ఎనిమిది పురపాలక సంఘాల్లో నేడు పోలింగ్
సాక్షి, కర్నూలు: మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. అధికార యంత్రాంగం ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. జిల్లాలోని నంద్యాల, ఆదోని, డోన్, ఎమ్మిగనూరు పురపాలక సంఘాలతో పాటు ఆత్మకూరు, ఆళ్లగడ్డ, నందికొట్కూరు, గూడూరు నగర పంచాయతీల్లో ఆదివారం పోలింగ్ జరగనుంది. ఎన్నికల విధుల్లో 3,061 మంది సిబ్బంది పాల్పంచుకోనున్నారు. మొత్తం నాలుగు మున్సిపాలిటీలు, నాలుగు నగర పంచాయతీల పరిధిలో 5,20,703 లక్షల మంది ఓటర్లు ఉండగా.. వీరంతా తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు 486 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎన్నికల విధులకు 609 మంది పోలింగ్ అధికారులు, మరో 609 మంది సహాయ పోలింగ్ అధికారులు.. 1843 మంది సిబ్బందిని నియమించారు. వీరితో పాటు ఎక్కడికక్కడ పట్టణ పరిధిని బట్టి జోనల్ అధికారులు, రూట్ అధికారులను ఏర్పాటు చేశారు.
పోలింగ్ రోజున 486 ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు(ఈవీఎం) వినియోగిస్తుండగా.. మరో 154 యంత్రాలను రిజర్వులో ఉంచారు. ఇప్పటికే వీటిని పోలింగ్ కేంద్రాలకు చేరవేయగా శనివారం రోజున సిబ్బందికి శిక్షణనిచ్చారు. ఎన్నికల సంఘం ఈసీఐఎల్ నుంచి నిపుణులైన ఇంజనీర్లు ఎనిమిది మందిని జిల్లాకు కేటాయించింది. వీరు కేటాయించిన పట్టణాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పర్యవేక్షించనున్నారు. ఇప్పటికే ఆయా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన 229 వెబ్ కెమెరాలతో పోలింగ్ ప్రక్రియపై ప్రత్యేక దృష్టి సారించారు. పోలింగ్ నిఘా బృందాలతో పాటు 90 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించారు.
నాలుగు పట్టణాల్లో 195 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు.. 229 అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. వీటన్నింటిపైనా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. పోలింగ్ ప్రక్రియనంతటినీ వీడియో కవరేజీ చేయనున్నారు. ఉదయం 7 గంటలకు ప్రారంభం కానున్న పోలింగ్ సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. 5 గంటల్లోపు క్యూలో ఉన్న ఓటర్లకు ఎంత ఆలస్యమైనా ఓటింగ్‌కు అవకాశం కల్పించనున్నట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు నిర్వహిస్తున్న మొదటి ఎన్నికలు కావడంతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టారు.