల వారిగా పంచాయతీలను విభజించి, అందులో పంచాయతీల జనాభా ఆధారంగా నిధులను కేటాయిస్తున్నారు. -
నేటి నుంచి జడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు
ఇందూరు : జిల్లా పరిషత్ పాలక వర్గం కొలువుదీరిన నేపథ్యంలో కొత్తగా ఏకగ్రీవంగా ఎన్నికైన జడ్పీ స్థాయీ సంఘాల సమావేశాలు తొలిసారిగా మంగళవారం ప్రారంభం కానున్నాయి. జడ్పీ చైర్మన్ దఫేదార్ రాజు అధ్యక్షతన ఈ సమావేశాలు జరగనున్నాయి. ఉదయం 10గంటలకు గ్రామీణాభివృద్ధి శాఖపై జరిగే సమీక్షలో కమిటీ అధ్యక్షులుగా ఉన్న జడ్పీ చైర్మన్‌తో పాటు ఇంకా ఎనిమిది మంది సభ్యులు, శాఖల అధికారులు పాల్గొంటారు. మధ్యాహ్నం రెండు గంటలకు వ్యవసాయ శాఖపై సమావేశం జరగనుంది. ఈ సమావేశం వ్యవసాయ శాఖ స్థాయీ సంఘానికి చైర్మన్‌గా ఉన్న జడ్పీ వైస్ చైర్ పర్సన్ గడ్డం సుమన రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ రెండు స్థాయీ సంఘాల సమావేశాలకు జడ్పీ చైర్మన్‌తో పాటు జడ్పీ సీఈఓ రాజారాం, జిల్లా పంచాయతీ అధికారి సురేశ్‌బాబులతో పాటు ఆ కమిటీ సభ్యులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొంటారు. సభ్యులందరూ శాఖల్లో ఉన్న లొసుగులు, సమస్యలు, అభివృద్ధి పనుల విషయాలను చైర్మన్ దృష్టికి తీసుకెళ్లి చర్చిస్తారు. అందరూ కలిసి వాటికి తీర్మానం చేయగా, త్వరలో జరిగే జడ్పీ సర్వసభ్య సమావేశంలో స్థాయి సంఘాలు చేసిన తీర్మానాలను జడ్పీటీసీ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆమోదం తెలుపాల్సి ఉంటుంది. ప్రతి కమిటీలో 8 నుంచి 9మంది సభ్యులున్న తరుణంలో సుదీర్ఘ చర్చలు జరిగే ఈ స్థాయీ సంఘాల సమావేశాలకు సంబంధిత సభ్యులందరూ తప్పనిసరిగా హాజరుకావాలని జిల్లా పరిషత్ అధికారులు సమాచారం అందించారు. 8వ తేదీన ఉదయం 11గంటలకు విద్యా,వైద్య శాఖలపై సంఘ సమావేశం జరుగుతుంది. మధ్యాహ్నం రెండు గంటలకు మహిళా,శిశు సంక్షేమ శాఖలపై సమావేశం జరుగుతుంది. విద్యా,వైద్య స్థాయీ సంఘానికి చైర్మన్‌గా జడ్పీ చైర్మన్ వ్యవహరిస్తారు. ఇటు మహిళా,శిశు సంక్షేమ సంఘానికి అధ్యక్షులుగా మోర్తాడ్ జడ్పీటీసీ ఎనుగందుల అనిత వ్యవహరిస్తారు. 9వ తేదీన ఉదయం 11గంటలకు సాంఘిక సంక్షేమ శాఖపై, మధ్యాహ్నం రెండు గంటలకు ఆర్థిక, ప్రణాళిక శాఖపై సమావేశాలు జరుగుతాయి. సాంఘిక సంక్షేమం స్థాయీ సంఘానికి మాక్లూర్ జడ్పీటీసీ సభ్యురాలు కున్యోత్ లత అధ్యక్షులుగా వ్యవహరిస్తారు. ఇటు ఆర్థిక, ప్రణాళిక సంఘానికి జడ్పీ చైర్మన్ దఫేదారు రాజు అధ్యక్షులుగా వ్యవహరిస్తారు. -
నిధులు మంజూరైనా స్థలం కరువు
ఇందూరు : జిల్లాకు మంజూరైన నిర్భయ కేంద్రం (వన్ స్టెప్ క్రైసిస్ సెం టర్) భవన నిర్మాణానికి స్థలం కరువైంది. రెన్నెళ్లుగా స్థలం చూపకుండా రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో జిల్లాకు వచ్చిన నిర్భయ కేంద్రం ఇప్పట్లో ప్రారంభమయ్యే సూచనలు కనిపించడం లేదు. ఇటు ఈ కేంద్రాన్ని డిసెంబర్‌కల్లా పూర్తిచేసి ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం నుంచి ఐసీడీఎస్ అధికారులకు ఆదేశాలు అందాయి. దీంతో నిర్భయ కేం ద్రాన్ని ఎలా? ఎక్కడ? ప్రారంభించాలోనని సమాలోచనలు చేస్తున్నారు. ప్రస్తుతానికి అద్దె భవనంలో ప్రారంభించాలని యోచిస్తూ భవనం కోసం వెతుకుతున్నారు. మహిళలపై వేధింపులు, అత్యాచారాలు, దాడులు జరిగిన వెంటనే తక్షణ సహాయం, వైద్యం అందజేయడానికి దేశవ్యాప్తంగా 660 నిర్భయ కేంద్రాలను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. మన జిల్లాకు కూడా నిర్భయ కేంద్రాన్ని మంజురు చేస్తూ ఆగస్టు 13న ఐసీడీఎస్ కార్యాలయానికి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేంద్రాన్ని జిల్లా కేంద్రంలో రెండు కిలోమీటర్ల పరిధిలో లేదా, ప్రభుత్వ ఆస్పత్రికి దగ్గర 300 చదరపు మీటర్ల స్థలంలో నిర్మించాలని ఆదేశిస్తూ రూ. 36 లక్షలను కేటాయించింది. ఇందుకు ఐసీడీఎస్ అధికారులు నిర్భయ కేంద్ర నిర్మాణం కోసం జిల్లాకేంద్రంలో ప్రభుత్వ స్థలం చూపించాలని నిజామాబాద్ ఆర్డీఓ యాదిరెడ్డికి ఫైలు పెట్టారు. ఆయన నిజామాబాద్ తహశీల్దార్‌కు సిఫార్సు చేశారు. వెంటనే తహశీల్దార్ జిల్లాకేంద్రంలో జాయింట్ విజిట్ చేసి పలు స్థలాలను గుర్తిం చారు. అయితే అవి కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయి. జిల్లా కేంద్రానికి రెండు కిటోమీటర్ల పరిధిలో కాకుండా ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న నాగారాం, సారంగపూర్ ప్రాంతాల్లో స్థలాలను చూపించారు. అంత దూరంలో కేంద్రాన్ని ఏర్పాటు చేయడం కుదరదని, మహిళలకు తక్షణ సహాయం, వైద్యం అందించడానికి వీలుపడదని ఐసీడీఎస్ అధికారులు స్పష్టం చేశారు. అంత దూరంలో నిర్మిస్తే ప్రయోజనం ఉండదని, చూపిన పై రెండు స్థలాలను తిరస్కరించారు. దీంతో నిర్భయ కేంద్రం నిర్మాణానికి బ్రేక్ పడింది. ఎంతో ఉపయోగకరమైన నిర్భయ కేంద్రం అధికారుల నిర్లక్ష్యం కారణంగా నిర్మాణానికి నోచుకోవడం లేదు. ఇందులో మరో విషయమేమంటే స్థలం చూపిన వెంటనే జిల్లాకు మంజూ రు చేసిన నిధులును ఖాతాలో వేస్తామని కేంద్రం స్పష్టం చేసింది. మహిళల రక్షణ కోసం జిల్లాకు మంజురైన ఈ కేంద్రాన్ని త్వరగా నిర్మించి అందుబాటులోకి తేలవాలని పలు మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. కలెక్టర్ చొరవ తీసుకుంటే.. నిర్భయ కేంద్రం నిర్మాణం కోసం జిల్లా కేంద్రంలో లేదా రెండు కిలోమీటర్ల పరిధిలో నిర్మించాలన్న ప్రభుత్వ నిబంధనల ప్రకారం జిల్లా కేంద్రంలో అనువైన స్థలాలు లేవని రెవెన్యూ అధికారులు అంటున్నారు. కాగా కేవలం 300 చదరపు మీటర్ల ప్రభుత్వ స్థలం లేదంటే ఆశ్చర్యకరంగా ఉందని మహిళా సంఘాలు పేర్కొంటున్నాయి. రైల్వే స్టేషన్ సమీపంలో పాత జిల్లా పంచాయతీ కార్యాలయం ఆవరణ, ఇటు నాల్గవ పోలీసు స్టేషన్ వద్ద, సుభాష్‌నగర్‌లోని ఎస్ఎఫ్ఎస్ పాఠశాల వద్ద అర్టికల్చర్ కార్యాలయం పక్కన, ఆర్మూర్ రోడ్డులో లక్ష్మి కళ్యాణ మండపం పక్కన డి-54 కెనాల్ ప్రాంతం, ఆర్మూర్ బైపాస్ రోడ్డు ప్రాంతం, ఇంకా నగరంలో అక్కడక్కడా ప్రభుత్వ స్థలాలున్నాయి. ఈ విషయంలో నిర్భయ కమిటీ చైర్మన్‌గా ఉన్న జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోస్ ప్రత్యేక చొరవ తీసుకుంటే తప్ప సమస్యకు పరిష్కార మార్గం కనిపించడం కష్టమని పలువురు అంటున్నారు. లేదంటే భవన నిర్మాణం కోసం కేటాయించిన నిధులు తిరిగి వెనక్కి వెళ్లే ప్రమాదం ఉంది. రెండు కిలోమీటర్ల పరిధిలో స్థలం చూపాలని కోరాం -రాములు, ఐసీడీఎస్ జిల్లాకు మంజూరైన నిర్భయ కేంద్రాన్ని వీలైనంత తొందరగా పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. అయితే స్థలం చూపాలని ఆర్డీఓ, ఎమ్మార్వోలను కోరాము. వారు జాయింట్ సర్వే జరిపి నాగారాం, సారంగపూర్ ప్రాంతాల్లో స్థలాలను చూపుతున్నారు. అవి నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయి. రెండు కిలో మీటర్ల పరిధిలో చూపాలని కోరాం. -
ఘనంగా గాంధీ జయంతి
ఇందూరు: ప్రభుత్వ కార్యాలయాలలో గురువారం గాంధీ జయంతిని ఘనంగా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ, ప్రధాని మోడీ ఆదేశాల మేరకు ‘స్వచ్ఛ భారత్’ ప్రతిజ్ఞ చేశారు. అనంతరం గాంధీజీ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. జిల్లా పరిషత్‌లో జడ్పీ సమావేశ మందిరంలో, జిల్లా పంచాయ తీ కార్యాలయంలో డీపీఓ సురేశ్‌బాబు గాంధీజీ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అ ర్పించారు. ఉద్యోగులందరిచే స్వచ్ఛ భారత్ ప్ర తిజ్ఞ చేయించి, గాంధీ జీవిత చరిత్రను వివరిం చారు. అనంతరం ఉద్యోగులు కార్యాలయ పరి సర ప్రాంతాలలో ఉన్న చెత్తను, పిచ్చి మొక్కల ను, గడ్డిని శుభ్రం చేశారు. ఇందులో జడ్పీ ఉ ద్యోగులు సాయన్న, సాయిలు, డీపీఓ ఏఓ రా జేంద్రప్రసాద్, లక్ష్మారెడ్డి, ప్రభాకర్, సిద్ధిరాము లు, అరుణ్‌కుమార్, కృష్ణ, మంజుల తదితరులు పాల్గొన్నారు. ఆర్డబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో గ్రామీణ నీటి సరఫరా శాఖ కార్యాలయంలో ఎస్ఈ శ్రీనివాస్‌రెడ్డి గాంధీ చిత్ర పటానికి పూ ల మాలలు వేసి నివాళులు అర్పించారు. స్వచ్ఛ భారత్ నిర్మాణానికి కృషి చేస్తామని ఉద్యోగుల చే ప్రతిజ్ఞ చేయించారు. వ్యక్తిగత మరుగుదొడ్లు, పాఠశాలలలో, అంగన్వాడీ కేంద్రాలలో మరుగుదొడ్ల నిర్మాణం, మురుగు కాలువలు, చెత్త ని ర్వహణ, పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అ వగాహన కలిగించాలని ఉద్యోగులకు సూచిం చారు. 2019 నాటికి స్వచ్ఛ తెలంగాణ, స్వచ్ఛ భారత్‌గా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. కా ర్యాలయ ఆవరణలో పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించారు. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో గాంధీ జయంతిని ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ఘ నంగా నిర్వహించారు. ఐసీడీఎస్ ఆవిర్భావ ది నోత్సవాన్ని కూడా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఐసీడీఎస్ పీడీ రాములు గాంధీ చిత్ర ప టానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించా రు. స్వచ్ఛ భారత్ ప్రతిజ్ఞ చేశారు. ఉద్యోగులు కార్యాలయం పరిసరాలను శుభ్రం చేశారు. టీడీపీ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో గాంధీచౌక్‌లో గాంధీ విగ్రహానికి ఎమ్మెల్సీ అరికె ల నర్సారెడ్డి పూలమాలలు వేసి నివాళులు అ ర్పించారు. టీడీపీ నగర అధ్యక్షుడు రత్నాకర్, రాజమల్లు, తదితరులు పాల్గొన్నారు. -
ఆడపిల్లకు అండగా ఉందాం
ఇందూరు : ఆడపిల్లలపై చిన్న చూపు వద్దని, వారికి అండగా ఉందామని ఇన్చార్జి కలెక్టర్, జడ్పీ సీఈవో రాజారాం, నగర మేయర్ ఆకుల సుజాత పిలుపునిచ్చారు. శనివా రం జిల్లా పరిషత్ కార్యాలయం వద్ద జిల్లా బాలల సంరక్షణ విభాగం (ఐసీపీఎస్) ఆధ్వర్యంలో బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమానికి సంబంధించిన లోగోను ఆవిష్కరించారు. అనంతరం నగరంలో ర్యాలీ నిర్వహిం చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆడపిల్లల పై ఇప్పటికీ వివక్ష కొనసాగుతోందన్నారు. పుట్టబోయేది ఆడపిల్ల అని తెలిస్తే చాలు కడుపులోనే చంపేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆడపిల్లంటే భారంగా భావిం చడం మానవత్వం అనిపించుకోదన్నారు. లింగనిర్ధారణ పరీక్షలు చేయించుకోవడం, చేయ డం నేరమన్నారు. లింగ నిర్ధారణకు ముందుకు వచ్చిన, ప్రోత్సహించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పిల్లల్లో ఆడ, మగ తేడాను చూపవద్దని తల్లిదండ్రులకు సూచించారు. సృష్టిలో ఇద్దరూ సమానమేనని భావించాలన్నారు. పెంపకంలో తేడా చూపవద్దని కోరా రు. ఆడపిల్లలకు రక్షణ కల్పించి, చదివించాల్సిన బాధ్య త తల్లిదండ్రులపై ఉందన్నారు. పిల్లలను అక్రమంగా రవాణా చేయడం, చట్ట విరుద్ధంగా దత్తతనివ్వడం, అమ్మడం, కొనడం నేరమన్నా రు. వీటిని నిరోధించడానికి ఐసీపీఎస్ సిబ్బంది కృషి చేయాలని సూచించారు. ఆడపిల్లలపై వివక్షను రూపుమాపేందుకోసం జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమాను అంగన్వాడీ సిబ్బంది, విద్య, వైద్య, పోలీసు శాఖల సిబ్బంది విజయవంతం చేయాలని కోరారు. జడ్పీ కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ రైల్వేకమాన్, ఎన్టీఆర్ చౌరస్తా మీదుగా కలెక్టరేట్ వరకు సాగింది. ర్యాలీలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్లకార్డులు చేతబడ్డి నినాదాలు చేశారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడీ రాములు, హాకీ క్రీడాకారిణి యెండల సౌందర్య, ఐసీపీఎస్ సిబ్బంది చైతన్య, ముఖీం తదితరులు పాల్గొన్నారు. -
ముదిరిన సీడీపీఓ వ్యవహారం..!
ఇందూరు : బిల్లులు చేయకుండా నిర్లక్ష్యం చేయడంతో పా టు అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొం టున్న బోధన్ సీడీపీఓ వెంకటరమణ వ్యవహారం ము దిరింది. బోధన్ ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీలు ఆమెపై తిరుగుబాటు బావుట ఎగురువేసి ఆందోళనకు దిగారు. జిల్లా కేంద్రంలోని సుభాష్‌నగర్‌లో ఉన్న ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయాన్ని బుధవారం ముట్టడించారు. ఉదయం 10 గంటలకే కార్యాలయం వద్ద బైఠాయించి ఉద్యోగులు లోనికి వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో ఐసీడీఎస్ పీడీ రాములుతో సహా ఉద్యోగులు కార్యాలయానికి వెళ్లకుండా బయటే ఉండిపోయారు. పోలీసులు సముదాయించినా ఆందోళనను విరమించలేదు. తొమ్మిది నెలల వేతనాలు, టీఏ, డీఏలు, భవనాల అద్దెలు, ఇతర బిల్లులు మంజూరు చేయించాలని, సీడీపీఓను వెంటనే తొలగించాలని నినదించారు. దీంతో పీడీ రాములు అంగన్వాడీలతో మాట్లాడారు. సీడీపీఓ అక్రమాలకు పాల్పడినట్లుగా రాతపూర్వకంగా ఫిర్యాదు ఇవ్వాలని సూచించారు. ఆమెపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే బకాయిలకు సంబంధించి సీడీఎస్ డెరైక్టర్ కార్యాలయానికి లేఖ రాశామని, రాగానే చెల్లిస్తామని చెప్పారు. దీంతో కార్యకర్తలు కొద్దిసేపు ఆందోళన విరమించారు. కొద్దిసేపటి తర్వాత పీడీ కార్యాలయం నుంచి కారులో బయటకు వెళ్తుండడంతో ఆయనను అడ్డుకున్నారు. సీడీపీఓను బదిలీ చేస్తామని చెప్పే వరకు కదలబోమని అక్కడే బైఠాయించారు. దీంతో విసుగు చెందిన పీడీ తన వాహనం నుంచి దిగి కోపంతో జడ్పీ కార్యాలయం వైపు నడుచుకుంటూ వెళ్లారు. ఆయన వెంట అంగన్వాడీలు కూడా పరుగెత్తారు. పోలీసులు అక్కడకు చేరుకుని కార్యకర్తలను, సీఐటీయూ నాయకులను అక్కడి నుంచి పంపించి వేశారు. డెరైక్టర్‌కు సీడీపీఓ వైఖరిపై నివేదిక.. కొన్ని రోజులుగా బోధన్ సీడీపీఓ వ్యవహారం జిల్లా వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. అంగన్వాడీ కార్యకర్తలకు సంబంధించిన బిల్లులను చేయకుండా నిర్లక్ష్యం చేయడంతో పాటు ప్రతి పనికి, బిల్లుకు డ బ్బులు అడుగుతున్నారనే ఆరోపణలు వచ్చాయి. చీరలు, బంగారం కొనిస్తేనే పనులు చేస్తున్నారని పేరుంది. కా వాలనే తొమ్మిది నెలలకు సంంధించిన బకాయి బిల్లులను చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారనే అభియోగం ఉంది. ఈ క్రమంలో సీడీపీఓ సెలవులో వెళ్లా రు. అయితే ఈ విషయమై ఐసీడీఎస్ అధికారుల కు, బోధన్ ఎమ్మెల్యేకు వినతిపత్రాలు సమర్పించిన ప్ర యోజనం లేకపోయింది. దీంతో ఆగ్రహించిన అం గన్వాడీలు బుధవారం ఐసీడీఎస్ జిల్లా కార్యాలయాన్ని ముట్టడించారు. అయితే బోధన్ సీడీపీఓ వైఖరిపై ఐసీడీఎస్ అధికారులు డెరైక్టర్‌కు నివేదికను పంపారు. బోధన్ సీడీపీఓగా అనురాధ బోధన్ సీడీపీఓ లాంగ్‌లీవ్‌లో వెళ్లడంతో బాన్సువాడ సీడీపీఓ అనురాధకు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించా రు. ఐసీడీఎస్ డెరైక్టరేట్ నుంచి ఆదేశాలు వచ్చినట్లు ఐసీడీఎస్ పీడీ రాములు తెలిపారు. -
ఆడబిడ్డకు అండగా
ఇందూరు: ఆడపిల్లలపై వివక్షను రూపుమాపేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ‘బేటీ బచావో...బేటీ పఢావో’ నినాదంతో ప్రజలలో అవగాహన క ల్పించాలని నిర్ణయించింది. ఈ మేరకు అన్ని జిల్లాల అధికారులకు ఆదేశాలు పంపింది. మన జిల్లాలో ఐసీడీఎస్ అధికారులు ‘బాలల సంరక్షణ విభాగం’ ఆధ్వర్యంలో నెల రోజులపాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సమాయత్తమవుతున్నారు. తేదీలవారీగా షెడ్యూల్‌ను రూపొందించారు. మండలాలవారీగా శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. గ్రామస్థాయిలో ప్రజలకు పూర్తి అవగాహన కల్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. పోలీసు శాఖ, వైద్య ఆరోగ్య, ఐసీడీఎస్ శాఖల సమన్వయం తో ఈనెల 15 లేదా 16న ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. నిర్వహించే కార్యక్రమాలివే {భూణ హత్యలు, గర్భధారణ సమయంలోనే వైద్యులచే లింగ నిర్ధారణ చేయించడం, చేయిస్తే ఎదురయ్యే ఇబ్బందుల గురించి కుటుంబ సభ్యులకు, వైద్యులకు పడే శిక్షలపై అవగాహన తరగతులు. అమ్మాయి, అబ్బాయి అనే వ్యత్యాసాన్ని, వివక్షను రూపుమాపేందుకు అందుకు అనుగుణమైన అంశాలతో కూడిన వర్క్‌షాప్‌ల నిర్వహణ. ఆడపిల్లల సంరక్షణ కోసం ప్రభుత్వాలు చేపడుతున్న పథకాలు, చట్టాల గురించి ,విద్య అవసరాలు ఇతర వాటిపై అవగాహన కలిగించడం. బాల్య వివాహాలను నిర్మూలించేందుకు గ్రామీణ ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించడం. బాల్య వివాహాలతో ఎలాంటి అనర్థాలు తలెత్తుతాయో క్లుప్తంగా వివరించడం. దాడులు, అత్యాచారాలను ఎదుర్కొనేందుకు బాలికలకు ప్రత్యేక శిక్షణ తరగతులు. హెల్ప్‌లైన్‌కు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు తెలపడం. {పతీ పాఠశాలలో పై అంశాలన్నింటిపై ప్రత్యేక తరగతులు నిర్వహించడం. విద్యార్థులచే గ్రామాలు, మండలాలలో విస్తృతంగా ర్యాలీలు, శిక్షణ తరగతులు నిర్వహించి ప్రచారం చేపట్టడం. జిల్లాస్థాయిలో పెద్ద కార్యక్రమం నిర్వహించడం. నిధుల లేమి.. ప్రభుత్వం వివిధ కార్యక్రమాలు పెట్టి ఐసీడీఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తుంది. కానీ, వీటిని విజయవంతగా నిర్వహించేందుకు కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు నిధులను కే టాయించడం లేదు. ప్రస్తుతం ‘బేటీ బచావో...బేటీ పఢావో’ కార్యక్రమం నెల రోజుల పాటు నిర్వహించాలి. ఇందుకు చాలా ఖర్చు అవుతుంది. ఒక్క పైసా కూడా కేంద్రం కేటాయించలేదు. మొన్న జరిగిన బాల్య వివాహాలపై సదస్సులు, ర్యాలీలు, పౌష్టికాహార వారోత్సవాలు, తదితర కార్యక్రమాలకు కూడా ప్రభుత్వాలు నిధులు కే టాయించలేదు. దీంతో వాటిని అంతంతమాత్రంగానే నిర్వహించాల్సి వచ్చింది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఈ పెద్ద బాధ్యతలు అప్పగించడం, ఎలా నిర్వహించాలో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. తప్పనిసరి పరిస్థితులలో, ఉన్న కొద్దిపాటి నిధులతో సర్దుకోవాల్సి వస్తుందని అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
