Web cameras
-
సిరిసిల్ల: ఎన్నికలకు సర్వం సిద్ధం
సాక్షి, సిరిసిల్ల: జిల్లాలో శాసనసభ ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధమైంది. ఇప్పటికే రెండు దఫాలుగా ఎన్నికల సిబ్బందికి శిక్షణ పూర్తిచేయగా.. ఈవీఎంలలో బ్యాలెట్ పత్రాల కమిషనింగ్ సైతం కొలిక్కి వచ్చింది. జిల్లావ్యాప్తంగా 505 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల నిర్వహణకు 2,910 మంది సిబ్బందిని సిద్ధంచేశారు. జిల్లాలో 4,10,999 మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. గతంలో ఎన్నడూలేని విధంగా దివ్యాంగుల కోసం సిరిసిల్ల బాలికల హైస్కూల్, వేములవాడ మండలం కోనాయిపల్లి పాఠశాలలో దివ్యాంగుల కోసం ప్రత్యేక పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుచేశారు. మహిళల కోసం మొత్తం మహిళా పోలింగ్ సిబ్బందితో సిరిసిల్ల గీతానగర్ స్కూల్, వేములవాడ సాంస్కృతిక డిగ్రీ కళాశాలలో ప్రత్యేక మహిళా కేంద్రాలు ఏర్పాటుచేయనున్నారు. పోలింగ్ సిబ్బంది నియామకం.. సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల్లో ఎన్నికల నిర్వహణ కోసం 2,910 మంది సిబ్బందిని నియమించారు. వేములవాడ నియోజకవర్గంలో 235 పోలింగ్ కేంద్రాలు ఉండగా 15శాతం అదనపు సిబ్బందితో కలిపి 271 మంది పోలింగ్ అధికారులను, మరో 271 మంది ఏపీవోలను, 542 మంది అదనపు పోలింగ్ సిబ్బందిని నియమించారు. మరో 271 మందిని ఎన్నికల నిర్వహణకు ఎంపికచేశారు. సిరిసిల్ల నియోజకవర్గంలో 270 పోలింగ్ కేంద్రాలు ఉండగా 311 మంది పోలింగ్ అధికారులు, మరో 311 మంది ఏపీవోలు, 622 మంది ఓపీవోలను, 311 మంది అదనపు సిబ్బందిని నియమించారు. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లను కలెక్టర్ వెంకట్రామరెడ్డి పూర్తిచేశారు. ఫొటో పోల్ చిట్టీల పంపిణీ జిల్లా వ్యాప్తంగా ఓటర్లకు ఫొటో పోల్ చిట్టీలను బూత్ లెవల్ అధికారుల ద్వారా పంపిణీ చేస్తున్నారు. శుక్రవారం ఒక్కరోజే 62వేల మందికి ఈ చిట్టీలను పంపిణీ చేశారు. వీటితోపాటు కొత్తగా ఓటర్లుగా నమోదైన యువకులకు ఓటరు గుర్తింపుకార్డులను జారీచేస్తున్నారు. మూడురోజల కిందటే జిల్లాకు కొత్త ఓటరు గుర్తింపుకార్డులు వచ్చాయి. వీటిని జిల్లావ్యాప్తంగా పంపిణీ చేస్తున్నారు. జిల్లాలో ఎన్నారై ఓటర్లు ఇద్దరు ఉండగా సర్వీసు ఓటర్లు 93 మంది ఉన్నారు. క్షేత్రస్థాయిలో ఎన్నికల నిర్వహణకు అవసరమైన పనులు చురుకుగా సాగుతున్నాయి. వెబ్ కెమెరాలకు ఏర్పాట్లు జిల్లావ్యాప్తంగా పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ కోసం వెబ్కెమెరాలను ఏర్పాటుచేస్తున్నారు. ఇప్పటికే లాప్‌ట్యాప్‌లు ఉన్న ఇంజినీరింగ్ విద్యార్థులను ఎంపిక చేసి వెబ్‌కాస్టింగ్‌పై శిక్షణ ఇచ్చారు. హై ఫ్రీక్వెన్సీ ఉన్న కెమెరాలను కొనుగోలు చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 69 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వి«ధిగా కెమెరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. తెలంగాణ ఎన్నికలు 2018 మరిన్ని వార్తలకు... -
ప్రభుత్వాస్పత్రుల్లో వెబ్ కెమెరాలు
వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి జడ్చర్ల: రాష్ర్టంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వెబ్ కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డి తెలిపారు. ఆదివారం మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో విలేకరులతో ఆయన మాట్లాడారు. ఆసుపత్రుల్లో సిబ్బంది పనితీరు, తదితర సమస్యలను పరిశీలించేందుకు వీలుగా ఈ వెబ్ కెమెరాలు పెడుతున్నామని చెప్పారు. ఇప్పటికే జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 16 కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు. ఈ సందర్భంగా ఆయన తన మొబైల్ ఫోన్ ద్వారా వెబ్ కెమెరాలను లింక్‌చేసి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని ఐసీయూ విభాగాన్ని పరిశీలించారు. వెబ్ కెమెరాలతో సిబ్బంది పనితీరులో మార్పు వచ్చే అవకాశం ఉంటుందన్నారు. దీంతో రోగులకు మరింత మెరుగైన వైద్యం అందుతుందని మంత్రి అభిప్రాయపడ్డారు. దశలవారీగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వెబ్ కెమెరాలను ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. -
నేడు పరిషత్ తుది పోరు
సాక్షి, నెల్లూరు జిల్లాలో పరిషత్ ఎన్నికల రెండో విడత పోరు శుక్రవారం జరగనుంది. మొత్తం 25 జెడ్పీటీసీ స్థానాలకు, 311 ఎంపీటీసీ స్థానాలకు జరగనున్న ఈ ఎన్నికల్లో 7,83,654 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో పురుషులు 3,87,068 మంది, స్త్రీలు 3,96,583 మంది, ఇతరులు ముగ్గురు ఉన్నారు. ఈ నెల 6న తొలివిడత ఎన్నికల్లో భాగంగా 21 జెడ్పీటీసీ, 258 ఎంపీటీసీలకు ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. శుక్రవారం జరగనున్న మలివిడత ఎన్నికల్లో మొత్తం 25 జెడ్పీటీసీ స్థానాలకు సంబంధించి 100 మంది, 311 ఎంపీటీసీ స్థానాలకు 883 మంది అభ్యర్థులు బరిలో ఉండగా 1,062 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇప్పటికే ఎన్నికలు జరగనున్న 25 మండలాల్లో 112 అతి సమస్యాత్మక గ్రామాలు, 207 సమస్యాత్మక గ్రామాలుగా అధికారులు గుర్తించారు. ఈ గ్రామాలపై జిల్లా అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు, సిబ్బందికి ఇప్పటికే ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఎదురైతే వాటిని ఏ విధంగా చక్కబెట్టాలనే విషయమై ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారు. ముఖ్యంగా ప్రిసైడింగ్ అధికారులకు జిల్లా పాలనాధికారి ఎన్.శ్రీకాంత్ పదేపదే జాగ్రత్తలు చెప్పడంతో పాటు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఆయా ప్రాంతాల్లో వెబ్‌కెమెరాలు, వీడియోగ్రాఫర్లను ఏర్పాటు చేసి అన్ని అంశాలను చిత్రీకరించే విధంగా చర్యలు చేపట్టారు. ఈ ఎన్నికలకు సంబంధించి 5,848 మంది ప్రిసైడింగ్, పోలింగ్ అధికారులు విధులను నిర్వర్తించనున్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బంది ఇప్పటికే అవసరమయ్యే బ్యాలెట్ బాక్సులు, ఇతర సామాగ్రితో పాటు పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకున్నారు. గతానుభవాలను దృష్టిలో ఉంచుకుని శుక్రవారం