ఇందూరు, న్యూస్‌లైన్ : గ్రామ పంచాయతీలను బలోపేతం చేయడానికి అధికారులు కృషి చేయాలని పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ వరప్రసాద్ అన్నారు. నూతనంగా సర్పంచులు ఎన్నికైన నేపథ్యంలో గ్రామాలను పటిష్టం చేయాలని, ప్రజలకు అవసరమైన సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకోవాలన్నారు. ఆయన మంగళవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా పంచాయతీరాజ్ అధికారులతో సమీక్షించారు. తాగు,సాగునీరు, విద్యుత్‌దీపాలు, డ్రైనేజీ, రోడ్లు ఇతర సౌకర్యాలు లేని గ్రామాలను గుర్తించాలన్నారు. సర్పంచులతో ప్రణాళిక తయారు చేసుకుని సౌకర్యాల కల్పనకు ఎన్ని నిధులు అవసరమవుతాయో నివేదికను సిద్ధం చేసుకోవాలన్నారు. పంచాయతీల అదాయం తక్కువగా ఉందని, దీంతో గ్రామాల అభివృద్ధికి నిధులు సరిపోవడంలేదన్నారు.
ఇందుకు గ్రామాల వారీగా పన్నుల వసూళ్లు డిమాండ్ ఎంత ఉందో, ఎంత వసూలు చేశారు, ఇంకా ఎంత చేయాలి, గ్రామాభివృద్ధికి ఎన్ని నిధులు అవసరమో తెలుసుకోవాలన్నారు. రాజీవ్ స్వశక్తి యోజన పథకం(ఆర్‌జీపీఎస్‌ఏ) కింద పంచాయతీలకు కొత్త భవనాలు, సిబ్బంది కొరత తీర్చడం, కంప్యూటర్ వ్యవస్థలను ఏర్పాటు చేస్తామన్నారు. మండల స్థాయిలో రిసోర్సు సెంటర్లను ఏర్పాటు చేసి, ప్రతి గ్రామ పంచాయతీలో కొత్త ఏడాదిలో కంప్యూటర్‌లను ఇస్తామని కమిషనర్ వెల్లడించారు. ఈ-పంచాయతీ ఆన్‌లైన్ ద్వారా మొత్తం వివరాలు అన్ని ఇందులో నమోదు అవుతాయన్నారు.
పంచాయతీ కార్యదర్శుల భర్తీకి..
జిల్లాల్లో ఖాళీ ఉన్న గ్రామ పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నామని, జిల్లాల వారీగా నోటిఫికేషన్‌లు వేయాలని, అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని కమిషనర్ వరప్రసాద్ ఆదేశించారు. ప్రస్తుతం పని చేస్తు కాంట్రాక్టు కార్యదర్శులకు ఇందులో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తున్నామన్నారు. వీరికి 25శాతం వెయిటేజీ ఇస్తున్నట్లు తెలిపారు. ఎలాంటి రాత పరీక్ష ఉండదని, డిగ్రీ మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుందన్నారు. జిల్లాకు మంజూరైన బీఆర్‌జీ నిధులు,పనులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో డీపీఓ సురేశ్‌బాబు, జెడ్పీ సీఈఓ రాజారాం, పంచాయతీరాజ్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.