ఫాస్ట్.. పాట్లు
ఇందూరు: ఫాస్ట్ (ఫైనాన్సియల్ అసిస్టెన్స్ టు స్టూడెంట్స్ ఆఫ్ తెలంగాణ).. పేరుకే పరిమి తమైంది. ఈ పథకం సక్రమంగా వేగవంతంగా అమలుకు నోచుకోవడం లేదు. కొత్త ప్రభుత్వం కొలువు దీరి దాదాపు మూడు నెలలు పూర్తయినప్పటికీ తెలంగాణ విద్యార్థులకు ఆర్థిక సహాయానికి సంబంధించిన ఎలాంటి స్పష్టమైన ఆదేశాలు గానీ, మార్గదర్శకాలు గా నీ రాలేదు. ఫీజు రీయింబర్స్‌మెంటు చెల్లిం పులో తెలంగాణ విద్యార్థులకు స్థానిక తను 1956 సంవత్సరంగా ప్రభుత్వం తేల్చినా 2013-14 విద్యా సంవత్సరానికి సంబంధిం చిన బీసీ, ఈబీసీ విద్యార్థులకు నేటి వరకు ఒక్క పైసాను కూడా విడుదల చేయలేదు. ఫీ జులు రాకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇ బ్బందులు పడుతున్నారు. ఫీజులు చెల్లించాల ని మరోవైపు కళాశాల యాజమాన్యాలు వి ద్యార్థులను తీవ్ర ఒత్తిడికి గురి చేయిస్తున్నాయి. కోర్సు పూర్తై విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడానికి నిరాకరిస్తున్నాయి. ‘ప్రభుత్వం నుంచి ఫీజులు వచ్చే వరకు అగండి, లేదా మీ జేబుల్లోంచి ఫీజులు కట్టి సర్టిఫికెట్లు తీసుకెళ్లండి’ అని కళాశాల యాజమాన్యాలు విద్యార్థులకు ఖరాఖండిగా చెప్పేస్తున్నాయి. దీంతో కోర్సు పూర్తి చేసిన విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కోర్సు పూర్తి చేసిన సర్టిఫికెట్తో పాటు, టీసీ, ఇతర సర్టిఫికెట్లు క ళాశాల యాజమాన్యాలు ఇవ్వకపోవడంతో వారు తదనంతర చదువుకు దూరమవుతున్నారు. దీంతో తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నారు. రూ. కోట్ల బకాయిలు 2013-14 విద్యా సంవత్సరానికి గాను జిల్లాలో ఇంటర్ నుంచి పీజీ వరకు చదువుతున్న బీసీ విద్యార్థులు 51154 మంది, ఈబీసీ విద్యార్థులు 3555 మంది ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్‌షిప్‌ల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. అయితే స్కాలర్షిప్ నిధులను ప్రభుత్వం విడతల వారీగా మంజురు చేసింది. ఇంకా దాదాపు రూ. 6 కోట్లు జిల్లాకు మంజురు కావాల్సి ఉంది. ఫీజు రీయింబర్స్ మెంట్ నిధులను కూడా కొద్ది మందికే అందించి, మిగతా నిధులను విడుదల చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతో ఏడాది కాలంగా వాటికోసం విద్యార్థులు, కళాశాల యాజమాన్యాలు నిరీక్షిస్తున్నాయి. 32, 216 మంది బీసీ విద్యార్థులకు సంబంధించిన రూ. 20 కోట్లు జిల్లాకు రావాల్సి ఉంది. ఈ నిధులను వెంటనే విడుదల చేయాలని విద్యార్థులు, విద్యార్థి సంఘాలు రోడ్డెక్కి ఆందోళనలు, ధర్నాలు, రాస్తారోకోలు చేశాయి. ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడించి విద్యార్థులు లాఠీ దెబ్బలూ తిన్నారు. చివరికి అరెస్టు కూడా అయ్యారు. శాంతియుతంగా పోస్టు కార్డుల ఉద్యమం, అధికారులకు వినతులు సమర్పించినా, రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకుండా నిమ్మకు నీరెతినట్లుగా వ్యవహరిస్తుండటం విద్యార్థులకు అవేశాన్ని, ఆగ్రహం, అసహనాన్ని కలిగిస్తున్నాయి. రీయింబర్స్మెంట్ నిధులు ఎప్పుడు వస్తాయి...? అసలు వస్తాయా...?రావా..? అని అధికారులను అడిగి తెలుసుకునేందుకు బీసీ విద్యార్థులు కలెక్టర్ కార్యాలయంలోని బీసీ సంక్షేమ శాఖ కార్యాలయం చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. యూసీలివ్వని కాలేజీలు.. 2007-08 విద్యా సంవత్సరం నుంచి ఈ ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలవుతోంది. ముఖ్యంగా ఈ పథకాన్ని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టారు. ఈ పథకాన్ని భేదాలు లేకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ విద్యార్థులకు సక్రమంగా అమలు చేసి జిల్లాలోని ఎందరో మంది విద్యార్థులకు బంగారు భవిష్యత్తునిచ్చారు. కాని మారుతున్న ప్రభుత్వాలు పథకం రూపు రేఖలను, నిబంధనలను మార్చడంతో విద్యార్థులకు ఉపకారం అందని ద్రాక్షలాగా మారుతోంది. అయితే నాటి నుంచి నేటి వరకు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ నిధులను జిల్లాకు కోట్లాది రూపాయల్లో మంజురు చేశారు. కానీ విద్యార్థుల వివరాలు పొందుపరిచిన యుటిలైజేషన్ సర్టిఫికెట్లు(యూసీ) పూర్తి స్థాయిలో ఇవ్వలేదని తెలుస్తోంది. ఆన్లైన్ ద్వారా వివరాలు పంపే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించినా యూసీలు ఇచ్చేందుకు కళాశాల యాజమాన్యాలు నిరాకరిస్తున్నాయి. ఇలా యూసీలు ఇవ్వకపోతే ఫీజు బకాయిలు చెల్లించేందుకు ఇబ్బందులు ఎదురవుతాయి. ప్రారంభం కాని కొత్త దరఖాస్తులు గత సంవత్సరానికి చెందిన బీసీ విద్యార్థుల పరిస్థితి ఇలా ఉంటే ఇక నాలుగు నెలల క్రితం కొత్తగా ప్రవేశాలు పొందిన విద్యార్థుల పరిస్థితి కూడా అయోమయంగా మారింది. ఈ ఏడాదికి సంబంధించి ఫీజులు, స్కాలర్ షిప్‌ల కోసం దరఖాస్తులు చేసుకునేందుకు ఇంకా ఆన్లైన్ ప్రక్రియ పూర్తి కాలేదు. ఫాస్ట్ మార్గదర్శకాలు ఖరారు అయితే తప్పా ఆన్లైన్ నమోదు కుదరదని అధికారులు చెబుతున్నారు. -
డీఎస్సీ నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలి
ఇందూరు: తెలంగాణ రాష్ర్టం ఏర్పడగానే తెలంగాణలోని ప్రతి నిరుద్యోగికి ఉద్యో గం వస్తుందని, లక్షాలాది ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన సీఎం కేసీఆర్ అధికారంలోకి రాగానే మాటను నిలబెట్టుకోకుండా నిరుద్యోగులతో ఆటలాడుతున్నారని తెలు గు యువత జిల్లా అధ్యక్షుడు వేణుగోపాల్ యాదవ్ ఆరోపించారు. వెంటనే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బుధవారం టీడీపీ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కొత్త ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలవుతున్నా ఇంత వర కు ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఎలాంటి నోటిఫికేషన్లు జారీ చేయలేదన్నారు. ఉపాధి లేక పైచదువులు చదివిన నిరుద్యో గ యువత ఉపాధిహామీ పనులకు వెళుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధ్యా య కొలువుల కోసం శిక్షణ పూర్తి చేసుకు న్న వారు ప్రస్తుతం డీఎస్సీ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నారన్నారు. బీసీ విద్యార్థులకు 2013-14 సంవత్సరానికి సంబంధించిన ఫీజు రీయింబర్స్ మెంట్ నిధులను విడుదల చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. దీంతో వారు చదువులకు దూరమవుతున్నారని అన్నారు. రాష్ట్రంలో దాదాపు రూ.1,250 కోట్లు ఫీజు బకాయిలున్నాయన్నారు. ఫీజులు చెల్లిస్తే కాని విద్యార్థులకు చదువు చెప్పలేమని, టీసీలు ఇవ్వలేమని ప్రైవేట్ కళాశాలు స్పష్టం చేయడంతో విద్యార్థుల పరిస్థితి దిక్కుతోచని విధంగా తయారైందన్నారు. నిరుద్యోగ సమస్య పరిష్కారానికి వెంటనే డీఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని కోరారు. -
ముగిసిన జడ్పీ స్థాయీ సంఘాల ఎన్నికలు
ఇందూరు: జిల్లా పరిషత్ స్థాయీ సంఘాల ఎన్నికలు బుధవారం ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం పది నిముషాలలోనే ఏడు కమిటీల ఎన్నికలు ఏకగ్రీవంగా చకచకా జరిగిపోయాయి. జడ్పీ చైర్మన్ అధ్యక్షతన మధ్యాహ్నం 12గంటలకు ప్రారంభమైన ఎన్నికల ప్రక్రియ 12:10నిముషాలకు ముగిసింది. ముందే నిర్ణయించుకున్న కమిటీల అధ్యక్షులు, సభ్యుల పేర్లను జడ్పీ సీఈఓ రాజారాం చదివిన వెం టనే జడ్పీటీసీ సభ్యులు, ఎమ్మెల్యేలు చప్పట్లు కొట్టి ఆమోదించారు. 24 మంది సభ్యులున్న టీఆర్ఎస్కే ఆయా కమిటీలకు నేతృత్వం వ హించే అవకాశం దక్కిం ది. కాంగ్రెస్ పార్టీకి 12 మంది జడ్పీటీసీలు ఉన్నప్పటికీ ఏ ఒక్క కమి టీ అధ్యక్ష పదవి లభించలేదు. జడ్పీలో మొ త్తం ఏడు కమిటీలు ఉండగా జడ్పీ చైర్మన్ దఫేదార్ రాజు నాలుగు కమిటీలకు అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. ఆర్థిక-ప్రణాళిక, గ్రామీణాభి వృద్ధి, విద్య-వైద్యం, పనులు-నిర్మాణాల కమిటీలకు ఆయన అధ్యక్షత వహిస్తారు. జడ్పీ వైస్ చైర్మన్ గడ్డం సుమనారెడ్డి వ్యవసాయ కమిటీకి చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. మహిళా సంక్షేమ కమిటీ అధ్యక్షురాలిగామోర్తాడ్ జడ్పీటీసీ ఎనుగందుల అమిత, సాంఘిక సంక్షేమ కమిటీ అ ధ్యక్షురాలిగా మాక్లూర్ జడ్పీటీసీ కున్యోత్ లత ఎన్నికయ్యారు. ఈ మూడు కమిటీలకు జడ్పీ చైర్మన్ ఎక్స్ అఫీషియో సభ్యులుగా వ్యవహరి స్తారు. ఒక్కో కమిటీలో ఎనిమిది మందిని స భ్యులుగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా జడ్ పీ చైర్మన్ మాట్లాడుతూ కమిటీల అద్యక్షులు, సభ్యులు శాఖల అభ్యున్నతికి, ప్రజల చెంతకు పథకాలు, ఫలాలు చేరవేసేందుకు కృషి చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు హ న్మంత్ సింధే, గంప గోవర్ధన్, ఏనుగు రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు. పలువురు గైర్హాజరు జడ్పీ స్థాయీ సంఘాల ఎన్నికల కోసం ఎంపీలు, ఎ మ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జడ్పీటీసీలకు రెండు రోజు ల ముందుగానే అధికారులు సమాచారం చేరవేశారు. అయితే కొందరు జడ్పీటీసీలు హాజరు కాలేదు. ఎమ్మెల్సీలు వీజీ గౌడ్, స్వామిగౌడ్, డి. శ్రీనివాస్, అరికెల నర్సారెడ్డి, ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, ప్రశాంత్‌రెడ్డి, షకీల్, జీవన్‌రెడ్డి, బిగాల గణేష్ గుప్తా, హాజరు కాలేదు. ఎంపీ కవిత, మంత్రి పోచాం శ్రీని వాస్‌రెడ్డి, కలెక్టర్ రోనాల్డ్ రోస్ కూడా హాజరు కాలేదు. -
నేడు జడ్పీ స్థాయీ సంఘాల ఎన్నికలు
ఇందూరు: జిల్లా పరిషత్ మరోసారి వేడెక్కనుంది. జడ్పీ సమావేశ మందిరంలో బుధవారం స్థాయీ సంఘాల ఎన్నికలు జరగనున్నాయి. పాలకవర్గం కొలుదీరిన 60 రోజుల లో ఈ ఎన్నికలు జరగాల్సి ఉండగా ఆలస్యం జరిగింది. పదవులను ఆశిస్తున్న జడ్పీటీసీలు మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలను ఇప్పటికే కలిసినట్లు తెలి సింది. 36 జడ్పీటీసీలకు గాను 24 స్థానాలను సాధించిన టీఆర్ఎస్ జడ్పీ పీఠాన్ని కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. స్థాయీ సం ఘాల ఎన్నికలలోనూ ఆ పార్టీ దూసుకుపోనుం ది. మొత్తం ఏడు కమిటీలలో ఎవరెవరు ఉండాలనే విషయంలో మంత్రి పోచారం, ఎంపీ కవిత ఒక అంచనాకు వచ్చినట్లు సమాచారం. ఉదయం 11గంటలకు ఎన్నికలు ప్రారంభం కాగానే, ముందుగా అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. పోటీ లేకపోతే ఏకగ్రీవంగా అభ్యర్థులను ఎన్నుకున్నట్లు ప్రకటించే అవకాశం ఉంది. ఈ ఎన్నికలకు మంత్రి పో చారం శ్రీనివాస్‌రెడ్డి, జడ్పీ చైర్మన్ దఫేదార్ రాజు, నిజామాబాద్ ఎంపీ కవిత, జడ్పీ వైస్ చైర్ పర్సన్ గడ్డం సుమనారెడ్డి, కలెక్టర్ రోనాల్డ్ రోస్‌తోపాటు జిల్లాలోని ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జడ్పీటీసీ సభ్యులు హాజరుకానున్నారు. 36 మంది జడ్పీటీసీలలో కనీసం సగం మంది సభ్యులు కచ్ఛితంగా హాజరైతేనే ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికల నిర్వహణకు జడ్పీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. సభ్యులు సకాలంలో సమావేశానికి హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు. -
ఐసీడీఎస్‌లో కొలువులు
ఇందూరు: ఐసీడీఎస్‌లో ఉద్యోగాల జాతర జరగనుంది. జిల్లాలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ కార్యకర్తల పోస్టులు భర్తీకి నోచుకోనున్నాయి. ఇప్పటికే ఐసీడీఎస్ అధికారులు ఖాళీల సంఖ్యను గుర్తించారు. నిబంధనల ప్రకారం నోటిఫికేషన్ విడుదల చేసి దరఖాస్తులను ఆహ్వానించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఖాళీలతో ఇక్కట్లు జిల్లాలో 27 మినీ, 42 మెయిన్, మొత్తం 69 అంగన్వాడీ కేంద్రాలలకు కార్యకర్తలు లేక ఇన్చార్జిలతో నెట్టుకొస్తున్నారు. కొద్ది నెలల క్రితం 22 మంది సీనియర్ అంగన్ వాడీ కార్యకర్తలు గ్రేడ్-2 సూపర్వైజర్ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. దీంతో ఖాళీల సంఖ్య పెరిగింది. అంగన్వాడీ కేంద్రాలను నడిపించడం సాధ్యం కావడం లేదు. ఐ సీడీఎస్ పీడీ రాములు జిల్లాలోని ఖాళీలను భర్తీ చేయడానికి ఫైలు సిద్ధం చేశారు. కలెక్టర్ నుంచి అనుమతి రాగానే నోటిఫికేషన్ జారీచేసి దరఖాస్తులను ఆహ్వానించను న్నారు. గతంలో ఈ పోస్టులకు భారీగా దరఖాస్తులు వచ్చాయి. పారదర్శంగా పోస్టులను భర్తీ చేయడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అర్హత పదవ తరగతి అంగన్వాడీ కేంద్రానికి ముఖ్య నిర్వాహకురాలిగా పనిచేసే కార్యకర్త పోస్టులకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు పదవ తరగతి ప్రధాన అర్హతగా నిర్ణయించారు. 21- 30 ఏళ్లలోపువారు మాత్రమే అర్హులు. స్థానికులై ఉండాలి. దరఖాస్తుల అనంతరం సంబంధిత నియోజకవర్గ ఎమ్మెల్యే,ఆర్డీఓ, ఐసీడీఎస్ పీడీ, వైద్యాధికారి నలుగురు కలిసి మెరిట్ మార్కులతో పాటు అభ్యర్థులకు ముఖ పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తారు. అభ్యర్థులు దరఖాస్తులను సంబంధిత సీడీపీఓ కార్యాలయంలో చేసుకోవాల్సి ఉంటుంది. సూపర్వైజర్ పోస్టుల సంగతేందీ అంగన్వాడీ కార్యకర్తల పోస్టులను భర్తీచేస్తున్న అధికారులు, సూపర్వైజర్ పోస్టుల భర్తీ విషయాన్ని తెరపైకి తేవడంలేదు. గతంలో నాలుగు జిల్లాలకు కలిపి సూప ర్వైజర్ పోస్టులను భర్తీచేశారు. కాగా కొన్ని మిగిలిపోయాయి. ప్రస్తుతం జిల్లాలో 20 సూపర్వైజర్ పోస్టుల వరకు ఖాళీలు ఉన్నాయి. ఇవి భర్తీకి నోచుకోవడం లేదు. క్షేత్రస్థాయిలో అంగన్వాడీలను పర్యవేక్షించడం వీరి విధి. అంగన్వాడీ పోస్టులతో పాటు సూపర్వైజర్ పోస్టులను నింపితే ఐసీడీఎస్‌కు సిబ్బంది కొరత కొంత వరకు తీరుతుంది. కార్యకర్తల పోస్టుల భర్తీ అధికారం జిల్లా అధికారులకే ఉంటుంది. సూపర్వైజర్ పోస్టుల భర్తీ ఐసీడీఎస్ కమిషనర్‌కు మాత్రమే ఉంటుంది. అందుకే ఈ పోస్టు లు భర్తీకి నోచుకోవడంలేదు. -
ఆంధ్రకు రాస్.. మనకు ఎవరో బాస్
ఇందూరుకు కొత్త కలెక్టర్ ఎవరనేది మళ్లీ చర్చనీయాంశంగా మారింది. పీఎస్ ప్రద్యుమ్న బదిలీ జరిగిన 43 రోజులకు జూలై 30న యువ ఐఏ ఎస్ అధికారి రొనాల్డ్ రాస్‌ను ప్రభుత్వం నియమించింది. జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్‌గా మంచి పేరు సంపాదించిన ఆయనను జిల్లా కలెక్టర్‌గా నియమించడంపై ప్రజలు, ప్రజాప్రతినిధుల నుంచి హర్షం వ్యక్తమైంది. నెల కూడా తిరగక ముందే, ఆయన బదిలీ అనివార్యం కావడంతో కథ మొదటికి వచ్చింది. సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: రొనాల్డ్ రాస్ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించి న మరుసటి రోజే హైదరాబాద్‌లో సీఎం కేసీఆర్ నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలో పాల్గొన్నారు. ‘మన ఊరు-మన ప్రణాళిక’ మొదలు సీఎం పర్యటన, సమగ్ర కుటుంబ సర్వే వరకు చురుగ్గా పాల్గొని సీఎం ప్రశంసలు అందుకున్నారు. పాల నపై పట్టు సాధిస్తున్న క్రమంలోనే, ఐఏఎస్ అధికారుల విభజనలో ఆయనను ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించారు. సెప్టెం బర్ ఒకటి లోగా రొనాల్డ్‌రాస్ ఆ రాష్ట్రం లో బాధ్యతలు చేపట్టాల్సి ఉంది. ప్రజాప్రతినిధులు, అధికారులను కలుపుకుని అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలే ల క్ష్యంగా పని చేస్తూ, కొద్ది రోజులలోనే డై నమిక్ కలెక్టర్‌గా పేరు తెచ్చుకున్న ఆ యన పాలన జిల్లా ప్రజలకు మూణ్ణాళ్ల ముచ్చటగానే మారనుంది. రొనాల్డ్‌రాస్ బదిలీ అనివార్యంగా మారడంతో కొత్త కలెక్టర్‌గా ఎవరు రాబోతున్నారనే చర్చ మొదలైంది. తెరపైకి మళ్లీ రఘునందన్ పేరు జూన్ 17న పీఎస్ ప్రద్యుమ్నను బదిలీ చేసిన ప్రభుత్వం 43 రోజుల తరువాత జిల్లాకు కొత్త కలెక్టర్‌గా రొనాల్డ్‌రాస్‌ను నియమించింది. అప్పటివరకు జేసీగా ఉన్న డి.వెంకటేశ్వర్రావు ఇన్చార్జి కలెక్టర్‌గా వ్యవహరించారు. రొనాల్డ్‌రాస్ నియామకం తరువాత, జేసీ వెంకటేశ్వర్రావు కూడా బదిలీ అయ్యారు. ఆయన కు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకపోగా, ఆయ న స్థానంలో కూడా ఎవరినీ నియమిం చలేదు. అయితే, శుక్రవారం జరిగిన అ నూహ్య పరిణామాల నేపథ్యంలో రోనాల్డ్ బదిలీ అనివార్యం కావడంతో ఆయన స్థానంలో కృష్ణా జిల్లా కలెక్టర్‌గా ఉన్న రఘునందన్ రావు పేరు తాజాగా ప్ర ముఖంగా వినిపిస్తోంది. మహబూబ్‌నగర్ కలెక్టర్‌గా పనిచేసిన గిరిజా శంకర్, మరో ఐఏఎస్ అధికారి విజయ్‌కుమార్ పేర్లు తెరపైకి వచ్చాయి. ఐఏఎస్‌ల కే టాయింపుతో ప్రచారంలోకి వచ్చిన ఈ ముగ్గురిలో ఒకరినీ నియమిస్తారా? లేక కొత్త పేర్లు తెరపైకి వస్తాయా? కలెక్టర్ నియామకం ఎప్పు డు జరుగుతుంది? అన్న చర్చ సర్వత్రా వినిపిస్తుంది. కాగా, జేసీగా పనిచేస్తూ జులై 30న బదిలీ అయిన డి.వెంకటేశ్వర్రావును మళ్లీ జేసీగా నియమించే అవకాశం ఉందన్న ప్రచారం కూడ జరుగుతోంది. రాస్ కోరుకుంటే ఒకవేళ రొనాల్డ్‌రాస్ ఇక్కడే కొనసాగ డానికి సుముఖంగా ఉంటే, ఆయనను తమకు కేటాయించాలని తెలంగాణ ప్ర భుత్వం ఆంధ్ర సర్కారును కోరే అవకా శం ఉంది.అప్పుడు రాస్ ఇక్కడే కలెక్టర్ గా కొనసాగుతారని భావించవచ్చు. -
మీరెక్కడ సారూ!
ఇందూరు : గ్రామాల పరిపాలనను శాసించే జిల్లా పంచాయతీ కార్యాలయానికి రెండుమూడు నెలలుగా గ్రహణం పట్టుకుంది. ఉద్యోగుల కొరతకు తోడు జిల్లా పంచాయతీ అధికారి సురేశ్‌బాబు కార్యాలయం వైపు కన్నెత్తి చూడకపోవడంతో ఫైళ్లతో సహా, ఇతర పనులన్నీ పెండింగ్ పడిపోయాయి. మరో పక్క ప్రజలు గ్రామాల నుంచి వచ్చి డీపీఓకు సమర్పించిన ఫిర్యాదులు పరిష్కారం లభించడం లేదు. సమాచార హక్కు చట్టం కింద వచ్చిన దరఖాస్తులకు సైతం మోక్షం లభించడంలేదు. మార్చిలో పంచాయతీ కార్యదర్శి పోస్టుల ఫలితాల అనంతరం మెరిట్ మార్కులు, రోస్టర్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేసి భర్తీ చేయాల్సిన పోస్టులు నేటి వరకు అలాగే ఉన్నాయి. తప్పులను సరిదిద్దుతున్నామనే సాకును చెప్పి ప్రస్తుతం ఆ ఫైలు సంగతే మరిచిపోయారు. నత్త నడక కన్నా నెమ్మదిగా డీపీఓ పాలన సాగుతుందని విమర్శలు వస్తున్నాయి. అత్యవసర ఫైళ్లకు తప్పా ఇతర ఫైళ్లపై డీపీఓ సంతకాలు పెట్టడం లేదని తెలుస్తోంది. అదేవిధంగా ఉద్యోగుల కొరత ప్రస్తుతం పని చేస్తున్న నలుగురైదుగురు ఉద్యోగులపైనే పడుతోంది. ఇదిలా ఉండగా డీపీఓ వైఖరిపై పంచాయతీ కార్యదర్శులతో పాటు కార్యాలయ ఉద్యోగులు కూడా అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. పనితనమే కారణం... ప్రతీది భూతద్దంలో పెట్టి చూడటం డీపీఓకు బలమూ,బలహీనతగా మారుతోందని అంటున్నారు. డీపీఓ కాస్త భిన్నంగా పనిచేస్తారని పేరుంది. సురేశ్ బాబు జిల్లాకు వచ్చి దాదాపు ఐదు సంవత్సరాలు అవుతోంది. విధుల్లోనే కాకుండా పనిని పూర్తి చేయడంలో ఒకటికి రెండు సార్లు పరిశీలించి, తప్పులను సవరించే మనస్తత్వం ఆయనది. సెక్షన్ ఉద్యోగి ఏదైనా ఫైలు తీసుకుని ఆయన వద్దకు వెళ్తే క్షుణ్ణంగా పరిశీలించి మళ్లీ మళ్లీ తెప్పించుకుంటారని సిబ్బంది అంటుంటారు. ఇలాంటి వైఖరి కలిగిన సురేశ్‌బాబు గత సంవత్సరం జరిగిన ఎన్నికల్లో చాల నిష్పక్షపాతంగా వ్యవహరించారు. తరువాత అసెంబ్లీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో డీపీఓకు పెద్ద బాధ్యతలు అప్పగించారు. రిటర్నింగు అధికారిగా పని చేశారు. ఎన్నికలు పూర్తయ్యాయో లేదో మన ఊరు-మన ప్రణాళిక కార్యక్రమం, ఆ తరువాత మొన్నటి వరకు సమగ్ర కుటుంబ సర్వే కార్యక్రమం రావడంతో మరింత బిజీ అయ్యారు. ఇలా రెండు మూడు నెలలుగా తన సొంత కార్యాలయ పనులను, ఫైళ్లను వదులుకుని ప్రభుత్వ కార్యక్రమాలు, ఎన్నికల్లో పూర్తిగా లీనమయ్యారు. దీంతో ఆ ప్రభావం కాస్త కార్యాలయంపై బాగానే పడింది. అత్యవసర ఫైళ్లను డీపీఓ ఎక్కడుంటే అక్కడికి తీసుకెళ్లి సంతకాలు పెట్టిస్తున్నారు. రిటైర్డు కార్యదర్శుల పెన్షన్, మెడికల్ బిల్లులు, కోర్టు సంబంధిత పేషీలు, పేబిల్స్, జీపీ సంబంధిత, బి2,బి1,బి5,బి6 సెక్షన్లతో పాటు మిగతా ఫైళ్లు కార్యాలయంలోని డీపీఓ చాంబర్లో కుప్పలుగా పేరుకుపోయి దర్శనమిస్తున్నాయి. అలాగే జిల్లా వ్యాప్తంగా 718 గ్రామ పంచాయతీల్లో నిర్వహించాల్సిన గ్రామ సభలు, పారిశుధ్య వారోత్సవాలు క్షేత్ర స్థాయిలో తూతూ మంత్రంగా జరిగాయి. పారిశుధ్య సమస్యతో గ్రామాలు, తండాలు కొట్టుమిట్టాడుతున్నా డీపీఓ అక్కడికి వెళ్లి పర్యటించిన దాఖలాలు లేవు. దర్శనమివ్వండి ‘బాబూ’ పనుల్లో బిజీగా ఉన్నా డీపీఓ సురేశ్‌బాబు తన కార్యాలయానికి ఎప్పుడు వస్తున్నారో.. ఎప్పుడు వెలుతున్నారో తెలియడం లేదని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. గత పక్షం రోజులుగా డీపీఓ కార్యాలయానికి రాలేదని చెబుతున్నారు. సమస్యల పరిష్కారం కోసం గ్రామాల నుంచి వస్తున్న వారు డీపీఓ కోసం నిరీక్షించి ఆయన రాకపోవడంతో నిరాశతో తిరిగి వెళ్లిపోతున్నారు. సర్పంచుల పరిస్థితి కూడా అంతే ఉంది. డీపీఓ దర్శన భాగ్యం దొరక్కపోవడంతో రెండవ శ్రేణి అధికారులకు సమస్యలను విన్నవించి వెళుతున్నారు. భర్తీ కావాల్సిన 66 పంచాయతీ కార్యదర్శుల పోస్టులకు చెందిన అభ్యర్థులు కూడా డీపీఓ కార్యాలయం చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. -
అన్యాయాలను సహించం
ఇందూరు :అగ్రవర్ణాలు వివక్షతో దళితులపై దాడులు చేస్తే, హింసలకు గురిచేస్తే తాము చూస్తూ ఊరుకోబోమని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యురాలు పీఎం కమలమ్మ స్పష్టం చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బాధితులకు ప్రభుత్వం తరపున ఆర్థిక సహాయం అందిం చి వారికి మరోధైర్యాన్ని ఇస్తామన్నారు. గురువారం జిల్లాలో పర్యటించిన ఆమె ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు, ఎస్సీ సబ్‌ప్లాన్, దళితులకు ఇచ్చిన అసైన్డ్ భూముల ఆక్రమణ, ఇతర అంశాలపై జిల్లా అధికారులు, దళిత, గిరిజన సంఘాల నాయకులతో జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సమీక్ష జరిపారు. తొలి సమావేశం ఇక్కడే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత తొలిసారిగా ఇక్కడే సమావేశం నిర్వహిస్తున్నామని కమలమ్మ తెలి పారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 68 ఏళ్లు గడుస్తు న్నా దళితులు ఇంకా అన్యాయానికి గురవుతూనే ఉ న్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వివక్షను చూపినవారిని శిక్షించి, బాధితులకు న్యాయం చేయడానికి ఏర్పడిన జాతీయ ఎస్సీ కమిషన్ మరింత చురుకుగా పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా పోలీ స్, రెవెన్యూ శాఖల నుంచి దళితులు ఎక్కువగా సమస్యలను ఎదుర్కొంటున్నారన్నారు. దళితుల కోసం యూపీఏ ప్రభుత్వం ఆర్డినెన్స్‌ను జారీ చేసిందని, చ ట్టం చేసినప్పటికీ దానిని అమలు చేయడంలో లోపాలున్నాయన్నారు. వాటిని సవరించుకోవాలని అధికారులకు సూచించారు. అధికారులు నిజాయితీగా పని చేస్తే ఫలితం ఉంటుందన్నారు. దళితులకు ప్రభుత్వం ఇచ్చిన భూములు. సొంత భూములు అన్యాక్రాంతం కాకుండా చర్యలు చేపట్టాలన్నారు. ప్రస్తుతం దళితుల వివరాలను తనకు అందజేయాలని కలెక్టర్‌ను ఆదేశిం చారు. దళితులపై గ్రామాభివృద్ధి కమిటీ ఆగడాలను అరికట్టే అధికారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లేదన్నారు. పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించాలి దళితులకు అన్యాయం జరిగిందని ఫిర్యాదు అందిన వెంటనే నిందితులను అరెస్టు చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పోలీసు అధికారులను కమలమ్మ ఆదేశిం చారు. జిల్లాలో 94 అట్రాసిటీ కేసులు నమోదు కాగా, నిజామాబాద్ డివిజన్లో 11, ఆర్మూర్‌లో 9, బోధన్ 6, కామారెడ్డిలో 7, మొత్తం 33 కేసులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. వీటిని త్వరగా పరిష్కరించాలని అ ధికారులను ఆదేశించారు. డీఎఫ్ఓ గంగయ్య హత్య కే సులో ప్రభుత్వం నుంచి రావాల్సిన ఫలాలను వారి కుటుంబ సభ్యులకు అంద జేయాలని సూచించారు. వేల్పూర్ మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన గంగామణి అనే మహిళ సమావేశంలో కంట తడిపెట్టింది. తన వ్యవసాయ భూమిలోంచి అక్రమంగా దా రి నిర్మించిన వ్యక్తిని ఎదురించినందుకు తనను దూ షించి అసభ్యకరంగా వ్యవహరించినా తనకు న్యా యం జరగలేదని వాపోయింది. ఇందుకు స్పందించి న కమిషన్ సభ్యురాలు సదరు వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు. 14 రో జులలో దీనిపై పూర్తి నివేదికను అందించాలన్నారు. సెప్టెంబర్ రెండున హియరింగ్ నిర్వహిస్తామన్నారు. దళిత సంఘాల నాయకులు ఇచ్చిన పలు ఫిర్యాదు లు, వినతులు స్వీకరించిన ఆమె వాటిని పరిష్కరిస్తామని హామినిచ్చారు. సమావేశంలో కలెక్టర్ రొనాల్డ్ రాస్, అదనపు ఎస్పీ పాండునాయక్, రాష్ట్ర స్థాయి అ ధికారులు హన్మంత్‌రావు, అజయ్‌కుమార్, అధికారు లు, దళిత, గిరిజన సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
ఉద్యోగం ఒక చోట.. నివాసం మరో చోట
ఇందూరు: అంగన్వాడీ కార్యకర్తలను ఉద్యోగంలో చేర్చుకు నే సమయంలోనే వారు స్థానికంగా నివాసముంటున్నా రా లేదా అని పరిశీలిస్తారు. స్థానికంగా ఉంటేనే ఉద్యోగంలో చేర్చుకుంటారు. కానీ, జిల్లాలో కొంత మంది కార్యకర్తలు నిబంధనలకు విరుద్ధంగా నడుచుకుంటూ విధులను విస్మరిస్తున్నారు. సొంతూళ్లలోనే ఉంటూ, దూర ప్రాంతాల లో అంగన్వాడీ కేంద్రాలను నిర్వహిస్తున్నారు. దీంతో వారు సక్రమంగా విధులకు హాజరు కాలేకపోతున్నారు. అంగన్వాడీలు సక్రమంగా నడవకపోవడం, అయాలతో కేంద్రాలను నడిపించడం, ఫలితంగా గర్భిణులు, బాలింతలు, పిల్లలకు పౌష్టికాహారం అందటం లేదనే విషయం ఐసీడీఎస్ అధికారుల వరకు వచ్చింది. స్పందించిన ఐ సీడీఎస్ పీడీ రాములు స్థానికంగా ఉండని అంగన్వాడీ కార్యకర్తల వివరాలను ప్రాజెక్టు కార్యాలయాల నుంచి తెప్పించుకున్నారు. జిల్లాలో మొత్తం మినీ, మెయిన్ కలిపి 2,700 అంగన్వాడీ కేంద్రాలుండగా, దాదాపు 400కు పైగా కార్యకర్తలు ఇతర ప్రాంతాలలో ఉంటున్నారని తేలింది. నెల రోజులలో అంగన్వాడీ కేంద్రం ఉన్న ఊరిలో, పట్టణంలో కచ్చితంగా నివాసం ఉండాలని, లేదా చర్యలు తీసుకుంటామని వారందరికీ హెచ్చరిక జారీ చేశారు. కానీ ఈ హెచ్చరికలను ఎవరూ లెక్కచేయలేదు. గతంలో కలెక్టర్‌గా ఉన్న ప్రద్యుమ్న కూడా స్థానికేతర అంగన్వాడీ కార్యకర్తల వివరాలు తనకు అందజేయాలని ఐసీడీఎస్ పీడీ రాములును ఆదేశించారు. కానీ, క్షేత్ర స్థాయిలో ఉండే సీడీపీఓలు, సూపర్వైజర్లు సమాచారం అందించడంలో తీవ్ర నిర్ల క్ష్యం చేశారు. ఎంత మంది స్థానికంగా ఉండటంలేదన్న వివరాలను పక్కాగా రాబట్టలేకపోయారు. గతంలో సేకరించిన వివరాల ప్రకారం దాదాపు 400 మంది కార్యక్తలున్నట్లు అధికారులు చెబుతున్నారు. చర్యలు తీసుకుని ఉంటే హెచ్చరికలు చేసినప్పటికీ నివాసం మార్చుకోనివారిపై గట్టి చర్యలు తీసుకుంటే పరిస్థితి వేరేలా ఉండేది. కానీ అధికారులు ఈ విషయంపై అంతగా దృష్టిపెట్టకపోవడ ంతోనే కార్యకర్తలు జంకడంలేదన్న విమర్శలు ఉన్నాయి. ఇటీవల జిల్లాకు వచ్చిన ఐసీడీఎస్ ఆర్జేడీ రాజ్యలక్ష్మి కూడా ఈ విషయంపై సీరియస్‌గా ఉన్నా, జిల్లా అధికారులు మాత్రం అలసత్వం వహిస్తున్నారు. -
జిల్లాకు ‘నిర్భయ’ సెంటర్ మంజూరు
ఇందూరు : దేశంలో రోజురోజుకు మహిళలపై దాడులు పెరిగిపోతున్నాయి. ఎక్కడో ఒక చోట అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఎన్ని చట్టాలు ఉన్నా.. మరెందరికో శిక్షలు పడుతున్నా పరిస్థితిలో మార్పు రావడం లేదు. అత్తారింట్లో, పని చేసే స్థలాల్లో మానసికంగా, శారీరకంగా హింసకు గురవుతూనే ఉన్నారు. బాధిత మహిళలకు తక్షణ వైద్య సహాయం, కౌన్సెలింగ్ అందడం లేదు. నిందితులకు శిక్షా పడడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం కొత్త ఆలోచన చేసింది. మహిళల రక్షణ కోసం, తక్షణ సాయం, న్యాయం అందించడం కోసం వన్ స్టాప్ క్రైసిస్ సెంటర్(నిర్భయ సెంటర్) ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. దేశంలో 660 ప్రాంతాల్లో ఇలాంటి కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా జిల్లాకు కూడా ‘నిర్భయ సెంటర్’ను మంజూరు చేసింది. దీనికి సంబంధించి లెటర్ నం: 1037 ద్వారా ఉత్తర్వులను కేంద్ర ప్రభుత్వం జిల్లా ఐసీడీఎస్ కార్యాలయానికి ఈ నెల 13న పంపించింది. భవన నిర్మాణానికి రూ. 36 లక్షలను కేటాయించింది. ఈ కేంద్రం ఎందుకంటే.. సెంటర్లో డాక్టర్, నర్సు, లీగల్ కౌన్సెలర్, పోలీసు, న్యాయవాది, హెల్పర్ ఉంటారు. వేధింపులు, అత్యాచారానికి గురైన వెంటనే సమాచారం అందించేందుకు సెంటర్లో ప్రత్యేకంగా ఒక టోల్ ఫ్రీ నంబర్‌ను త్వరలోనే ఏర్పాటు చేయనున్నారు. సంఘటన లేదా వేధింపులకు గురైనవారు ఆ నెంబర్‌కు ఫోన్ చేస్తే.. సంఘటనను బట్టి సంబంధిత ఉద్యోగులు ప్రత్యేక వాహనం ద్వారా లేదా అంబులెన్స్‌లో ఘటనా స్థలానికి చేరుకుంటారు. కుటుంబ సభ్యుల వేధింపుల కేసైతే ఇరువురికీ కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. కుటుంబ సభ్యుల పై, లేదా భర్త, అత్త, మామలపై చర్యలు తప్పవన్న పరిస్థితుల్లో వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో పని చేస్తున్న మహిళలు శారీరక, మానసిక వేధింపులకు గురైతే కూడా పై పద్ధతిన చర్యలు తీసుకుంటారు. అత్యాచారానికి గురైన వారికి తక్షణ వైద్య సహాయం అందిస్తారు. కేసులను ఉచితంగానే కోర్టులో వాదిస్తారు. పోలీసు స్టేషన్‌కు, కోర్టుకు బాధితురాలి వాంగ్మూలం వినేందుకు వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యాన్ని కల్పించనున్నారు. ఇటు బాధిత మహిళలకు తాత్కాలిక వసతిని కల్పిస్తారు. ఐదుగురు అధికారుల కమిటీకి కలెక్టర్ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. మొత్తం మీద బాధిత మహిళలకు తక్షణ సాయం, న్యాయం జరిగేలా ఈ ‘నిర్భయ సెంటర్’ పని చేస్తుంది. సెంటర్ ఏర్పాటుకు సన్నాహాలు జిల్లాకు నిర్భయ సెంటర్‌ను మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వం భవన నిర్మాణానికి రూ. 36 లక్ష లను కేటాయించింది. వీలైనంత త్వరగా భవనా న్ని నిర్మించి అందులో బాధిత మహిళలకు అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా తయారు చేయాలని ఐసీడీఎస్ అధికారులను కేంద్రం ఆదేశించింది. భవనం నిర్మించే వరకు తాత్కాలికంగా వేరే భవనాన్ని చూసుకోవాలని సూచించింది. ఈ నిర్భయ సెంటర్‌ను 300 చదరపు మీటర్లు గల స్థలంలో నిర్మించాలని, అది కూడా జిల్లా కేంద్రంలోనే ఉండాలని ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల్లో ఉంది. అయితే జిల్లా ఆస్పత్రి ఆవరణలో లేదా రెండు కిలోమీటర్ల సమీపంలో భవనాన్ని నిర్మించాలని అధికారులను ఆదేశించింది. జిల్లా కేంద్రంలో స్థలం వెతకడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. -
పౌష్టికాహారం కష్టమే!
ఇందూరు: వసతి గృహాల విద్యార్థులకు ఇది చేదు వార్తే. సంక్షేమాధికారుల విన్నపాన్ని ఇన్చార్జి కలెక్టర్ మన్నిస్తే, మార్పు చేసిన మెనూ వెంటనే అమలులోకి వస్తుంది. విద్యార్థులకు అరకొరగానే పౌష్టికాహారం అందుతుంది. జిల్లాలో ఎస్సీ 67, ఎస్టీ 13, బీసీ 42, మొత్తం 122 ప్రభుత్వ సంక్షేమ వసతిగృహలున్నాయి. ఒక్కో వసతి గృహంలో 50 నుంచి 80 మంది విద్యార్థులు వసతి పొందుతున్నారు. పెరుగుతున్న నిత్యావసరాల ధరలు వార్డెన్లకు ఇబ్బందిగా మారాయి. గుడ్లు, అరటి పండ్ల సరఫరాకు ఏజేన్సీలు లేకపోవడంతో వార్డెన్లే తమ జేబుల్లోంచి డబ్బులు వెచ్చించి కొనుగోలు చేయాలని ప్రభుత్వం గతంలో సూచించింది. నెల నెలా బిల్లులు సమర్పిస్తే నిధులు మంజురు చేస్తామని చెప్పడంతో జిల్లాలోని అందరు వార్డెన్లు తమ జేబుల్లోంచి ఖర్చు పెట్టి గుడ్లు, అరటి పండ్లు కొంటున్నారు. ధరలు పెరిగినప్పటికీ ప్రభుత్వం ఇచ్చే నిధులు మాత్రం పెరగడంలేదు. ప్రస్తుతం ఒక గుడ్డు చిల్లర ధర రూ.4.50 నుంచి రూ.5 వరకు పలుకుతోంది. ఇటు అరటి పండ్లు డజనుకు రూ.45 నుంచి 50 వరకు ఉంది. ప్రభుత్వం మాత్రం పాత ధరలకు తగ్గట్టుగానే నిధులును మంజురు చేస్తోంది. గుడ్డుకు రూ.3.75 పైసలు, అర టి పండుకు రూ. 3.50 పైసలు మాత్రమే అందిస్తోంది. ఫలితంగా తాము నష్టపోతున్నామని వార్డెన్లు పేర్కొంటున్నారు. ఈపాటికే వార్డెన్లు పాత మెనూలోనే అనాధి కారికంగా కోతలు విధించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆరు నుంచి ఐదు రోజులకు గతంలో వారానికి ఆరు రోజులు విద్యార్థులకు గుడ్లు, అరటిపండ్లు పెట్టేవారు. ఇపుడు ఐదు రోజులే అందించనున్నారు. ఈ లెక్కన చూస్తే నెలకు నాలుగు, ఏడాదికి 48 గుడ్లు, అరటిపండ్లు విద్యార్థులకు దూరం అవుతున్నాయి. వీటిని ఇవ్వనిరోజు స్నాక్స్, బఠానీలు, అల్పాహారం పెడుతామని సంక్షేమాధికారులు చెబుతున్నారు. కూరగాయల భోజనం దూరం వారంలో ఒక రోజు పౌష్టికాహారం గుడ్డు, అరటి పండు విద్యార్థులకు దూరమౌతుంటే, ఇటు రుచికరమైన భోజనమూ అందటంలేదు. టమాట ధర కిలో రూ.80లకు చేరగా పచ్చి మిర్చి కిలో రూ.60కి చేరింది. ఉల్లి, బెండకాయ ధరలు కూడా ఆకాశాన్నంటాయి. పప్పులు, నూనెల ధరలు కూడా అదే దారిలో ఉన్నాయి. పప్పు, కూరగాయల భోజనం తప్పనిసరికావడంతో తక్కువ నాణ్యతతో కూడిన భోజనం వండి విద్యార్థులకు పెడుతున్నారు. నీళ్ల పప్పు అన్నంతోనే సరిపెడుతున్నారు. కూరగాయల స్థానంలో దోస, సోరకాయ, వంకాయ వండుతున్నారు. అసలైన కూరగాయల భోజనం చేయక చాలరోజులవుతోందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
‘లోపం’ ఎక్కడ?
ఇందూరు: చిన్న పిల్లల మరణాలను తగ్గించడంలో భాగంగా, తక్కువ, అతి తక్కువ బరువుతో పుట్టిన పిల్లల బరువును పెంచ డానికి కేంద్ర ప్రభుత్వం జూన్ 15 నుంచి ఐసీడీఎస్ ద్వారా అమలు చేస్తున్న ‘మినీ మెనూ’ (పౌష్టికాహార పథకం) ప్రారంభంలోనే బాలరిష్టాలను ఎదుర్కొంటోం ది. పథకం మొదలై నెల రోజులు గడుస్తు న్నా పూర్తి స్థాయిలో అమలుకు నోచుకోవడంలేదు. లోప పోషణకు గురైన పిల్లల కు అందించే పౌష్టికాహారం పాలు, గుడ్లు అంగన్వాడీ కేంద్రాలకు 15 రోజులుగా సరఫరా కావడం లేదు. కొన్ని కేంద్రాలకు సరఫరా అయినప్పటికీ, పాత మెనూ ప్రకారమే అందిస్తున్నారు. మరి కొన్ని కేంద్రాల నిర్వాహకులు డెయిరీ నుంచి పాలు కొనుగోలు చేసి అం దిస్తున్నారు. దీంతో లోప పోషణకు గురైన పిల్లలకు పూర్తి స్థాయిలో అదనపు పౌష్టికాహారం అందడంలేదు. ఇదీ పరిస్థితి జిల్లాలో మొత్తం 10 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరి ధిలో 2,410 మెయిన్, 298 మినీ మొత్తం కలిపి 2,708 అంగన్వాడీ కేంద్రాలు కొనసాగుతున్నాయి. జిల్లాలో తక్కువ, అతి తక్కువ బరువుతో పుట్టిన పిల్లలు, పోషణలోపానికి గురైన ప్లిలలు ఎంత మంది ఉన్నారో గుర్తించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండు నెలల క్రితం ఐసీడీఎస్ అధికారులకు ఆదేశాలిచ్చింది. ఈ మేర కు ఐసీడీఎస్ పీడీ రాములు పిల్లల వివరాలు సేకరించాలని, అంగన్వాడీ కేంద్రాలకు వస్తున్న అందరు పిల్లల బరువు తీయాలని సీడీ పీఓలు, సూపర్వైజర్లను ఆదేశించారు. ఇలా గుర్తించిన పిల్లలకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మినీ మెనూ పథకం ద్వారా ప్రత్యేక అదనపు పౌష్టికాహారం అందజే యాల్సి ఉంటుంద ని వివరించారు. అందుకోసం వారికి ప్రత్యేక శిక్షణను కూడా ఇచ్చారు. మరేం జరుగుతోంది! ఈ పథకం అమలుకు సరిపడా ప్రత్యేక పౌష్టికాహారం అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా కావ డం లేదు. సరఫరా అయిన కేంద్రాలలో అమలుకు నోచుకోవడం లేదు. సిబ్బంది, అధికారు ల నిర్లక్ష్యమే ఇందుకు కారణం. గతంలో పాల ను ఏజేన్సీల ద్వారా అంగన్వాడీలకు సరఫరా చేసేవారు. ప్రస్తుతం అది నిలిచిపోయింది. అం గన్వాడీ కార్యకర్తలే నేరుగా పాలు కొనుగోలు చేసి పిల్లలకు అందజేయాలని, బిల్లులు సమర్పిస్తే డబ్బులు చెల్లిస్తామని పీడీ రాములు సూ చించారు. గ్రామీణ ప్రాంతాలలో పాల ధర లీటరుకు రూ.40 ఉండగా, పట్టణ ప్రాంతాలలో రూ. 50 ఉంది. దీంతో కార్యకర్తలు రోజూ డబ్బులు వెచ్చించి పాలు కొనుగోలు చేయలేకపోతున్నారు. కొన్ని ప్రాంతాలలో డెయిరీలు లేకపోవడంతో పాలు లేకుండానే పథకాన్ని అ మలు చేస్తున్నారు. ఇటు గుడ్ల ధర నాలుగైదు రూపాయల వరకు పెరగడంతో, తాము సరఫరా చేయలేమని ఏజేన్సీలు చేతులెత్తేశాయి. దీంతో పిల్లలకు రోజూ అందించాల్సిన గుడ్డును రెండు, మూడు రోజులకు ఒకసారి అందిస్తున్నట్లు తెలిసింది. పిల్లలు ఎంత మందో లెక్క లేదు గతంలో జిల్లాలో లోప పోషణకు గురైన పిల్లల ను గుర్తించారు. మినీ మెనూ పథకం అమలు జరుగుతుండడంతో మరోసారి క్షేత్ర స్థాయిలో సర్వే నిర్వహించారు. దాదాపు నాలుగు వేల నుంచి ఐదు వేల మంది పిల్లలు లోప పోషణకు గురయ్యారని గుర్తించినట్లు సమాచారం. ఎందరు పిల్లలున్నారు? పౌష్టికాహారం ఎందరికి అందుతోంది. ఎంత పౌష్టికాహారం వినియోగిస్తున్నారు.? అనే వివరాలను మాత్రం ఐసీడీఎస్ అధికారులు అధికారికంగా రాబట్టలేకపోతున్నారు. సీడీపీఓలను ప్రతి రోజూ అడుగుతు న్నా, వారు అధికారులు మాటలను లెక్కచేయ డం లేదు. -
‘గిరిజన సంక్షేమాని’కి బదిలీ గండం!
ఇందూరు : జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఇన్చార్జ్ అధికారిగా ఇతర జిల్లా అధికారులు ఎవరు వచ్చినా వారం రోజులు తిరగకముందే బదిలీపై వెళ్లిపోతున్నారు. దీంతో డీటీడబ్ల్యూ పోస్టులో రెండు రోజులకు ఒక అధికారి ఇన్చార్జిగా ఉంటున్నారు. రెండు నెలల క్రితం గిరిజన సంక్షేమ శాఖ రెగ్యులర్ అధికారిగా రాములు కొనసాగారు. ఆయన పదవీ విరమణచేయగానే అసిస్టెంట్ సాంఘిక సంక్షేమ శాఖ నిజామాబాద్ అధికారి(ఏఎస్‌డబ్ల్యూ) జగదీశ్వర్‌రెడ్డికి ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. వారం రోజులకే ఆయనను బాధ్యతల నుంచి తప్పించారు. వెంటనే జిల్లా యువజన సంక్షేమ శాఖ సీఈఓ మాధవరావుకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆయన వారం రోజుల పాటు పని చేశారో లేదో ఇతర జిల్లాకు బదిలీపై వెళ్లారు. మళ్లీ స్థానం ఖాళీ కావడంతో రాజీవ్ విద్యా మిషన్(ఆర్వీఎం) పీఓ కిషన్‌రావుకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈయన కూడా నాలుగు రోజుల పాటు పని చేశారో లేదో వేరే జిల్లాకు బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ప్రస్తుతం జిల్లా బీసీ సంక్షేమ శాఖకు ఇన్చార్జ్ అధికారిగా పని చేస్తున్న విమలాదేవికి గిరిజన సంక్షేమ శాఖకు ఇన్చార్జ్ అధికారిగా బాధ్యతలు అప్పగించారు. సిబ్బంది ఇష్టారాజ్యం ఇలా నెల 15 రోజుల్లోనే జిల్లా గిరిజన సంక్షేమ శాఖకు నలుగురు అధికారులు ఇన్‌చార్జ్‌లుగా పనిచేసి బదిలీ లేదా బాధ్యతల నుంచి తప్పుకుంటున్నారు. శాఖకు రెగ్యులర్ అధికారి లేకపోవడంతో శాఖ పరిస్థితి దయనీయంగా మారింది. సిబ్బంది కూడా క్రమ శిక్షణ తప్పి ఇష్టారాజ్యంగా విధులు నిర్వర్తిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బాధ్యతలు స్వీకరించిన విమలాదేవి జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఇన్చార్జ్ అధికారిగా సీహెచ్. విమలా దేవి నియామకమయ్యారు. ఈ మేరకు జిల్లా ఇన్చార్జి కలెక్టర్ వెంకటేశ్వర్రావు వఆమెకు బాధ్యతలు అప్పగిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఈమె జిల్లా బీసీ సంక్షేమ శాఖకు ఇన్చార్జ్ అధికారిగా కొనసాగుతున్నారు. దీంతో సొంత ఉద్యోగమైన బోధన్ ఏబీసీడబ్ల్యూఓ స్థానంలో పని చేస్తూ ప్రస్తుతం బీసీ స్టడీ సర్కిల్ డెరైక్టర్‌గా, బీసీ సంక్షేమ శాఖ అధికారిగా, గిరిజన సంక్షేమ శాఖ అధికారిగా మూడు శాఖలకు ఇన్చార్జ్ అధికారిగా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. -
‘గౌరవం’ ఏదీ
ఇందూరు: గ్రామ ప్రథమ పౌరుడిగా గుర్తింపు లభించిన సర్పంచుకు గౌరవ వేతనం ఇవ్వడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. సర్పంచులుగా ఎన్నికై ఏడాది గడుస్తున్నా ప్రభుత్వం ఇంతవరకు ఒక్క రూపాయి కూడా వేతనం అందించలేదు. దీంతో వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో మొత్తం 718 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇందులో 74 మేజర్, 644 మైనర్ పంచాయతీలు. వీటికి 2013 జూన్ నెలాఖరులో ఎన్నికలు జరిగాయి. అప్పటినుంచి గౌరవ వేతనాలకు సంబంధించిన నిధులను ప్రభు త్వం విడుదల చేయలేదు. 2006 నుంచి మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచులకు రూ.500, మైనర్ గ్రామ పంచాయతీ సర్పంచులకు రూ.700 వేతనం ఇచ్చేవారు. గత ఏడాది కొత్త పాలకవర్గాలు కొలువుదీరిన నేపథ్యంలో మేజర్ గ్రామ పంచాయతీలకు రూ.1500, మైనర్ గ్రామ పంచాయతీలకు రూ.1000 వేతనాలు ఇవ్వనున్నట్లు అ ప్పటి ప్రభుత్వం ఒక జీఓ విడుదల చేసింది. గౌరవ వేతనాలలో సగం వాటా ప్రభుత్వానిది కాగా, మిగతా సగం పంచాయతీ నిధుల నుంచి ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి కానీ, పంచాయతీల నుంచి వేతనాల నిధులు విడుదల కాలేదు. ఇలా అయితే గ్రామాల అభివృద్ధిపై దృష్టి సారించలేమని, పనులు, ప్రభుత్వ పథకాలు అమలు చేయబోమని, సమయం చూసుకుని ఆందోళనకు దిగుతామని సర్పంచులు హెచ్చరిస్తున్నారు. కోట్లలో పేరుకుపోయిన బకాయిలు దాదాపు 12 నెలల పాటు వేతనాలను విడుదల చేయకపోవడంతో బకాయిలు రూ. 9.60 కోట్లకు చేరుకున్నాయి. వెంటనే నిధులను విడుదల చేయాలని ప్రభుత్వానికి జిల్లా పంచాయతీ అధికారి, సర్పంచుల సంఘం విన్నవించినా ఫలితం లేదు. 2006 నుంచి పని చేసిన సర్పంచులకు కూడా రెండున్నర, మూడేళ్ల వేతనాలు మాత్రమే అందాయి. మిగతా వేతనాలను వారు దాదాపు మరిచిపోయారు. మరో విచిత్రం ఏమిటంటే, ఆరు నెలల క్రితం జిల్లాకు దాదాపు రూ. మూడు కోట్ల నిధులు వచ్చాయని, వాటిని సర్పంచులకు అందజేయాలని డీఎల్పీఓలకు ఆదేశాలిచ్చామని పంచాయతీ అధికారులు అంటున్నారు. ఈ విషయం వారికి తెలియకపోవచ్చని, పంచాయతీల ఖాతాలలో చూస్తే తెలుస్తుందని పేర్కొంటున్నారు. సర్పంచులేమో తమకు ఇంత వరకు ఒక్క నెల వేతనం కూడా అందలేదని, పంచాయతీల ఖాతాలో నిధులు జమ కాలేదని చెబుతున్నారు. దీంతో ఇంతకు ఆ నిధులు ఏమయ్యాయో అన్న సందేహం తలెత్తుతోంది. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుంటే తప్ప ఈ విషయం తేలేలా లేదు. పాత వేతనాలను సవరించిన ప్రభుత్వం కొత్త వేతనాల జీఓను ఇంత వరకు అమలు చేయలేదు. ఆరు నెలల క్రితం అధికారులు ఇచ్చామని చెబుతున్న వేతనాలు కూడా పాతవే అని తెలిసింది. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వమైనా కొత్త జీఓ ప్రకారం వేతనాలు వేతనాలు విడుదల చేయాలని సర్పంచులు కోరుతున్నారు. -
‘తప్పులతడక’కు బాధ్యులెవరు..!
