ఇందూరు(నిజామాబాద్ అర్బన్):
నిజామాబాద్ అర్బన్ ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారులు ఓ బినామీ కాంట్రాక్టర్‌కు కొమ్ము కాస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. డిచ్‌పల్లి మండలంలోని ఓ ఎంపీటీసీ సభ్యుడి తమ్ముడు వేరే వ్యక్తి పేరుపై అంగన్‌వాడీ కేంద్రాలకు సరుకులు రవాణా చేసే టెండరును దక్కించుకున్నాడని తెలిసినా.. అధికారులు తెలియనట్లుగా ప్రవర్తిస్తున్నారు. కాగా ప్రస్తుతం బినామీ కాంట్రాక్టర్‌గా ఉన్న శ్రావణ్ సరుకులు సరఫరా చేస్తుండగా, ఎంపీటీసీ సభ్యుడి తమ్ముడు పలుమార్లు ప్రాజెక్టు కార్యాలయానికి వచ్చి దగ్గరుండి సరుకులను రవాణా చేయించినా అధికారులు ఆయన ఎవరనేది కూడా పట్టించుకోకపోవడం వెనుక అనుమానాలకు తావిస్తోంది. అధికారులకు ప్రతినెలా ముడుపులు కూడా అందుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
అయితే నాలుగు నెలల క్రితం నిజామాబాద్ అర్బన్ ప్రాజెక్టు పరిధిలో ఉన్న 258 అంగన్‌వాడీ కేంద్రాలకు బియ్యం, పప్పులు, నూనెలు, బాలామృతం ఇతర సరుకులను సరఫరా చేయడానికి జాయింట్ కలెక్టర్ రవీందర్ రెడ్డి అధ్యక్షతన టెండర్లు జరిగాయి. అయితే అప్పటికే డిచ్‌పల్లి ప్రాజెక్టుకు టెండర్ దక్కించుకున్న సదరు ఎంపీటీసీ సభ్యుడి తమ్ముడు నిజామాబాద్ అర్బన్ ప్రాజెక్టులో కూడా సరుకులు రవాణా చేయడానికి పాలువు కదిపాడు. తాను ఇది వరకే ఓ ప్రాజెక్టులో టెండరు దక్కించుకున్న నేపథ్యంలో వేరే ప్రాజెక్టులో టెండరు వేయడానికి వీలు పడదని శ్రావణ్ అనే వ్యక్తి పేరుపై అర్బన్ ప్రాజెక్టుకు టెండరు వేసి కాంట్రాక్టును దక్కించుకున్నట్లు తెలిసింది. పేరు, బిల్లులను శ్రావణ్ పేరుపైనే అధికారులు చేస్తున్నా.. డబ్బులు మాత్రం సదరు ఎంపీటీసీ సభ్యుడి తమ్ముడికే ముడుతున్నట్లు సమాచారం. అయితే కమిషన్ మట్టుకే టెండరు దక్కించుకున్న శ్రావణ్ పని చేస్తున్నట్లు సమాచారం.
విషయం తెలిసినా పట్టింపులేదు..
బినామీ కాంట్రాక్టర్‌గా శ్రావణ్ కొనసాగుతున్నాడనే దానికి ఆయనే గతంలో ఒప్పుకున్నట్లు సాక్ష్యాలు ప్రాజెక్టు కార్యాలయంలోని ఓ అధికారికి తెలిసినా పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈ విషయం సీడీపీవో వరకు వెళ్లినప్పటికీ శ్రావణ్‌తో మిలాఖత్ అయినట్లు ఆరోపణలు వస్తున్నాయి. బినామీ పేరుపై శ్రావణ్ కాంట్రాక్టర్‌గా చలామణి అవుతున్నాడని.. ఈ విషయంపై ప్రాజెక్టు అధికారులను వివరణ కోరగా తమకేమీ తెలియదని మాట దాటవేస్తున్నారు. అలాగే కాంట్రాక్టర్ శ్రావణ్‌ను వివరణ కోరగా వేరే వ్యక్తుల ప్రమేయం లేదని, తానే కాంట్రాక్ట్‌ను దక్కించుకుని సరుకులు సరఫరా చేస్తున్నట్లు తెలిపారు.
ప్రొసీడింగ్‌లో శ్రావణ్ పేరే ఉంది
జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన టెండర్లు జరిగా యి. జేసీ ఇచ్చిన ప్రొసీడింగ్‌లో మాత్రం కాంట్రాక్ట్‌ను శ్రావణ్ దక్కించుకున్నట్లు ఉంది. ఓ ఎంపీటీసీ సభ్యుడి తమ్ముడు శ్రావణ్‌ను బినామీగా పెట్టుకుని కాంట్రాక్టర్‌గా పని చేస్తున్న విషయం నాదృషికి రాలేదు.
– డెబోరా, సీడీపీవో, నిజామాబాద్ అర్బన్ ప్రాజెక్టు