కలెక్టర్ సి.సుదర్శన్‌రెడ్డి
కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: జిల్లాలోని ఎనిమిది మున్సిపాలిటీల్లో పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని.. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సి.సుదర్శన్‌రెడ్డి తెలిపారు. ఆదివారం మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడుతూ రీపోలింగ్ సమస్య ఎక్కడా తలెత్తలేదన్నారు. అయితే పోలింగ్ 80 శాతం ఆశించగా.. 71.09 శాతానికే పరిమితమైందన్నారు. గత మున్సిపల్ ఎన్నికలతో పోలిస్తే ఈ శాతం కాస్త మెరుగేనన్నారు. ఇటీవల నగర పంచాయతీలుగా మారిన గూడూరు, ఆళ్లగడ్డ, నందికొట్కూరు, ఆత్మకూరులో పోలింగ్ సంతృప్తికరంగా ఉందన్నారు.
పోలింగ్ ప్రారంభంలో పలుచోట్ల ఈవీఎంలు మొరాయించడం తదితర సమస్యలు తలెత్తినా వెంటనే పరిష్కరించామన్నారు. 225 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల ప్రక్రియను వెబ్ క్యాస్టింగ్ ద్వారా పర్యవేక్షించామన్నారు. త్వరలో జరగనున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీలతో పాటు సాధారణ ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
ఓటరుగా నమోదు కావడమే కాదు.. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునేలా చైనత్యం తీసుకొస్తామని తెలిపారు. ఈ విషయమై కళాజాతలతో అవగాహన కల్పిస్తామన్నారు. మున్సిపల్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించిన పోలింగ్ సిబ్బంది, ఎన్నికల అధికారులు, పోలీసు యంత్రాంగానికి ఆయన అభినందనలు తెలిపారు