ఇందూరు మెడలో గులాబీ మాల | voters elected of trs candidates | Sakshi
Sakshi News home page

ఇందూరు మెడలో గులాబీ మాల

Published Sat, May 17 2014 2:31 AM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM

voters elected of trs candidates

 సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : ఇందూరు ప్రజలు తెలంగాణ రాష్ట్ర సమితికి పట్టం కట్టారు. రెండు లోక్‌సభ, తొమ్మిది అసెంబ్లీ స్థానాలలో ఆ పార్టీ అభ్యర్థులకు విజయాన్ని అందించారు. జిల్లా చరిత్రలో 1952 నుంచి ఇప్పటి వరకు ఒకే పార్టీకి చెందిన ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు విజయం సాధించడం ఇదే ప్రథ మం. తెలంగాణ తొలి శాసనసభలో ఈ అరుదైన రికార్డు చిరస్థాయిగా నిలవనుంది. ఇం దూరు ప్రజల ఏకపక్ష తీర్పుతో ఈ రికార్డును సొంతం చేసుకున్న టీఆర్‌ఎస్ శ్రేణుల్లో సంబ రాలు అంబరాన్ని అంటాయి. కాంగ్రెస్ పార్టీ దిగ్గజాలు, మాజీ మంత్రులు ధర్మపురి శ్రీని వాస్, మహ్మద్ షబ్బీర్ అలీ, మాజీ స్పీక ర్ కేఆర్ సురేశ్ రెడ్డిలకు ఈసారి కూడా పరాజయం తప్పలేదు. మాజీ మంత్రి పొద్దుటూరి సుదర్శన్‌రెడ్డి బోధన్‌లో ఓటమిని చవిచూశారు. మాజీ విప్ ఈరవత్రి అనిల్‌కుమార్ ఘోర పరాజయం పొందారు.

 కవితకు, బీబీ పాటిల్ కు మద్దతు పలికిన ఓటర్లు
 రాజకీయ ఉద్ధండుల కేరాఫ్ నిజామాబాద్ లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత విజయం సొంతం చేసుకుంది. ఇందూరు కోడలిని జిల్లా ప్రజలు ఆదరించారు. తెలంగాణ రాష్ర్టంలో జరిగిన తొలి ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు సర్వశక్తులొడ్డినా.. ఇందూరు ఓటర్లు మాత్రం టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కూతురు, జిల్లా కోడలు కవితకే మద్దతు పలికారు. రెండుసార్లు గెలుపొందిన మధుయాష్కీ గౌడ్, బీజేపీ మాజీ శాసనసభ పక్షనేత యెండల లక్ష్మీనారాయణలు ఆమె చేతిలో ఘోర పరాజయం పొందారు. తెలంగాణ జిల్లాల్లో అత్యంత ఆసక్తికరంగా జరిగిన ఈ పోటీలో 1,67,184 మెజార్టీ సాధించారు.

టీఆర్‌ఎస్‌కు పోస్టల్ బ్యాలెట్లు కలుపుకొని 4,39,307 ఓట్లు రాగా, కాంగ్రెస్‌కు 2,72,723 ఓట్లు వచ్చాయి. జహీరాబాద్ లోక్‌సభ స్థానం నుంచి రాజకీయ తెరపైకి వచ్చిన టీఆర్‌ఎస్ అభ్యర్థి భీంరావు బస్వంత్ రావు పాటిల్‌ను జిల్లా ప్రజలు ఆదరించారు. సిట్టింగ్ ఎంపీ సురేశ్‌కుమార్ షెట్కార్‌పై ఆయన ఘన విజయం సాధించారు. మెదక్ జిల్లా జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోకి వచ్చే జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్ సెగ్మెంట్లలో ఆయనకు భారీ ఆధిక్యం లభించింది. 13వ రౌండ్ ముగిసే సరికి బీబీరావు పాటిల్ 1,21,487 ఓట్ల ఆధిక్యంతో తిరుగులేని మెజార్టీ సాధించారు.

 ఇందూరు కోటలో గులాబీ గుబాళింపు
 ఇందూరు ఇలాకాలో గులాబీ ప్రభంజనం వీచింది. ఓటెత్తిన జనం టీఆర్‌ఎస్‌కు బ్రహ్మరథం పట్టారు. మొత్తం రెండు పార్లమెంట్, తొమ్మిది అసెంబ్లీ స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులకు అధికార పీఠంపై కూర్చో బెట్టారు. ఎల్లారెడ్డి అసెంబ్లీ స్థానం నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా ఏనుగు రవీందర్‌రెడ్డి వరుసగా మూడోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించారు. 2009లో టీడీపీ నుంచి గొలుపొంది టీఆర్‌ఎస్‌లో చేరిన పోచారం శ్రీనివాస్‌రెడ్డి, గంప గోవర్ధన్, హన్మంత్ సింధేలు బాన్సువాడ, కామారెడ్డి, జుక్కల్‌ల నుంచి గెలుపొందారు.

నిజామాబాద్ రూరల్ నుంచి పీసీసీ మాజీ చీఫ్ డి శ్రీనివాస్‌పై ముందుగానే గెలుపు ధీమాను వ్యక్తం చేసిన టీఆర్‌ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ విజయం సాధించారు. నిజామాబాద్ అర్బన్, ఆర్మూరు, బాల్కొండ, బోధన్‌ల నుంచి బిగాల గణేశ్ గుప్త, ఆశన్నగారి జీవన్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, మహ్మద్ షకీల్‌లు తొలిసారి ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దిగ్గజాలు డి శ్రీనివాస్‌తో పాటు షబ్బీర్‌అలీ, పి సుదర్శన్‌రెడ్డి, కేఆర్ సురేశ్‌రెడ్డిలు కోలుకోలేని షాక్ కు గురయ్యారు. మాజీ విప్ ఈరవత్రి అనిల్‌కు బాల్కొండ ఓటర్లు మొండి చెయ్యిచ్చారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement