ఇందూరులో  ఎవరెందాక? | TRS and Congress tough fight At Indhuru | Sakshi
Sakshi News home page

ఇందూరులో  ఎవరెందాక?

Published Mon, Nov 26 2018 2:53 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

TRS and Congress tough fight At Indhuru - Sakshi

రాష్ట్రకూట చక్రవర్తి ఇంద్రసోముని ఏలుబడిలో ఇందూరుగా, నిజాం ఉల్‌–ముల్క్‌ పాలనతో నిజామాబాద్‌గా మారి.. స్త్రీ పురుష జనాభా నిష్పత్తిలో దేశానికే ఆదర్శమై ఆడబిడ్డల అమ్మఒడిగా ప్రత్యేకత చాటుకుంటోన్న ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా మరో పది రోజుల్లో తీర్పునిచ్చేందుకు సిద్ధమవుతోంది. గోదావరి, దాని ఉపనదులపై కాలువలు, లిఫ్ట్‌లతో పట్టెడన్నం పంచుతున్న ఆర్మూర్, బోధన్, బాల్కొండ, బాన్స్‌వాడ ఒకవైపు.. వందల కొద్దీ ఫీట్ల బోర్లు, బావులతో సేద్యం చేస్తూ కడుపు నింపుకుంటున్న కామారెడ్డి, ఎల్లారెడ్డి మరోవైపు.. కడుపు చేతబట్టుకుని గల్ఫ్‌బాట పట్టిన పల్లెలు.. ఇందూరు జనజీవనం దేనికదే ప్రత్యేకం. మలి దశ తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలపాత్ర పోషించిన ఈ ప్రాంతం 2014లో జరిగిన ఎన్నికల్లో 9 నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు భారీ మెజారిటీతో జైకొట్టి ఏకపక్ష తీర్పునిచ్చింది. ప్రస్తుత ఎన్నికల్లో అభివృద్ధి, సంక్షేమం నినాదంతో టీఆర్‌ఎస్‌.. అవినీతి, వైఫల్యం పేరుతో కాంగ్రెస్‌.. ఒక్క చాన్స్‌ అంటూ బీజేపీ తలపడుతున్నాయి. 

అభివృద్ధే ఆసరాగా అధికారపక్షం
అభివృద్ధి, సంక్షేమమే ప్రధాన ఎజెండాగా సానుకూల ప్రయాణాన్ని ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర సమితికి ఆ పథకాలే ఓట్లు కురిపించే అవకాశం కనిపిస్తోంది. వ్యవసాయాధారిత జిల్లాలో పెట్టుబడి సహాయంగా ఎకరాకు రూ.4,000 చొప్పున ప్రభుత్వమిస్తున్న ఆర్థిక సాయం రైతుల్లో సానుకూలతను పెంచింది. 24 గంటల విద్యుత్‌ను చిన్నకారు రైతులు కొందరు వ్యతిరేకిస్తున్నా.. మోస్తరు, బడా రైతులంతా స్వాగతిస్తున్నారు. మరోవైపు జిల్లా వ్యాప్తంగా పింఛన్లు అందుకుంటున్న వృద్ధులు, వితంతు, ఒంటరి, వికలాంగులు, బీడీ, కల్లుగీత తదితర వర్గాలకు చెందిన 4,25,728 మంది.. టీఆర్‌ఎస్‌కు గంపగుత్త ఓటుబ్యాంక్‌గా మారే అవకాశం ఉంది. ప్రధాన గ్రామాలను కలిపే రహదారులు పూర్తి కావటంతో ఆయా గ్రామాలలో సంతృప్తి వ్యక్తమవుతోంది. అయితే, తిరిగి అన్నిచోట్లా సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకే టికెట్లు ఇవ్వడం టీఆర్‌ఎస్‌కు ఒకింత ఇబ్బంది కలిగిస్తోంది. అందరినీ కలుపుకుని పోకపోవడం, గెలిచిన తరువాత అభ్యర్థులు గ్రామాలు, పట్టణాల ముఖం చూడలేదనే విమర్శలు జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో అధికార పార్టీ అభ్యర్థులకు ప్రతిబంధకాలుగా మారిన పరిస్థితి కనిపిస్తోంది. దళితులకు మూడు ఎకరాల భూ పంపిణీ, డబుల్‌ బెడ్రూం ఇళ్లు, ఉద్యోగాల కల్పన, ఇంటింటికి నల్లా వంటి హామీలు ఇప్పటికీ పూర్తి స్థాయిలో నెరవేరకపోవటం కొంత వరకు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. 

