ఇందూరు, న్యూస్‌లైన్: జిల్లాలో సోమవారం ఓవైపు హోలీ సంబురాలు.. మరో వైపు నామినేషన్ల జోరు కొనసాగింది. హోలీ రోజు నామినేషన్ వేస్తే కలిసి వస్తుందనే సెంటిమెంట్‌తో వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్లు వేశా రు. దీంతో తొలిరోజు జడ్పీటీసీకి 3, ఎంపీటీసీకి 57 నామినేషన్‌లు దాఖలయ్యాయి. జడ్పీటీసీ స్థానానికి టీఆర్‌ఎస్ తరపున వర్ని మండలం జలాల్‌పూర్ గ్రామానికి చెందిన సింగంపల్లి గంగారాం మొదటి నామినేషన్ వేశారు. తర్వాత కాంగ్రెస్ తరపున వేల్పూర్ మండలం పచ్చల నడ్కుడ గ్రామానికి చెందిన సాతెల్లి కవిత, కామారెడ్డి మండలం దేవన్‌పల్లి గ్రామానికి చెందిన నరేశ్ నామినేషన్‌లను వేశారు.
నామినేషన్ దాఖలు చేయడానికి వీరు తమ ప్రాంతాల నుంచి ప్రత్యేక వాహనాల్లో జిల్లా కేంద్రానికి తరలి వచ్చారు. జిల్లా పరిషత్‌లో ఏర్పాటు చేసిన కేంద్రంలో నామినేషన్‌లు వేశారు. ఎంపీటీసీ స్థానాలకు ఆయా మండల కార్యాలయాల్లో అభ్యర్థులు నామినేషన్‌లు వేశారు. ఎంపీటీసీ స్థానాలకు టీఆర్‌ఎస్ నుంచి 10, కాంగ్రెస్ నుంచి 17, టీడీపీ నుంచి 5, బీజేపీ నుంచి 5, స్వాతంత్రు 20 మంది నామినేషన్ వేశారు. అదేవిధంగా పలువురు అభ్యర్థులు జిల్లా కేంద్రానికి వచ్చి నామినేషన్ ఫారాలను తీసుకెళ్లారు.
ఈ దృశ్యాలన్నీ అధికారులు వీడియో తీయిస్తున్నారు. జిల్లా పరిషత్, మండల పరిషత్ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాల వద్ద పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా పరిషత్ కార్యాలయం రెండు గేట్లను మూసివేసి, బారికేడ్లను అడ్డంగా పెట్టారు. జడ్పీ ఉద్యోగులను సైతం గుర్తింపు కార్డులు లేనిదే లోపలికి అనుమతించలేదు. జిల్లా పరిషత్ వైపు ద్విచక్ర వాహనాలు తప్ప ఇతర వాహనాలను అనుమతించలేదు.
తొలి రోజు నామినేషన్ల జోరు
Published Tue, Mar 18 2014 2:44 AM | Last Updated on Sat, Sep 2 2017 4:49 AM
Advertisement
Advertisement