ఇందూరు : జిల్లాలో పంచాయతీ కార్యదర్శుల పోస్టులకు ఎంపిక చేసిన అభ్యర్థుల జాబితా తప్పుల తడకగా మారింది. అధికారుల నిర్లక్ష్యం మూలంగా తాము ఉద్యోగం కోల్పోయామని ఇద్దరు అభ్యర్థులు మంగళవారం జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయానికి వచ్చి డీపీఓ సురేశ్‌బాబును కలిసి, ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మరి కొన్ని విషయాలు బహిర్గతమయ్యాయి. చేసిం దంతా చేసి పైగా తమ తప్పేం లేదని పంచాయ తీ శాఖ అధికారులు పేర్కొనడం గమనార్హం. ఏపీపీఎస్సీ నుంచి నేరుగా వచ్చిన మెరిట్ మా ర్కుల జాబితాను ప్రదర్శించామని, ఆ జాబి తానే తప్పుగా ఉందంటూ ఏపీపీఎస్సీని తప్పుబ ట్టారు. మరో మాటగా అభ్యర్థులు కూడా దరఖా స్తు చేసుకునే సమయంలో తప్పుగా భర్తీ చేయ డం మూలంగా కూడా ఇలా జరిగిందని, వారు చేసిన తప్పుకు తామెందుకు బాధ్యత వహించాలన్నట్లుగా డీపీఓ సురేశ్‌బాబు ‘సాక్షి’తో ఫోన్లో చెప్పారు. మహిళకు సంబంధించిన కేటగిరిలో మహేష్ కూమార్ అనే అభ్యర్థి ఎంపికైనట్లు జాబితాలో చేర్చడం ఏంటని ప్రశ్నించగా, సదరు అభ్యర్థి దరఖాస్తు చేసుకునే సమయంలో తన జెండర్‌ను ఫిమెయిల్‌గా ఎంచుకుని ఉండవచ్చని, కాగా ఫొటోను కూడా గుర్తు పట్టలేకపోయామని సమాధానం ఇచ్చారు. ఇటు ఓసీకి చెందిన బి. నవనీత అనే అభ్యర్థినికి బీసీ-ఏ కేటగిరిలో ఎలా ఎంపిక చేస్తారని అడగ్గా ఏపీపీఎస్సీ నుంచి అలా తప్పుగా వచ్చిందని చెప్పారు.దీంతో ఇంతకు ఎవరు తప్పు చేశారో.. దీనికి ఎవరు బాధ్యత వహించాలో అర్థంకాని పరిస్థితి నెలకొంది. ఈ విషయం సదరు అభ్యర్థులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేయగా మళ్లీ డీపీఓ సురేశ్‌బాబుకు రిఫర్ చేశారు. కసరత్తులో అధికారులు ఏం చేసినట్లు..? అభ్యర్థుల ఎంపిక జాబితాలో జరిగిన తప్పులకు తమ తప్పేం లేదని ఏపీపీఎస్సీ అధికారులపై, ఇటు దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులే కారణమని ఆరోపిస్తున్న అధికారులు మరీ ఇన్ని రోజులుగా చేసిన కసరత్తులో ఏం చేసినట్లు..? గత నాలుగైదు నెలలుగా కసరత్తు పేరుతో ఉద్యోగాల భర్తీ ప్రక్రియను ఆలస్యం చేసిన అధికారులు ఎంపిక విషయంలో పక్కాగా ఎందుకు చేపట్టలేకపోయారు..? దీని వెనుక ఏమైనా ప్రలోభాలున్నాయా...? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. మెరిట్ జాబితా ప్రకటించిన అనంతరం మార్కులు, రోస్టర్ పాయింట్‌ను కలుపుకుని అభ్యర్థులను ఎంపిక చేసిన అధికారులు జాబితాను క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉంటుంది. ఒకటికి రెండు సార్లు చూసుకుని, జల్లెడ పట్టి మరీ అసలైన అభ్యర్థులను ఎంపిక చేయాల్సిన కసరత్తులో పెద్ద తప్పులు ఎలా దొర్లాయో అంతుచిక్కడం లేదు. బాధిత అభ్యర్థులు తమకు అన్యాయం జరిగింది మహాప్రభో అని అధికారులకు మొరపెట్టుకుంటే తప్ప, అసలు విషయం తెలియలేదా...? అని బాధిత అభ్యర్థులు అధికారులను ప్రశ్నిస్తున్నారు. పూర్తి స్థాయిలో విచారణ చేసిన తరువాత జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని డీపీఓ సురేశ్‌బాబు తెలిపారు. -
ఇందూరు అడ్డాగా మార్బుల్స్ దందా
సుభాష్‌నగర్ : ఇందూరు అడ్డాగా మార్బుల్ అక్రమ రవాణా కొనసాగుతోంది. నగరం నడిబొడ్డు నుంచి నిత్యం పదుల సంఖ్యలో లారీల్లో మార్బుల్ అక్రమ రవాణా జరుగుతున్నప్పటికి సంబంధిత అధికారులు స్పందించడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయడానికి అధికారులు వెనుకంజ వేస్తున్నారని తెలుస్తుంది. మార్బుల్ లారీలు నగర శివారులోని ఓ ప్రత్యేకమైన స్థలంలో నిలి పి, హైదరాబాద్‌లో నో ఎంట్రీ సమయం ముగిసిన అనంతరం ఇక్కడి నుంచి బయలు దేరుతున్న విషయం కూడా అధికారులకు తెలిసినా, వాటిని నియంత్రించేం దుకు ముందుకు రావడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. డిమాండ్‌తో.. నగరం రోజురోజుకు శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో, మార్బుల్ వినియో గం విపరీతంగా పెరిగింది. దీంతో దానిని అవకాశంగా తీసుకున్న మార్బుల్ వ్యాపారులు, అక్రమ రవాణాతో పాటు అధిక సామర్థ్యంతో మార్బల్‌ను నగరంతోపాటు హైదరాబాద్‌కు చేరవేస్తున్నారు.ఈ విలువైన మార్బల్‌ను కొంతకాలంగా రాజస్థాన్ నుంచి సాలూర చెక్‌పోస్టు మీదుగా నగరంలో నుంచి కామారెడ్డి చెక్‌పోస్టు ద్వారా హైదరాబాద్‌కు తరలుతోంది. ఇలా రవాణా జరుగుతున్న మార్బల్‌పై 14.5 శాతం పన్నును వాణిజ్య పన్నుల శాఖకు చెల్లించాల్సి ఉంటుంది. అయితే చెక్‌పోస్టుల వద్ద అధికారులు మామూళ్లు తీసుకుని లారీలను వదలడం వల్ల, ఆ శాఖ ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయానికి గండిపడుతోంది. ఇలా రవాణా జరుగుతున్న మార్బుల్ ద్వారా, రోజుకు సుమారుగా రూ. 3 లక్షల మేర నష్టం వాటిల్లుతోంది. చెక్‌పోస్టుల వద్ద విధులు నిర్వహిస్తున్న అధికారుల జేబులు నిండుతున్నాయి. అక్రమ వ్యాపారుల రూపాయలు లక్షల్లో ఆర్జిస్తున్నారు. ఓ ట్రాన్స్‌పోర్టు ద్వారా.. రాజస్థాన్ నుంచి మార్బల్‌ను అక్రమంగా తరలించేందుకు ప్రత్యేకంగా ఓ ట్రాన్స్‌పోర్టు లారీలు నడుస్తున్నట్లు సమాచారం. ఈ ట్రాన్స్‌పోర్టు నుంచి బయలుదేరే 10 టైర్ల లారీల్లో 25 టన్నులు రవాణా చేయాల్సి ఉండగా, నిబంధనలకు విరుద్ధంగా 40 టన్నుల సామర్థ్యంతో రవాణా జరుపుతున్నారు. సామర్థ్యానికి మించి లారీల్లో మార్బల్‌ను రవాణా చేస్తున్నప్పటికి, సంబంధిత రవాణాశాఖాధికారులు కూడా వీటిపై కన్నేయక పోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. చీటికి మాటికి ఇతరత్రా లారీలను వేధించే రవాణాశాఖాధికారులు, ఈ ట్రాన్స్‌పోర్టు లారీలు కనిపించగానే చేతులు ముడుచుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. -
లెక్క చూపాల్సిందే !
ఇందూరు,న్యూస్‌లైన్ : జిల్లాకు మంజూరవుతున్న ఆర్థిక సంఘం నిధులను ఇష్టారాజ్యంగా ఖర్చు చేయడం ఇక ముందు కుదరదు. పనులు చేయకున్నా.. చేసినట్లు తప్పుడు బిల్లులు పెడితే దొరికిపోవడం ఖాయం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం పంచాయతీ రాజ్ ఇనిస్ట్యూషన్ అకౌంటింగ్ పేరిట ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను అమల్లోకి తెచ్చింది. ఇక మీదట జిల్లాలోని గ్రామీణ, మండల స్థాయిలో అభివృద్ధి పనులకు, మరమ్మతుల కోసం ఆర్థిక సంఘం నిధులను ఏ విధంగా ఖర్చు చేశారు? దేనికి ఎంత ఖర్చు చేశా రు? వివరాలను ఖచ్చితంగా కేంద్రానికి తెలుపా ల్సి ఉంటుంది. ఈ మేరకు ఆర్థిక సంఘం నిధులు ఎప్పటి నుంచి వస్తున్నాయో ఆ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు పూర్తి వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని కేంద్రం జిల్లా పంచాయతీ అధికారులకు సూచించింది. దీంతో పాత లెక్కలను ఎలా చూపాలోనని మండల పరిషత్ కార్యాలయా ల్లో పని చేస్తున్న ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఒక్కసారిగా పాత లెక్కలను అడగటంతో 2011-12, 2012-13 సంవత్సరాలకు సంబంధించిన రికార్డులు ఎక్కడున్నాయోనని కట్టి పెట్టిన ఫైళ్లను వెతకడం మొదలు పెట్టారు. ఈ ఖర్చుల వివరాలు ఆన్లైన్లో పెడితే కానీ ఇప్పుడు మం జూరు చేసిన 2013-14 ఆర్థిక సంఘం నిధులు రూ.12 కోట్ల 61లక్షల 71 వేల 900, 2014-15 ఆర్థిక సంఘం నిధులు రూ. 13 కోట్ల 88 లక్షల 45 వేల 200ల వినియోగానికి అనుమతివ్వబోమని కేం ద్రం హెచ్చరించింది. జిల్లాకు మంజురు చేసిన ఆర్థిక సంఘం నిధుల వివరాలను జూన్ 1లోగా ఆన్లైన్లో నమోదు చేసి తీరాలని కేంద్ర ప్రభుత్వం జిల్లా పంచాయతీ అధికారులకు గడువు కూడా విధించింది. దీంతో అన్ని గ్రామ పంచాయతీల కార్యదర్శులతో పాటు మండలాల ఉద్యోగులను అలర్ట్ చేశారు. డీఎల్పీఓ కార్యాలయాల్లో, మండల కార్యాలయాల్లో కంప్యూటర్లు పెట్టి ఏర్పాట్లు చేసి ఆపరేటర్లతో నిధుల ఖర్చుల వివరాలను ఆన్లైన్ చేయించాలని జిల్లా పంచాయతీ అధికారి సురేశ్‌బాబు సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. అక్రమాలకు అడ్డుకట్ట ఆర్థిక సంఘం నిధులను కేంద్ర ప్రభుత్వం కోట్ల రూపాయలలో జిల్లాకు మంజూరు చేస్తూ వచ్చింది. అయితే ఇన్నాళ్లూ ఆ నిధుల వినియోగంపై వివరాలు తెలుసుకోలేదు. ఆర్థిక సంఘం నిధులు దుర్వినియోగం అవుతున్నాయన్న ఆరోపణలు రావడంతో కేంద్ర ప్రభుత్వం ఈ కొత్త నిబంధనను ప్రవేశపెట్టింది. ఖర్చు చేసిన నిధులకు సంబంధిం చిన గ్రామం పంచాయతీల నుండి ధ్రువీకరణ పత్రాలను దాదాపు జిల్లాలోని 718 పంచాయతీల్లో ఎవరు కూడా ఇంత వరకు జిల్లా పంచాయతీ కా ర్యాలయంలో సమర్పించలేదు. ఎందుకంటే నిధు లు పక్కదారిపట్టాయని, దీనికి తోడు ఆన్లైన్ వ్యవస్థ లేకపోవడం కూడా కలిసి వచ్చిందని సం బంధిత వర్గాలు చెబుతున్నాయి. పాత, కొత్త లెక్క లు తీస్తే ఎక్కడ దొరికిపోతామోనని ఉద్యోగులు, పాలకులు జంకుతున్నారు. ఇక మీదట ఆర్థిక సం ఘం నిధుల్లోంచి నయా పైసా ముట్టాలన్నా.. పని చేసినట్లుగా సాక్ష్యాలు చూపి ఆన్లైన్లో వివరాలు నమోదు చేయాలి. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో అభివృద్ధి నిధుల్లో జరిగే అక్రమాలకు అడ్డుకట్ట వేసినట్లయిందని పలువురు పేర్కొంటున్నారు. -
‘పంచాయతీ’లో కాసుల గలగల
ఇందూరు, న్యూస్‌లైన్ : పంచాయతీలకు నిధుల కొరత తీరనుంది. ఇకముందు నిధుల కొరత ఉండబోదు. పల్లెల అభివృద్ధి పనులకు కావాల్సిన్ని నిధులు పంచాయతీల ఖాతాల్లో వచ్చి చేరాయి. ఎన్నడూ లేనంతగా పంచాయతీల ఖజానా నిండుకుండలాగా మారింది. ఇటీవల ఆర్థిక శాఖ పంచాయతీలకు రూ.13,88,45,200 నిధులను కేటాయించి వాటి విడుదలకు ట్రెజరీ శాఖకు అనుమతినిచ్చిన విషయం తెలిసిందే. అయితే 2013-14 సంవత్సరానికి సంబంధించిన నిధుల విడుదలకు ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వలేదు. దీంతో కొద్దిగా నిరాశకు గురయ్యారు. ఈ నేపథ్యంలో తాజాగా 2013-14కు చెందిన రూ. 12,61,71,900 నిధుల విడుదలకు ఆర్థిశాఖ సోమవారం అనుమతినిచ్చింది. ఇందుకు పంచాయతీ అధికారులు గతంలోనే పంపిన బిల్లుల ఫైలును జిల్లా ట్రెజరీ శాఖ అధికారులు బయటకు తీశారు. బిల్లులను సబ్ ట్రెజరీగా వారీగా కేటాయించారు. 2013-14, 2014-15 సంవత్సరాలకు సంబంధించి విడుధలైన 13వ ఆర్థిక సంఘం నిధులు కలిపితే ప్రస్తుతం రూ.26,51,17,100లకు చేరింది. జిల్లాలోని 718 గ్రామ పంచాయతీలకు జనాభా ఆధారంగా సర్దుబాటు చేయాలని పంచాయతీ అధికారులు ట్రెజరీ శాఖ అధికారులకు సూచించారు. మొన్నటి వరకు పంచాయతీల ఖాతాల్లో నిధులు లేక జీరో బ్యాలెన్స్ చూపించాయి. గ్రామ సర్పంచులు కూడా పనులు చేయించలేకపోయారు. ప్రస్తుతం లక్షల్లో పంచాయతీల ఖాతాల్లో నిధులు వచ్చి చేరాయి. ఇక పల్లెల్లో అవసరమైన పనులకు, అభివృద్ధి పనులకు నిధులు పుష్కలంగా ఉంటాయి. నిధుల సర్దుబాటు ఇలా... జిల్లాలోని 718 గ్రామ పంచాయతీలకు నిధులను సర్దుబాటు చేశారు. జిల్లా ట్రెజరీ నుంచి సబ్ ట్రెజరీలకు నిధులను కేటాయించారు. వాటిని రెండు రోజుల్లో సర్దుబాటు చేసి పంచాయతీల ఖాతాల్లో వేస్తారు. ఆర్మూర్ సబ్ ట్రెజరీకి రూ.1,70,33,655, బాన్సువాడ రూ.1,26,03,440, భీంగల్ రూ.1,57,93,101, బోధన్ రూ.1,69,74,294, కామారెడ్డి రూ.2,01,63,699, మద్నూర్ రూ.1,09,57,521, నిజామాబాద్ రూ.2,10,39,743, ఎల్లారెడ్డి రూ.1,16,06,447 -
రెండు ఎంపీటీసీలకు నేడు ఎన్నిక
ఇందూరు/ ధర్పల్లి, న్యూస్‌లైన్: జిల్లాలో రద్దయిన రెండు ఎంపీటీసీ స్థానాలకు ఆదివారం ఎన్నికలు జరగనున్నాయి. పిట్లం మండలంలోని బండపల్లి, ధర్పల్లి మండలంలోని మైలారం ఎంపీటీసీ స్థానాలు నిబంధనలకు విరుద్ధంగా వేలం పాట ద్వారా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారనే ఆరోపణలతో గత నెల 12న ఆ రెండు స్థానాల ఎన్నికను రద్దు చేస్తూ ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. తర్వాత ఈ రెండు స్థానాలకు ఎన్నికలు నిర్వహించడానికి నోటిఫికేషన్ జారీ చేసి అభ్యర్థుల నుంచి నామినేషన్ లు స్వీకరించారు. మైలారం స్థానానికి స్వతంత్ర అభ్యర్థి సీహెచ్ ప్రకాష్, కాం గ్రెస్ అభ్యర్థి లలితా నాయక్‌లు బరిలో ఉన్నారు. ఎంపీటీసీ పరిధిలో మై లా రం, కేశారం గ్రామాలు ఉన్నాయి. మొత్తం 1823 మంది ఓటర్లు ఉన్నారు. కేశారం గ్రామంలోని ఒకటో నంబర్ పోలింగ్ కేంద్రంలో 565 మంది, మై లారంలో రెండో నంబర్ పోలింగ్ బూత్‌లో 615 మంది, మూడో బూత్‌లో 643 మంది ఓటర్లు ఉన్నారు. బండపల్లి స్థానానికి టీఆర్ఎస్ అభ్యర్థి రజినీ కాంత్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి నడ్పి గంగారాం పోటీలో నిలిచారు. ఇక్కడ మొ త్తం 2235 మంది ఓటర్లు ఉండగా, మూడు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలింగ్ సిబ్బందిని నియమించారు. బ్యాలెట్ బాక్సులు పోలింగ్ కేంద్రాలకు తరలించారు. పోలింగ్ ఉ.7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. ఫలితాలను సోమవారం వెల్లడిస్తారు. వేతనంతో కూడిన సెలవు మైలారం, బండపల్లి ఎంపీటీసీ స్థానాల పరిధిలోని దుకాణాలు, ఫ్యాక్టరీలు, వ్యాపార సంస్థల్లో పనిచేసే కార్మికులకు ఆదివారం వేతనంతో కూడిన సెల వును జిల్లా కలెక్టర్ పీఎస్ ప్రద్యుమ్న ప్రకటించారు.యజమానులు కార్మికులకు సెలవునిస్తూ ఓటు వేసే విధంగా సహకరించాలని ఒక ప్రకటనలో కోరా రు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని కార్మిక శాఖ అధికారులను ఆదేశించినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. -
ఇందూరు మెడలో గులాబీ మాల
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : ఇందూరు ప్రజలు తెలంగాణ రాష్ట్ర సమితికి పట్టం కట్టారు. రెండు లోక్‌సభ, తొమ్మిది అసెంబ్లీ స్థానాలలో ఆ పార్టీ అభ్యర్థులకు విజయాన్ని అందించారు. జిల్లా చరిత్రలో 1952 నుంచి ఇప్పటి వరకు ఒకే పార్టీకి చెందిన ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు విజయం సాధించడం ఇదే ప్రథ మం. తెలంగాణ తొలి శాసనసభలో ఈ అరుదైన రికార్డు చిరస్థాయిగా నిలవనుంది. ఇం దూరు ప్రజల ఏకపక్ష తీర్పుతో ఈ రికార్డును సొంతం చేసుకున్న టీఆర్ఎస్ శ్రేణుల్లో సంబ రాలు అంబరాన్ని అంటాయి. కాంగ్రెస్ పార్టీ దిగ్గజాలు, మాజీ మంత్రులు ధర్మపురి శ్రీని వాస్, మహ్మద్ షబ్బీర్ అలీ, మాజీ స్పీక ర్ కేఆర్ సురేశ్ రెడ్డిలకు ఈసారి కూడా పరాజయం తప్పలేదు. మాజీ మంత్రి పొద్దుటూరి సుదర్శన్‌రెడ్డి బోధన్‌లో ఓటమిని చవిచూశారు. మాజీ విప్ ఈరవత్రి అనిల్‌కుమార్ ఘోర పరాజయం పొందారు. కవితకు, బీబీ పాటిల్ కు మద్దతు పలికిన ఓటర్లు రాజకీయ ఉద్ధండుల కేరాఫ్ నిజామాబాద్ లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత విజయం సొంతం చేసుకుంది. ఇందూరు కోడలిని జిల్లా ప్రజలు ఆదరించారు. తెలంగాణ రాష్ర్టంలో జరిగిన తొలి ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు సర్వశక్తులొడ్డినా.. ఇందూరు ఓటర్లు మాత్రం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూతురు, జిల్లా కోడలు కవితకే మద్దతు పలికారు. రెండుసార్లు గెలుపొందిన మధుయాష్కీ గౌడ్, బీజేపీ మాజీ శాసనసభ పక్షనేత యెండల లక్ష్మీనారాయణలు ఆమె చేతిలో ఘోర పరాజయం పొందారు. తెలంగాణ జిల్లాల్లో అత్యంత ఆసక్తికరంగా జరిగిన ఈ పోటీలో 1,67,184 మెజార్టీ సాధించారు. టీఆర్ఎస్కు పోస్టల్ బ్యాలెట్లు కలుపుకొని 4,39,307 ఓట్లు రాగా, కాంగ్రెస్‌కు 2,72,723 ఓట్లు వచ్చాయి. జహీరాబాద్ లోక్‌సభ స్థానం నుంచి రాజకీయ తెరపైకి వచ్చిన టీఆర్ఎస్ అభ్యర్థి భీంరావు బస్వంత్ రావు పాటిల్‌ను జిల్లా ప్రజలు ఆదరించారు. సిట్టింగ్ ఎంపీ సురేశ్‌కుమార్ షెట్కార్‌పై ఆయన ఘన విజయం సాధించారు. మెదక్ జిల్లా జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోకి వచ్చే జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్ సెగ్మెంట్లలో ఆయనకు భారీ ఆధిక్యం లభించింది. 13వ రౌండ్ ముగిసే సరికి బీబీరావు పాటిల్ 1,21,487 ఓట్ల ఆధిక్యంతో తిరుగులేని మెజార్టీ సాధించారు. ఇందూరు కోటలో గులాబీ గుబాళింపు ఇందూరు ఇలాకాలో గులాబీ ప్రభంజనం వీచింది. ఓటెత్తిన జనం టీఆర్ఎస్కు బ్రహ్మరథం పట్టారు. మొత్తం రెండు పార్లమెంట్, తొమ్మిది అసెంబ్లీ స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులకు అధికార పీఠంపై కూర్చో బెట్టారు. ఎల్లారెడ్డి అసెంబ్లీ స్థానం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగు రవీందర్‌రెడ్డి వరుసగా మూడోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించారు. 2009లో టీడీపీ నుంచి గొలుపొంది టీఆర్ఎస్లో చేరిన పోచారం శ్రీనివాస్‌రెడ్డి, గంప గోవర్ధన్, హన్మంత్ సింధేలు బాన్సువాడ, కామారెడ్డి, జుక్కల్‌ల నుంచి గెలుపొందారు. నిజామాబాద్ రూరల్ నుంచి పీసీసీ మాజీ చీఫ్ డి శ్రీనివాస్‌పై ముందుగానే గెలుపు ధీమాను వ్యక్తం చేసిన టీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ విజయం సాధించారు. నిజామాబాద్ అర్బన్, ఆర్మూరు, బాల్కొండ, బోధన్ల నుంచి బిగాల గణేశ్ గుప్త, ఆశన్నగారి జీవన్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, మహ్మద్ షకీల్‌లు తొలిసారి ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దిగ్గజాలు డి శ్రీనివాస్‌తో పాటు షబ్బీర్‌అలీ, పి సుదర్శన్‌రెడ్డి, కేఆర్ సురేశ్‌రెడ్డిలు కోలుకోలేని షాక్ కు గురయ్యారు. మాజీ విప్ ఈరవత్రి అనిల్‌కు బాల్కొండ ఓటర్లు మొండి చెయ్యిచ్చారు. -
పరిషత్ ఫలితాలు నేడే
ఇందూరు, న్యూస్‌లైన్: అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఫలితాల సీజన్ రానే వచ్చింది. సోమవారం మున్సిపల్ ఫలితాలు ముగిసిన నేపథ్యంలో మంగళవారం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఫలితాలు వెల్లడి కానున్నాయి. బ్యాలెట్ బాక్సులలో దాగున్న అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. జిల్లాలో 36 జడ్పీటీసీ, 583 ఎంపీటీసీ స్థానాలకు సంబంధించిన ఫలితాలను వెల్లడించేందుకు జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం 8 గంటలకు ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లతో లెక్కింపు ప్రారంభం కానుంది. నిజామాబాద్ డివిజన్లోని 14 మండలాలకు సంబంధించి డిచ్పల్లి మండలం ధర్మారంలోని తిరుమల నర్సింగ్ కళాశాలలో, బోధన్ డివిజన్ 12 మండలాల ఓట్లను ఆచన్‌పల్లి ఆర్కే ఇంజనీరింగ్ కళాశాలలో, కామారెడ్డి డివిజన్లోని 10 మండలాల ఓట్లను సదాశివనగర్ మండలం మర్కల్‌లోని విజయ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో లెక్కింపు చేపట్టనున్నారు. మొత్తం ఈ మూడు కేంద్రాలలో 60 గదులను గుర్తించి కౌంటింగ్ టేబుళ్లను ఏర్పాటు చేశారు. లెక్కింపు పక్రియ వీలైనంత తొందరగా పూర్తి చేయడానికి ప్రతీ ఎంపీటీసీ స్థానానికి ఒక కౌంటింగ్ టేబుల్‌ను ఏర్పాటు చేశారు. లెక్కింపు ప్రక్రియను వీడియో కెమెరాలతో చిత్రీకరిస్తారు. ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికల ఫలితాలు వెల్లడించడానికి జిల్లా యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. ఒక్కో ఎంపీటీసీ కౌంటింగ్ టేబుల్ వద్ద ఒక సూపర్వైజర్, ముగ్గురు అసిస్టెంట్లు, ఒక అటెండర్, ఆర్వోలు మొత్తం దాదాపు మూడు వేలకు పైగా సిబ్బంది పాల్గొంటున్నారు. ప్రతీ రౌండ్‌కు సంబంధించిన ఓట్ల వివరాలు కౌంటింగ్ టేబుల్వారిగా షీట్లలో నమోదు చేసిన సిబ్బంది, అధికారులు ఎప్పటికప్పుడు జిల్లా ఉన్నతాధికారులకు తెలియజేస్తారు. సెల్ఫోన్లతో నో ఎంట్రీ ఒక కౌంటింగ్ టేబుల్‌కు అభ్యర్థితోపాటు, ఒక ఏజెంటును మాత్రమే లోనికి అనుమతిస్తారు. రిటర్నింగ్ అధికారి తప్ప మిగతా కౌంటింగ్ సిబ్బంది, అభ్యర్థులు, ఏజెంట్లు ఎవరు కూడా సెల్‌ఫోన్‌తో లోనికి వెళ్లరాదు. ఒక్కసారి లోపలికి వెళ్లిన వారు మళ్లీ బయటకు రావాలంటే రిటర్నింగ్ అధికారి అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. టీ, టిఫిన్, భోజనంలాంటివి లోపలికి అనుమతించరు. పోలీసు బందోబస్తు మూడు కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీసు శాఖ గట్టి బందోబస్తును ఏర్పాటు చేసింది. డీఎస్పీలు, ఎస్ఐలు, ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, హోంగార్డులు, ప్రత్యేక పోలీసు బలగాలు మొత్తంగా దాదాపు 260కి పైగా సిబ్బంది కౌంటింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు నిర్వహిస్తారు. -
అంగన్వాడీల్లో ‘మినీ’ మెనూ
ఇందూరు, న్యూస్‌లైన్ : పౌష్టికాహార లోపంతో బలహీనంగా మారిన పిల్లలను బలిష్టం చేయడానికి రాష్ట్ర ఐసీడీఎస్ అధికారులు చర్యలు చేపట్టారు. పౌష్టికాహార లోపానికి గురైన పిల్లల బరువును పెంచడమే లక్ష్యంగా జిల్లాలో అంగన్వాడీ కేంద్రాల్లో కొత్త పౌష్టికాహార మెనూకు శ్రీకారం చుట్టారు. అదే మినీ భోజన మెనూ. ఈ కొత్త మెనూ ద్వారా పౌష్టికాహార లోప పిల్లలందరికీ ప్రతిరోజు గుడ్డు, 100 ఎంఎల్ పాలు అందిస్తారు. వీటితో పాటే బియ్యం, పప్పు, పోపు దినుసులు అందజేస్తారు. ఈ మెనూను జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో అమలు చేయాలని ఈ మేరకు ఐసీడీఎస్ కమిషనర్ చిరంజీవి చౌదరి జీఓ ఎంఎస్ నం.15 ద్వారా ఉత్తర్వులను జిల్లా ఐసీడీఎస్ కార్యాలయానికి జారీచేశారు. ఈ క్రమంలో జిల్లా ఐసీడీఎస్ పీడీ రాములు కొత్త మెనూ జీఓ కాపీలను అన్ని ప్రాజెక్టుల సీడీపీఓలకు పంపించారు. 7 నెలల నుంచి మూడేళ్లలోపు పిల్లలు ఎవరైనా పౌష్టికాహార లోపానికి గురైతే వారికి కొత్త మెనూ ప్రకారం పౌష్టికాహార భోజనం అందించాలని, ఈ విషయం అంగన్వాడీ కార్యకర్తలకు తెలియజేయాలని ఆదేశాలు జారీచేశారు. పౌష్టికాహారానికి సంబంధించిన సరుకులు బియ్యం, పప్పు, కూరగాయలు, నూనె, పోపు దినుసులు, అదనపు నూనె, గుడ్లు, పాలు అంగన్వాడీ కేంద్రాలకు పంపిస్తున్నారు. ఈనెల నుంచే అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో అమలు పర్చాలని పీడీ ఆదేశాలు జారీచేశారు. పిల్లల కోసం సర్వే... జిల్లాలో ఈ పాటికే సుమారుగా రెండు వేల మంది వరకు పిల్లలు పౌష్టికాహార లోపానికి గురైనట్లు అధికారులు గుర్తించారు. వారికి ఆస్పత్రుల్లో చికిత్సలు, అం గన్‌వాడీల్లో పౌష్టికాహారం అందిస్తున్నారు. ప్రస్తుతం వీరికోసం కొత్త మెనూ రావడంతో మరో విడతగా అంగన్వాడీ కార్యకర్తలు సర్వే చేసి పిల్లలను గుర్తించే పనిలో ఉన్నారు. పౌష్టికాహార లోపానికి గురయ్యారో లేదో, పిల్లల ఎత్తుకు తగిన బరును తెలుసుకునేందు కు వారి బరువులను కొలుస్తున్నారు. తక్కువ, అతి తక్కువ బరువు ఉంటే వెంటనే వారి పేర్లను నమోదు చేసుకుంటున్నారు. అలా పేరు నమోదు చేసిన పిల్లలను ఆస్పత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేయిస్తారు. అనంతరం అంగన్వాడీ కేంద్రాల్లో లేదా పౌష్టికాహారం ఇంటికి పంపించి తినిపిస్తారు. బరువు పెరిగారో లేదోనని వారానికి ఒకసారి వారి బరువు చూస్తారు. పిల్లలకు తినిపించే సమయవేళలు .. పౌష్టికాహార లోపానికి గురైన పిల్లలకు అంగన్వాడీ కేంద్రాల్లో మూడుసార్లు ఆహారం అందిస్తారు. ఇంటి వద్ద నాలుగు సార్లు తినిపించాలి. ప్రతిరోజు ఉదయం 9:30 గంటలకు గుడ్డు, 11:30కి 100 ఎంఎల్ పాలు, మధ్యాహ్నం 12 గంటలకు మినీ భోజనం అంగన్వాడీ కేంద్రాల్లో ఇస్తారు. తల్లులు, పిల్లలకు ఇది తినిపించడమే కాకుండా ఇంటి వద్ద అంగన్వాడీ కేంద్రం నుంచి అందించిన బాలామృతం పౌష్టికాహా రం ఉదయం 7:30కి ఒకసారి, సాయంత్రం 5:30 మరోసారి 50 గ్రాముల చొప్పున జావలా చేసి లేదా లడ్డులాగా చేసి తినిపించాలి. అంతే కాకుండా మధ్యాహ్నం 3:30లకు ఉడికించిన కూరగాయలు (ఆలుగడ్డ లాంటివి), పండు గుజ్జులా తయారు చేసి తినిపిం చా లి. రాత్రి 7:30లకు భోజనం పెట్టాలి. ఈ భోజనంలో నెయ్యి లేదా నూనె కలపాలి. పౌష్టికాహార లోపానికి కు గురైన పిల్లలకు ప్రతిరోజు ఈ విధంగా ఆహారం అందించడంలో అంగన్వాడీ కార్యకర్త, తల్లి పూర్తి శ్రద్ధ చూపాలి. పక్కాగా అమలు చేస్తాం పౌష్టికాహార లోపానికి గురైన పిల్లల కోసం జిల్లాలో సర్వే నిర్వహిస్తున్నాం. కొత్త మినీ భోజన మెనూ ప్రకా రం సర్వేలో గుర్తించిన పిల్లలకు పౌష్టికాహారం కచ్చితంగా అందిస్తాం. మెనూను పక్కాగా అమలు చేయాలని, ఈ విషయంలో నిర్లక్ష్యం చేయరాదని అంగన్వాడీ కార్యకర్తలకు ఆదేశాలు జారీచేశాం. -రాములు, ఐసీడీఎస్, పీడీ -
‘పరిషత్’ తొలి పోరుకు సర్వం సిద్ధం
ఇందూరు, న్యూస్‌లైన్ : ఈనెల 6న ఆదివారం జరిగే ఎంపీటీసీ, జడ్పీటీసీ తొలి విడత ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. జిల్లాలో మొదటి విడతగా 18 మండలాల్లో ఎన్నికలను నిర్వహించనున్నారు. ఎలాంటి అ వాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడానికి అధికార యం త్రాంగం ఏర్పాట్లు పూర్తిచేసింది. పోలీసు బందోబస్తుతో పాటు, సూక్ష్మ పరిశీలకులు, ఇతర అధికారుల నియామ కం పూర్తయింది. ఏడు లక్షల ఓటర్లు... తొలి విడత జరిగే 18 మండలాల్లో మొత్తంగా 7,28, 809 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 3,51,559 మంది పురుష ఓటర్లు, 3,77,207 మంది మహిళా ఓటర్లు, ఇతరులు 43 మంది ఉన్నారు. వీరు ఓటుహక్కును వినియోగించుకోవడానికి ఎలాంటి ఇబ్బందు లు లేకుండా పోలింగ్ కేంద్రాల వద్ద అన్ని వసతులు ఏర్పాటు చేస్తున్నారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఓటరు జాబితాతో సహ పోలింగ్ సామగ్రిని మొత్తం సంబంధిత మండలాలకు పంపించారు. జడ్పీటీసీ బరిలో 92 మంది... జడ్పీటీసీ స్థానాలకు 92మంది అభ్యర్థులు, 298 ఎంపీటీసీ స్థానాలకు గాను 1,105 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. బాన్సువాడలో 52, బీర్కూర్ 47, బిచ్కుంద 53, బోధన్ 61, ధర్పల్లి 39, డిచ్పల్లి 61, జక్రాన్‌పల్లి 37, జుక్కల్ 53, కోటగిరి 53, మద్నూరు 57, మాక్లూర్ 51, నవీపేట్ 52, నిజామాబాద్ 91, నిజాంసాగర్ 33, రెంజల్ 33, వర్ని 59, ఎడపల్లిలో 35 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తంగా 18 మండలాల్లో 911 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు వెయ్యి కన్నా తక్కువ ఉంటే రెండు, అంత కన్నా ఎక్కువగా ఎక్కువగా ఉంటే మూడు బ్యాలెట్ బాక్సులను, మొత్తంగా 1,850 వరకు బ్యాలెట్ బాక్సులను వినియోగించనున్నారు. ఎన్నికల సిబ్బంది నియామకం... ఒక్కో పోలింగ్ కేంద్రానికి ఒక ప్రిసైడింగ్, ఇద్దరు అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులను నియమించగా, ఒక్కో పోలింగ్ కేంద్రానికి ముగ్గురు చొప్పున మొత్తం 2,733 మంది పోలింగ్ అధికారులను నియమించారు.ఒక్కో లైజన్ అధికారి చొప్పున 18 మందిని, రూట్ అధికారులను 18 మందిని ఏర్పాటు చేశారు. ప్రతి మండలానికి ఒక రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులను నియమించగా, మండలానికి ఐదుగురు చొప్పున 90 మంది జోనల్ అధికారులను, 20 మంది సిబ్బందిని నియమించారు. మొత్తం మీద మొదటి విడత ఎన్నికల నిర్వహణకు ఐఐటీ విద్యార్థుల నుంచి సిబ్బంది, అధికారులు కలిపి దాదాపుగా 3,300 మంది విధులు నిర్వర్తించబోతున్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వెబ్కన్ను... మొదటి విడత ఎన్నికలు జరిగే 18 మండలాల్లో 911 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో 516 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా, 254 సున్నిత, 242 అతి సున్నిత పోలింగ్ కేంద్రాలుగా అధికారులు గుర్తించారు. కాగా 20 పోలింగ్ కేంద్రాలు నక్సలైట్ ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించారు. అవి మొత్తం ఒక్క నిజామాబాద్ మండలంలోనే ఉండటం గమనార్హం. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో ఏం జరుగుతుందో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కూర్చుండి పర్యవేక్షించి తెలుసుకోవడానికి 79 వెబ్ కెమెరాలను ఏర్పాటు చే శారు. వీటిని ఆపరేట్ చేయడానికి పరిజ్ఞానం కలిగిన ఐఐటీ విద్యార్థుల సేవలను వినియోగించుకుంటున్నారు. పోలింగ్ కేంద్రాల్లో 58 మంది వీడియోగ్రాఫర్లను నియమించారు. వీరు నిరంతరాయంగా చిత్రీకరికరిస్తారు. అలాగే పోలింగ్ సరళిని పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా 142 మంది మైక్రో పరిశీలకులను నియమించారు. జిల్లాకు ఎన్నికల పరిశీలకులుగా నియమితులైన ఐఏఎస్ అధికారులు శ్రీదేవి, బి.భారతీ లక్పతి నాయక్‌లతో పాటు, జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న, జేసీ వెంకటేశ్వర్రావు ఆయా మండలాల్లో తిరిగి ఎన్నికల తీరును పరిశీలిస్తారు. ఎన్నికల్లో ఎక్కడ సమస్యలు తలెత్తిన అధికారులకు తెలియజేయడానికి ఉద్యోగులకు, ప్రజల కోసం 239003 అనే టోల్ ఫ్రీ నెంబర్‌ను జిల్లా పరిషత్‌లో ఏర్పాటు చేశారు. పోలింగ్ ఉదయం 7గంటలకు ప్రారంభమై సాయంత్రం ఐదు గంటలకు ముగుస్తుంది. -
చురుకుగా ఏర్పాట్లు
ఇందూరు, న్యూస్‌లైన్: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో జిల్లా అధికార యంత్రాంగంచు రుగ్గా ఏర్పాట్లు చేస్తోంది. ఏప్రిల్ 6, 11 తేదీలలో ఎన్నికలు జరిపేందుకు ఈసీ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో జిల్లాలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను అధికార యంత్రాంగం గుర్తించింది. మొత్తం 718 గ్రామ పంచాయతీలలో, 1,765 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. దోమకొండ, తాడ్వాయి మండలాలలో ఎక్కువ సమస్యాత్మక, వేల్పూర్, సిరికొండ, సదాశివనగర్, నాగి రెడ్డిపేట్, లింగంపేట్ మండలాలలో అతి తక్కువ సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. సున్నిత, అతిసున్నిత పోలింగ్ కేంద్రాలను గుర్తించిన అధికారులు వాటి భద్రత కోసం చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకుగాను పోలింగ్ కేంద్రాలలో 171 వెబ్ కెమె రాలు ఏర్పాటు చేయనున్నారు. వీటి నిర్వహణకు ట్రి పుల్ ఐటీ విద్యార్థు ల సేవలను వినియోగించుకోనున్నారు. అదేవిధంగా 114 వీడియోలను అద్దెకు తీసుకుని పోలింగ్ సరళిని చిత్రీకరించనున్నారు. ఎన్నికల ను ప్రత్యేకంగా పర్యవేక్షించేందుకు 278 మంది మైక్రో పరిశీలకులను నియమించారు. సూమా రు 10 నుంచి 12మంది వరకు నోడ ల్ అధికారులను,రిటర్నింగ్ అధికారులను కలెక్టర్ ప్రద్యు మ్న నియమించారు. ప్రిసైడింగ్,అసిస్టెంట్ ప్రిసైడింగ్, పోలింగ్ బూత్‌స్థాయి అధికారుల నూ నియమించారు. రిటర్నింగ్, నోడల్ అధికారులతో కలెక్టర్ ప్రతి రోజు సమీక్షిస్తున్నారు. ఎన్నికల నిర్వహణపై అధికారులకు జిల్లా కేం ద్రంలోని రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి.ఐదు రోజు ల పాటు మండల, రెవెన్యూ డివిజన్లవారీగా శిక్ష ణ తరగతులు కొనసాగుతాయని సంబంధిత అధి కారులు తెలిపారు. మూడు వేలకుపైగా బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేయగా, 20 వేల మెట్రిక్ టన్నుల తెల్ల కాగితాలతో బ్యాలెట్ పత్రాలను ముద్రణ చేస్తున్నారు. పోలీసు శాఖ పకడ్బందీ బందోబస్తుకు కసరత్తు చేస్తోంది. -
జెడ్పీటీసీ బరిలోఅభ్యర్థులు 195
ఇందూరు, న్యూస్‌లైన్ : ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు పోటీచేసే అభ్యర్థుల తుది జాబితా సిద్ధమైంది. జాబితాపై సోమవారం అర్ధరాత్రి వరకు అధికారులు కసరత్తు చేశారు. పరిషత్ స్థానాలకు ఎంతమంది బరిలో ఉన్నారు. పార్టీల వారీగా మంగళవారం అధికారులు అధికారికంగా జాబితా వెళ్లడించనున్నారు. జిల్లాలోని 36 జెడ్పీటీసీ స్థానాలకు 497 నామినేషన్లు వచ్చాయి. వీటిలో పరిశీలనలో 10 మంది నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. ఇందులో ముగ్గురు కలెక్టర్‌కు అప్పీల్ చేసుకోగా, ఇద్దరికి అవకాశం కల్పించారు. మిగతా ఎనిమిది మంది నామినేషన్లను పరిగణలోకి తీ సుకోలేదు. మూడు, నాలు గు రోజుల వ్యవధిలో 150 మంది అభ్యర్థులు వేసిన నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. మొత్తం 36 జెడ్పీటీసీ స్థానాలకు 195 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. మిగిలిన 142 నామినేషన్లు ప్రస్తుతం పోటీలో ఉన్న అభ్యర్థులు రెండు నుంచి మూడు సెట్ల నామినేషన్లను వేసినవేనని, వాటిని లెక్కలోకి తీసుకోలేదని అధికారులు చెప్పారు. సోమవారం సాయంత్రానికల్లా పోటీలోని అభ్యర్థుల తుది జాబితాను తయారు చేయాల్సిన అధికారులు పనిభారంతో వెల్లడించలేక పోయారు. ఎంపీటీసీలకు సంబంధించి 583 స్థానాలకు 4,752 నామినేషన్లు రాగా, ఇందులో దాదాపు 2,316 మంది బరిలో ఉన్నట్లు తెలిసింది. మంగళవారం మధ్యాహ్నంకల్లా ఎంపీటీసీ, జెడ్పీటీసీ పోటీ అభ్యర్థుల తుది జాబితాతో పాటు వారికి కేటాయించిన గుర్తుల వివరాలను గ్రామ, మండల, జిల్లా పరిషత్ కార్యాలయాల్లో ప్రదర్శించనున్నారు. -
గెలుపే లక్ష్యంగా..
ఇందూరు, న్యూస్‌లైన్ : త్వరలో జరగనున్న పరిషత్, బల్దియా ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు గెలుపే లక్ష్యంగా పార్టీలు ముందుకు కదులుతున్నాయి. జెడ్పీ, బల్దియా పీఠాలు కైవసం చేసుకోవడంతోపాటు, ఆ తర్వాత జరిగే సాధారణ ఎన్నికల్లో అధిక స్థానాలు గెలవడం సులభమవుతుందని ఆశి స్తున్నాయి. దీంతో రాజకీయంగా బలపడవచ్చని ఆయా పార్టీలు ఉవ్విళ్లూరుతున్నాయి. అందుకోసం జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో ప్రజా, ధనబలం ఉన్న అభ్యర్థులకే పార్టీ టికె ట్లు ఇచ్చి బరిలోకి దింపి రం గం సిద్ధం చేశాయి. ఇక మిగిలింది ఓటర్లను తమవైపు తిప్పుకోవడమే. ఎలా చేస్తే ఓటర్ల మనసును గెలుస్తాం, ఏ విధంగా ప్రచారం చేసి ప్రతిపక్ష పార్టీల ఎత్తుగడలను దాటుతామనే ఆలోచనలో పార్టీల ముఖ్య నాయకులు తలమునకల య్యారు. ఇందుకోసం రాజకీయ విశ్లేషకులు, నిపుణుల సలహాలు, సూచనలు తీసుకుంటున్నారు. ఇటు కాంగ్రె స్, టీఆర్ఎస్, టీడీపీ, బీజేపీ, వైఎస్ఆర్ సీపీలు అన్ని మం డలాల్లో తమ పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తున్నాయి. నామినేషన్ల పర్వం ముగిసిన మరుసటి రోజు నుంచే ప్రచారం మొదలైన నేపథ్యంలో, అభ్యర్థికి మద్దతు గా ప్రజాబలం ఉన్న జిల్లా నాయకుడిని ప్రచారకర్తగా నియమిస్తున్నారు. పోటీ పార్టీలకు తగ్గకుండా ప్రచారం నిర్వహించాలని ఆయా పా ర్టీల రాష్ట్ర నేతలు జిల్లా నేతలకు గట్టి ఆదేశాలు జారీచేశారు. జిల్లా నాయకు లు మండల నాయకులకు ఎన్నికల బా ధ్యతలు అప్పగిస్తున్నారు. దీంతో పరి షత్ ఎన్నికలను సవాల్‌గా తీసుకుని కాలుదువ్వడానికి సై అంటున్నారు. డబ్బులు ఉన్నవారికే టికెట్టు.. జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు ఒక్కో పార్టీ నుంచి ముగ్గురు నుంచి నలుగురు నామినేషన్లు వేశారు. అయితే వీరిలో ప్రజాబలం ఉన్న అభ్యర్థులను పక్కనపెట్టి ధనబలం ఉన్న అభ్యర్థులకే ఆయా పార్టీలు పార్టీ టికెట్లను ఇస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. టికెట్ రానివారు పార్టీలు వీడడం, స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో దిగడం చేస్తున్నారు. పోటీనుంచి తప్పుకుంటే మండల, జిల్లాస్థాయి పదవి ఇస్తామని బుజ్జగించినా వారు వినడంలేదు. దీంతో మనస్తాపం చెందిన పలువురు అభ్యర్థులు చెప్పకుండానే పార్టీలను వీడుతున్నారు. ఇది వరకే మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ టికెట్లు దక్కని పలు పార్టీల నాయకులు, కార్యకర్తలు పార్టీ కార్యాలయాలపై దాడులు చేసి, తిట్లతో దుమ్మెత్తి పోసిన సంగతి తెలిసిందే. ఇంత జరిగినా తర్వాత కూడా జెడ్పీటీసీ, ఎంపీటీసీ టికెట్లను సైతం అమ్ముకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఏళ్లుగా పార్టీలో ఉంటూ సేవచేచేసిన వారికి పార్టీలు టికెట్లు విస్మరించడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జెడ్పీ పీఠం అభ్యర్థుల పేర్లు గోప్యం.. జిల్లాపరిషత్ చైర్మన్ పీఠం కోసం పోటీలో ఉంచే అభ్యర్థి పేరును ఇంకా ఏ పార్టీలు ప్రకటించలేదు. జడ్పీ పీఠం బీసీ జనరల్ రిజర్వు కావడంతో పురుష, మహిళా అభ్యర్థులు పోటీ పడుతున్నారు. కాంగ్రెస్, టీఆర్ఎస్, టీడీపీ, బీజేపీ పార్టీలో ముగ్గురు అభ్యర్థుల చొప్పున పేర్ల జాబితాను తయారు చేశారు. ఆ ముగ్గురిలో ఒకరిని రేసులో ఉంచడానికి ముఖ్య నాయకుల అభిప్రాయాలను తీసుకుంటున్నారు. కాంగ్రెస్ నుంచి నిజామాబాద్ మండలానికి చెందిన పుప్పాల శోభ పేరు తెరపైకి వచ్చింది. కాని ఇంకా ఖరారు కాలేదు. పీఠం రేసులో తనకు అవకాశం ఇవ్వాలంటూ పేరు, పలుకుబడి, ధనబలం ఉన్న పోటీ అభ్యర్థులు సంబంధిత పార్టీ పెద్దలను కలుస్తున్నట్లు తెలిసింది. ఒకరకంగా అభ్యర్థి పేరు ఖరారు చేసినప్పటికీ పార్టీ పెద్దలు గోప్యంగా ఉంచుతున్నారు. ఇటు జెడ్పీటీసీ,ఎంపీటీసీ స్థానాల్లో నామినేషన్లు ఎక్కువగా కాంగ్రెస్, టీఆర్ఎస్ నుంచే వచ్చాయి. జెడ్పీ పీఠం రేసులో ప్రధానంగా ఈ రెండు పార్టీలే పోటీలో కీలకం కానున్నాయి. పంచడానికి రంగం సిద్ధం.. పరిషత్ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులకు దాదాపుగా పార్టీ టికెట్లను ఖరారు చేసిన ఆయా పార్టీలు, పార్టీ ఫండ్‌ను అందజేయడానికి సిద్ధం చేస్తున్నాయి. ధనబలం ఉన్న అభ్యర్థులకు, పార్టీపరంగా మరికొంత డబ్బును ఇస్తే గెలవడం సాధ్యమవుతుందనే ఉద్దేశంతో పార్టీ ఫండ్‌ను ఇవ్వడానికి పార్టీలు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. పోటీ అభ్యర్థులు గ్రామాల్లోని సర్పంచ్, ద్వితీయశ్రేణి నాయకులు, కుల సంఘాలతో రహస్య మంతనాలు జరిపి ప్యాకేజీలకు ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. డబ్బులు, మద్యం పంచడానికి టీంలుగా విభజించి వారికి జోరుగా దావత్‌లు ఇస్తున్నారు. యూత్ సభ్యులను మచ్చిక చేసుకునే పనిలో పడ్డారు. మరి ఓటరన్న ఎవరిని గెలిపిస్తాడో కొద్దిరోజులు వేచిచూడాల్సిందే. -
బరిలో ఎవరో?