పాలనలో లోపాలున్నాయంటూ విపక్షం..
జిల్లాలోని అన్ని స్థానాల్లో ప్రజాకూటమి నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థులే బరిలో నిలిచారు. నాలుగున్నరేళ్ల టీఆర్‌ఎస్‌ పాలనలో తాజా మాజీ ఎంఎల్‌ఏలపై అసంతృప్తి ఉందని, అది తమకు అనుకూలమని వారు భావిస్తున్నారు. దళితులకు భూ పంపిణీ, డబుల్‌ బెడ్రూం ఇళ్లు, కౌలు రైతులకు పరిహారం, ఉద్యోగాల కల్పన, నిజాం షుగర్‌ ఫ్యాక్టరీ పునరుద్ధరణ, గల్ఫ్‌ వెళ్లిన కార్మికులు తిరిగి వస్తే వారు స్థానికంగా వ్యాపారాలు చేసుకునేందుకు ఆర్థిక సహాయం వంటి విషయాల్లో ప్రభుత్వం విఫలమైందంటూ కాంగ్రెస్‌ జనంలోకి వెళ్తోంది. మేం వస్తే ఇప్పుడు సాగుతున్న అన్ని పథకాలను కొనసాగించటంతో పాటు అదనంగా ఏమేం చేస్తామో వివరిస్తూ టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు అన్నిచోట్లా గట్టి పోటీనిచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి తోడు కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో చేపట్టిన పథకాలు, సంక్షేమాన్ని వివరిస్తూ ముందుకు వెళ్తున్నారు. కామారెడ్డి, బోధన్, ఆర్మూర్, నిజామాబాద్, ఎల్లారెడ్డి, నిజామాబాద్‌ రూరల్‌లో కాంగ్రెస్‌ నుంచి రాజకీయ అనుభవం ఉన్న అభ్యర్థులు బరిలో ఉండటం కలిసివస్తోంది. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లే అధికంగా ఉండటంతో వారిని ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.

 ‘పోయినసారి మేం చెయ్యికి వేశాం..ఈమారు ఇంకా నిర్ణయించుకోలే.. మహిళలను పట్టించుకునే పార్టీకే మా మద్దతు...
– కర్రోళ్ల ఎల్లవ్వ (రోజు కూలీ)

ఇదీ ఇందూరు ఎజెండా
- నిజామాబాద్‌ జిల్లా ప్రాజెక్టుల కింద సరిపడా సాగునీరు
పండించిన పంటలకు కనీస గిట్టుబాటు ధర
వ్యవసాయాధారిత పరిశోధన సంస్థలు, పరిశ్రమల ఏర్పాటు
గల్ఫ్‌ కార్మిక కుటుంబాల సంక్షేమం, ఉద్యోగాల నిమిత్తం విదేశాలకే వెళ్లే యువతకు శిక్షణ సంస్థల ఏర్పాటు
.. ఇవి తమ తక్షణ అవసరాలని నిజామాబాద్‌ జిల్లా ఓటర్లు చెబుతున్నారు. 
​​​​​​​- ‘సాగునీటి కరువు ఏర్పడ్డ సమయంలో సింగూరు నుంచి శ్రీరాంసాగర్‌కు నీటిని తీసుకుపోవటం వల్ల తమకు నష్టం కలుగుతోంద’ని బాన్స్‌వాడ నియోజకవర్గం శ్రీనగరం గ్రామానికి చెందిన రైతు కోడూరు గాంధీ వాపోయాడు.
​​​​​​​- ‘రైతుబంధు వల్ల పెద్దరైతులకే మేలు జరిగింది. గిట్టుబాటు ధరలు కల్పిస్తే మాకు చాలు. ఎవరి సహాయం అవసరం లేదు. ఈ ఎన్నికలు ఏకపక్షం కాదు. ఎవరికి ఓటెయ్యాలో మాకు తెలుస’ని అంకాపూర్‌కు చెందిన రైతు నారాయణరెడ్డి వ్యాఖ్యానించాడు. ‘ఏఆర్‌పీ క్యాంప్‌ను దత్తత తీసుకున్న ఎంఎల్‌ఏ షకీల్‌ సరిగా పని చేయలేకపోయాడు. ఆయనకు ఈమారు మద్దతిస్తామో లేదో ఇంకా నిర్ణయించలేద’ని ఏఆర్‌పికి చెందిన రామారావు స్పందించాడు.

