ఫలితాలపై ఉత్కంఠ
సాక్షి, రంగారెడ్డి జిల్లా: టిక్.. టిక్.. టిక్.. గడియారం చప్పుడు రాజకీయ పార్టీల నేతల గుండెల్లో దడ పుట్టిస్తోంది. మరికొద్ది సేపట్లో పురపాలక సంఘాల ఎన్నికల ఓట్ల లెక్కింపు మొదలు కానుంది. సోమవారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. గత మార్చి 30న జిల్లాలోని వికారాబాద్, తాండూరు, ఇబ్రహీంపట్నం, బడంగ్‌పేట్, పెద్ద అంబర్‌పేట్ మున్సిపాలిటీలు/నగర పంచాయతీలకు ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఫలితాల వెల్లడి వాయిదా పడింది. ఇప్పుడు అన్ని ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ముగియడంతో ఫలితాలను వెలువరించేందుకు ఎన్నికల సంఘం ఉపక్రమించింది. ఇందులో భాగంగా సోమవారం పురపాలక సంఘాలు, మంగళవారం ప్రాదేశిక స్థానాలకు సంబంధించి ఓట్ల లెక్కింపుచేపట్టనున్నారు. ఇందుకోసం జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
తేలనున్న 663 మంది భవిష్యత్తు
ఐదు మున్సిపాలిటీలు/నగర పంచాయతీల పరిధిలో 119 కౌన్సిలర్ స్థానాలకు వివిధ పార్టీలకు చెందిన 663 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. శక్తియుక్తులన్నీ కూడగట్టి జోరుగా ప్రచారం నిర్వహించి, ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు పలు ఫీట్లు చేశారు. ఓటింగ్ సమయం వరకు గెలుపు కోసం కృషి చేసిన వీరంతా.. నెలకు పైబడి ఫలితాల కోసం అంచనాలు వేసి తమ బలమెలా ఉందనే విషయమై రకరకాల సర్వేలు నిర్వహించారు. మొత్తంగా సోమవారం అభ్యర్థుల భవితవ్యం తేలనుండటంతో ఉత్కంఠ నెలకొంది.
చైర్మన్ ఎన్నికపై సందిగ్ధత
నగర పంచాయితీ చైర్మన్ ఎన్నికపై ఎన్నికల కమిషన్ ఇంతవరకు ఎలాంటి నోటిఫికేషన్ జారీ చేయకపోవడంతో చైర్మన్ ఎన్నికపై సందిగ్ధత నెలకొంది. రాష్ట్ర విభజన, సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో చైర్మన్ ఎన్నిక ఎప్పుడు జరుగుతుందో చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. చైర్మన్ ఎన్నికపై జాప్యం జరిగిన కొద్దీ సమీకరణాలు మారే అవకాశాలు ఉన్నాయి.