ఇందూరు, న్యూస్‌లైన్ : ఈనెల 6న ఆదివారం జరిగే ఎంపీటీసీ, జడ్పీటీసీ తొలి విడత ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. జిల్లాలో మొదటి విడతగా 18 మండలాల్లో ఎన్నికలను నిర్వహించనున్నారు. ఎలాంటి అ వాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడానికి అధికార యం త్రాంగం ఏర్పాట్లు పూర్తిచేసింది. పోలీసు బందోబస్తుతో పాటు, సూక్ష్మ పరిశీలకులు, ఇతర అధికారుల నియామ కం పూర్తయింది.
ఏడు లక్షల ఓటర్లు...
తొలి విడత జరిగే 18 మండలాల్లో మొత్తంగా 7,28, 809 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 3,51,559 మంది పురుష ఓటర్లు, 3,77,207 మంది మహిళా ఓటర్లు, ఇతరులు 43 మంది ఉన్నారు. వీరు ఓటుహక్కును వినియోగించుకోవడానికి ఎలాంటి ఇబ్బందు లు లేకుండా పోలింగ్ కేంద్రాల వద్ద అన్ని వసతులు ఏర్పాటు చేస్తున్నారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఓటరు జాబితాతో సహ పోలింగ్ సామగ్రిని మొత్తం సంబంధిత మండలాలకు పంపించారు.
జడ్పీటీసీ బరిలో 92 మంది...
జడ్పీటీసీ స్థానాలకు 92మంది అభ్యర్థులు, 298 ఎంపీటీసీ స్థానాలకు గాను 1,105 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. బాన్సువాడలో 52, బీర్కూర్ 47, బిచ్కుంద 53, బోధన్ 61, ధర్పల్లి 39, డిచ్‌పల్లి 61, జక్రాన్‌పల్లి 37, జుక్కల్ 53, కోటగిరి 53, మద్నూరు 57, మాక్లూర్ 51, నవీపేట్ 52, నిజామాబాద్ 91, నిజాంసాగర్ 33, రెంజల్ 33, వర్ని 59, ఎడపల్లిలో 35 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తంగా 18 మండలాల్లో 911 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు వెయ్యి కన్నా తక్కువ ఉంటే రెండు, అంత కన్నా ఎక్కువగా ఎక్కువగా ఉంటే మూడు బ్యాలెట్ బాక్సులను, మొత్తంగా 1,850 వరకు బ్యాలెట్ బాక్సులను వినియోగించనున్నారు.
ఎన్నికల సిబ్బంది నియామకం...
ఒక్కో పోలింగ్ కేంద్రానికి ఒక ప్రిసైడింగ్, ఇద్దరు అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులను నియమించగా, ఒక్కో పోలింగ్ కేంద్రానికి ముగ్గురు చొప్పున మొత్తం 2,733 మంది పోలింగ్ అధికారులను నియమించారు.ఒక్కో లైజన్ అధికారి చొప్పున 18 మందిని, రూట్ అధికారులను 18 మందిని ఏర్పాటు చేశారు. ప్రతి మండలానికి ఒక రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులను నియమించగా, మండలానికి ఐదుగురు చొప్పున 90 మంది జోనల్ అధికారులను, 20 మంది సిబ్బందిని నియమించారు. మొత్తం మీద మొదటి విడత ఎన్నికల నిర్వహణకు ఐఐటీ విద్యార్థుల నుంచి సిబ్బంది, అధికారులు కలిపి దాదాపుగా 3,300 మంది విధులు నిర్వర్తించబోతున్నారు.
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కన్ను...
మొదటి విడత ఎన్నికలు జరిగే 18 మండలాల్లో 911 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో 516 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా, 254 సున్నిత, 242 అతి సున్నిత పోలింగ్ కేంద్రాలుగా అధికారులు గుర్తించారు. కాగా 20 పోలింగ్ కేంద్రాలు నక్సలైట్ ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించారు. అవి మొత్తం ఒక్క నిజామాబాద్ మండలంలోనే ఉండటం గమనార్హం. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో ఏం జరుగుతుందో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కూర్చుండి పర్యవేక్షించి తెలుసుకోవడానికి 79 వెబ్ కెమెరాలను ఏర్పాటు చే శారు. వీటిని ఆపరేట్ చేయడానికి పరిజ్ఞానం కలిగిన ఐఐటీ విద్యార్థుల సేవలను వినియోగించుకుంటున్నారు. పోలింగ్ కేంద్రాల్లో 58 మంది వీడియోగ్రాఫర్లను నియమించారు. వీరు నిరంతరాయంగా చిత్రీకరికరిస్తారు.
అలాగే పోలింగ్ సరళిని పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా 142 మంది మైక్రో పరిశీలకులను నియమించారు. జిల్లాకు ఎన్నికల పరిశీలకులుగా నియమితులైన ఐఏఎస్ అధికారులు శ్రీదేవి, బి.భారతీ లక్‌పతి నాయక్‌లతో పాటు, జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న, జేసీ వెంకటేశ్వర్‌రావు ఆయా మండలాల్లో తిరిగి ఎన్నికల తీరును పరిశీలిస్తారు. ఎన్నికల్లో ఎక్కడ సమస్యలు తలెత్తిన అధికారులకు తెలియజేయడానికి ఉద్యోగులకు, ప్రజల కోసం 239003 అనే టోల్ ఫ్రీ నెంబర్‌ను జిల్లా పరిషత్‌లో ఏర్పాటు చేశారు. పోలింగ్ ఉదయం 7గంటలకు ప్రారంభమై సాయంత్రం ఐదు గంటలకు ముగుస్తుంది.
‘పరిషత్’ తొలి పోరుకు సర్వం సిద్ధం
Published Sat, Apr 5 2014 2:36 AM | Last Updated on Sat, Sep 2 2017 5:35 AM
Advertisement
Advertisement