పసుపు బోర్డు కావాలి
ప్రభుత్వం అందిస్తున్న రైతుబంధు, 24 గంటల విద్యుత్‌ వల్ల మేలు జరిగింది. మా మద్దతు మళ్లీ టీఆర్‌ఎస్‌కే. ఐతే పదేళ్ల క్రితం పసుపు ధర ఎంతుందో ఇప్పటికీ అంతే ఉంది. పెట్టుబడి మాత్రం రెండింతలైంది. ఎకరంలో సాగుచేస్తే రూ.75 వేలవుతున్నాయి. 25–30 క్వింటాళ్ల దిగుబడి వచ్చినా.. ప్రస్తుతం ధర మాత్రం రూ.6 వేలే పలుకుతోంది. ఇది గిట్టుబాటు కాదు. మా పిల్లలంతా విదేశాల్లో ఉంటూ, నగదు పంపుతుండటం వల్ల వ్యవసాయాలు నడుస్తున్నాయి. లేకపోతే ఇబ్బందే. పసుపు బోర్డు ఏర్పాటు చేసి వెంటనే గిట్టుబాటు ధరలు ప్రకటించాలి. మేం పండించే ఉత్పత్తులను వ్యయప్రయాసలకోర్చి మహారాష్ట్రలోని సాంగ్లీకి వెళ్లి విక్రయించాల్సి వస్తోంది.
– రాధాకృష్ణారెడ్డి, అంకాపూర్‌

కౌలురైతుకు న్యాయం చేయరూ
నేను ఏడెకరాలు కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నా. ఏటా కొంత మొత్తాన్ని భూ యజమానికి చెల్లిస్తా. సర్కారు పెట్టిన రైతు బంధు సహాయం నాకు పైసా కూడా రాలేదు. రైతులకు ఇవ్వటం సంతోషమే అయినా.. నాలాంటి నిరుపేద కౌలు రైతులకూ సాయం చేస్తే బాగుండేది. కానీ మమ్మల్ని పట్టించుకోలేదు. మమ్మల్ని పట్టించుకునే పార్టీకే ఓటేస్తాం.
– శంకర్, తాడ్వాయి

‘నిజాం షుగర్స్‌’ తెరిపించాలె..
‘అధికారంలోకి వస్తే వెంటనే నిజాం షుగర్స్‌ తెరిపిస్తమని చెప్పిన్రు. ఇంకా తెరవలే. నిజాం షుగర్స్‌లో డ్రైవర్‌గా పనిచేసినా. రూ.19 వేలు వచ్చేవి. కంపెనీ మూతపడ్డాక ఇక్కడే భూమిని కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నా. ఈ ఏజ్‌లో వేరే పని చేయలేను. ఉద్యోగం పోయినవాళ్లంతా హోటళ్లలో సర్వర్లు, సెక్యూరిటీలుగా పనిచేస్తుండ్రు. ఇంకా మేం టీఆర్‌ఎస్‌నే నమ్ముకుని ఉన్నాం. ఆ పార్టీ విజయం కోసం పనిచేస్తున్నా.
– ఔదరి మోహన్,  ఏఆర్‌పీ క్యాంప్, బోధన్‌

బాన్స్‌వాడ: ఎవరికి చాన్స్‌?
​​​​​​​ఐదుసార్లు గెలుపొంది వివిధ శా ఖల మంత్రిగా పనిచేసిన పోచా రం శ్రీనివాసరెడ్డి టీఆర్‌ఎస్‌ నుంచి మరోసారి పోటీ చేస్తుండగా, ప్రజాకూటమి నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా రెండుసార్లు ఓటమి పాలైన కాసుల బాలరాజు అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. క్రితంసారి బాలరాజుపై 24 వేల మెజారిటీ సా«ధించిన పోచారం.. ఈసారి గట్టిపోటీ ఎదుర్కొంటున్నారు. బాన్స్‌వాడలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే గెలిపిస్తాయన్న ధీమాతో పోచారం సుడిగా లి ప్రచారం చేస్తుండగా, కాంగ్రెస్‌ ప్రచారం పుంజుకో లేదు. కాంగ్రెస్‌ టికెట్‌ ఆశించి భంగపడ్డ మల్యాద్రి రెడ్డి.. బాలరాజు కోసం గట్టిగా పనిచేస్తే.. పోచారం ‘కారు’కు బ్రేకులుపడే అవకాశం లేకపోలేదు.