జరగనున్న ఎన్నికల్లో ఎలాంటి చిన్న ఇబ్బంది కూడా తలెత్తకుండా సజావుగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అధికార యంత్రాంగం ప్రత్యేకంగా చర్యలు చేపట్టింది. కౌంటిగ్ కేంద్రాలు ఇవే : 25 జెడ్పీటీసీ స్థా నాలకు జరిగే ఎన్నికలకు సంబంధించి నెల్లూరులోని డీకే మహిళా కళాశాల, గూడూరులోని ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాల, నాయుడుపేటలోని నారాయణ జూని యర్ కళాశాలలో ఓట్ల లెక్కింపునకు చర్యలు చేపట్టారు. చేజర్ల, కలువాయి, ఇందుకూరుపేట, నెల్లూరు, తోటపల్లిగూడూరు, ముత్తుకూరు, వెంకటాచలం, పొదలకూరు, రాపూరు మండలాలకు సంబంధించిన బ్యాలెట్ బాక్సులను నెల్లూరులోని డీకే ప్రభుత్వ మహిళా కళాశాలకు చేర్చడంతో పాటు అక్కడే నిర్ణయించిన తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుంది. మనుబోలు, గూడూరు, చిల్లకూరు, చిట్టమూరు, కోట, వాకాడు, సైదాపురం, డక్కిలి, వెంకటగిరి, బాలాయపల్లి, మండలాలకు సంబంధించి గూడూరులోని ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాలలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఓజిలి, నాయుడుపేట, పెళ్లకూరు, దొరవారిసత్రం, సూళ్లూరుపేట, తడ మండలాలకు సంబంధించి నాయుడుపేటలోని నారాయణ జూనియర్ కళాశాలలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. -
‘పరిషత్’ తొలి పోరుకు సర్వం సిద్ధం
ఇందూరు, న్యూస్‌లైన్ : ఈనెల 6న ఆదివారం జరిగే ఎంపీటీసీ, జడ్పీటీసీ తొలి విడత ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. జిల్లాలో మొదటి విడతగా 18 మండలాల్లో ఎన్నికలను నిర్వహించనున్నారు. ఎలాంటి అ వాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడానికి అధికార యం త్రాంగం ఏర్పాట్లు పూర్తిచేసింది. పోలీసు బందోబస్తుతో పాటు, సూక్ష్మ పరిశీలకులు, ఇతర అధికారుల నియామ కం పూర్తయింది. ఏడు లక్షల ఓటర్లు... తొలి విడత జరిగే 18 మండలాల్లో మొత్తంగా 7,28, 809 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 3,51,559 మంది పురుష ఓటర్లు, 3,77,207 మంది మహిళా ఓటర్లు, ఇతరులు 43 మంది ఉన్నారు. వీరు ఓటుహక్కును వినియోగించుకోవడానికి ఎలాంటి ఇబ్బందు లు లేకుండా పోలింగ్ కేంద్రాల వద్ద అన్ని వసతులు ఏర్పాటు చేస్తున్నారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఓటరు జాబితాతో సహ పోలింగ్ సామగ్రిని మొత్తం సంబంధిత మండలాలకు పంపించారు. జడ్పీటీసీ బరిలో 92 మంది... జడ్పీటీసీ స్థానాలకు 92మంది అభ్యర్థులు, 298 ఎంపీటీసీ స్థానాలకు గాను 1,105 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. బాన్సువాడలో 52, బీర్కూర్ 47, బిచ్కుంద 53, బోధన్ 61, ధర్పల్లి 39, డిచ్పల్లి 61, జక్రాన్‌పల్లి 37, జుక్కల్ 53, కోటగిరి 53, మద్నూరు 57, మాక్లూర్ 51, నవీపేట్ 52, నిజామాబాద్ 91, నిజాంసాగర్ 33, రెంజల్ 33, వర్ని 59, ఎడపల్లిలో 35 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తంగా 18 మండలాల్లో 911 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు వెయ్యి కన్నా తక్కువ ఉంటే రెండు, అంత కన్నా ఎక్కువగా ఎక్కువగా ఉంటే మూడు బ్యాలెట్ బాక్సులను, మొత్తంగా 1,850 వరకు బ్యాలెట్ బాక్సులను వినియోగించనున్నారు. ఎన్నికల సిబ్బంది నియామకం... ఒక్కో పోలింగ్ కేంద్రానికి ఒక ప్రిసైడింగ్, ఇద్దరు అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులను నియమించగా, ఒక్కో పోలింగ్ కేంద్రానికి ముగ్గురు చొప్పున మొత్తం 2,733 మంది పోలింగ్ అధికారులను నియమించారు.