మెనూలో కోత
ఇందూరు, న్యూస్‌లైన్: వసతిగృహ విద్యార్థులకు పౌష్టికాహారంలో కోత పడనుంది. ప్రస్తుతం అమలవుతున్న మెనూలో మార్పులు చోటు చేసుకోనున్నాయి. నానాటికీ పె రుగుతున్న ధరల కారణంగా పౌష్టికాహారంలో కోతలు విధించడానికి సంక్షేమాధికారులు ప్రణాళికను సిద్ధం చేశారు. ఈ పాటికే విద్యార్థులకు రుచికరమైన భోజనం అందటం లేదనుకుంటే ఇటు పౌష్టికాహారానికీ తూట్లు పొడుస్తున్నారు. వారంలో ఒక కోడి గుడ్డు, రెండు అరటి పండ్లు కోత విధించాలని అధికారులు నిర్ణయించారు. దీనికి సంబంధించిన కొత్త మెనూను తయారు చేసి జిల్లా కలెక్టర్ అనుమతి కోసం ఫైలును పంపించారు.
కలెక్టర్ సంతకం చేసిన వెంటనే కోతలు ప్రారంభం కానున్నాయి. అయితే కొత్త మెనూ సం క్రాంతి తరువాత అమలు చేసే అవకాశం ఉందని సంక్షేమాధికారులు పే ర్కొంటున్నారు. కాగా వసతి గృహాలకు గుడ్లు, పప్పులు, నూనెలు ఇతర నిత్యవసరాలను సరఫరా చేసే ఏజెన్సీ నిర్వాహకులు, వార్డెన్‌లు చేతు లెత్తేస్తున్నారు. పెరిగిన రేట్ల ప్రకారం తమకు బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. కూరగాయల ధరలు ఆకాశాన్నంటడం, గుడ్డు రేటు రూ.5కు ఎగబాకడం, సిలిండర్ ధర కొత్త సంవత్సరంలో రూ.1400లకు చేరువ కావడంతో వసతి గృహ విద్యార్థులకు భోజనం, పౌష్టికాహారం అందించడం కష్టంగా మారిందని అంటున్నారు. ప్రభుత్వం మెస్ చార్జీలు పెంచకపోవడంతో పౌష్టికాహారంలో కోతలు విధించాలని ఎస్సీ,ఎస్టీ,బీసీ సంక్షేమ శాఖల అధికారులు, వార్డెన్‌లు ఇటీవల సమావేశమై నిర్ణయం తీసుకున్నారు.
విద్యార్థుల పొట్టగొట్టడం న్యాయమేనా..?
పెరిగిన నిత్యావసరాల ధరల కారణంగా ప్రభుత్వం 9 డిసెంబర్ 2012నకొత్త మెనూను అమలు చేయాలని జీఓ జారీ చేసింది. ప్రతి విద్యార్థికి ప్రతి రోజు ఒక గుడ్డు, అరటి పండుతో పాటు పాలు అందించాలని సూచించి అదనంగా నిధులు కేటాయించింది. దీనిని జిల్లా సంక్షేమాధికారులు అమలు చేస్తూ వస్తున్నారు. అయితే ఆరు నెలలుగా అన్ని రకాల వస్తువులపై ధరలు పెరగడంతో సంక్షేమంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఎలాగొలా నెట్టుకుంటూ వచ్చిన వార్డెన్‌లకు ఇప్పుడు సాధ్యం కావడంలేదు. అయితే ధరలు ఎంత పెరిగినా విద్యార్థులకు అందించాల్సిన ఆహారంలో కోతలు విధించడం సరికాదని విమర్శలు వస్తున్నాయి. అవసరం అయితే ప్రభుత్వం నుంచి అదనంగా నిధులను తెప్పించాలే గానీ విద్యార్థులకు పౌష్టికాహారం దూరం చేయడం సరికాదంటున్నారు. జిల్లాలో ఎస్సీ,ఎస్టీ,బీసీ వసతి గృహాలు మొత్తం 120 వరకు ఉన్నాయి. సూమారు 10 వేల నుంచి 12 వేల మంది విద్యార్థుల వరకు ఉంటున్నారు. వీరికి కొత్త మెనూ ప్రకారం వారానికి ఆరు రోజులకు బదులు ఐదు రోజులు గుడ్డును అందించనున్నారు. అరటి పండును వారానికి ఆరు రోజుల బదులు నాలుగు రోజులు ఇవ్వనున్నారు. ఇలా ప్రతి విద్యార్థి నెలకు నాలుగు గుడ్లు, 8 అరటి పండ్లను కోత విధించనున్నారు. ఇవే కాకుండా మరి కొన్ని కూడా కోతలు విధించే ఆలోచనలో కూడా అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది.
కలెక్టర్‌దే తుది నిర్ణయం...
-ఖాలేబ్, సాంఘిక సంక్షేమ శాఖ,జాయింట్ డెరైక్టర్
వసతిగృహ విద్యార్థులకు అందించే పౌష్టికాహారంలో కోతలు విధిస్తున్నామనే విషయం వాస్తవమే. అయితే అధికారులందరం కలిసి వారానికి ఒక గుడ్డు, రెండు అరటి పండ్లు కోత విధించాలని నిర్ణయించాం. ఈ విషయంలో కలెక్టరే తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. గ్యాస్ సిలిండర్, కూరగాయల ధరల పెరుగుదల కారణంగా ఇలా కోతలు విధించడం తప్పడంలేదు.