రూరల్‌: గట్టి సవాల్‌
జిల్లాలో విశేష రాజకీయానుభవం ఉన్న బాజిరెడ్డి గోవర్ధన్‌ (టీఆర్‌ఎస్‌) మరోసారి నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యేగా పోటీచేస్తూ, కాంగ్రెస్‌ అభ్యర్థి భూపతిరెడ్డి నుంచి గట్టి సవాల్‌ను ఎదుర్కొంటున్నారు. గడిచిన ఎన్నికల్లో బాజిరెడ్డి కాంగ్రెస్‌ అభ్యర్థి ధర్మపురి శ్రీనివాస్‌పై 27 వేల మెజారిటీతో గెలుపొందారు. ఇటీవల పరిణామాలతో టీఆర్‌ఎస్‌ ఎంఎల్‌సీ భూపతిరెడ్డి కాంగ్రెస్‌లో చేరి టికెట్‌ తెచ్చుకుని బాజిరెడ్డిని ఢీకొంటున్నారు. ఇద్దరూ విజయం కోసం శ్రమిస్తున్నారు.

ఆర్మూర్‌: 3 పార్టీల తీన్‌మార్‌
జిల్లాలో కీలకమైన ఆర్మూర్‌ నియోజకవర్గంలో ఈమారు పోటీ హోరాహోరీగా సాగుతోంది. టీఆర్‌ఎస్‌ నుంచి తాజా మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి, కాంగ్రెస్‌ నుంచి ఎంఎల్‌సీ ఆకుల లలిత, టీఆర్‌ఎస్‌ టికెట్‌ ఆశించి భంగపడ్డ వినయ్‌రెడ్డి బీజేపీ నుంచి బరిలో ఉన్నారు. జీవన్‌రెడ్డిపై ఒకింత అసంతృప్తి ఉన్నా, ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు వాటిని పట్టించుకోరన్న విశ్వాసాన్ని పార్టీ నాయకులు వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థి ఆకుల లలిత నియోజకవర్గంలో తనకున్న విస్తృత సంబంధాలకు తోడు, ప్రభుత్వ వ్యతిరేక వర్గాల్ని కలుపుకొనే విషయంలో చురుగ్గా వ్యవహరిస్తున్నారు. బీజేపీ నుంచి పోటీ చేస్తున్న వినయ్‌కుమార్‌రెడ్డి భారీగా ఓట్లు చీల్చే అవకాశం ఉంది.

జుక్కల్‌: ప్రధాన పార్టీల దంగల్‌
జుక్కల్‌ (ఎస్సీ)లో పాత ప్రత్యర్థులే మరోసారి బరిలో నిలిచారు. గత ఎన్నికల్లో 37 వేల మెజారిటీతో గెలుపొందిన హనుమంత్‌షిండే మరోసారి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేస్తుంటే నాలుగుమార్లు ఎంఎల్‌ఏగా పనిచేసి, గత ఎన్నికల్లో ఓటమి పాలైన గంగారం మరోసారి కాంగ్రెస్‌ అభ్యర్థిగా, మరో మాజీ ఎమ్మెల్యే అరుణతార బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ప్రధానంగా టీఆర్‌ఎస్‌–కాంగ్రెస్‌ మధ్యే హోరాహోరీ పోటీ ఉంది. అభివృద్ధిని నమ్ముకుని టీఆర్‌ఎస్, తామొస్తే ఏం చేస్తామో చెబుతూ కాంగ్రెస్‌ ప్రచారం హోరెత్తిస్తున్నాయి. 

బాల్కొండ: ఎవరికో దండ!
జిల్లాలో కీలకమైన బాల్కొండలో పాత ప్రత్యర్థులే పోటీలో ఉన్నారు. గత ఎన్నికల్లో 37 వేల ఓట్ల మెజారిటీతో గెలిచిన టీఆర్‌ఎస్‌ అభ్యర్థి వేముల ప్రశాంత్‌రెడ్డి.. మరోసారి కాంగ్రెస్‌ అభ్యర్థి అనిల్‌ను ఢీకొంటున్నారు. ఈ టికెట్‌ ఆశించి భంగపడి బీఎస్పీ అభ్యర్థిగా రంగంలోకి దిగిన ముత్యాల సునీల్‌కుమార్‌.. టీఆర్‌ఎస్‌ ఓటమే లక్ష్యమంటూ ప్రచారం చేస్తుండటం ఆ పార్టీకి ఇబ్బందిగా మారింది. సౌమ్యుడన్న పేరుకు తోడు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే గెలిపిస్తాయని ప్రశాంత్‌రెడ్డి, బీసీ నినాదం అనుకూలిస్తుందని అనిల్‌ ఆశ పెట్టుకున్నారు.

