ఎటు వెళ్దాం?
సాక్షి ప్రతినిధి, నెల్లూరు : ఆత్మకూరు నుంచే మళ్లీ బరిలోకి దిగాలా? లేక నెల్లూరు రూరల్‌కు వెళ్లాలా? ఈ రెండింటిలో ఏదైతే మనకు సేఫ్? మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మెదడును ఈ ప్రశ్నలు తొలచివేస్తున్నట్లు సమాచారం. అటో, ఇటో తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నం కావడంతో ఆయన శుక్రవారం తన సన్నిహితులైన ముఖ్యనేతలతో సమావేశం ఏర్పాటు చేశారు.
రామనారాయణరెడ్డి ఆత్మకూరు నుంచి గత ఎన్నికల్లో గెలుపొంది కీలకమైన ఆర్థిక మంత్రి పదవి సంపాదించారు. అధికార బలంతో వందల కోట్ల రూపాయల నిధులను అభివృద్ధి పేరుతో నియోజకవర్గంలో కుమ్మరింపజేశారు. ఇందులో వాస్తవంగా జరిగిన అభివృద్ధి ఎంత? అనే విషయం పక్కన పెడితే ఆయన మద్దతుదారులు, స్థానిక కాంగ్రెస్ నేతలు మాత్రం ఆర్థికంగా బాగానే అభివృద్ధి చెందారనేది నిర్వివాదాంశం.
ఈ ధీమాతోనే మళ్లీ ఆత్మకూరులో తాను గట్టెక్కగలననే ధీమాతో ఆనం నిశ్చయంగా గడుపుతూ వచ్చారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని నిట్టనిలువునా చీల్చిన ప్రభావం అన్ని ప్రాంతాల్లో మాదిరిగానే ఆనం ఇలాకాలో కూడా పడింది. కాంగ్రెస్ పేరు చెబితేనే జనం మాట అటుంచి నిన్నమొన్నటి దాకా ఆ పార్టీతో మమేకమైన నాయకులే ఆమడ దూరం పారిపోయే పరిస్థితి ఏర్పడింది. తాను చేసిన అభివృద్ధి మంత్రం వర్కవుట్ అవుతుందేమోనని మున్సిపల్ ఎన్నికల్లో ట్రయల్ రన్ నిర్వహించిన ఆనంకు ఆశించిన ఫలితం దక్కే సూచనలు కనిపించలేదు. ఆ ఎన్నికల్లో అన్ని వార్డులకు అభ్యర్థులు దొరకని పరిస్థితి ఏర్పడింది.
జెడ్‌పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ఇదే సీన్ పునరావృతం అయింది. పిలిచి టికెట్ ఇస్తానని చెప్పినా మా కొద్దు బాబోయ్ అంటూ పార్టీ నేతలు పరుగులెత్తడం ప్రారంభించారు. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో రామనారాయణరెడ్డి చేతులెత్తేశారు. కనీసం హస్తం గుర్తుకు ఓటేయండి అని గ్రామాల్లో ప్రచారం చేయడానికి కూడా ఆయన సాహసించలేక పోయారు. ఇలాంటి అనానుకూల వాతావరణంలో మళ్లీ ఆత్మకూరు నుంచే పోటీ చేస్తే సీన్ సితార్ అవుతుందని ఆనం ఆందోళన చెందుతున్నారు.
పోటీ చేస్తే ఒక ఇబ్బంది, చేయక పోతే భయపడి పోయాడనే పేరు వస్తుంది. ఏం చేయాలబ్బా అని కిందా మీదా పడుతూ బుర్ర బద్దలు కొట్టుకుంటున్న తరుణంలో టీడీపీ- బీజేపీ పొత్తు రాజకీ యం ఆయన నెత్తిన పాలుపోసినంత పనిచేసిందని రామనారాయణరెడ్డి సన్నిహితులు అంటున్నారు. ఈ స్థానం బీజేపీకి కేటాయించడం, ఆరు నూరైనా తాము ఇక్కడి నుంచే బరిలోకి దిగుతామని ఆ పార్టీ నాయకులు ప్రకటించడం ఆనం ఆశలకు మరింత బలమిచ్చినట్లు సమాచారం.
నెల్లూరు రూరల్ తమ సొంత నియోజకవర్గం కావడం, ఇక్కడ ప్రతి గ్రామంలో ఎవరు ఏమిటో తమకు అవగాహన ఉండటంతో ఈసారి ఎన్నికల్లో రూరల్ సీటు ఎంచుకోవడమే శ్రేయస్కరంగా ఆనం అంచనా వేశారని తెలిసింది. తాను ఇక్కడి నుంచి పోటీకి దిగితే తెలుగుదేశం శ్రేణుల మద్దతు సంపాదించి, తమ సొంత బలం జోడిస్తే కనీసం పోటీలో అయినా నిలవచ్చని ఆయన లెక్కలు కట్టినట్లు గుస గుసలు వినిపిస్తున్నాయి.
తన మనసులోని మాటను, క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితులను తన సన్నిహితులైన ముఖ్యుల ముందుంచి వారి మద్దుతు సంపాదించాలని రామనారాయణరెడ్డి నిర్ణయించారు. ఇందులో భాగంగా శుక్రవారం ఆత్మకూరు నియోజకవర్గంలోని కాంగ్రెస్ ముఖ్య నేతలను నెల్లూరులోని తన నివాసంలో జరిగే సమావేశానికి ఆహ్వానించారు. వారి నుంచి కూడా సరేననిపించుకున్న తర్వాతే సీటు మార్పిడి ప్రకటన చేయాలనే ఆలోచన చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
సిటీ నుంచి సుబ్బారెడ్డి
నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి కుమారుడు ఏసీ సుబ్బారెడ్డిని కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయించడానికి ఆనం కుటుంబీకులు నిర్ణయించారు. వివేకానందరెడ్డి ఈ ఎన్నికల్లో ఎక్కడి నుంచీ పోటీ చేయరాదని భావిస్తున్నట్లు సమాచారం.
నేను రాను...
టీడీపీలో చేరాలని ఆహ్వానం అం దుకున్న డీసీసీ బ్యాంకు చైర్మన్ మెట్టుకూరు ధనుంజయరెడ్డి ఇందుకు నో చెప్పారు. ఆత్మకూరు టికెట్ ఇస్తామని ఆఫర్ ఇచ్చిన టీడీపీ నేతలు రెండు రోజుల్లో ఏ నిర్ణయం చెప్పాలని మెట్టుకూరును కోరారు. ఆనం రామనారాయణరెడ్డితో చర్చించిన అనంతరం ధనుం జయరెడ్డి మీతో కలవలేనని టీడీపీ నేతలకు స్పష్టం చేశారని తెలిసింది.