నెల్లూరు(టౌన్), న్యూస్‌లైన్: పరిషత్ ఎన్నికలకు సంబంధించి ప్రలోభాలు ఊపందుకున్నాయి. ఇప్పటి వరకు రసవత్తరంగా సాగిన మున్సిపల్ పోరు ముగిసింది. ఏప్రిల్ 6, 11 తేదీల్లో జరగనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు అన్ని పార్టీలు సర్వం సిద్ధం చేసుకున్నాయి. ఎన్నికల యుద్ధంలో విజయం సాధించేందుకు పావులు కదుపుతున్నాయి. జిల్లాలో 6వ తేదీ పెన్నానదికి ఉత్తరం వైపు ఉన్న 21 మండలాల్లో, 11న పెన్నానదికి దక్షిణం వైపు ఉన్న 25 మండలాల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి.
46 జెడ్పీటీసీలకు 173 మంది పోటీ చేస్తున్నారు. ఈ పోటీ ప్రధానంగా వైఎస్సార్‌సీపీ, టీడీపీ మధ్యే సాగుతోంది. కాంగ్రెస్ కనీసం సగం స్థానాల్లో కూడా అభ్యర్థులను నిలపలేక ఆదిలోనే చేతులెత్తేసి చతికిల పడింది. అలాగే 583 ఎంపీటీసీ స్థానాలకు 1588 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు.
ఈ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ నుంచి 560 మంది, టీడీపీ నుంచి 537 మంది పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ మూడోవంతు స్థానాల్లో అంటే 192 స్థానాల్లో పోటీ చేస్తోంది. ఇక్కడ కూడా పోటీ వైఎస్సార్‌సీపీ, టీడీపీ మధ్యే సాగుతోంది.
ఓటర్లను ఆకట్టుకునేందుకు..
పల్లెల్లో ప్రధానంగా టీడీపీ ప్రలోభాలతో ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. అప్పుడే అనేక చోట్ల చీరలు, జాకెట్లు, వెండి కుంకుమ భరిణిలు పంచుతున్నట్టు వార్తలొస్తున్నాయి. రూ. 500 నుంచి రూ. 1000 వరకు చెల్లించి ఓట్లను నోట్ల కట్టలతో కొనుగోలు చే సేందుకు పన్నాగం పన్నారు. గ్రామాల్లో ఏ ఇద్దరు కలిసినా పరిషత్ ఎన్నికల గురించే చర్చించుకుంటున్నారు.
తూలుతున్న పల్లెలు
మరో వైపు మద్యం, బిరియాని పొట్లాలతో పురుషులను ఆకట్టుకుంటున్నారు. ముసలి, చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా ఎక్కువ మంది ఉచితంగా ఇచ్చే మద్యాన్ని తాగుతూ తూలుతున్నారు. పల్లెల్లో మద్యం ఏరులై పారుతున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. గత పంచాయతీ ఎన్నికలప్పుడు ఆత్మకూరు మండలం కుప్పురుపాడులో నేల బావిలో కేసుల కొద్ది మద్యం నిలువ చేసిన విషయం విదితమే.
అలాంటివి ఇప్పుడు కూడా అనేక గ్రామాల్లో చోటుచేసుకున్నాయి. పల్లెల్లో పోలీసులు గాలింపులు చేయడం మరచిపోయారనే విమర్శలున్నాయి. మత్తులో పరస్పరం తగాదాలు కొని తెచ్చుకుంటున్నారు. చిన్నచిన్నవి చినికిచినికి గాలివానలాగా మారి పెద్దపెద్ద కొట్లాటలకు దారి తీస్తున్నాయి. ఇప్పటికైనా పోలీసు అధికారులు నిఘా పెంచి పల్లెల్లో ప్రశాంత వాతావరణాన్ని కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.
ప్రలోభాల జోరు
Published Tue, Apr 1 2014 1:22 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM
Advertisement