బోధన్‌: టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ ధనాధన్‌
తాజా మాజీ ఎమ్మెల్యే షకీల్‌(టీఆర్‌ఎస్‌), మాజీ మంత్రి పి.సుదర్శన్‌రెడ్డి (కాంగ్రెస్‌), అల్జాపూర్‌ శ్రీనివాస్‌ (బీజేపీ) పోటీ చేస్తున్నారు. నియోజకవర్గంలో అత్యధికంగా ఉన్న మైనారిటీలకు తోడు సర్కారు పథకాలను షకీల్‌ నమ్ముకోగా, ఏడోసారి శాసనసభకు పోటీ చేస్తున్న సుదర్శన్‌రెడ్డి.. ని యోజకవర్గంపై తనకున్న పట్టు నిరూపిం చుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ప్రభుత్వ పథకాలందని ఓటర్లతో పాటు పార్టీకి దూరమైన వారిని తన వైపు తిప్పు కుంటూ ముందుకు సాగుతున్నారు.

కౌన్‌ బనేగా నిజామా‘బాద్‌షా’?
నిజామాబాద్‌ అర్బన్‌లో త్రిముఖ పోరు నెలకొంది. సిట్టింగ్‌ ఎమ్మెల్యే బిగాల గణేష్‌ గుప్తా (టీఆర్‌ఎస్‌), మాజీ ఎంఎల్‌ఏ యెండల లక్ష్మీనారాయణ (బీజేపీ), తాహెర్‌బిన్‌ (కాంగ్రెస్‌) పోటీలో ఉన్నారు. ముగ్గురూ ప్రత్యేక వ్యూహంతో ముందుకెళ్తున్నారు. దీంతో గెలుపు అంచనాలకు తేలిగ్గా అందేలా లేదు. పార్టీ పథకాలు, పట్ట ణాభివృద్ధిపై గణేష్‌ భరోసాతో ఉండగా, లక్ష్మీనారాయణ వ్యక్తిగత సంబంధాలు, పార్టీ ఇమేజ్‌పై ఆధారపడ్డారు. మైనారిటీ ఓట్లకు తోడు కాంగ్రెస్, టీడీపీ ఓటుబ్యాంక్‌ చెక్కు చెదరకుంటే విజయం తనదేన న్న ధీమాలో తాహెర్‌ ఉన్నారు.

ఎల్లారెడ్డి: ఎవరికి అడ్డా!
నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఏనుగు రవీందర్‌రెడ్డి (టీఆర్‌ఎస్‌).. ఈసారి కాంగ్రెస్‌ అభ్యర్థి నల్లమడుగు సురేందర్‌ నుంచి గట్టిపోటీ ఎదుర్కొంటున్నారు. వరసగా ఓటమి పాలైన సానుభూతికి తోడు నియోజకవర్గంలో నెలకొన్న కొన్ని ప్రత్యేక పరిస్థితులు టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కారు స్పీడ్‌కు బ్రేకులు వేస్తున్నాయి. ప్రభుత్వ పథకాలే తనను గెలిపిస్తాయని రవీందర్‌రెడ్డి.. ప్రభుత్వం నెరవేర్చని హామీలకు తోడు రవీందర్‌రెడ్డిపై ఉన్న అసంతృప్తి కలిసొస్తుందని సురేందర్‌ ధీమాతో ఉన్నారు. ఇక్కడ బీజేపీ నుంచి నాయుడు ప్రకాష్‌ పోటీలో ఉన్నారు.

కామారెడ్డి: ఢీ అంటే ఢీ
కామారెడ్డి బరిలో మళ్లీ సీనియర్లు తలపడుతున్నారు. గత ఎన్నికల్లో పోటీపడ్డ గంప గోవర్ధన్‌ (టీఆర్‌ఎస్‌), మహ్మద్‌ అలీ షబ్బీర్‌ (కాంగ్రెస్‌)కు తోడు మాజీ జడ్పీ ఛైర్మన్‌ వెంకటరమణారెడ్డి (బీజేపీ) మధ్య పోటీ నెలకొంది. గడిచిన ఎన్నికల్లో 8 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించిన గంపా గోవర్ధన్‌ను నిలువరించేందుకు షబ్బీర్‌ అలీ సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. అయితే కాంగ్రెస్‌ పార్టీలో కొనసాగి రాజీనామా చేసిన బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డి సైతం సీరియస్‌గా పనిచేస్తుండటంతో ఫలితంపై ఆసక్తి నెలకొంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement