తేలేది నేడే | local body elections results coming soon | Sakshi
Sakshi News home page

తేలేది నేడే

Published Mon, May 12 2014 1:29 AM | Last Updated on Tue, Oct 16 2018 6:27 PM

తేలేది నేడే - Sakshi

తేలేది నేడే

మున్సిపల్ ఎన్నికల అభ్యర్థుల భవితవ్యం సోమవారంతో తేలిపోనుంది. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుండగా మధ్యాహ్నానికే పూర్తి ఫలితాలు వెల్లడయ్యే అవకాశముంది. అధికారులు కౌంటింగ్ కోసం అన్ని ఏర్పాట్లూ పూర్తిచేశారు.
 
 మచిలీపట్నం, న్యూస్‌లైన్ : జిల్లాలోని మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు సోమవారం వెల్లడి కానున్నాయి. జిల్లాలో ఒక కార్పొరేషన్, ఐదు పురపాలక సంఘాలు, మూడు నగర పంచాయతీలు ఉన్నాయి. వాటిలో కొత్తగా ఏర్పడిన నగర పంచాయతీలు ఉయ్యూరు, నందిగామ, తిరువూరులకు తొలి విడతగా పాలకవర్గాలు ఎన్నిక కానున్నాయి. పురపాలక సంఘాల్లో ఓట్ల లెక్కింపు కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఆయా పార్టీల అభ్యర్థుల తరఫున కౌంటింగ్ ఏజెంట్ల నియామకం పూర్తయింది. లెక్కింపులో పాల్గొనే అధికారులు, సిబ్బందికి శిక్షణ కార్యక్రమం కూడా నిర్వహించారు.
 
 నాలుగేళ్లుగా వాయిదాలే...

 2010 సెప్టెంబరులో పురపాలక సంఘాల పాలకవర్గాల పదవీకాలం పూర్తయింది. అప్పటి ప్రభుత్వం పురపాలక సంఘాల ఎన్నికలను వాయిదా వేసి ప్రత్యేకాధికారుల పాలనలోనే  పురపాలక సంఘాలను నడిపింది. హైకోర్టు అక్షింతలు వేయడంతో దాదాపు 42 నెలల అనంతరం పురపాలక సంఘాల ఎన్నికలను ఈ ఏడాది మార్చి 30న నిర్వహించారు. ఏప్రిల్ రెండో తేదీనే పురపాలక సంఘాల ఫలితాలను ప్రకటించాల్సి ఉంది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సాధారణ ఎన్నికల నేపథ్యంలో పురపాలక సంఘాల కౌంటింగ్‌ను మే 12న నిర్వహించాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. 41 రోజుల తరువాత పురపాలక ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ చేపట్టేందుకు ఏర్పాట్లు చేశారు.
 
 కౌంటింగ్ కేంద్రాలు ఇవే...
 జిల్లాలోని ఎనిమిది పురపాలక సంఘాల్లోని 218 వార్డులకు, విజయవాడ కార్పొరేషన్‌లోని 59 డివిజన్లలో మార్చి 30న ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికలను ఈవీఎంల ద్వారా నిర్వహించగా సోమవారం కౌంటింగ్ జరగనుంది. మచిలీపట్నం పురపాలక సంఘంలోని 42 వార్డులకు చెందిన ఎన్నికల కౌంటింగ్ మచిలీపట్నం హిందూ కళాశాల ఆడిటోరియంలో నిర్వహిస్తారు. గుడివాడ పురపాలక సంఘంలోని 36 వార్డుల కౌంటింగ్‌ను గుడివాడలోని ఏఎన్నార్ కళాశాలలో నిర్వహించనున్నారు.

నూజివీడు పురపాలక సంఘంలోని 30 వార్డులకు, తిరువూరు పురపాలక సంఘంలోని 20 వార్డులకు, ఉయ్యూరు పురపాలక సంఘంలోని 20 వార్డులకు సంబంధించిన ఓట్ల లెక్కింపును నూజివీడు సారథి ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. నందిగామ పురపాలక సంఘంలోని 20 వార్డులకు, జగ్గయ్యపేట పురపాలక సంఘంలోని 27 వార్డులకు సంబంధించిన ఓట్ల లెక్కింపును విజయవాడ సిద్ధార్థ మహిళా కళాశాలలో నిర్వహించనున్నారు. పెడన పురపాలక సంఘంలోని  23 వార్డులకు సంబంధించిన ఓట్ల లెక్కింపును మచిలీపట్నంలోని శ్రీవరలక్ష్మి పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఎం.రఘునంద న్‌రావు తెలిపారు. కౌంటింగ్ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆయన వివరించారు.
 
అభ్యర్థుల్లో ఎడతెగని ఉత్కంఠ...
ఈ ఏడాది మార్చి 30న పురపాలక సంఘాలకు ఎన్నికలు నిర్వహించారు. 41 రోజుల అనంతరం ఓట్ల లెక్కింపు జరగనుంది. ఏప్రిల్ రెండో తేదీనే పురపాలక సంఘాల ఎన్నికల ఫలితాలు వెల్లడవుతాయని అభ్యర్థులు ఆశలు పెట్టుకోగా సాదారణ ఎన్నికల నేపధ్యంలో పురపాలక సంఘాల ఎన్నికల ఫలితాల వెల్లడికి బ్రేక్ పడింది. ఆద్యంతం హోరాహోరీగా జరిగిన పురపాలక సంఘాల ఎన్నికల్లో అన్ని పార్టీల అభ్యర్థులూ నగదును మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు చేశారు. కౌన్సిలర్ పదవి కోసం లక్షలాది రూపాయలు ఖర్చు చేసిన అభ్యర్థులు ఫలితాలు ఎలా ఉంటాయనే అంశంపై ఉత్కంఠ ఎదుర్కొంటున్నారు. ఎట్టకేలకు సోమవారం ఎన్నికల ఫలితాలు వెల్లడి కానుండటంతో ఈ ఉత్కంఠకు తె రపడనుంది. ఇప్పటికే అభ్యర్థులు తమ తరఫున కౌంటింగ్ ఏజెంట్లను నియమించుకున్నారు. కౌంటింగ్ ఏజెంట్లు లోపలికి ప్రవేశించకుండా బారికేడ్లతో పాటు మెస్‌లను ఏర్పాటు చేశారు. కౌంటింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటన లూ జరగకుండా అన్ని కౌంటింగ్ కేంద్రాల్లో పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. గెలుపొందిన అభ్యర్థులకు ఆయా పురపాలక సంఘాల ఎన్నికల అధికారులు ధ్రువపత్రాలను జారీ చేస్తారు.
 
 జోరుగా బెట్టింగ్‌లు...
 పురపాలక సంఘాల్లో కౌంటింగ్ సోమవారం జరగనుండటంతో ఆయా పురపాలక సంఘాల్లో ఆయా పార్టీల అభ్యర్థుల గెలుపోటములపై బెట్టింగ్‌ల జోరు ఊపందుకుంది. ఏ పురపాలక సంఘంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఏ వార్డులో ఎవరు గెలుస్తారు,  వార్డుల వారీగా గెలిచే అభ్యర్థులకు ఎంత మెజారిటీ వస్తుంది తదితర అంశాల్లో బెట్టింగ్‌లు ఊపందుకున్నాయి. పందేల రాయుళ్లు అవతలి వ్యక్తులను రెచ్చగొట్టి మరీ పందేలకు పురిగొల్పుతున్నారు. సామాన్యుడి నుంచి ధనవంతుల వరకు అతి తక్కువగా వెయ్యి రూపాయల నుంచి లక్షల్లో పందేలు జరుగుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement