నేడు ‘పుర’ పోరు
సాక్షి, గుంటూరు,జిల్లాలోని 12 పురపాలక సంఘాల్లో ఆదివారం ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించేందుకు జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అన్ని పురపాలక సంఘాల్లో కలిపి 371 వార్డులు కాగా, మాచర్లలో రెండు వార్డులకు ఎన్నిక నిలిచిపోయింది. మరో వార్డు ఏకగ్రీవమైంది. ఫలితంగా 368 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. 1456 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మొత్తం 6,08,972 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరి కోసం మొత్తం 654 పోలింగ్‌బూత్‌లు ఏర్పాటు చేశారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్(ఈవీఎం)లను వినియోగిస్తున్నారు.
ఈ ఎన్నికలకు జిల్లా జాయింట్ కలెక్టర్ వివేక్ యాదవ్ నోడల్ అధికారిగా వ్యవహరిస్తున్నారు. జిల్లాకు పరిశీలకులుగా అనితా రాజేంద్ర, లక్ష్మినరసింహ నియమితులయ్యారు.ఒక్కో మున్సిపాలిటీకి ఒక్కో సూపర్‌వైజరీ అధికారిని నియమించి పకడ్బందీగా నిర్వహించే విధంగా చర్యలు చేపట్టారు.12 మున్సిపాలిటీలకు 3,500 మంది ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు, పోలింగ్ సిబ్బందిని పంపారు.సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి ఆయా ప్రాంతాల్లో వీడియోగ్రాఫర్‌లతో పాటు వెబ్ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు.
అన్ని మున్సిపాలిటీల పరిధిలో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి కొత్త వ్యక్తులు పట్టణాల్లోకి రాకుండా, డబ్బు, మద్యం తరలించకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.పోలింగ్ సమయంలో ఎలాంటి గొడవలు జరగకుండా ఆరు అంచెల బందోబస్తు ఏర్పాటు చేశారు.
368 వార్డులు...1456 మంది అభ్యర్థులు 12 పురపాలకసంఘాల పరిధిలో 371 వార్డులకు మాచర్లలోని 21, 22 వార్డులకు ఎన్నిక నిలిచిపోయాయి. 28వ వార్డు టీడీపీకి ఏకగ్రీవమైంది.
మిగిలిన 368 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. 1456 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.అత్యధికంగా నరసరావుపేటలో 34 వార్డులకు 203 మంది బరిలో ఉన్నారు.అత్యల్పంగా మాచర్లలో 26 వార్డులకు 70 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. ఇండిపెండెంట్ అభ్యర్థులు 419 మంది ఉండటం గమనార్హం.
వర్గపోరుతో సతమతమవుతున్న టీడీపీ
పురపాలక ఎన్నికల్లో టీడీపీ వర్గపోరుతో సతమతమవుతోంది. ఈ ఎన్నికల్లో అభ్యర్థులు ఓటమి పాలైతే ఇన్‌చార్జిలకు టికెట్‌లు ఉండవని భావించిన వ్యతిరేక వర్గీయులు టీడీపీ అభ్యర్థుల ఓటమికి పథక రచన చేస్తున్నారు. ముఖ్యంగా నరసరావుపేట, బాపట్ల, రేపల్లె, మంగళగిరి, పిడుగురాళ్ళ, మాచర్ల మున్సిపాలిటీల్లో టీడీపీకి ఇంటిపోరు తీవ్ర తలనొప్పిగా మారింది.
వైఎస్సార్ సీపీ ధాటిని తట్టుకోలేక ఏకమైన పార్టీలు
మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీని తట్టుకోలేక అన్ని పార్టీలు ఏకమై పోటీకి దిగాయి.మంగళగిరి, వినుకొండ, నరసరావుపేట, మాచర్ల, చిలకలూరిపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ, సీపీఎంలు ఒక్కోచోట ఒక్కో పార్టీతో పొత్తు పెట్టుకుని వైఎస్సార్ సీపీని ఎదుర్కోవాలని చూస్తున్నాయి. అన్ని వర్గాల ప్రజలు వైఎస్సార్ సీపీకి అనుకూలంగా ఉండటంతో ప్రత్యర్థుల ఎత్తులు పారే అవకాశం లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.