ఇందూరు, న్యూస్‌లైన్: జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు అభ్యర్థిత్వాల ఉపసంహరణ గడు వు సోమవారంతో ముగియనుంది. జిల్లాలో 36 జడ్పీటీసీ స్థానాలకుగా ను 497 నామినేషన్లు, 583 ఎంపీటీసీ స్థానాలకు గాను 4,752 నామినేషన్లు దాఖలైన విషయం తెలిసిందే. నాలుగు రోజుల క్రితం ఎంతో ఉత్సాహంతో నామినేషన్లు వేసిన వివిధ పార్టీలకు చెందిన నేతలు టికెట్లు దొరికే పరిస్థితి లేకపోవడంతో మనస్తాపంతో నామినేషన్ల ఉపసంహరణకు సిద్ధమవుతున్నారు. సుమారు 40 శాతం మంది అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్యాకేజీల గొడవ ప్రధాన పోటీదారులు తమ విజయానికి ఆటంకంగా మారుతున్నవారి అభ్యర్థిత్వాలను ఉపసంహరించుకునేందుకు ప్యాకేజీలను మాట్లాడుకుం టున్నారు. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం ఒక్కో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానానికి సుమారు ఐదారుగురు పోటీలో నిలబడవచ్చని అధికారిక వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ లెక్కన మొత్తం జడ్పీటీసీ స్థానాలకు రెం డు వందలకుపైగా, ఎంపీటీసీ స్థానాలకు మూడు వేల మందికిపైగా పోటీ లో ఉండచ్చని అంచనా వేస్తున్నారు. సోమవారం సాయంత్రం ఐదు గం టల వరకు బరిలో ఉన్న అభ్యర్థుల జాబితాను అధికారులు ప్రకటించే అవకాశం ఉంది. ఈ జాబితాను మండల కార్యాలయాలలో ప్రదర్శించడంతోపాటు, అక్కడి రిటర్నింగ్ అధికారులకు అందజేస్తారు. ‘బి’ ఫారం ఇవ్వకపోతే స్వతంత్ర అభ్యర్థిగానే.. అభ్యర్థులు నామినేషన్లు వేసిన సమయంలో వారు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారో ధ్రువీకరణ పత్రాలను సమర్పించలేదు. అభ్యర్థులు సోమవారం మధ్యాహ్నం మూడు గంటలలోగా ‘బి’ఫారాలను రిటర్నింగ్ అధికారికి అందజేయాలి. లేదా అధికారులు సాయంత్రం ప్రకటించే తుది జాబితాలో వారిని స్వతంత్ర అభ్యర్థులుగా ప్రకటిస్తారు. ఈ నేపథ్యంలో ‘బి’ఫారాల కోసం వివిధ పార్టీల అభ్యర్థులు అగ్రనేతల వద్ద తంటాలు పడుతున్నారు. పార్టీ టికెట్లు దొరకని పక్షంలో కొంతమంది ప్రత్యర్థి పార్టీల వైపు చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. -
పెరిగిన నామినేషన్లు
ఇందూరు, న్యూస్‌లైన్ : జడ్పీటీసీకి, ఎంపీటీసీ స్థానాలకు మంగళవారం నామినేషన్ల జోరు పెరిగింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు జడ్పీటీసీకి ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాకపోగా, భోజన విరామం తర్వాత సాయంత్రం ఐదు గంటల లోపు ఆరుగురు అభ్యర్థులు నామినేషన్లు వేశారు. పిట్లం మండలానికి చెందిన ప్రతాప్‌రెడ్డి టీఆర్ఎస్ తరపున రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. ఇటు మండల కార్యాలయాలలో ఎంపీటీసీ స్థానాలకు మొత్తం 134 నామినేషన్లు దాఖలయ్యాయి. కాంగ్రెస్ నుంచి 36, టీడీపీ నుంచి 15, టీఆర్ఎస్ నుంచి 33, బీజేపీ నుంచి 18, స్వతంత్రులు 32 మంది నామినేషన్లు వేశారు. వాహనదారులు ఇబ్బందుల పాలు జిల్లా పరిషత్ ముందు పోలీసులు రోడ్డుపై బారికేడ్లు ఏర్పాటు చేయడంతో వాహన దారు లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జిల్లా పరిషత్ దాటిన తర్వాత నాందేవ్‌వాడ, దుబ్బ, గౌతంనగర్, హమల్వాడీ, చంద్రశేఖర్ కాలనీ, ఎన్జీఓస్ కాలనీలున్నాయి. ఈ ప్రాంత ప్రజలు తమ నివాసాలకు వెళ్లాలంటే జిల్లా పరిషత్ రోడ్డు మీద నుంచి వెళ్లాలి. పోలీసులు ఈ దారిని మూసివేయడంతో చుట్టూ తిరిగి వెళ్లాల్సి వచ్చింది. నామినేషన్ కేంద్రానికి రోడ్డుకు కొద్ది దూరంలో ఉన్నప్పటికీ పోలీసులు రోడ్డును బ్లాక్ చేయడంపై నిరనసలు వ్యక్తం అయ్యాయి. -
తొలి రోజు నామినేషన్ల జోరు
ఇందూరు, న్యూస్‌లైన్: జిల్లాలో సోమవారం ఓవైపు హోలీ సంబురాలు.. మరో వైపు నామినేషన్ల జోరు కొనసాగింది. హోలీ రోజు నామినేషన్ వేస్తే కలిసి వస్తుందనే సెంటిమెంట్‌తో వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్లు వేశా రు. దీంతో తొలిరోజు జడ్పీటీసీకి 3, ఎంపీటీసీకి 57 నామినేషన్లు దాఖలయ్యాయి. జడ్పీటీసీ స్థానానికి టీఆర్ఎస్ తరపున వర్ని మండలం జలాల్పూర్ గ్రామానికి చెందిన సింగంపల్లి గంగారాం మొదటి నామినేషన్ వేశారు. తర్వాత కాంగ్రెస్ తరపున వేల్పూర్ మండలం పచ్చల నడ్కుడ గ్రామానికి చెందిన సాతెల్లి కవిత, కామారెడ్డి మండలం దేవన్‌పల్లి గ్రామానికి చెందిన నరేశ్ నామినేషన్లను వేశారు. నామినేషన్ దాఖలు చేయడానికి వీరు తమ ప్రాంతాల నుంచి ప్రత్యేక వాహనాల్లో జిల్లా కేంద్రానికి తరలి వచ్చారు. జిల్లా పరిషత్‌లో ఏర్పాటు చేసిన కేంద్రంలో నామినేషన్లు వేశారు. ఎంపీటీసీ స్థానాలకు ఆయా మండల కార్యాలయాల్లో అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఎంపీటీసీ స్థానాలకు టీఆర్ఎస్ నుంచి 10, కాంగ్రెస్ నుంచి 17, టీడీపీ నుంచి 5, బీజేపీ నుంచి 5, స్వాతంత్రు 20 మంది నామినేషన్ వేశారు. అదేవిధంగా పలువురు అభ్యర్థులు జిల్లా కేంద్రానికి వచ్చి నామినేషన్ ఫారాలను తీసుకెళ్లారు. ఈ దృశ్యాలన్నీ అధికారులు వీడియో తీయిస్తున్నారు. జిల్లా పరిషత్, మండల పరిషత్ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాల వద్ద పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా పరిషత్ కార్యాలయం రెండు గేట్లను మూసివేసి, బారికేడ్లను అడ్డంగా పెట్టారు. జడ్పీ ఉద్యోగులను సైతం గుర్తింపు కార్డులు లేనిదే లోపలికి అనుమతించలేదు. జిల్లా పరిషత్ వైపు ద్విచక్ర వాహనాలు తప్ప ఇతర వాహనాలను అనుమతించలేదు. -
ఎండలలో గొంతెండదు
ఇందూరు, న్యూస్‌లైన్: వేసవిలో జిల్లా ప్రజలకు తాగునీటి సమస్య లు తలెత్తకుండా గ్రామీణ నీటి సరఫరా (ఆర్డబ్ల్యూఎస్) అధికారులు ప్రత్యేక ప్రణాళికను రూపొందించారు. పని చేయని బోర్ల మరమ్మతులతోపాటు ట్యాంకుల ద్వారా నీటిని సరఫరా చేయాల్సిన ప్రాంతాలను గుర్తించారు. అయితే, ఈసారి వేసవిలో తాగునీటి ఎద్దటి తీవ్రంగా ఉండబోదని అధికారులు పేర్కొంటున్నారు. ఆశించిన దానికం టే అధిక వర్షపాతం నమోదు కావడమే ఇందుకు కారణంగా చెబుతున్నారు. భూగర్భ జలాలు పు ష్కలంగా ఉన్నాయంటున్నారు. అయినా, ఎక్క డా ఎలాంటి నీటి ఎద్దడి ఏర్పడకుండా జిల్లా యంత్రాంగం దృష్టి సారించింది. ముందస్తు చర్యలలో భాగంగా మండలాలవారీగా ఏఈలు సర్వే నిర్వహించి నివేదికను తయారు చేశారు. వేసవిలో నీటి ఎద్దడి తీర్చడానికి సుమారు రూ. కోటిన్నర నిధులు అవసరం అవుతాయని అంచనా వేశారు. ప్రతిపాదనలను ఉ న్నతాధికారులకు, జిల్లా కలెక్టర్‌కు సమర్పించారు. వేసవి ప్రణాళిక ఇలా జిల్లాలో సుమారు 1,800 ఆవాస ప్రాంతాలున్నాయి. ఇందులో 1,054 ప్రాంతాలలో తాగునీటి సరఫరా ఉంది. 590 ప్రాంతాలలో పాక్షికంగా నీటి సరఫరా జరుగుతోం ది. 159 ప్రాంతాలలో సరఫరా అసలే లేదు. కొన్ని చోట్ల నీటి సరఫరా ఉన్నప్పటికీ నీటిలో ఫ్లోరైడ్ శాతం అధికంగా ఉంది. సురక్షితం కాని ఈ ప్రాంతాలకు సీపీడబ్ల్యూ, పీడబ్ల్యూసీ, ఆర్ఓ వాటర్ ప్లాంట్ల ద్వారా నీరు అందించడానికి చర్యలు చేపట్టనున్నారు. అలాగే 39 గ్రామాలలో అద్దె బోరుల ద్వారా, 31 గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయనున్నారు. పని చేయకుండా ఉన్న 347 బోర్లు, మోటార్లు, చేతి పంపులకు మరమ్మతులు చేయించనున్నారు. 77 గ్రామాలకు వాటర్ ట్యాంక్‌లను నిర్మించేందుకు ప్రతిపాదనలను సిద్ధం చేశారు. పుష్కలంగా నిధులు వేసవిలో తాగునీటి సరఫరాకు కావాల్సిన నిధులు పుష్కలంగా ఉన్నాయి. సీపీడబ్ల్యూ పథకానికి సంబంధించినవాటికి జిల్లా పరిషత్ 13వ ఆర్థిక సంఘం నిధులు న్నా యి. పీడబ్ల్యూసీ పథకాలకు సంబంధించినవాటికి గ్రామ పంచాయతీ నిధులతో పాటు 13వ ఆర్థిక సంఘం నిధులున్నాయి. మళ్లీ ప్రభుత్వం వేసవి కోసం మంజూరు చేసే నిధులు వేరు. వీటిని ప్రణాళిక బద్ధంగా వినియోగించడానికి ఉన్నతాధికారులు చర్యలు చేపట్టనున్నారు. -
స్థానికానికీ సై
ఇందూరు, న్యూస్‌లైన్: మండల, జిల్లా పరిషత్ ఎన్నికల నేపథ్యంలోగతంలో పోటీ చేసినవారితో పాటు కొత్తగా రేసులోకి దిగేవారు కూడా తమకు రిజర్వేషన్లు కలిసి వస్తాయో లేదోననే ఉత్కంఠలో ఉన్నారు. గెజిట్ నోటిఫికేషన్, ఎన్నికల షెడ్యూల్ ఖరారు కానున్నం దున జిల్లాలో అధికార, ఇతర పార్టీల నా యకులు గెలుపు గుర్రాల కోసం వెతుకులా ట ప్రారంభించారు. మరికొందరు ఆశావహులు కీలకమైన జ డ్పీ చైర్మన్ గిరి కోసం పావులు కదుపుతున్నారు. రిజర్వేషన్లు ఖరారు కాక ముందే తాము పోటీ చేస్తున్నామంటూ ఇప్పటి నుం చే పలువురు ప్రచారం చేసుకుంటున్నారు. గ్రామాల్లో ఎన్నికల వాతావరణం రోజు రో జుకు వేడెక్కుతోంది. 2006 ఎన్నికల్లో జిల్లాలో 528 ఎం పీటీసీ, 36 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగ్గా, 2011 జూలైలో పాలక వర్గాల పదవీ కాలం ముగిసింది. ఇప్పుడు జరుగనున్న ఎన్నికలకు 2011 జనాభా లెక్కల ప్రకారం 55 ఎంపీటీసీ స్థానాలు అదనంగా పెరిగాయి. నియోజక వర్గాల పున ర్విభజనలో ఎల్లారెడ్డి, సదాశివనగర్, వేల్పూర్, నందిపేట్ మండలాలు మినహా అన్ని మండలాల్లో ఒకటి నుంచి ఐదు వరకు ఎంపీటీసీ స్థానాలు పెరిగాయి. పెరిగిన స్థానాలపై ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించేందుకు 2013 సెప్టెంబర్ 14న ముసాయిదా జాబితాను విడుదల చేసి మండల పరిషత్ కార్యాలయాల్లో ప్రదర్శించారు. మొత్తం 20 అభ్యంతరాలు వచ్చాయి. ఇందులో 11 అభ్యంతరాలు పరిష్కరించి, 9 అభ్యంతరాలను అధికారులు తిరస్కరించారు. 27న మళ్లీ ఎంపీటీసీల తుది జాబితాను ప్రకటించారు. జిల్లాలో పెరిగిన 55 స్థానాలతో మొత్తం ఎంపీటీసీల సంఖ్య 583కు చేరింది. ఎంపీటీసీ స్థానాలు పెరడగడం పై వివిధ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. అధికారుల కసరత్తు రెండు రోజుల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు సంబంధించిన రిజర్వేషన్లను ఎన్నికల కమిషన్ ప్రకటించనున్న నేపథ్యంలో జిల్లా అధికారులు ఎన్నికల నిర్వహణకు కసరత్తును ప్రారంభించారు. ఈ పాటికే జిల్లాలో 1695 పోలింగ్ కేంద్రాలు, వాటిలో ఏర్పాటు చేసే పోలింగ్ బాక్సులను సిద్ధం చేసి ఉంచారు. ఓటర్ల జాబితా కూడా సిద్ధంగా ఉంది. ఇటు నగర పాలక ఎన్నికలకు సమాయత్తం అవుతూనే స్థానిక సంస్థల ఎన్నికల పనుల్లో అధికారులు నిమగ్నం అయ్యారు. కాగా ఈ ఎన్నికలను బ్యాలెట్ బాక్సులు, లేదా ఈవీఎంల ద్వారా నిర్వహించే విషయమై ఎన్నికల కమిషన్ స్పష్టత ఇవ్వాల్సి ఉంది. -
పోరుట ఫలితమే తెలంగాణ
పోరుట ఫలితమే తెలంగాణ 60 ఏళ్లకు లభించిన విముక్తవేదనను తీర్చింది మాతృమూర్తులే ఉద్యమ చరిత్రలో బోధన్ దీక్షలకు స్థానం టీజేఏసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర జుక్కల్‌లో మిన్నంటిన సంబురాల ఢిల్లీ నుంచి వచ్చిన సింధేకు ఘనస్వాగతం లింబాద్రి గుట్టపై బీజేపీ విజయోత్సవం సుష్మా చలవేనన్న అల్జాపూర్ శ్రీనివాస్. ఇందూరు ఆదివారమూ ఆడిపాడింది. తెలంగాణ విజయోత్సవాలను ఘనంగా జరుపుకుంది. ఊరూవాడా ఏకమై చిందేసింది. జై తెలంగాణ నినాదాలతో హోరెత్తించింది. నిజామాబాద్ నగరం, కామారెడ్డి, బోధన్, ఆర్మూరు, జుక్కల్ తదితర ప్రాంతాలలో విజయోత్సవాలు సాగాయి. బోధన్‌లో 1,519 రోజుల పాటు కొనసాగిన దీక్షలు ముగిశాయి. ఢిల్లీ నుంచి జుక్కల్‌కు చేరుకున్న ఎమ్మెల్యే హన్మంతు సింధేకు కార్యకర్తలు, ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. భీమ్‌గల్ మండలం లింబద్రిగుట్టలో బీజేపీ విజయోత్సవ సభ నిర్వహించింది. జిల్లా అంతటా జై తెలంగాణ నినాదాలు మారుమోగాయి. -
నేటి నుంచి ‘అంగన్వాడీ’ సేవలు బంద్
ఇందూరు, న్యూస్‌లైన్ : తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీ ఉద్యోగులు సోమవారం నుంచి సమ్మె చేపట్టనున్నారు. దీంతో జిల్లాలోని 2,410 అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణులకు,బాలింతలకు, పిల్లలకు అందించాలిన పౌష్టికాహారంతోపాటు, సేవలు పూర్తిగా నిలిచిపోనున్నాయి. వారం రోజుల పాటు అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు విధుల్లోకి వెళ్లకుండా కేంద్రాలన్నింటికి తాళాలు వేసి ఆందోళనలో పాల్గొననున్నారు. అంగన్వాడీ ఉద్యోగులు తీర్మానం చేసిన ఉద్యమ కార్యాచరణ ప్రకారం మొదటి దశగా సోమవారం జిల్లా ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట, అన్ని సీడీపీఓ ప్రాజెక్టు కార్యాలయాల ఎదుట ధర్నా నిర్వహించి ప్రభుత్వానికి నిరసన తెలుపనున్నారు. జిల్లాలోని అంగన్వాడీ ఉద్యోగులందరు ఈ ఆందోళన కార్యక్రమాల్లో తప్పకుండా పాల్గొనాలని ఆ సంఘం నాయకులు పిలుపునిచ్చారు. -
మండలానికో రీసోర్స్ భవనం
ఇందూరు,న్యూస్‌లైన్: జిల్లాలోని ప్రతి మండలంలో పంచాయతీ రాజ్ శాఖ రీసోర్స్ సెంటర్లను నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. ఇందుకోసం ఒక్కో భవనానికి రూ.20 లక్షల వరకు ఖర్చు చేయనుంది. ఈ మేరకు పంచాయతీ శాఖ అధికారులకు ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. ప్రస్తుతం ఎలాంటి సమావేశాలు నిర్వహించుకోవాలన్నా... అధికారులు, పాలక వర్గాలు ఏదైనా హోట్‌ల్‌లోని కాన్ఫరెన్స్ హాటళ్లను ఆశ్రయించాల్సి వస్తోంది. స్థలాలు వెదకడం పూర్తికాగానే రీసోర్స్ సెంటర్ భవనాల నిర్మాణాల పనులు ప్రారంభమవుతాయి. ఐదు నెలల క్రితమే గ్రామ పంచాయతీ పాలక వర్గాలు ఏర్పాటు కాగా, త్వరలోనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరుగనున్నాయి. కొత్త పాలక వర్గాలకు పంచాయతీరాజ్ శాఖ తరపున శిక్షణ తరగతులు నిర్వహిస్తారు. అధికారులు కూడా శిక్షణ తరగతులను ఈ భవనాల్లో నిర్వహించుకోవచ్చు. రీసోర్స్ సెంటర్ల నిర్వహణ కోసం కో ఆర్డినేటర్, బిల్డింగ్ సూపర్వైజర్, సివిల్ ఎలక్ట్రికల్ ఇంజినీర్, డాటాఎంట్రీ ఆపరేటర్లను నియమిస్తారు. జిల్లా కేంద్రంలోనూ.. మండల కేంద్రాల్లో పంచాయతీ రీసోర్స్ సెంటర్ల మాదిరిగానే జిల్లా కేంద్రంలోనూ జిల్లా పంచాయతీ రీసోర్స్ సెంటర్‌ను నిర్మించనున్నారు. ఈ భవన నిర్మాణం కోసం కోటి రూపాయలను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తుంది. ఈ భవన నిర్మాణం కోసం ముందుగా సిర్పూర్ గ్రామ శివారులో స్థలం వెదికారు. అయితే జిల్లా కేంద్రానికి దూరంగా ఉండటంతో దానిని రద్దు చేశారు.ప్రస్తుతం జిల్లా పరిషత్ కార్యాలయం వెనుక శిథిలావస్థలో ఉన్న క్వార్టర్లను కూలివేసి అక్కడ భవనాన్ని నిర్మించాలని అధికారులు యోచిస్తున్నారు. ఈ భవనాన్ని త్వరితంగా నిర్మించేందుకు నిధుల విడుదల కోసం జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న ప్రత్యేక చొరవ చూపుతున్నట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. సమావేశాలకు,శిక్షణ తరగతులకు అనువుగా ఉంటుంది... - సురేశ్ బాబు, జిల్లా పంచాయతీ అధికారి జిల్లాలో నిర్మించే రీసోర్స్ సెంటర్లు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. పంచాయతీరాజ్ శాఖ అధికారులతో పాటు పాలక వర్గాలకు సమావేశాలు, శిక్షణ తరగతులు నిర్వహించుకోవడానికి అనువుగా ఉంటాయి. వేరే భవనాల కోసం వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు. -
ఏకగ్రీవ పంచాయతీలకు ఏదీ నజరానా?
ఇందూరు/డిచ్పల్లి, న్యూస్‌లైన్: సర్పంచుతోపాటు గ్రామపంచాయతీ పాలకమండలి సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే అధిక నిధులు వస్తాయని, వీటితో గ్రామాలను అభివృద్ధి చేసుకోవచ్చని ఆశించి జిల్లాలోని 73 పంచాయతీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికలు జరిగి ఐదు నెలలు గడుస్తున్నా ఏకగ్రీవ పంచాయతీలకు ప్రభుత్వం ఇస్తానని చెప్పిన నజరానా సొమ్ము విడుదల కాలేదు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో గ్రామాలలో ఎన్నికల పేరిట కక్షలు పెరగవద్దని, రాజకీయాలకతీతంగా ఏకగ్రీవం చేసుకుంటే ప్రోత్సాహకంగా మేజర్ పంచాయతీలకు రూ. 10 లక్షలు, చిన్న పంచాయతీలకు రూ. 5 లక్షలు అందజేశారు. ప్రస్తుత ప్రభుత్వం ఆ నజరానాను మేజర్ పంచాయతీకి రూ. 15 లక్షలు, మైనర్ పంచాయతీకి రూ. 7 లక్షలకు పెంచింది. దీంతో ఈ సారి ఎన్నికలలో పలు గ్రామాల ప్రజలు సర్పంచ్‌తో పాటు పాలకమండలి సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఐదు నెలలు గడుస్తున్నా ఇంతవరకు ప్రభుత్వం వాటికి నజరానా విడుదల చేయడం లేదు. దీంతో గ్రామాలలో అభివృద్ధి కుంటుపడుతోంది. నిర్వహణ ఖర్చు కూడా తగ్గుతుందని గ్రామాలలో ఎన్నికల పేరిట కక్షలు పెరుగకుండా ఉండడంంతో పాటు, ఎన్నికల నిర్వహణ ఖర్చు కూడా తగ్గుతుందని భావించిన ప్రభుత్వం నజరానా సొమ్మును పెం చింది. ఏకగ్రీవం అయిన పంచాయతీలలో 15వేలు అంతకుపైగా జనాభా ఉన్న పంచాయతీలకు రూ. 15లక్షలు, అంత కంటే తక్కువ జనాభా ఉన్న పంచాయతీలకు రూ. 7 లక్షలను ఇవ్వనున్నట్లు ప్రకటించింది. 2013 జూలైలో నిర్వహించిన ఎన్నికలలో జిల్లాలోని 718 పంచాయతీలకు గాను 73 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. ఆయా గ్రామాల సర్పంచులు, పాలకమండలి సభ్యులతో పాటు గ్రామస్తులు తమ గ్రామాల అభివృద్ధికి నిధులు పుష్కలంగా వస్తాయని భావించారు. ప్రభుత్వం ఇచ్చిన మాట మరిచి పోవడంతో ఒక్క రూపాయి మంజూరు కాలేదు. నజరానా సొమ్మును కేవలం గ్రామాభివృద్ధి కోసం మాత్రమే వినియోగించాలని నింబంధన విధించింది. జిల్లాలో ఏకగ్రీవంగా ఎన్నికైన 73 పంచాయతీలలో 15వేల కంటే తక్కువ జనాభా ఉండటంతో ఒక్కో పంచాయతీకి రూ.7 లక్షలు రావాలి. మొత్తం రూ. 5. 11 కోట్లు మం జూరు కావాలి. ఎన్నికలు జరిగిన రెండు మూడు నెలలలోపు ప్రభుత్వం నజరానా నిధులను మంజూరు చేస్తుందని సర్పంచులు భావించారు. కానీ, అలా జరుగలేదు. నజరానాతో అభివృద్ధి పనులు ప్రభుత్వం అందించే నజరానా సొమ్ము, స్థానిక ఎమ్మెల్యే, ఎంపీతోపాటు ఎమ్మెల్సీలు ఇచ్చే నిధులతో గ్రామాన్ని ఐదేళ్ల కాలంలో అన్ని రంగాలలో అభివృద్ధి చేయవచ్చ ని సర్పచులు భావించారు. ఇప్పటికైనా ప్రభుత్వం నజరానా సొమ్ములను విడుదల చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. -
పంచాయతీకి ‘రెడీ’
ఇందూరు, న్యూస్‌లైన్: జిల్లాలో రెండు సర్పంచ్, రెండు వార్డు స్థానాలకు శనివారం ఉప ఎన్నికలు నిర్వహించడానికి జిల్లా పంచాయతీ అధికారులు సర్వం సిద్ధం చేశారు. సదాశివనగర్ మండలం పోసానిపేట, ఎల్లారెడ్డి మండలం అడవి లింగాల గ్రామాల సర్పంచులు ఆకస్మికంగా మరణించడంతో ఈ సర్పంచ్ స్థానాలతో పాటు, వివిధ మండలాల్లో ఎన్నికలు జరగని 36 వార్డు స్థానాల్లో ఉప ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. సర్పంచ్, వార్డు స్థానాలకు నామినేషన్లు స్వీకరించిన అధికారులు వాటిని పరిశీలించి న అనంతరం పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. ప్రసుత్తం సదాశివనగర్ మండలం పోసానిపేట్ సర్పంచ్ స్థానానికి ఇద్దరు, ఎల్లారెడ్డి మం డలం అడవిలింగాల సర్పంచ్ స్థానానికి ఇద్దరు అభ్యర్థులు బరిలో ఉన్నారు. అలాగే వివిధ మండలాల్లోని 36 వార్డు స్థానాలకుగాను 29 వార్డు స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. ఐదు స్థానాలకు అభ్యర్థులెవరు నామినేషన్లు దాఖలు చేయకపోవడంతో అక్కడ ఎన్నికలు నిర్వహించడంలేదు. మిగిలిన మద్నూర్ మండలం బండెకల్లూర్ గ్రామంలోని 3,9 వార్డు స్థానాల్లో మాత్రమే ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎన్నికల నిర్వహణకు ఒక్కరోజే సమయం ఉన్నందున జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న పంచాయతీ, రెవెన్యూ, పోలీ సు శాఖల అధికారులతో ప్రత్యేక సమీక్షలు నిర్వహిం చారు. పంచాయతీ అధికారులు ఎన్నికల నిర్వహణకు అవసరమైన సిబ్బందిని, బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లు ఇతర సామగ్రిని సంబంధిత పోలింగ్ కేంద్రాలకు తరలించారు. వెబ్ కెమెరాలను పోసానిపేట పోలింగ్ కేంద్రం లోనే ఏర్పాటు చేస్తున్నారు. మిగతా పోలింగ్ కేం ద్రాల్లో వాటిని ఏర్పాటు చేయడానికి సౌకర్యం లేదని జిల్లా పంచాయతీ అధికారి సురేశ్‌బాబు ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. వెబ్ కెమెరాలకు బదులు వీడియో చిత్రీకరణ చేయిస్తున్నామన్నారు. మైక్రో పరిశీలకుల నియామకం ఎన్నికలు జరిగే ప్రాంతాలను పర్యవేక్షించడానికి జిల్లాకు కేంద్ర ప్రభుత్వ అధికారులైన ముగ్గురు మైక్రో పరిశీలకులను నియమిస్తూ ఎన్నికల కమిషన్ ఉత్తర్వు లు జారీ చేసింది. అడవి లింగాల గ్రామానికి శ్రీనివాస్‌రెడ్డిని, పోసానిపేట గ్రామానికి లింగం, బండెకల్లూర్ గ్రామానికి డి.రమేష్‌లు నియామకమయ్యారు. వీరు శుక్రవారం జిల్లాకు చేరుకుని ఎన్నికలు జరిగే ప్రాంతాలను తిరిగి పర్యవేక్షించనున్నారు. ఎన్నికలు జరిగే రోజు కూడా పర్యవేక్షణ చేస్తారు. అదేవిధంగా జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఏజేసీ, జిల్లా పంచాయతీ అధికారి, ఇతర అధికారులు ఎన్నికల సరళిని పరిశీలిస్తారు. -
ఇదేం ‘పంచాయతీ’