ఒక్కో లైజన్ అధికారి చొప్పున 18 మందిని, రూట్ అధికారులను 18 మందిని ఏర్పాటు చేశారు. ప్రతి మండలానికి ఒక రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులను నియమించగా, మండలానికి ఐదుగురు చొప్పున 90 మంది జోనల్ అధికారులను, 20 మంది సిబ్బందిని నియమించారు. మొత్తం మీద మొదటి విడత ఎన్నికల నిర్వహణకు ఐఐటీ విద్యార్థుల నుంచి సిబ్బంది, అధికారులు కలిపి దాదాపుగా 3,300 మంది విధులు నిర్వర్తించబోతున్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వెబ్కన్ను... మొదటి విడత ఎన్నికలు జరిగే 18 మండలాల్లో 911 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో 516 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా, 254 సున్నిత, 242 అతి సున్నిత పోలింగ్ కేంద్రాలుగా అధికారులు గుర్తించారు. కాగా 20 పోలింగ్ కేంద్రాలు నక్సలైట్ ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించారు. అవి మొత్తం ఒక్క నిజామాబాద్ మండలంలోనే ఉండటం గమనార్హం. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో ఏం జరుగుతుందో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కూర్చుండి పర్యవేక్షించి తెలుసుకోవడానికి 79 వెబ్ కెమెరాలను ఏర్పాటు చే శారు. వీటిని ఆపరేట్ చేయడానికి పరిజ్ఞానం కలిగిన ఐఐటీ విద్యార్థుల సేవలను వినియోగించుకుంటున్నారు. పోలింగ్ కేంద్రాల్లో 58 మంది వీడియోగ్రాఫర్లను నియమించారు. వీరు నిరంతరాయంగా చిత్రీకరికరిస్తారు. అలాగే పోలింగ్ సరళిని పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా 142 మంది మైక్రో పరిశీలకులను నియమించారు. జిల్లాకు ఎన్నికల పరిశీలకులుగా నియమితులైన ఐఏఎస్ అధికారులు శ్రీదేవి, బి.భారతీ లక్పతి నాయక్‌లతో పాటు, జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న, జేసీ వెంకటేశ్వర్రావు ఆయా మండలాల్లో తిరిగి ఎన్నికల తీరును పరిశీలిస్తారు. ఎన్నికల్లో ఎక్కడ సమస్యలు తలెత్తిన అధికారులకు తెలియజేయడానికి ఉద్యోగులకు, ప్రజల కోసం 239003 అనే టోల్ ఫ్రీ నెంబర్‌ను జిల్లా పరిషత్‌లో ఏర్పాటు చేశారు. పోలింగ్ ఉదయం 7గంటలకు ప్రారంభమై సాయంత్రం ఐదు గంటలకు ముగుస్తుంది. -
నేడు ‘పుర’ పోరు
