ఇందూరు : జిల్లా పరిషత్ పాలక వర్గం కొలువుదీరిన నేపథ్యంలో కొత్తగా ఏకగ్రీవంగా ఎన్నికైన జడ్పీ స్థాయీ సంఘాల సమావేశాలు తొలిసారిగా మంగళవారం ప్రారంభం కానున్నాయి. జడ్పీ చైర్మన్ దఫేదార్ రాజు అధ్యక్షతన ఈ సమావేశాలు జరగనున్నాయి. ఉదయం 10గంటలకు గ్రామీణాభివృద్ధి శాఖపై జరిగే సమీక్షలో కమిటీ అధ్యక్షులుగా ఉన్న జడ్పీ చైర్మన్‌తో పాటు ఇంకా ఎనిమిది మంది సభ్యులు, శాఖల అధికారులు పాల్గొంటారు.
మధ్యాహ్నం రెండు గంటలకు వ్యవసాయ శాఖపై సమావేశం జరగనుంది. ఈ సమావేశం వ్యవసాయ శాఖ స్థాయీ సంఘానికి చైర్మన్‌గా ఉన్న జడ్పీ వైస్ చైర్ పర్సన్ గడ్డం సుమన రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ రెండు స్థాయీ సంఘాల సమావేశాలకు జడ్పీ చైర్మన్‌తో పాటు జడ్పీ సీఈఓ రాజారాం, జిల్లా పంచాయతీ అధికారి సురేశ్‌బాబులతో పాటు ఆ కమిటీ సభ్యులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొంటారు.
సభ్యులందరూ శాఖల్లో ఉన్న లొసుగులు, సమస్యలు, అభివృద్ధి పనుల విషయాలను చైర్మన్ దృష్టికి తీసుకెళ్లి చర్చిస్తారు. అందరూ కలిసి వాటికి తీర్మానం చేయగా, త్వరలో జరిగే జడ్పీ సర్వసభ్య సమావేశంలో స్థాయి సంఘాలు చేసిన తీర్మానాలను జడ్పీటీసీ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆమోదం తెలుపాల్సి ఉంటుంది. ప్రతి కమిటీలో 8 నుంచి 9మంది సభ్యులున్న తరుణంలో సుదీర్ఘ చర్చలు జరిగే ఈ స్థాయీ సంఘాల సమావేశాలకు సంబంధిత సభ్యులందరూ తప్పనిసరిగా హాజరుకావాలని జిల్లా పరిషత్ అధికారులు సమాచారం అందించారు.
8వ తేదీన ఉదయం 11గంటలకు విద్యా,వైద్య శాఖలపై సంఘ సమావేశం జరుగుతుంది. మధ్యాహ్నం రెండు గంటలకు మహిళా,శిశు సంక్షేమ శాఖలపై సమావేశం జరుగుతుంది. విద్యా,వైద్య స్థాయీ సంఘానికి చైర్మన్‌గా జడ్పీ చైర్మన్ వ్యవహరిస్తారు. ఇటు మహిళా,శిశు సంక్షేమ సంఘానికి అధ్యక్షులుగా మోర్తాడ్ జడ్పీటీసీ ఎనుగందుల అనిత వ్యవహరిస్తారు.
9వ తేదీన ఉదయం 11గంటలకు సాంఘిక సంక్షేమ శాఖపై, మధ్యాహ్నం రెండు గంటలకు ఆర్థిక, ప్రణాళిక శాఖపై సమావేశాలు జరుగుతాయి. సాంఘిక సంక్షేమం స్థాయీ సంఘానికి మాక్లూర్ జడ్పీటీసీ సభ్యురాలు కున్యోత్ లత అధ్యక్షులుగా వ్యవహరిస్తారు. ఇటు ఆర్థిక, ప్రణాళిక సంఘానికి జడ్పీ చైర్మన్ దఫేదారు రాజు అధ్యక్షులుగా వ్యవహరిస్తారు.
నేటి నుంచి జడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు
Published Tue, Oct 7 2014 1:18 AM | Last Updated on Sat, Sep 2 2017 2:26 PM
Advertisement