రాజీనామా చేయను.. మీరే సస్పెండ్‌ చేయండి | I Do Not Give Resignation-Suspend Yourself Said By D srinivas | Sakshi
Sakshi News home page

రాజీనామా చేయను.. మీరే సస్పెండ్‌ చేయండి

Published Tue, Sep 4 2018 1:00 PM | Last Updated on Wed, Oct 17 2018 6:10 PM

I Do Not Give Resignation-Suspend Yourself Said By D srinivas - Sakshi

అనుచరులతో కలిసి మీడియాతో మాట్లాడుతోన్న డీఎస్‌

సాక్షి, నిజామాబాద్‌: తాను టీఆర్‌ఎస్‌కు రాజీనామా చేయనని, కావాలంటే సస్పెండ్‌ చేయాలని టీఆర్‌ఎస్‌ అధిష్టానాన్ని రాజ్యసభ ఎంపీ డీ శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు. నిజామాబాద్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ‘నేను రాజీనామా చేసి పార్టీని వదిలి వెళ్తే మీరు చేసిన ఆరోపణలు నిజమని ఒప్పుకున్నట్లు అవుతుంది. నన్ను సస్పెండ్‌ చేయడం చేతకాకపోతే తీర్మానాన్ని వెనక్కు తీసుకోవాలని సూచించారు. తనను రాజకీయంగా దెబ్బ తీశారని, నా కుటుంబాన్ని రోడ్డుకు ఈడ్చారు. లేనిపోనివన్నీ కల్పించి జిల్లా యంత్రాంగంపై ఒత్తిడి తెచ్చి నా కుమారుడు సంజయ్‌పై కేసు పెట్టించార’ని ఆరోపించారు.

హైకోర్టు 41ఏ నోటీసు ఇచ్చినా ఆ ఆర్డర్‌లు పట్టించుకోకుండా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని విమర్శించారు. ఇందులో ప్రభుత్వం ఎంత ఆసక్తి తీసుకుందో అందరికీ అర్ధమవుతోందని, తనపై నిరాధార ఆరోపణలు చేశారని ధ్వజమెత్తారు. తాను ఎలాంటి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు చేశానో స్పష్టంగా చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఎప్పుడు ఎక్కడ పార్టీని బలహీన పరిచానో నిరూపించాలని కోరారు. తాను బీజేపీకి ఎలా ఉపయోగపడ్డానో, బీజేపీకి తన సహచరులను ఎవరిని పంపానో చూపించాలని పేర్కొన్నారు. తాను టీఆర్‌ఎస్‌లో ఉండటం టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులకు, ఎంపీ కవితకు ఇష్టం లేకపోతే దయచేసి తనను పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలన్నారు.

ఇంకా మాట్లాడుతూ.. ‘ఈ రోజుల్లో ఎదిగిన కుమారులు స్వతంత్రంగా జీవిత నిర్ణయాలు తీసుకుంటున్నారు. నా ఇంట్లోనే కాదు అందరి ఇళ్లల్లోనూ జరిగేది కూడా అదే. నా రెండో కుమారుడు అరవింద్ బీజేపీలో చేరడం అతని స్వీయ నిర్ణయం. నా ప్రమేయం లేదు అయినా నేను ఏమీ చేయలేని పరిస్థితి. కేసీఆర్‌కి ముందే రెండుసార్లు చెప్పాను. నా కుమారుడు అరవింద్ మోడీ అభిమాని అని. గతంలోనే కాలినడకన వెళ్లి బీజేపీలో చేరే ప్రయత్నం చేశాడు. నా 50 ఏళ్ల రాజకీయ జీవితంలో క్రమశిక్షణతో మెలిగాను. పార్టీని మోసం చేయడం నాకు తెలియదు. తెలంగాణ పట్ల నాకు ఉన్న ప్రేమ నిబద్దతను ఎవరూ ప్రశ్నించలేరు. అలాంటి నాపై లేనిపోని అభాండాలు మోపి నన్నో పార్టీ వ్యతిరేకిగా ముద్ర వేశారు. మనసులో ఏదో పెట్టుకొని నిరాధారమైన, నిజాయితీ లేని ఆరోపణలు చేస్తూ నన్ను రాజకీయంగా దెబ్బ తీయాలని చూస్తున్నా’ ని వ్యాఖ్యానించారు.

నాపై చర్యల విషయంలో టీఆర్ఎస్‌కు డెడ్‌లైన్ ఇవ్వను కానీ సమయం, సందర్భాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటానని.. ఈ విషయంలో చాలా సీరియస్‌గా ఉన్నానని తెలిపారు. సస్పెండ్ చేయాలి లేదా తీర్మానం వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement