ఇందూరు, న్యూస్‌లైన్ : పౌష్టికాహార లోపంతో బలహీనంగా మారిన పిల్లలను బలిష్టం చేయడానికి రాష్ట్ర ఐసీడీఎస్ అధికారులు చర్యలు చేపట్టారు. పౌష్టికాహార లోపానికి గురైన పిల్లల బరువును పెంచడమే లక్ష్యంగా జిల్లాలో అంగన్‌వాడీ కేంద్రాల్లో కొత్త పౌష్టికాహార మెనూకు శ్రీకారం చుట్టారు. అదే మినీ భోజన మెనూ. ఈ కొత్త మెనూ ద్వారా పౌష్టికాహార లోప పిల్లలందరికీ ప్రతిరోజు గుడ్డు, 100 ఎంఎల్ పాలు అందిస్తారు. వీటితో పాటే బియ్యం, పప్పు, పోపు దినుసులు అందజేస్తారు.
ఈ మెనూను జిల్లాలోని అన్ని అంగన్‌వాడీ కేంద్రాల్లో అమలు చేయాలని ఈ మేరకు ఐసీడీఎస్ కమిషనర్ చిరంజీవి చౌదరి జీఓ ఎంఎస్ నం.15 ద్వారా ఉత్తర్వులను జిల్లా ఐసీడీఎస్ కార్యాలయానికి జారీచేశారు. ఈ క్రమంలో జిల్లా ఐసీడీఎస్ పీడీ రాములు కొత్త మెనూ జీఓ కాపీలను అన్ని ప్రాజెక్టుల సీడీపీఓలకు పంపించారు. 7 నెలల నుంచి మూడేళ్లలోపు పిల్లలు ఎవరైనా పౌష్టికాహార లోపానికి గురైతే వారికి కొత్త మెనూ ప్రకారం పౌష్టికాహార భోజనం అందించాలని, ఈ విషయం అంగన్‌వాడీ కార్యకర్తలకు తెలియజేయాలని ఆదేశాలు జారీచేశారు. పౌష్టికాహారానికి సంబంధించిన సరుకులు బియ్యం, పప్పు, కూరగాయలు, నూనె, పోపు దినుసులు, అదనపు నూనె, గుడ్లు, పాలు అంగన్‌వాడీ కేంద్రాలకు పంపిస్తున్నారు. ఈనెల నుంచే అన్ని అంగన్‌వాడీ కేంద్రాల్లో అమలు పర్చాలని పీడీ ఆదేశాలు జారీచేశారు.
పిల్లల కోసం సర్వే...
జిల్లాలో ఈ పాటికే సుమారుగా రెండు వేల మంది వరకు పిల్లలు పౌష్టికాహార లోపానికి గురైనట్లు అధికారులు గుర్తించారు. వారికి ఆస్పత్రుల్లో చికిత్సలు, అం గన్‌వాడీల్లో పౌష్టికాహారం అందిస్తున్నారు. ప్రస్తుతం వీరికోసం కొత్త మెనూ రావడంతో మరో విడతగా అంగన్‌వాడీ కార్యకర్తలు సర్వే చేసి పిల్లలను గుర్తించే పనిలో ఉన్నారు. పౌష్టికాహార లోపానికి గురయ్యారో లేదో, పిల్లల ఎత్తుకు తగిన బరును తెలుసుకునేందు కు వారి బరువులను కొలుస్తున్నారు. తక్కువ, అతి తక్కువ బరువు ఉంటే వెంటనే వారి పేర్లను నమోదు చేసుకుంటున్నారు. అలా పేరు నమోదు చేసిన పిల్లలను ఆస్పత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేయిస్తారు. అనంతరం అంగన్‌వాడీ కేంద్రాల్లో లేదా పౌష్టికాహారం ఇంటికి పంపించి తినిపిస్తారు. బరువు పెరిగారో లేదోనని వారానికి ఒకసారి వారి బరువు చూస్తారు.
పిల్లలకు తినిపించే సమయవేళలు ..
పౌష్టికాహార లోపానికి గురైన పిల్లలకు అంగన్‌వాడీ కేంద్రాల్లో మూడుసార్లు ఆహారం అందిస్తారు. ఇంటి వద్ద నాలుగు సార్లు తినిపించాలి. ప్రతిరోజు ఉదయం 9:30 గంటలకు గుడ్డు, 11:30కి 100 ఎంఎల్ పాలు, మధ్యాహ్నం 12 గంటలకు మినీ భోజనం అంగన్‌వాడీ కేంద్రాల్లో ఇస్తారు. తల్లులు, పిల్లలకు ఇది తినిపించడమే కాకుండా ఇంటి వద్ద అంగన్‌వాడీ కేంద్రం నుంచి అందించిన బాలామృతం పౌష్టికాహా రం ఉదయం 7:30కి ఒకసారి, సాయంత్రం 5:30 మరోసారి 50 గ్రాముల చొప్పున జావలా చేసి లేదా లడ్డులాగా చేసి తినిపించాలి. అంతే కాకుండా మధ్యాహ్నం 3:30లకు ఉడికించిన కూరగాయలు (ఆలుగడ్డ లాంటివి), పండు గుజ్జులా తయారు చేసి తినిపిం చా లి. రాత్రి 7:30లకు భోజనం పెట్టాలి. ఈ భోజనంలో నెయ్యి లేదా నూనె కలపాలి. పౌష్టికాహార లోపానికి కు గురైన పిల్లలకు ప్రతిరోజు ఈ విధంగా ఆహారం అందించడంలో అంగన్‌వాడీ కార్యకర్త, తల్లి పూర్తి శ్రద్ధ చూపాలి.
పక్కాగా అమలు చేస్తాం
పౌష్టికాహార లోపానికి గురైన పిల్లల కోసం జిల్లాలో సర్వే నిర్వహిస్తున్నాం. కొత్త మినీ భోజన మెనూ ప్రకా రం సర్వేలో గుర్తించిన పిల్లలకు పౌష్టికాహారం కచ్చితంగా అందిస్తాం. మెనూను పక్కాగా అమలు చేయాలని, ఈ విషయంలో నిర్లక్ష్యం చేయరాదని అంగన్‌వాడీ కార్యకర్తలకు ఆదేశాలు జారీచేశాం. -రాములు, ఐసీడీఎస్, పీడీ
అంగన్‌వాడీల్లో ‘మినీ’ మెనూ
Published Mon, May 5 2014 1:22 AM | Last Updated on Wed, Sep 19 2018 8:32 PM
Advertisement