నేడు పరిషత్ తుది పోరు | toda parishad last elections | Sakshi
Sakshi News home page

నేడు పరిషత్ తుది పోరు

Published Fri, Apr 11 2014 2:46 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM

నేడు పరిషత్ తుది పోరు - Sakshi

నేడు పరిషత్ తుది పోరు

 సాక్షి, నెల్లూరు    జిల్లాలో పరిషత్ ఎన్నికల రెండో విడత పోరు శుక్రవారం జరగనుంది. మొత్తం 25 జెడ్పీటీసీ స్థానాలకు, 311 ఎంపీటీసీ స్థానాలకు జరగనున్న ఈ ఎన్నికల్లో 7,83,654 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో పురుషులు 3,87,068 మంది, స్త్రీలు 3,96,583 మంది, ఇతరులు ముగ్గురు ఉన్నారు. ఈ నెల 6న తొలివిడత ఎన్నికల్లో భాగంగా 21 జెడ్పీటీసీ, 258 ఎంపీటీసీలకు ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే.

శుక్రవారం జరగనున్న మలివిడత ఎన్నికల్లో మొత్తం 25 జెడ్పీటీసీ స్థానాలకు సంబంధించి 100 మంది, 311 ఎంపీటీసీ స్థానాలకు 883 మంది అభ్యర్థులు బరిలో ఉండగా 1,062 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇప్పటికే ఎన్నికలు జరగనున్న  25 మండలాల్లో 112 అతి సమస్యాత్మక గ్రామాలు, 207 సమస్యాత్మక గ్రామాలుగా అధికారులు గుర్తించారు. ఈ గ్రామాలపై జిల్లా అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు, సిబ్బందికి ఇప్పటికే ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఎదురైతే వాటిని ఏ విధంగా చక్కబెట్టాలనే విషయమై ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారు.


 ముఖ్యంగా ప్రిసైడింగ్ అధికారులకు జిల్లా పాలనాధికారి ఎన్.శ్రీకాంత్ పదేపదే జాగ్రత్తలు చెప్పడంతో పాటు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఆయా ప్రాంతాల్లో వెబ్‌కెమెరాలు, వీడియోగ్రాఫర్లను ఏర్పాటు చేసి అన్ని అంశాలను చిత్రీకరించే విధంగా చర్యలు చేపట్టారు. ఈ ఎన్నికలకు సంబంధించి 5,848 మంది ప్రిసైడింగ్, పోలింగ్ అధికారులు విధులను నిర్వర్తించనున్నారు.

 ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బంది ఇప్పటికే అవసరమయ్యే బ్యాలెట్ బాక్సులు, ఇతర సామాగ్రితో పాటు పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకున్నారు. గతానుభవాలను దృష్టిలో ఉంచుకుని శుక్రవారం జరగనున్న ఎన్నికల్లో ఎలాంటి చిన్న ఇబ్బంది కూడా తలెత్తకుండా సజావుగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అధికార యంత్రాంగం ప్రత్యేకంగా చర్యలు చేపట్టింది.


 కౌంటిగ్ కేంద్రాలు ఇవే : 25 జెడ్పీటీసీ స్థా నాలకు జరిగే ఎన్నికలకు సంబంధించి నెల్లూరులోని డీకే మహిళా కళాశాల, గూడూరులోని ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాల, నాయుడుపేటలోని నారాయణ జూని యర్ కళాశాలలో ఓట్ల లెక్కింపునకు  చర్యలు చేపట్టారు.

 చేజర్ల, కలువాయి, ఇందుకూరుపేట, నెల్లూరు, తోటపల్లిగూడూరు, ముత్తుకూరు, వెంకటాచలం, పొదలకూరు, రాపూరు మండలాలకు సంబంధించిన బ్యాలెట్ బాక్సులను నెల్లూరులోని డీకే ప్రభుత్వ మహిళా కళాశాలకు చేర్చడంతో పాటు అక్కడే నిర్ణయించిన తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుంది. మనుబోలు, గూడూరు, చిల్లకూరు, చిట్టమూరు, కోట, వాకాడు, సైదాపురం, డక్కిలి, వెంకటగిరి, బాలాయపల్లి, మండలాలకు సంబంధించి గూడూరులోని ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాలలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఓజిలి, నాయుడుపేట, పెళ్లకూరు, దొరవారిసత్రం, సూళ్లూరుపేట, తడ మండలాలకు సంబంధించి నాయుడుపేటలోని నారాయణ జూనియర్ కళాశాలలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement