ఇందూరు, న్యూస్‌లైన్ : జిల్లాలో పాఠశాల, కళాశాల విద్యార్థులకు కలిపి మొత్తం 126 వసతి గృహాలు ఉన్నాయి. పాఠశాల విద్యార్థుల వసతి గృహాలు 88 ఉండగా 90 శాతం వరకు సొంత భవనాల్లో కొనసాగుతున్నాయి. కళాశాల విద్యార్థులకు సంబంధించిన హాస్టళ్లలో ఎక్కువగా అద్దె భవనాలలోనే నడుస్తున్నాయి. బీసీ కళాశాల విద్యార్థుల వసతి గృ హాలు 20 ఉండగా 17 అద్దె భవనాలలోనే కొనసాగుతున్నాయి. ఎస్‌సీ వసతి గృహాలు 15 ఉండగా 14, ఎస్‌టీ వసతి గృహాలు మూడు ఉండగా రెండు అద్దె భవనాలలోనే నడుస్తున్నాయి. అన్ని హాస్టళ్లకు అనువైన స్థలం ఉన్నప్పటికీ, భవన నిర్మాణాలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడంతో అద్దె భవనాలలో వాటిని కొనసాగించాల్సి వస్తోంది.
అక్కడ సరైన వసతులులేవు. కొన్ని హాస్టళ్లు ఇరుకు గదుల్లో, ఎతె్తైన భవనాల్లో ఉన్నాయి. దీంతో విద్యార్థులు ప్రమాదాలకు గురవుతున్నారు. రెండు నెలల క్రితం జిల్లా కేంద్రంలోని సుభాష్‌నగర్‌లో రెండో అంతస్తులో ఉన్న సాంఘిక సంక్షేమ శాఖ కళాశాల విద్యార్థుల వసతి గృహంలోంచి ఓ విద్యార్థి కిందపడిపోయాడు. అదృష్టవశాత్తూ స్వల్ప గాయాలతో ప్రాణాలతో బయటపడ్డాడు. ఈనెల ఐదున వర్ని చౌరస్తాలో రెండో అంతస్తులో ఉన్న బీసీ కళాశాల విద్యార్థుల హాస్టల్‌పైనుంచి పడి జయచంద్రకాంత్ అనే డిగ్రీ విద్యార్థి మరణించిన విషయం తెలిసిందే.
నిబంధనలకు విరుద్ధంగా..
నిబంధనల ప్రకారం వసతి గృహాలు గ్రౌండ్ ఫ్లోర్‌లో, మొదటి అంతస్తులోనే ఉండాలి. కానీ రెండు, మూడు, నాలుగు అంతస్తుల్లోనూ గదులను అద్దెకు తీసుకుంటున్నారు. అలాగే ప్రమాదాలను నివారించేందుకు చివరి అంతస్తులో సరైన ఎత్తులో ప్రహరీ నిర్మించాల్సి ఉంటుంది. కానీ అద్దె భవనాల్లో కొనసాగుతున్న ఏ హాస్టల్‌లోనూ ఇలాంటి నిర్మాణం లేదు. దీంతో విద్యార్థులు ప్రమాదాల బారిన పడుతున్నారని తెలుస్తోంది. హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మిస్తే ప్రమాదాలు జరగవని విద్యార్థి సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
నిఘా కరువు
వార్డెన్లు హాస్టళ్లలో ఉండడం లేదన్న ఆరోపణలున్నాయి. దీంతో విద్యార్థులపై పర్యవేక్షణ కరువవుతోంది. విద్యార్థులు ఎక్కడికి వెళ్తున్నారో, ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితి. గత ఏడాది మల్లారం సాంఘిక సంక్షేమ కళాశాల బాలుర వసతి గృహానికి చెందిన డిగ్రీ విద్యార్థులు ముగ్గురు మల్లారం చెరువుకు ఈతకు వెళ్లారు. అందులో ఒకరు నీట మునిగి చనిపోయారు. వార్డెన్ స్థానికంగా లేకపోవడం, విద్యార్థులు ఇష్టారాజ్యంగా వ్యవహరిండంతో ప్రమాదం చోటు చేసుకుంది. వార్డెన్‌తోపాటు నైట్ వాచ్‌మన్‌లు ఉండేలా చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థులు ఎటు వెళుతున్నారన్న సమాచారాన్ని హాస్టల్‌లోని రిజిస్టర్‌లో నమోదు చేసేలా చూడాలని సూచిస్తున్నారు.
నిబంధనలు అమలు చేస్తాం
వసతిగృహాల్లో ఉంటున్న కళాశాల విద్యార్థులు బయటకు వెళ్లకుండా, సెల్‌ఫోన్ వాడకుండా చర్యలు తీసుకోవాలని గతంలో వార్డెన్‌లకు సూచించాం. వాటిని కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించాం. వార్డెన్ అనుమతి తీసుకోకుండా విద్యార్థులు బయటికి వెళ్లరాదు. విద్యార్థులు సెల్‌ఫోన్ వినియోగించినట్లు తెలిస్తే వార్డెన్‌ను బాధ్యులను చేస్తాం.
-విమలాదేవి, బీసీ సంక్షేమ శాఖాధికారి
వసతి గృహాల్లో విద్యార్థుల రక్షణ ఎక్కడ?
Published Wed, Oct 9 2013 4:25 AM | Last Updated on Fri, Sep 1 2017 11:27 PM
Advertisement
Advertisement