ఓటెత్తిన పల్లె
సాక్షి, కరీంనగర్ : జెడ్పీటీసీ, ఎంపీటీసీ తొలివిడత ఎన్నికల పోలింగ్ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జగిత్యాల, పెద్దపల్లి, మంథని డివిజన్ల పరిధిలోని 30 జెడ్పీటీసీ స్థానాలు, 403 ఎంపీటీసీ స్థానాలకు ఆదివారం ఎన్నికలు నిర్వహించారు. జెడ్పీటీసీ స్థానాలకు 183 మంది, ఎంపీటీసీ స్థానాలకు 1,790 మంది బరిలో నిలిచారు. మంథనిలో ఉదయం ఏడు నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ జరిగితే.. జగిత్యాల,పెద్దపల్లిలో ఐదు గంటల వరకు కొనసాగింది.
10,16,165 మంది ఓటర్లకు 7,90,887మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. జగిత్యాలలో అత్యధికంగా 2,20,936 మంది, మంథనిలో 4,21,331మంది మహిళలు ఓటేశారు. జిల్లా వ్యాప్తంగా 77.93శాతం పోలింగ్ నమోదైంది. 2006లో జరిగిన పోలింగ్ (72.78శాతం)తో పోల్చుకుంటే ఈసారి 5శాతం పెరిగింది.
అధికారులు ఈసారి 80 నుంచి 90శాతం వరకు పోలింగ్ జరిగేలా చర్యలు తీసుకున్నా.. పలు గ్రామాల్లో ఓటర్ల జాబితాలో పేర్లు లేకపోవడంతో ఆశించిన మేరకు ఓటింగ్ జరగలేదు. ఎండ తీవ్రత కూడా పోలింగ్‌పై ప్రభావం చూపింది. గ్రామాల్లో ఓటర్లు ఉదయం నుంచే బారులు తీరారు. మధ్యాహ్నం 12 గంటలకు ఎండ తీవ్రత పెరగడంతో ముగింపు సమయంలో పోటెత్తారు.
పోలింగ్ జరిగిందిలా..
సమస్యాత్మక ప్రాంతాల్లో పోలింగ్ సరళిని కలెక్టర్ ఎం.వీరబ్రహ్మయ్య, ఎన్నికల పరిశీలకులు, ఎస్పీ వెబ్‌కాస్టింగ్ ద్వారా పరిశీలించారు. కలెక్టర్ వీరబ్రహ్మయ్య సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి జెడ్పీ హైస్కూల్, నర్సయ్యపల్లి మండల పరిషత్ పాఠశాల, శివపల్లి పీఎస్, ఎలిగేడు జెడ్పీ హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. మహాముత్తారం మండలం కనుకునూరి-సింగారం గ్రామాల మధ్య గుర్తు తెలియని వ్యక్తులు రోడ్డుపై రాళ్లు పెట్టారు.
అది మావోయిస్టులపనే అని పుకార్లు లేవడంతో స్థానికులే రోడ్డుపై అడ్డంగా రాళ్లు పెట్టారని పోలీసులు చెప్పారు.
జగిత్యాల మండలం అనంతారం, బాలపల్లి గ్రామాల్లోని పోలింగ్ బూత్‌లో సాయత్రం ఐదు గంటలకు ఒకేసారి 50 మందికి పైగా ఓటర్లు రావడంతో అధికారులు అవకాశమిచ్చారు. కమాన్‌పూర్ మండలం రాణాపూర్‌లోని ఓ పోలింగ్ కేంద్రంలో బ్యాలెట్ పేపర్లు ఉల్టా ప్రచురితం కావడంతో అభ్యర్థులు ఆందోళనకు దిగారు. అక్కడ మధ్యాహ్నం రెండు గంటలకు నిలిచిన పోలింగ్ 45నిమిషాల తర్వాత ప్రారంభమైంది.
మహాదేవ్‌పూర్ మండలం బెగ్లూర్‌లో ఓ పోలింగ్ కేంద్రం వద్దే అభ్యర్థులు ప్రచారం నిర్వహిస్తుండడంతో పోలీసులు స్వల్పంగా లాఠీచార్జి చేశారు.పోలింగ్ పూర్తయిన తర్వాత పోలీసులు కట్టుదిట్టమైన భద్రత మధ్య బ్యాలెట్ బాక్సులను రెవెన్యూ డివిజన్ కేంద్రాలకు తరలించారు. మే 9 తర్వాత ఫలితాలు ప్రకటించాలని ప్రభుత్వం ఎప్పుడు ఆదేశించినా దానికి అధికారులు సిద్ధంగా ఉన్నారు. ఈ నెల 11న జరిగే రెండో విడత ఎన్నికల పోలింగ్‌పై అధికారులు దృష్టిసారించారు.