సాక్షి, గుంటూరు,జిల్లాలోని 12 పురపాలక సంఘాల్లో ఆదివారం ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించేందుకు జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అన్ని పురపాలక సంఘాల్లో కలిపి 371 వార్డులు కాగా, మాచర్లలో రెండు వార్డులకు ఎన్నిక నిలిచిపోయింది. మరో వార్డు ఏకగ్రీవమైంది. ఫలితంగా 368 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. 1456 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మొత్తం 6,08,972 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరి కోసం మొత్తం 654 పోలింగ్‌బూత్‌లు ఏర్పాటు చేశారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్(ఈవీఎం)లను వినియోగిస్తున్నారు. ఈ ఎన్నికలకు జిల్లా జాయింట్ కలెక్టర్ వివేక్ యాదవ్ నోడల్ అధికారిగా వ్యవహరిస్తున్నారు. జిల్లాకు పరిశీలకులుగా అనితా రాజేంద్ర, లక్ష్మినరసింహ నియమితులయ్యారు.ఒక్కో మున్సిపాలిటీకి ఒక్కో సూపర్వైజరీ అధికారిని నియమించి పకడ్బందీగా నిర్వహించే విధంగా చర్యలు చేపట్టారు.12 మున్సిపాలిటీలకు 3,500 మంది ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు, పోలింగ్ సిబ్బందిని పంపారు.సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి ఆయా ప్రాంతాల్లో వీడియోగ్రాఫర్లతో పాటు వెబ్ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. అన్ని మున్సిపాలిటీల పరిధిలో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి కొత్త వ్యక్తులు పట్టణాల్లోకి రాకుండా, డబ్బు, మద్యం తరలించకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.పోలింగ్ సమయంలో ఎలాంటి గొడవలు జరగకుండా ఆరు అంచెల బందోబస్తు ఏర్పాటు చేశారు. 368 వార్డులు...1456 మంది అభ్యర్థులు 12 పురపాలకసంఘాల పరిధిలో 371 వార్డులకు మాచర్లలోని 21, 22 వార్డులకు ఎన్నిక నిలిచిపోయాయి. 28వ వార్డు టీడీపీకి ఏకగ్రీవమైంది. మిగిలిన 368 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. 1456 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.అత్యధికంగా నరసరావుపేటలో 34 వార్డులకు 203 మంది బరిలో ఉన్నారు.అత్యల్పంగా మాచర్లలో 26 వార్డులకు 70 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. ఇండిపెండెంట్ అభ్యర్థులు 419 మంది ఉండటం గమనార్హం. వర్గపోరుతో సతమతమవుతున్న టీడీపీ పురపాలక ఎన్నికల్లో టీడీపీ వర్గపోరుతో సతమతమవుతోంది. ఈ ఎన్నికల్లో అభ్యర్థులు ఓటమి పాలైతే ఇన్చార్జిలకు టికెట్లు ఉండవని భావించిన వ్యతిరేక వర్గీయులు టీడీపీ అభ్యర్థుల ఓటమికి పథక రచన చేస్తున్నారు. ముఖ్యంగా నరసరావుపేట, బాపట్ల, రేపల్లె, మంగళగిరి, పిడుగురాళ్ళ, మాచర్ల మున్సిపాలిటీల్లో టీడీపీకి ఇంటిపోరు తీవ్ర తలనొప్పిగా మారింది. వైఎస్సార్ సీపీ ధాటిని తట్టుకోలేక ఏకమైన పార్టీలు మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీని తట్టుకోలేక అన్ని పార్టీలు ఏకమై పోటీకి దిగాయి.మంగళగిరి, వినుకొండ, నరసరావుపేట, మాచర్ల, చిలకలూరిపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ, సీపీఎంలు ఒక్కోచోట ఒక్కో పార్టీతో పొత్తు పెట్టుకుని వైఎస్సార్ సీపీని ఎదుర్కోవాలని చూస్తున్నాయి. అన్ని వర్గాల ప్రజలు వైఎస్సార్ సీపీకి అనుకూలంగా ఉండటంతో ప్రత్యర్థుల ఎత్తులు పారే అవకాశం లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కెమెరాలు