ఇందూరు, న్యూస్‌లైన్: జిల్లాలో 29 పంచాయతీ కార్యదర్శుల పోస్టులను భర్తీ చేయడానికి 2013 డిసెంబర్ మెదటి వారంలో అధికారులు నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. ఈ పోస్టులకు ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇతర కేటగిరీల అభ్యర్థులు మొత్తం 5,500 మంది వరకు దరఖాస్తు చేసుకున్నారు. నిరుద్యోగ అభ్యర్థులతో పాటు పని చేస్తున్న కాంట్రాక్టు కార్యదర్శులు కూడా ఇం దులో దరఖాస్తు చేసుకోవాలని, సర్వీసును గుర్తించి డిగ్రీ మార్కులే కాకుండా 25 శాతం వెయిటేజీ మార్కులు ఇవ్వనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. అయితే, తమను రెగ్యులర్ చేస్తానని గతంలో హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇపుడు అన్యాయం చేస్తోందంటూ జిల్లాలో పనిచేస్తున్న సుమారు 24 మంది కాంట్రాక్టు కార్యదర్శులు డిసెంబర్ 10న ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. దీంతో కాంట్రాక్టు కార్యదర్శులను రెగ్యులర్ చేయాలని, వారు పని చేస్తున్న పోస్టులను భర్తీ చేయకూడదని ట్రిబ్యునల్ జనవరి మొదటి వారం లో తీర్చు నిచ్చింది. కాంట్రాక్టు కార్యదర్శులుగా పని చేస్తున్న వారిలో ఇంటర్ అర్హత ఉంటే వారికి డిగ్రీ పూర్తి చేసే వరకు సమయాన్ని ఇచ్చి, ఆ తరువాత వారిని రెగ్యులర్ చేస్తూ నియమక పత్రాలు ఇవ్వాల ని సూచించింది. ఈ తీర్పు కాంట్రాక్టు కార్యదర్శులకు అనుకూలంగానే ఉన్నప్పటికీ 29 పోస్టుల భర్తీకి అధికారులు జారీ చేసిన నోటిపికేషన్ విషయంలో ఏం చేయాలో ట్రిబ్యునల్ ఎలాంటి స్పష్టత ఇవ్వలే దు. దీంతో జిల్లా పంచాయతీ అధికారులకు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఎదురైంది. అయితే ట్రిబ్యునల్ ఉత్తర్వులు తమకు ఇంకా చేరలేదని చెబుతున్నారు. దరఖాస్తులు చేసుకున్నవారి పరిస్థితేంది ట్రిబ్యునల్ కాంట్రాక్టు కార్యదర్శులకు అనుకూలం గా ఇవ్వడంతో.. 29 పోస్టులకు దరఖాస్తులు చేసుకున్న నిరుద్యోగుల పరిస్థితి అయోమయంగా మా రింది. దూర ప్రాంతాల నుంచి ప్రయాణ ఖర్చులు పెట్టుకుని జిల్లా కేంద్రానికి వచ్చి ఎంతో ఆశతో దరఖాస్తులు చేసుకున్నారు. బీసీలు దరఖాస్తు చేసుకునే సమయంలో రూ.50 డీడీ కూడా కట్టారు. ఈ మొత్తం నిధులు రూ.2లక్షలకు పైగా డీపీఓ ఖాతాలో జమ అయ్యాయి. ఉచితంగా దరఖాస్తులు చేసుకున్న వారేమేగాని,డబ్బులు ఖర్చు చేసి దరఖాస్తు చేసుకున్న వారినుంచి వ్యతిరేకత వచ్చే అవకాశాలున్నా యి. ఈ తికమకపై పంచాయతీ అధికారులు జిల్లా కలెక్టర్‌తో లేదా ప్రభుత్వంతో చర్చించనున్నారు. స్పష్టత వచ్చే వరకు భర్తీ చేయం - సురేశ్‌బాబు, జిల్లా పంచాయతీ అధికారి ట్రిబ్యునల్ కోర్టు ఇచ్చిన తీర్పు కాంట్రాక్టు కార్యదర్శులకు అనుకూలంగా ఉంది. కాని 29 పోస్టుల భర్తీకి మేం ఇచ్చిన నోటిఫికేషన్, పోస్టుల కోసం దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థుల విషయంలో ఏం చేయాలని కోర్టు సూచించిందో తెలియదు. ఉత్తర్వులను పరిశీలించి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాం. అప్పటి వరకు కాంట్రాక్టు కార్యదర్శులను రెగ్యులర్ గాని, పోస్టుల భర్తీ గాని చేయబోం. -
మెనూలో కోత
ఇందూరు, న్యూస్‌లైన్: వసతిగృహ విద్యార్థులకు పౌష్టికాహారంలో కోత పడనుంది. ప్రస్తుతం అమలవుతున్న మెనూలో మార్పులు చోటు చేసుకోనున్నాయి. నానాటికీ పె రుగుతున్న ధరల కారణంగా పౌష్టికాహారంలో కోతలు విధించడానికి సంక్షేమాధికారులు ప్రణాళికను సిద్ధం చేశారు. ఈ పాటికే విద్యార్థులకు రుచికరమైన భోజనం అందటం లేదనుకుంటే ఇటు పౌష్టికాహారానికీ తూట్లు పొడుస్తున్నారు. వారంలో ఒక కోడి గుడ్డు, రెండు అరటి పండ్లు కోత విధించాలని అధికారులు నిర్ణయించారు. దీనికి సంబంధించిన కొత్త మెనూను తయారు చేసి జిల్లా కలెక్టర్ అనుమతి కోసం ఫైలును పంపించారు. కలెక్టర్ సంతకం చేసిన వెంటనే కోతలు ప్రారంభం కానున్నాయి. అయితే కొత్త మెనూ సం క్రాంతి తరువాత అమలు చేసే అవకాశం ఉందని సంక్షేమాధికారులు పే ర్కొంటున్నారు. కాగా వసతి గృహాలకు గుడ్లు, పప్పులు, నూనెలు ఇతర నిత్యవసరాలను సరఫరా చేసే ఏజెన్సీ నిర్వాహకులు, వార్డెన్లు చేతు లెత్తేస్తున్నారు. పెరిగిన రేట్ల ప్రకారం తమకు బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. కూరగాయల ధరలు ఆకాశాన్నంటడం, గుడ్డు రేటు రూ.5కు ఎగబాకడం, సిలిండర్ ధర కొత్త సంవత్సరంలో రూ.1400లకు చేరువ కావడంతో వసతి గృహ విద్యార్థులకు భోజనం, పౌష్టికాహారం అందించడం కష్టంగా మారిందని అంటున్నారు. ప్రభుత్వం మెస్ చార్జీలు పెంచకపోవడంతో పౌష్టికాహారంలో కోతలు విధించాలని ఎస్సీ,ఎస్టీ,బీసీ సంక్షేమ శాఖల అధికారులు, వార్డెన్లు ఇటీవల సమావేశమై నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థుల పొట్టగొట్టడం న్యాయమేనా..? పెరిగిన నిత్యావసరాల ధరల కారణంగా ప్రభుత్వం 9 డిసెంబర్ 2012నకొత్త మెనూను అమలు చేయాలని జీఓ జారీ చేసింది. ప్రతి విద్యార్థికి ప్రతి రోజు ఒక గుడ్డు, అరటి పండుతో పాటు పాలు అందించాలని సూచించి అదనంగా నిధులు కేటాయించింది. దీనిని జిల్లా సంక్షేమాధికారులు అమలు చేస్తూ వస్తున్నారు. అయితే ఆరు నెలలుగా అన్ని రకాల వస్తువులపై ధరలు పెరగడంతో సంక్షేమంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఎలాగొలా నెట్టుకుంటూ వచ్చిన వార్డెన్లకు ఇప్పుడు సాధ్యం కావడంలేదు. అయితే ధరలు ఎంత పెరిగినా విద్యార్థులకు అందించాల్సిన ఆహారంలో కోతలు విధించడం సరికాదని విమర్శలు వస్తున్నాయి. అవసరం అయితే ప్రభుత్వం నుంచి అదనంగా నిధులను తెప్పించాలే గానీ విద్యార్థులకు పౌష్టికాహారం దూరం చేయడం సరికాదంటున్నారు. జిల్లాలో ఎస్సీ,ఎస్టీ,బీసీ వసతి గృహాలు మొత్తం 120 వరకు ఉన్నాయి. సూమారు 10 వేల నుంచి 12 వేల మంది విద్యార్థుల వరకు ఉంటున్నారు. వీరికి కొత్త మెనూ ప్రకారం వారానికి ఆరు రోజులకు బదులు ఐదు రోజులు గుడ్డును అందించనున్నారు. అరటి పండును వారానికి ఆరు రోజుల బదులు నాలుగు రోజులు ఇవ్వనున్నారు. ఇలా ప్రతి విద్యార్థి నెలకు నాలుగు గుడ్లు, 8 అరటి పండ్లను కోత విధించనున్నారు. ఇవే కాకుండా మరి కొన్ని కూడా కోతలు విధించే ఆలోచనలో కూడా అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. కలెక్టర్‌దే తుది నిర్ణయం... -ఖాలేబ్, సాంఘిక సంక్షేమ శాఖ,జాయింట్ డెరైక్టర్ వసతిగృహ విద్యార్థులకు అందించే పౌష్టికాహారంలో కోతలు విధిస్తున్నామనే విషయం వాస్తవమే. అయితే అధికారులందరం కలిసి వారానికి ఒక గుడ్డు, రెండు అరటి పండ్లు కోత విధించాలని నిర్ణయించాం. ఈ విషయంలో కలెక్టరే తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. గ్యాస్ సిలిండర్, కూరగాయల ధరల పెరుగుదల కారణంగా ఇలా కోతలు విధించడం తప్పడంలేదు. -
ఉపకారం దూరం
ఇందూరు, న్యూస్‌లైన్: మొన్న మొన్నటి వరకు కళాశాలలో చదువుతున్నట్లు ప్రిన్సిపాల్ సంతకంతో కూడిన ధ్రువీకరణ పత్రం, రేషన్‌కార్డు జిరాక్స్, బ్యాం కు ఖాతా, కుల, ఆదాయ ధ్రువీకరణపత్రాల ను దరఖాస్తు ఫారానికి జత చేస్తే మార్చిలోగా ఉపకార వేతనాలు వచ్చేవి. కానీ, ఇప్పుడున్న ప్రభుత్వం పైవాటితో పాటు ఆధార్ కార్డు, సొంత సెల్‌ఫోన్ నంబరుతో విద్యార్థులే నేరుగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కొన్ని నెల ల క్రితం నిబంధన విధించింది. ఈ నిబంధన లు సరిపోవన్నట్లుగా ఉపకార వేతనాల దర ఖా స్తుల పరిశీలన అధికారుల వ్యవస్థను రద్దు చేసి, ఆ బాధ్యతలను సంబంధిత కళాశాలల యాజ మాన్యాలకే అప్పగించింది. ఇక బయోమెట్రిక్ మెషిన్ ద్వారా విద్యార్థులకు ఉపకార వేతనాలు అందించాలని, దీనికి విద్యార్థి వేలి ముద్రతో పాటు, కళాశాల ప్రిన్సిపాళ్ల సంతకం కూడా తప్పని సరిగా ఉండాలని, అయితేనే ఉపకార వేతనాలు మంజురు అవుతాయని కొత్త కొత్త షరతులు పెట్టి తల నొప్పిగా మా ర్చుతోంది ప్రభుత్వం. దీంతో ఉపకారం పేద విద్యార్థులకు అందని ద్రాక్షలా మారుతోంది. ఇదీ పరిస్థితి జిల్లాలో ప్రభుత్వ, ప్రయివేటు కళాశాలు కలిపి సూమారు 280 వరకు ఉన్నాయి. ఇందులో ఫ్రెష్, రెన్యూవల్ ఉపకార వేతనాలకు దరఖాస్తులు చేసుకున్న ఎస్సీ, ఎస్ టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులు దాదాపుగా 80 వేలకు పైగా ఉన్నారు. వీరిలో 15 శాతం మందికి ఆధార్ కార్డు రాకపోవడం, సొంత సెల్ఫోన్లు లేకపోవడంతో ఇప్పటి కీ ఆన్‌లైన్‌లోకి ఎంట్రీ కావడం లేదు. సెల్‌ఫోన్ నెంబరు లేకపోడం ప్రధాన సమస్యగా మారింది. ఉపకార వేతనాలకు దరఖాస్తులు చేసుకునే వారందరు పేద విద్యార్థు లే కావడంతో సెల్‌ఫోన్‌ను వాటడంలేదు. వాడినవారికీ సమస్యగానే మారింది. ఎందుకంటే, ఉపకార వేతనాలు రెన్యూవల్ కావాలంటే సెల్ నంబరుకు ఒక హై సెక్యూ రిటీ నంబరును మెసేజ్ ద్వారా పంపుతారు. అది వచ్చిన మరుక్షణమే సంబంధిత కళాశాల వారు ఫోన్ చేసి ఆ నంబరు చెప్పమంటారు. అది చెబితేనే ఉపకార వేతనం పొందటానికి అర్హూలు. లేదంటే అనర్హూలవుతారు. ఈ నిబంధనతో జిల్లావ్యాప్తంగా రెండు నుంచి మూడు వేల మంది వరకు విద్యార్థులు తమ ఉపకార వేతనాన్ని నష్ట పోయినట్లు సంక్షేమాధికారులు, కళాశాలల ప్రిన్సిపాళ్లు అంచనా వేశారు. అంటే ప్రభుత్వం పెట్టిన లేనిపోని నిబంధనలతో వారికి అన్యాయం జరిగినట్టే. భయపెట్టిస్తున్న బయోమెట్రిక్ విధానం ఇంత జరుగుతున్నా ప్రభుత్వం పట్టనట్లుగా వ్యవహరిస్తోంది. నెలకో నిబంధన, కొత్త విధానాలంటూ అసలుకే ఎసరు పెడుతోంది. నెల రోజుల క్రితం కొత్తగా బ యో మెట్రిక్ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. అమలు చేసేందుకు చర్యలు కూడా ప్రారంభించింది. ఈ విధానంపై ప్రిన్సిపాళ్లు, జిల్లా సంక్షేమాధికారులకు అవగాహన కలిగించేందుకు సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి రేమండ్ పీటర్ నిర్వహించాలనుకున్న వీడియో కాన్ఫరెన్స్ వాయిదా పడుతూ వస్తోంది. ఉపకార వేతనం పొందాలంటే ప్రతి విద్యార్థి వేలిముద్ర కచ్చితంగా బయోమెట్రిక్ యంత్రంలో నమోదు కావాలి. దానితోపాటు సంబంధిత కళాశాల ప్రిన్సిపాల్ సంతకం కూడా ఉండాలి. ఇటు విద్యార్థి ఆధార్ కార్డులో నమోదు చేసిన వేలి ముద్రలు, బయోమెట్రిక్ మెషిన్లో నమోదు చేసిన వేలిముద్రలు సరిపోలకుంటే ఆ విద్యార్థికి ఉపకార వే తనం రానట్లే. మూడు నెలలలో ఎలా సాధ్యం? ఉపకార వేతనాలను ఎగవేసే కుట్రలో భాగంగానే బయోమెట్రిక్ మెషిన్ విధానాన్ని ప్రవేశపెట్టారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ విద్యా సంవత్సరం మార్చితో ము గియనుంది. ఇంకా యంత్రాలు జిల్లాకు రాలేదు. ఈ పాటికే అధికారులు ప్రక్రియను పూర్తి చేసి ఉండాలి. ప్రభుత్వం దీనికి వ్యవధిని నిర్ణయించకపోవడంతో నిధులు ఎ ప్పుడు విడుధల అవుతాయో అర్థకాని పరిస్థితి నెలకొంది. 80 వేల మందితో వేలిముద్రలు తీసుకోవడం, అవి ఆధార్‌లో ఉన్న వేలి ముద్రలతో సరిచూడడం కష్టసాధ్యం అవుతుందని ప్రిన్సిపాళ్లు పేర్కొంటున్నారు. బయోమెట్రిక్ మెషిన్లను కళశాలల యాజమాన్యాలే కొనుగోలు చేసుకోవాలని సర్కారు మరో తిరకాసు పెట్టింది. ఒక్కో మె షిన్ రూ.30 వేల వరకు ఉండటంతో తాము సొంత నిధులతో ఎలా కొనుగోలు చేయాలని ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ కొన్నా విద్యార్థుల నుంచే డబ్బులు వసూలు చేయాలని కళాశాలల యాజమాన్యాలు నిర్ణయించుకున్నట్లు సమాచారం. ప్రభుత్వ కళాశాలలు మాత్రం ప్రభుత్వం ఇచ్చే నిధులతో కొనుగోలు చేయాలని సూచించింది. ప్రభుత్వ నిర్ణయం సరికాదు విద్యార్థులకు మంజూరు చేసే ఉపకార వేతనాల విషయంలో ప్రభుత్వం నెలకో నిర్ణయం తీసుకుంటోంది. బయోమెట్రిక్ మెషిన్, సొంత సెల్ ఫోన్ నంబరు విధానం తో విద్యార్థులు ఉపకారానికి దూరం అయ్యే అవకాశం ఉంది. పేద విద్యార్థుల దగ్గర సెల్ఫోన్లు ఎలా ఉంటాయి? బయోమెట్రిక్ మెషిన్లను ఎవరికివారే కొనుక్కోవడ ం, వేలి ముద్రలు తీసుకోవడం యాజమాన్యాలకు అదనపు భారమే. - ప్రవీణ్ కుమార్, శ్రీసాయి జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్,నందిపేట్ -
గడువులోగా పనులు పూర్తిచేయాలి
ఇందూరు,న్యూస్‌లైన్ : గ్రామాల్లో జనవరి పదో తేదీలోగా బీఆర్జీఎఫ్ పనులు పూర్తి చేయని సర్పంచుల చెక్ పవర్ రద్దు చేస్తామని, ఈ విషయాన్ని జిల్లాలోని 718 గ్రామ పంచాయతీల సర్పంచులకు సమావేశం ఏర్పాటుచేసి తెలియజేయాలని ఎంపీడీఓలను జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న దేశించారు. ఇందులో ఉపేక్షించేది లేదని తేల్చి చె ప్పారు. బుధవారం జిల్లాపరిషత్ సమావేశ మందిరంలో జిల్లాలో కొనసాగుతున్న 2012- 13, 2013-14 బీఆర్జీఎఫ్ పనుల పురోగతిపై ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, ఇంజినీరింగ్ అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. 2013-14 సంవత్సరానికి సంబంధించిన బీఆర్జీఎఫ్ పనులు ప్రారంభించని వాటిని వెంటనే ప్రాంభించాలని, ముఖ్యంగా గ్రామాల్లో పనులు పెండింగ్‌లో ఉన్నందున సర్పంచులు చర్యలు తీసుకోవాలన్నారు. నిర్ణయించిన గడువు తేదీలోగా పనులు పూర్తిచేయని సర్పంచుల చెక్ పవర్‌ను తక్షణమే రద్దు చేయాలని జిల్లా పంచాయతీ అధికారిని, ఎంపీడీఓలను ఆదేశించారు. ఎన్నికల నోటిఫికేషన్‌ను జారీ చేస్తే పనులను ప్రాంభించడం వీలు పడదన్నారు. దీంతో నిధులు వృథా అవుతాయన్నారు. లక్షలోపు ఉన్న పనులను జనవరి పదో తేదీలోగా పూర్తి చేయాలని, రూ.లక్ష నుంచి రెండు రూ.లక్షల పనులను ఫిబ్రవరి 10వ తేదీలోగా పూర్తి చేయాలన్నారు. రెండు లక్షల కన్న ఎక్కువగా ఉన్న పనులను మార్చి నెలాఖరులోగా పూర్తి చేయాలని, నిర్ణయించిన గడువు విషయంలో ఎలాంటి మార్పు ఉండబోదన్నారు. నిర్లక్ష్యం చేసిన సర్పంచులపైనే కాకుండా మండలాధికారులపై కూడా చర్యలు తప్పవన్నారు. ఇసుక క్వారీలు వేరే వ్యక్తులకు వద్దు జిల్లాలో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలకు ఇసుక కొరత తీవ్రంగా ఉందని చెబుతున్నారని కలెక్టర్ అన్నారు. ఇందుకు సంబంధిత మండలంలో లేదా పక్క మండలంలో ఎంపీడీఓల పేరుతో వాగుల్లో ఇసుకను తీయడానికి క్వారీని అనుమతిస్తున్నానని, కానీ ఆ క్వారీలు వేరే వ్యక్తుల పేరిటగాని, ఇతర పనులకు ఇసుకను వాడటంగాని జరిగితే ఎంపీడీఓలపై కఠిన చర్యలు తీసుకుంటానని కలెక్టర్ హెచ్చరించారు. వివిధ కారణాలతో మరుగుదొడ్ల నిర్మాణాలు నిలిచిపోతున్నాయని కారణాలు చెప్పి తప్పించుకోవడం కుదరదన్నారు. మరుగుదొడ్లు నిర్మిస్తున్న నేపథ్యంలో రింగుల తయారీదారులు ఎక్కువ ధరలకు అమ్ముతున్నారని ఓ ఎంపీడీఓ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. స్పం దించిన కలెక్టర్ రింగులను ఎక్కువ ధరకు అమ్మే వారిని తమ కంట్రోల్లో పెట్టుకోవాలని, సరైన ధరకే అమ్మే విధంగా చూడాలన్నారు. అలాకాదని ఎక్కువ ధరకు అమ్మిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే రింగుల తయారీ కోసం దరఖాస్తులు చేసుకున్న వారికి త్వరగా సబ్సిడీ రుణాలు ఇప్పించాలని, బ్యాంకు అనుమతి ఇవ్వని వారికి బ్యాంకరుతో మాట్లాడి రుణం వచ్చేలా చేయాలని కలెక్టర్ సూచించారు. ఈ నెలాఖరులోగా మరుగుదొడ్ల నిర్మాణంలో పురోగతి కనిపించాలన్నారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ రాజారాం, డ్వామా పీడీ శివలింగయ్య, ఐకేపీ పీడీ వెంకటేశం ఇతర అధికారులు పాల్గొన్నారు. పనిచేసే దమ్ముండాలి.. మెతక వైఖరి పనికిరాదు.. 2012-13 బీఆర్జీఎఫ్ పనులను కూడా ఇంతవరకు పూర్తి చేయలేని పరిస్థితిలో అధికారులు ఉన్నారని కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎంపీడీఓ కార్యాలయానికి సంబంధించిన ప్రహరీ నిర్మాణానికి ఓ వ్యక్తి అడ్డు తగిలి కోర్టులో కేసు వేశాడని బాన్సువాడ ఎంపీడీఓ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ‘ మీ కార్యాలయానికే ప్రహరీ నిర్మించుకోలేని విధంగా ఉన్నావు.. ఇక ప్రజలకు ఉపయోగపడే పనులు ఎలా చేస్తావు.. నీకు సిగ్గుగా అనిపించడంలేదా..’ అంటూ అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వ అధికారి పనిచేసే దమ్ముండాలని, మెతక వైఖరి పనికిరాదని కలెక్టర్ హితవు పలికారు. నేటి నుంచి కొత్త పెన్షన్‌దారులు డబ్బులు తీసుకోవచ్చు జిల్లాలో రచ్చబండ కార్యక్రమంలో ప్రభుత్వం మంజూరు చేసిన కొత్త పెన్షన్లకు సంబంధింత పెన్షన్‌దారులు పోస్టాఫీసుల్లో డబ్బులు తీసుకోవచ్చని కలెక్టర్ తెలిపారు. ఈ విషయం గ్రామాల్లో దండోర వేయించాలని సూచించారు. రచ్చబండలో మంజూరైన రేషన్ కార్డులు, పెన్షన్, ఇందిరమ్మ ఇళ్లు కొందరికి రెండుసార్లు, మరికొందరు బోగస్ ఉండటం, లబ్ధిదారులు చనిపోయిన వారికి మంజూరైనట్లు చెప్పారు. మంజూరైన వాటిని వివరాలతో సహా తనకు అప్పగించాలని మండలాధికారులను ఆదేశించారు. వాటిని ప్రభుత్వానికి సరెండర్ చేస్తానని కలెక్టర్ తెలిపారు. -
పల్లె ఖజానాఖాళీ
ఇందూరు, న్యూస్‌లైన్: పల్లెసీమల అభివృద్ధికి మూలమైన గ్రామ పంచాయతీలకు ఆర్థిక వనరులను సమకూర్చడంలో పంచాయతీ అధికారులు విఫలమవుతున్నారు. పంచాయతీలలో సకాలంలో పన్నులను వసూలు చేయడంలో గ్రామ కార్యదర్శులు తీవ్ర నిర్లక్ష్యం చూపుతున్నారు. జిల్లాలోని 718 గ్రామ పంచాయతీల ఆదాయాలను లెక్కించిన ప్రభుత్వం 2013-14 సంవత్సరానికి గాను రూ. 47.24 కోట్లు పన్నుల రూపంలో వసూలు చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆగస్టులోగా 60 శాతం పన్నుల వసూళ్లు పూర్తికావాల ని సూచించింది. అయితే, అధికారులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరించడంతో లక్ష్యం నీరుగారిపోయింది, గ్రామ కార్యదర్శులు సైతం పన్నుల వసూలును తీవ్రంగా పరిగణించడం లేదు. దీంతో ఇప్పటి వరకు రూ. 9.23 కోట్లు మాత్రమే వసూలయ్యాయి. ఇంకా రూ.38.01 కోట్లు వసూలు కావాల్సి ఉంది. జిల్లాలోని 74 మేజర్ గ్రామ పంచాయతీలలోనూ పన్నులను 30 శాతం మాత్రమే వసూలు చేశారు. ఇంటి పన్ను, నల్లా బిల్లులు, మార్కెట్ సెస్సు, లెసైన్సు ఫీజు, సెల్‌టవర్ స్థలాల అద్దెలను సిబ్బంది నెలనెలా కచ్చితంగా వసూలుచేయాలి. కానీ, ఎక్కడా ఇది సక్రమంగా సాగడం లేదు. దీంతో పంచాయతీలకు నిధులు సమకూరక ప్రజలకు సౌకర్యాలు అందడం లేదని అంటున్నారు. మరోవైపు పంచాయతీ కార్యదర్శుల కొరత సైతం పన్నుల వసూళ్లకు ఆటంకంగా మారింది. జిల్లాలో 718 పంచాయతీలు ఉంటే 200 మంది కార్యదర్శులు మాత్రమే పని చేస్తున్నారు. నోటీసులు జారీ గ్రామాలలో పన్నుల వసూళ్లు కుంటుపడడంతో అధికారులు స్పందించారు. బకాయి పడిన రూ.38.01 కోట్ల పన్నులను రాబట్టేందుకు చర్యలు చేపట్టారు. బకాయిలు చెల్లించని వారికి డిమాండ్ నోటీసులు జారీ చేయాలని జిల్లా పంచాయతీ అధికారి సురేశ్‌బాబు గ్రామ కార్యదర్శులను ఆదేశించారు. దీంతో కార్యదర్శులు పన్ను బకాయి దారులకు నోటీసులు జారీ చేయడం మొదలు పెట్టారు. గడువులోగా బకాయిలును చెల్లించకుంటే చట్టపరమైన తీసుకుంటామని హెచ్చరికలు చేస్తున్నారు. రాష్ట్ర అధికారులు కూడా జిల్లాలో పన్నుల వసూలు తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ప్రేక్షక పాత్ర గ్రామ పంచాయతీ కార్యదర్శులు డీఎల్పీఓలు, ఈఓపీఆర్డీల ఆధీనంలో పని చేస్తారు. వీరు కార్యదర్శులకు పన్ను వసూళ్ల విషయంలో ఏనాడు సమావేశాలు నిర్వ హించి మార్గదర్శకాలు జారీ చేసిన సందర్భాలు లేవని సంబంధితలే వర్గాలు పేర్కొంటున్నాయి. చర్యలు తీసుకుంటున్నాం.. -సురేశ్‌బాబు, జిల్లా పంచాయతీ అధికారి జిల్లాలో బకాయి పడిన పన్నులను రాబట్టేందుకు చర్యలు తీసుకుంటున్నాం. లక్ష్యం మేరకు 38.01 కోట్లు వసూలు చేయాలని జిల్లాలోని పంచాయతీ కార్యదర్శులను ఆదే శించాం. పన్నులు కట్టని వారికి నోటీసులు ఇవ్వాలని సూచించాం. -
29 పోస్టులు దరఖాస్తులు 5808
ఇందూరు, న్యూస్‌లైన్ : గ్రామ పంచాయతీ కార్యదర్శి పోస్టులకు దరఖాస్తులు వెల్లువెత్తా యి. ఈ నెల 6న జిల్లాలో పంచాయతీ కార్యదర్శుల పోస్టులకు నోటిఫికేషన్ వెలువడింది. చాలాకాలం తర్వాత కార్యదర్శి పోస్టుల భర్తీ చేయనుండడంతో నిరుద్యోగులు వేల సంఖ్యలో పోటీ పడుతున్నారు. అధికారులు ప్ర తి రోజు 500 నుంచి 1500 వరకు దరఖాస్తులను స్వీకరించారు. మొత్తం 29 పోస్టులకు గాను 5,808 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అంటే ఒక్కో పోస్టుకు రెండు వందల మంది బరిలో ఉన్నారు. దరఖాస్తులకు గడు వు చివరి రోజైన శనివారం జిల్లా పం చాయతీ కార్యాలయం అభ్యర్థులతో కిక్కిరిసిపోయింది. అభ్యర్థులకు దరఖాస్తు ఫారాలు ఇవ్వడానికి మూడు కౌంటర్లు, పూరించిన దరఖాస్తులను స్వీకరించడానికి మూడు కౌంటర్లను ఏర్పాటు చేశారు. అతి తక్కువ పోస్టులకు ఇంత పెద్ద మొత్తంలో దరఖాస్తు లు రావడం ఇదే మొదటి సారని అధికారులు పేర్కొంటున్నారు. దరఖాస్తులను అధికారులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ కేటగిరి కింద విభజిస్తారు. అనంతరం పరిశీలన చేసి దరఖాస్తులు సరి గ్గా చేసుకున్న అభ్యర్థుల వివరాలను నోటీసు బోర్డుపై పెడతారు. ఈ ప్రక్రి య పూర్తయ్యేవరకు 15రోజులు పట్టవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. పోస్టులు రావని తెలిసినా.. గ్రామ కార్యదర్శి పోస్టులు తమకు దక్కవని తెలిసినా.. అదృష్టాన్ని పరీ క్షించుకునేందుకే చాలా మంది అభ్యర్థులు దరఖాస్తులు చేకున్నారు. ప్రభుత్వం కల్పించిన వెయిటేజీ మార్కులతో మొత్తం 29 పోస్టుల్లో సుమారు 20 పోస్టులు కాంట్రాక్టు కార్యదర్శుల కే సొంతం కానున్నాయి. అంటే మిగి లే తొమ్మిది ఉద్యోగాలను ఐదు వేల మందికి పైగా ఆశిస్తున్నారు. -
పంచాయతీలను బలోపేతం చేయాలి
ఇందూరు, న్యూస్‌లైన్ : గ్రామ పంచాయతీలను బలోపేతం చేయడానికి అధికారులు కృషి చేయాలని పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ వరప్రసాద్ అన్నారు. నూతనంగా సర్పంచులు ఎన్నికైన నేపథ్యంలో గ్రామాలను పటిష్టం చేయాలని, ప్రజలకు అవసరమైన సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకోవాలన్నారు. ఆయన మంగళవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా పంచాయతీరాజ్ అధికారులతో సమీక్షించారు. తాగు,సాగునీరు, విద్యుత్‌దీపాలు, డ్రైనేజీ, రోడ్లు ఇతర సౌకర్యాలు లేని గ్రామాలను గుర్తించాలన్నారు. సర్పంచులతో ప్రణాళిక తయారు చేసుకుని సౌకర్యాల కల్పనకు ఎన్ని నిధులు అవసరమవుతాయో నివేదికను సిద్ధం చేసుకోవాలన్నారు. పంచాయతీల అదాయం తక్కువగా ఉందని, దీంతో గ్రామాల అభివృద్ధికి నిధులు సరిపోవడంలేదన్నారు. ఇందుకు గ్రామాల వారీగా పన్నుల వసూళ్లు డిమాండ్ ఎంత ఉందో, ఎంత వసూలు చేశారు, ఇంకా ఎంత చేయాలి, గ్రామాభివృద్ధికి ఎన్ని నిధులు అవసరమో తెలుసుకోవాలన్నారు. రాజీవ్ స్వశక్తి యోజన పథకం(ఆర్‌జీపీఎస్‌ఏ) కింద పంచాయతీలకు కొత్త భవనాలు, సిబ్బంది కొరత తీర్చడం, కంప్యూటర్ వ్యవస్థలను ఏర్పాటు చేస్తామన్నారు. మండల స్థాయిలో రిసోర్సు సెంటర్లను ఏర్పాటు చేసి, ప్రతి గ్రామ పంచాయతీలో కొత్త ఏడాదిలో కంప్యూటర్లను ఇస్తామని కమిషనర్ వెల్లడించారు. ఈ-పంచాయతీ ఆన్లైన్ ద్వారా మొత్తం వివరాలు అన్ని ఇందులో నమోదు అవుతాయన్నారు. పంచాయతీ కార్యదర్శుల భర్తీకి.. జిల్లాల్లో ఖాళీ ఉన్న గ్రామ పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నామని, జిల్లాల వారీగా నోటిఫికేషన్లు వేయాలని, అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని కమిషనర్ వరప్రసాద్ ఆదేశించారు. ప్రస్తుతం పని చేస్తు కాంట్రాక్టు కార్యదర్శులకు ఇందులో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తున్నామన్నారు. వీరికి 25శాతం వెయిటేజీ ఇస్తున్నట్లు తెలిపారు. ఎలాంటి రాత పరీక్ష ఉండదని, డిగ్రీ మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుందన్నారు. జిల్లాకు మంజూరైన బీఆర్జీ నిధులు,పనులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో డీపీఓ సురేశ్‌బాబు, జెడ్పీ సీఈఓ రాజారాం, పంచాయతీరాజ్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
ఫలితమివ్వని ‘బస’
ఇందూరు, న్యూస్‌లైన్ : జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ వసతి గృహాలు 116 ఉన్నాయి. వీటిలో విద్యార్థులకు కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పన కోసం రెండు నెలల క్రితం కలెక్టర్ ప్రద్యుమ్న రాత్రి బస కార్యక్రమం చేపట్టారు. జిల్లాస్థాయి అధికారులందరూ నెలలో ఒకరోజు హాస్టళ్లలో బస చేసి విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు, కావాల్సిన మౌలిక వసతులు తెలుసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం ప్రత్యేక ప్రొఫార్మా తయారు చేశారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందుతుందా, వసతిగృహాల్లో తాగునీరు, టాయిలెట్లు, విద్యుత్ సౌకర్యాలున్నాయా అన్న వివరాలను ప్రొఫార్మాలో పొందుపర్చాలి. రెండు సార్లు హాస్టళ్లలో బస చేసిన అధికారులు 209 సమస్యలను గుర్తించి కలెక్టర్‌కు నివేదిక అందించారు. అయితే ఇప్పటివరకు సౌకర్యాల కల్పనకు ఏ వసతి గృహంలోనూ చర్యలు చేపట్టకపోవడం గమనార్హం. నిధులు లేకపోవడంతో వసతులు కల్పించలేకపోయామని సంక్షేమ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. కాగా మౌలిక సదుపాయాల కల్పనను పక్కన పెట్టి ప్రస్తుతానికి వసతి గృహల పరిసరాల్లోని అపరిశుభ్ర వాతావరణాన్ని తొలగించడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా ఈ పనులను త్వరలో చేపట్టనున్నారు. అయితే కలెక్టర్ స్పందించి హాస్టళ్లలోని ప్రధాన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు. త్వరలో పరిష్కారం జిల్లాలోని వసతి గృహాల్లో అధికారులు రెండు సార్లు బస చేశారు. పలు సమస్యలను గుర్తించి కలెక్టర్‌కు నివేదిక ఇచ్చారు. కొన్ని వసతి గృహాల్లో సదుపాయాల కల్పనకు నిధులు వచ్చాయి. మరికొన్నింటికి త్వరలో నిధులు మంజూరవుతాయి. హాస్టళ్లలోని సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తాం. -విమలాదేవి, జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి -
ఇందూరుతో ‘రావూరి భరద్వాజ’కి అనుబంధం
జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత రావూరి భరద్వాజ శుక్రవార రాత్రి హైదరాబాద్‌లో అకాల మరణం పొందడంతో జిల్లా సాహితీలోకం దిగ్భ్రాంతి చెందింది. భరద్వాజకు జిల్లాతో విడదీయలేని అనుబంధముంది. కొన్నినెలల క్రితమే కేంద్ర ప్రభుత్వం ఆయన రాసిన ‘పాకుడు రాళ్లు’ నవలకు జ్ఞానపీఠ్ అవార్డు ప్రకటించింది. ఇటీవలే ఢిల్లీలో ఆ అవార్డును అందుకున్నారాయన. విశ్వనాథ సత్యనారాయణ, సి. నారాయణరెడ్డి తర్వాత 23ఏళ్లకు ఆ స్థాయి గౌరవం దక్కించున్న తెలుగువాడు భరద్వాజ. జిల్లాకేంద్రంలో ఇందూరు భారతి ఆధ్వర్యంలో నిర్వహించిన మూడు కార్యక్రమాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జ్ఞాన్‌పీఠ్ అవార్డు ప్రకటన తర్వాత జూన్‌లో హరిదా రచయితల సంఘం ఆధ్వర్యంలో రావూరిని సన్మానించారు. భరద్వాజ మృతి సాహితీ లోకానికి తీరని లోటని జిల్లా కవులు వి.పి.చందన్రావు, కందాలై రాఘవాచార్య, ఘనపురం దేవేందర్, మేక రామస్వామి, పడాల రామారావు, కాసర్ల నరేశ్‌రావు, తిరుమల శ్రీనివాస్, నరాల సుధాకర్, ఆయాచితం వెంకటేశ్వర్లు తదితరులు ఆవేదన వ్యక్తంచేశారు. -
మహనీయులను మరిచిపోతున్నాం
ఇందూరు, న్యూస్‌లైన్ : ‘అఖండ భారతదేశంలో మహార్షి వాల్మీకీ లాంటి మహాపురుషులు ఎందరో ఉన్నారు.. వారిని స్మరించుకోకుండా, వారు చూపిన అడుగుజాడల్లో నడవకుండా.. వారినే మరిచిపోతున్నాం.. ఇది అత్యంత బాధాక ర విషయం’ అని జిల్లా కలెక్టర్ పీఎస్ ప్రద్యుమ్న ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి ఏర్పడడానికి ముఖ్యకారణం పాశ్చాత్య సంస్కృతికు అలవాటు పడడమే అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని నూతన అంబేద్కర్ భవన్లో జిల్లా బీసీ వెల్ఫేర్ ఆధ్వర్యంలో వాల్మీకీ జయంతి నిర్వహించారు. ముఖ్యఅతిథిగా కలెక్టర్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. వాల్మీకీ చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలో మొ దటిసారిగా వాల్మీకీ జయంతి ఉత్సవాలు నిర్వహించడం చాలా గొప్పవిషయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడైనా గుర్తించడం అనందించదగ్గ విషయమన్నారు. ఎంతోమంది గొప్ప మేధావులు, మహాపురుషులు పుట్టిన ఈ దేశంలో, మన దేశ సంసృ్కతిని తెలుసుకోలేని స్థితిలో మనం ఉన్నామన్నారు. కనీసం మనకు పుట్టిన పిల్లలకు కూడా చెప్పుకోలేని స్థితిలో ఉన్నామన్నారు. వారికి వాల్మీకీ అంటే ఎవరో తెలియదన్నారు. దేశ సంసృ్కతి, గొప్ప వ్యక్తులు, మహా పురుషుల గురించి చె ప్పాల్సిన అవసరం మనపై ఉందన్నారు. ఇలాంటి పరి స్థితి ఎదురుకాకుండా ఉండడానికి ప్రభుత్వం గొప్ప వ్యక్తుల జయంతి వేడుకలను నిర్వహిస్తోందన్నారు. వాల్మీకీ ఒక కూలానికి చెందిన వ్యక్తి కాదని సా మాన్య మానవుడేనన్నారు. రామాయణం రాసిన మొ ట్టమొదటి వ్యక్తిగా చరిత్రలో నిలిచి, గత చరిత్రను మనకు తెలియజేశారన్నారు. 24వేల శ్లోకాలు రాసి, ఆదికవిగా పేరు పొందారన్నారు. ఒక సంఘటన ద్వారా తన జీవితంలో మార్పు చోటు చేసుకుని ఇంతటి స్థా యికి ఎదిగారని, ఆయన జీవిత చరిత్ర అందరికి ఆదర్శంగా నిలిచిందన్నారు. ప్రభుత్వం బీసీ సంఘాల సొసైటీల అభివృద్ధికి జిల్లాకు వంద యూనిట్ల రుణాలను మంజూరు చేసిం దని, కాని ఒక్క దరఖాస్తు కూడా రాలేదన్నారు. ఉత్సాహవంతులు ముం దుకు వచ్చి రుణాల కోసం దరఖాస్తులు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. ప్రతి ఏటా నిర్వహించాలి... -వి.గంగాధర్ గౌడ్, ఎమ్మెల్సీ వాల్మీకీ జయంతి ఉత్సవాలను మొదటిసారిగా ప్రభుత్వం నిర్వహించడం అభినందనీయమని ఎమ్మెల్సీ వీజీ గౌడ్ అన్నారు. ప్రతి సారి నిర్వహించాలని ప్రభుత్వానికి సూచించారు. దేశానికి సేవ చేసిన గొప్ప వ్యక్తుల జయంతిలను నిర్వహించాలని, ఇందుకు ప్ర త్యేక నిధులు ఇవ్వాలని కోరారు. బీసీ సంఘాల అభివృద్ధి కోసం మరో వంద యూనిట్లను మంజూరు చే యాలని కలెక్టర్‌ను కోరారు. కార్యక్రమంలో జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారిణి విమలదేవి, బీసీ కార్పొరేషన్ ఇన్చార్జి అధికారి సత్యనారాయణ, జిల్లా వాల్మీకీ సంఘం అధ్యక్షుడు నర్సింలు, బీసీ సంఘం నాయకులు నరాల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. -
వసతి గృహాల్లో విద్యార్థుల రక్షణ ఎక్కడ?
ఇందూరు, న్యూస్‌లైన్ : జిల్లాలో పాఠశాల, కళాశాల విద్యార్థులకు కలిపి మొత్తం 126 వసతి గృహాలు ఉన్నాయి. పాఠశాల విద్యార్థుల వసతి గృహాలు 88 ఉండగా 90 శాతం వరకు సొంత భవనాల్లో కొనసాగుతున్నాయి. కళాశాల విద్యార్థులకు సంబంధించిన హాస్టళ్లలో ఎక్కువగా అద్దె భవనాలలోనే నడుస్తున్నాయి. బీసీ కళాశాల విద్యార్థుల వసతి గృ హాలు 20 ఉండగా 17 అద్దె భవనాలలోనే కొనసాగుతున్నాయి. ఎస్సీ వసతి గృహాలు 15 ఉండగా 14, ఎస్టీ వసతి గృహాలు మూడు ఉండగా రెండు అద్దె భవనాలలోనే నడుస్తున్నాయి. అన్ని హాస్టళ్లకు అనువైన స్థలం ఉన్నప్పటికీ, భవన నిర్మాణాలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడంతో అద్దె భవనాలలో వాటిని కొనసాగించాల్సి వస్తోంది. అక్కడ సరైన వసతులులేవు. కొన్ని హాస్టళ్లు ఇరుకు గదుల్లో, ఎతె్తైన భవనాల్లో ఉన్నాయి. దీంతో విద్యార్థులు ప్రమాదాలకు గురవుతున్నారు. రెండు నెలల క్రితం జిల్లా కేంద్రంలోని సుభాష్‌నగర్‌లో రెండో అంతస్తులో ఉన్న సాంఘిక సంక్షేమ శాఖ కళాశాల విద్యార్థుల వసతి గృహంలోంచి ఓ విద్యార్థి కిందపడిపోయాడు. అదృష్టవశాత్తూ స్వల్ప గాయాలతో ప్రాణాలతో బయటపడ్డాడు. ఈనెల ఐదున వర్ని చౌరస్తాలో రెండో అంతస్తులో ఉన్న బీసీ కళాశాల విద్యార్థుల హాస్టల్పైనుంచి పడి జయచంద్రకాంత్ అనే డిగ్రీ విద్యార్థి మరణించిన విషయం తెలిసిందే. నిబంధనలకు విరుద్ధంగా.. నిబంధనల ప్రకారం వసతి గృహాలు గ్రౌండ్ ఫ్లోర్లో, మొదటి అంతస్తులోనే ఉండాలి. కానీ రెండు, మూడు, నాలుగు అంతస్తుల్లోనూ గదులను అద్దెకు తీసుకుంటున్నారు. అలాగే ప్రమాదాలను నివారించేందుకు చివరి అంతస్తులో సరైన ఎత్తులో ప్రహరీ నిర్మించాల్సి ఉంటుంది. కానీ అద్దె భవనాల్లో కొనసాగుతున్న ఏ హాస్టల్లోనూ ఇలాంటి నిర్మాణం లేదు. దీంతో విద్యార్థులు ప్రమాదాల బారిన పడుతున్నారని తెలుస్తోంది. హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మిస్తే ప్రమాదాలు జరగవని విద్యార్థి సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. నిఘా కరువు వార్డెన్లు హాస్టళ్లలో ఉండడం లేదన్న ఆరోపణలున్నాయి. దీంతో విద్యార్థులపై పర్యవేక్షణ కరువవుతోంది. విద్యార్థులు ఎక్కడికి వెళ్తున్నారో, ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితి. గత ఏడాది మల్లారం సాంఘిక సంక్షేమ కళాశాల బాలుర వసతి గృహానికి చెందిన డిగ్రీ విద్యార్థులు ముగ్గురు మల్లారం చెరువుకు ఈతకు వెళ్లారు. అందులో ఒకరు నీట మునిగి చనిపోయారు. వార్డెన్ స్థానికంగా లేకపోవడం, విద్యార్థులు ఇష్టారాజ్యంగా వ్యవహరిండంతో ప్రమాదం చోటు చేసుకుంది. వార్డెన్‌తోపాటు నైట్ వాచ్మన్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థులు ఎటు వెళుతున్నారన్న సమాచారాన్ని హాస్టల్లోని రిజిస్టర్లో నమోదు చేసేలా చూడాలని సూచిస్తున్నారు. నిబంధనలు అమలు చేస్తాం వసతిగృహాల్లో ఉంటున్న కళాశాల విద్యార్థులు బయటకు వెళ్లకుండా, సెల్‌ఫోన్ వాడకుండా చర్యలు తీసుకోవాలని గతంలో వార్డెన్లకు సూచించాం. వాటిని కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించాం. వార్డెన్ అనుమతి తీసుకోకుండా విద్యార్థులు బయటికి వెళ్లరాదు. విద్యార్థులు సెల్‌ఫోన్ వినియోగించినట్లు తెలిస్తే వార్డెన్‌ను బాధ్యులను చేస్తాం. -విమలాదేవి, బీసీ సంక్షేమ శాఖాధికారి -
హోరెత్తిన ఇందూరు
కంఠేశ్వర్, న్యూస్‌లైన్ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం మరో ముందడుగు వేయడం జిల్లా ప్రజలను సంబురం లో ముంచింది. కేంద్ర కేబినెట్ తెలంగాణ నోట్‌కు ఆమోదముద్ర వేయడంతోనే అన్ని పార్టీలు, జేఏసీలు ర్యా లీలు తీస్తూ టపాకాయలు కాలుస్తూ సంతోషం వ్యక్తం చేశాయి. జిల్లా కేం ద్రంలో శుక్రవారం ఉద్యోగ జేఏసీ ప్రతినిధులు ప్రగతిభవన్ ముందు ఉద్యోగులు స్వీట్లు పంచుకున్నారు. అంతకు ముందు ఉద్యోగులు టీఎన్జీవోస్ భవనం నుంచి ర్యాలీ తీశారు. జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. కేంద్రం అతి త్వరగా పార్లమెంట్లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించాలని ఉద్యోగ జేఏసీ చైర్మన్ గైని గంగారాం అన్నారు. మహిళ ఉద్యోగులు ఈ సంబురాల్లో పాలుపంచుకున్నారు. బీజేపీ నాయకులు గాంధీచౌక్‌లోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు. అమరవీరుల త్యాగఫలితం రాష్ట్ర ఏర్పాటుకు నాంది పలికిందని వారు పేర్కొన్నారు. ట్రాన్స్‌కో జేఏసీ ఆధ్వర్యంలో పవర్‌హౌజ్‌లో టపాకాయలు కాలుస్తు ఆనందం వ్యక్తం చేశారు. జిల్లా కోర్టు లో న్యాయవాదులు టపాకాయలు కాల్చి, స్వీట్లు పంచుకున్నారు. టీఆర్ఎస్ అర్బన్ ఇన్చార్జి బస్వలక్ష్మినర్సయ్య ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వినాయక్‌నగర్‌లోని జై జై వినాయక సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి వి గ్రహానికి పూలమాలలు వేసి స్వీట్లు పంచుకున్నారు. కాలనీవాసులు అందరు తెలంగాణ తల్లి విగ్రహం వద్దకు వచ్చి జై తెలంగాణ అం టూ నినాదాలు చేశారు. డిచ్పల్లి మండల కేం ద్రంలో టీఆర్ఎస్ నియోజక వర్గ ఇన్చార్జి భూపతిరెడ్డి తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ధర్పల్లి, సిరికొండ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, టీఆర్ఎస్ నాయకులు వేరువేరుగా టపాకాయలు కాల్చి విజయోత్సవ ర్యాలీలు నిర్వహించారు. జక్రాన్‌పల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు టపాకాయలు కాల్చారు. మండల కాం గ్రెస్ నాయకులు విజయోత్సవ ర్యాలీ తీశారు. కామారెడ్డిలో కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ నాయకులు విజయోత్సవ ర్యాలీ నిర్వహించి టపాకాయలు కాల్చారు. కామారెడ్డిలో బీజేపీ నాయకులు తెలంగాణ అమరవీరుడు కిష్టయ్య విగ్రహానికి పూలమాలలు వేశారు. మోర్తాడ్‌లో సహకార సంఘంలో స్వీట్లు పంపిణీ చేశారు. కమ్మర్‌పల్లిలో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యం లో స్వీట్లు పంచి, టపాకాయలు కాల్చారు. జుక్కల్‌లో టీఆర్ఎస్, జేఏసీ నాయకులు ర్యాలీ నిర్వహించి స్వీట్లు పంచుకున్నారు. ఎల్లారెడ్డిలో న్యాయవాదులు కోర్టులో సంబురాలు చేశారు. బీజేపీ నాయకుడు బాణాలక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి స్వీట్లు పంచుకున్నారు. టీఆర్ఎస్, జేఏసీ నాయకులు టపాకాయలు కాల్చారు. భిక్కనూరు గ్రామం లో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహిం చారు. ఆర్మూర్‌లోని కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ నాయకులు విజయోత్సవ ర్యాలీలు నిర్వహిం చారు. మాక్లూర్ మండలంలో బీజేపీ ఆధ్వర్యంలో విజయెత్సవ ర్యాలీలు నిర్వహించా రు. బోధన్‌లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీ చేపట్టారు. ఏబీవీపీ నాయకులు భారీ ర్యాలీ నిర్వహించి స్వీట్లు పంచుకున్నా రు. తెలంగాణ ప్రైవేట్ లెక్చరర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. నవీపేట, రెంజల్, ఎడపల్లిలో టీడీపీ, టీఆర్ఎస్, జేఏసీ లు, కాంగ్రెస్ నాయకులు విజయోత్సవ ర్యాలీ లు నిర్వహించారు. -
సకల జన భేరికి కదులుతున్న ఇందూరు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : హైదరాబాద్‌లోని నిజాం కళాశాల మైదానంలో ఆదివారం జరుగనున్న తెలంగాణ సకల జనభేరి బహిరంగ సభకు ఇందూరు నుంచి భారీగా తెలంగాణవాదులు తరలివెళ్లనున్నారు. జనాల తరలింపునకు తెలంగాణ జేఏసీ భాగస్వామ్యపక్షాలు సన్నాహాలు పూర్తి చేశాయి. ఇందులో టీఆర్ఎస్ పెద్దన్న పాత్ర పోషిస్తోంది. పది రోజులుగా జిల్లా రాజకీయ జేఏసీ భాగస్వామి పక్షాలు, తెలంగాణ వాదులు విస్తృత ప్రచార కార్యక్రమాలతో పాటు సభలు, సమావేశాలు నిర్వహించారు. ఈ నేపథ్యం లోనే జిల్లా నుంచి 25 వేల మందిని జనభేరి సభకు తరలించనున్నారు. నిజామాబాద్ నగరంలో వారం రోజుల వ్యవధిలో జనభేరి బహిరంగ సభ విజయవంతం కోసం రెండు సన్నాహాక సభలు నిర్వహించగా టీఎన్జీఓఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దేవీప్రసాద్, ప్రతిని ధులు అద్దంకి దయాకర్, ప్రముఖ కళాకారుడు రసమ యి బాలకిషన్‌తో పాటు టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు హాజరయ్యారు. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా ర్యాలీలు, సమావేశాలు, ఆందోళనలు, మానవహారాల తో పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహించి ప్రచారం చేశారు. టీఆర్ఎస్తో సహా ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యార్థి, కార్మిక, ప్రజా సంఘాలు, అన్ని జేఏసీలు జనభేరి జయప్రదం కోసం పలు కార్యక్రమాలు చేపట్టా యి. మరోవైపు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోచారం శ్రీని వాసరెడ్డి,ఏనుగు రవీందర్‌రెడ్డి, గంప గోవర్ధన్, నియోజకవర్గం ఇన్చార్జులు బస్వా లక్ష్మీనర్సయ్య, ఎ జీవన్‌రెడ్డి, భూపతిరెడ్డి, సురేందర్‌రెడ్డి, బంగారు నవనీతల తోపాటు పార్టీ జిల్లా ఇన్చార్జి కరిమిళ్ల బాబూరావులు జనసమీకరణ కోసం విస్తృతంగా జిల్లాలో పర్యటిం చారు. న్యూడెమోక్రసీతో పాటు ఉద్యోగ, విద్యార్థి, జేఏ సీ ప్రతినిధులు పెద్ద ఎత్తున ప్రచారాన్ని నిర్వహిం చారు. సకల జనభేరి సభకు ప్రజలను తరలించడానికి 385 వాహనాలను టీఆర్ఎస్ జిల్లా నాయకత్వం సమకూర్చింది. జిల్లా నుంచి జనాన్ని సమీకరించేందుకు ఇన్చార్జి బాధ్యతలను ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డికి పార్టీ అధినేత కేసీఆర్ అప్పగించారు. పోచారం జనసమీకరణపై ప్రత్యేక దృష్టి సారించారు. నిజామాబాద్‌లో అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల ఇన్చార్జులు, ఎమ్మెల్యేలతో పాటు టీజాక్ ప్రతినిధులతో విడివిడిగా సమావేశాలు నిర్వహించారు. పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల నుంచి నాలుగు వేల మంది, ఇతర నియోజకవర్గాల నుంచి 15 వందల మందిని హైదరాబాద్ సభకు తరలించటానికి ఏర్పా ట్లు చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. నియోజకవర్గ ఇన్చార్జులు వాహనాలను సమకూర్చుకోవడంతో పా టు సభకు తరలివచ్చే ప్రజలకు అన్ని విధాల సౌకర్యాలను కల్పించే బాధ్యతలను తీసుకున్నట్టు తెలుస్తోం ది. జనసమీకరణలో ఇన్చార్జులు పోటీపడుతున్నట్టు పార్టీ వర్గాల్లో చర్చసాగుతోంది. నియోజక వర్గాల వారీ గా 40 వాహనాలకు తగ్గకుండా ఏర్పాటు చేయటంతోపాటు అవసరాన్ని బట్టి అదనంగా టాటాసుమోలు, తుఫాన్ వంటి వాహనాలను అందుబాటులో ఉంచుతున్నారు. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియకు ప్రస్తుతం కీలక సమయం కావటం వల్లనే సకల జనసభను టీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా టీజేఏసీకి అదనంగా 25 వాహనాలను సమకూర్చారు. ఈ వాహనాల్లో ప్రధానంగా ఉద్యోగులు, రిటైర్ ఉద్యోగులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు తరలి వెళ్లనున్నారు. ఈ మేరకు టీఆర్ఎస్ నుం చి 20 వేల మంది, తెలంగాణ జేఏసీతోపాటు న్యూడెమోక్రసీ, సీపీఐలు కలసి ఐదువేల మందిని హైదరాబాద్‌కు తరలించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. టీజేఏసీలో భాగస్వామ్యపక్షమైన భారతీయ జనతాపార్టీ కూడా హైదరాబాద్‌కు జనసమీకరణపై దృష్టిసారిం చినట్టు ఆపార్టీ వర్గాలు తెలిపాయి. తెలుగుదేశం పార్టీ కూడా జనభేరికి మద్దతు ప్రకటించినట్టు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.