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : సార్వత్రిక, మున్సిపల్, స్థానిక ఎన్నికలు ప్రశాంతం గా జరగడానికి జిల్లా అధికార యంత్రాంగం దృష్టిసారించింది. ఇందుకోసం ట్రిపుల్ ఐటీ విద్యార్థుల సహాయం తీసుకోనున్నారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిఘా పెట్టాలని చూస్తున్నారు. ఇందుకోసం వెబ్ కెమెరాలను, మోబైల్ వాహనాలను ఉపయోగించనున్నారు. 2,256 పోలింగ్ కేంద్రాలు జిల్లా వ్యాప్తంగా పది నియోజకవర్గాల్లో 2,256 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. కాగజ్‌నగర్ నియోజకవర్గంలో 226, చెన్నూర్‌లో 208, బెల్లంపల్లిలో 190, మంచిర్యాలలో 245, ఆసిఫాబాద్‌లో 254, ఖానాపూర్‌లో 218, ఆదిలాబాద్‌లో 230, బోథ్‌లో 223, నిర్మల్‌లో 222, ముథోల్‌లో 241 ఉన్నాయి. వీటిలో 650 అత్యంత సమస్యాత్మక, 820 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉంచవచ్చని అధికారులు భావిస్తున్నారు. వీటిని పూర్తిస్థాయిలో నిర్ధారించడానికి కసరత్తు జరుగుతోంది. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో వెబ్ కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం ఇంటర్ నెట్, ఫోన్ సౌకర్యం కల్పించేందుకు కలెక్టర్ బీఎస్ఎన్ఎల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఇంకా 2,500 మంది బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులను ఉపయోగించుకోకున్నారు. వీరికి వెబ్ కాస్టింగ్‌పై శిక్షణ ఇచ్చి మున్సిపల్, సార్వత్రిక ఎన్నికల వరకు రొటేషన్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఫొటో, వీడియోగ్రాఫర్ల చిత్రీకరణ జిల్లావ్యాప్తంగా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న 4,512 మంది ఫొటో, వీడియోగ్రాఫర్ల వివరాలు సేకరించారు. ప్రతీ పోలింగ్ కేంద్రంలో ఒక ఫొటో, ఒక వీడియోగ్రాఫర్‌ను నియమించనున్నారు. ఇందుకు 2,256 మంది ఫొటోగ్రాఫర్లు, 2,256 మంది వీడియోగ్రాఫర్లు పనిచేయనున్నారు. అధికారులు ఎన్నికల పనుల్లో బిజీగా ఉన్నారు. ఎన్నికల ఏర్పాట్లు, మండలాల, డివిజన్‌వారీగా సమావేశాలు, వీడియో కాన్ఫరెన్స్‌ల్లో నిర్వహిస్తున్నారు. ఇంకా 10 నుంచి 15 గ్రామాలకు ఒక రూట్లో మోబైల్ వాహానాలు సంచరించే అవకాశాలున్నాయి. కాగా, వెబ్ కెమెరాలను పోలింగ్ కేంద్రాల నుంచి హైదరాబాద్‌లోని ఎన్నికల కమిషనర్ కార్యాలయం, జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయానికి అనుసంధానం చేస్తారు. దీంతో పోలింగ్ విధానాన్ని అటు ఈసీ అధికారులు, ఇటు కలెక్టరేట్ అధికారులు ఏక కాలంలో చూసుకోవడానికి వీలుంటుంది. ఫలితంగా ఏమైన సంఘటనలు జరిగితే వెంటనే చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. విధులు.. భత్యం.. ఎన్నికల విధులు నిర్వహించే ప్రతీ విద్యార్థికి రూ.500 ఇవ్వనున్నారు. పోలింగ్ ముందురోజే విద్యార్థులు కేంద్రాలకు చేరుకోవాల్సి ఉంటుంది. ఒక రాత్రి, ఒక పగలు విద్యార్థులు ఎన్నికల విధుల్లో పాల్గొంటారు. నెట్ సౌకర్యం, వెబ్‌కాస్టింగ్‌లో ఏలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలి. విద్యార్థులు వెళ్లాల్సిన పోలింగ్ కేంద్రాలను అధికారులు ముందు రోజే చెబుతారు. రెవెన్యూ డివిజన్లవారీగా నియమించి పోలింగ్ కేంద్రాలు కేటాయిస్తారు.