కొనసాగుతున్న ఉత్కంఠ..
సాక్షి, హన్మకొండ: వరుస ఎన్నికల నేపథ్యంలో క్వార్టర్స్ ఫైనల్‌గా భావించిన పురపాలక పోరు క్లైమాక్స్ దశకు చేరింది. సార్వత్రిక ఎన్నికలకు కచ్చితంగా నెలరోజుల ముందు జిల్లాలోని రెండు మునిసిపాలిటీలు, మూడు నగర పంచాయతీల్లో ఎన్నికలు జరగగా... సోమవారం ఈ ఫలితాలు వెల్లడి కానున్నారుు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపోటముల అంశం మునిసి‘పోల్స్’ ఫలితాలతో కొంతమేర తేటతెల్లం కానుండడంతో జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న ముఖ్య నేతల్లో ఉత్కంఠ నెలకొంది. జనగామ, మహబూబాబాద్ మునిసిపాలిటీలు... నర్సంపేట, పరకాల, భూపాలపల్లి నగర పంచాయతీలకు మార్చి 30వ తేదీన ఎన్నికలు జరిగాయి.
వీటిలో కాంగ్రెస్ తరఫున జనగామ అసెంబ్లీ అభ్యర్థిగా తెలంగాణపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, భూపాలపల్లి నుంచి మాజీ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి బరిలో ఉన్నారు. మహబూబాబాద్ నుంచి కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే కవిత, నర్సంపేట నుంచి తెలంగాణ టీడీపీ అగ్రనేతల్లో ఒకరైన రేవూరి ప్రకాశ్‌రెడ్డి బరిలో నిలిచారు. మునిసిపాలిటీల్లో సాధించే ఓట్లను బట్టి సార్వత్రిక ఎన్నికల్లో ఆయూ పార్టీల అభ్యర్థులు సునాయాసంగా విజయం సాధిస్తారా... గట్టిపోటీని ఎదుర్కొంటారా... అనేది వెల్లడికానుంది. దీంతో మునిసిపల్ ఎన్నికల ఫలితాలు వారిని టెన్షన్‌కు గురిచేస్తున్నారుు.
టార్గెట్ పొన్నాల...
పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు పాసై...ఎన్నికల హడావుడి ప్రారంభమైన తర్వాత కాంగ్రెస్, టీఆర్‌ఎస్ పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. టీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యను టార్గెట్ చేస్తూ టీఆర్‌ఎస్ నేతలు వ్యూహం రచించారు. ఇందులో భాగంగానే పొన్నాలపై గులాబీ అధినేత కేసీఆర్ నిత్యం విమర్శలు గుప్పించినట్లు వినికిడి. మరోవైపు టీఆర్‌ఎస్ నాయకులు జనగామలో గల్లీగల్లీకి తిరుగుతూ విస్తృత ప్రచారం చేశారు. అంతేకాదు.. సొంత ఇలాకాలోనే పార్టీని గెలిపించడం పొన్నాలకు కష్టం అనిపించేలా గులాబీ శ్రేణులు ప్రచారం సాగించాయి. ఈ వ్యూహాలకు పొన్నాల సైతం దీటుగానే స్పందించారు.
రాష్ట్ర వ్యాప్త బాధ్యతలు నిర్వర్తిస్తూనే... జనగామ మునిసిపాలిటీపై ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లాలో ఒకే ఒక వార్డు ఏకగ్రీవం కాగా... అది జనగామలో కాంగ్రెస్ పార్టీనే దక్కించుకునేలా వ్యవహరించి పోలింగ్‌కు ముందే ప్రత్యర్థులకు సవాల్ విసిరారు. టీఆర్‌ఎస్ ప్రచార హోరు చెక్ పెట్టేందుకు ఎన్నికల ప్రచారం చివరి రోజు పొన్నాల స్వయంగా జనగామలో పర్యటించారు. అరుుతే మునిసిపాలిటీ పోరులో ఎవరు విజయం సాధిస్తారో.. అసెంబ్లీ ఎన్నికల్లో వారిదే పైచేరుుగా నిలుస్తుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తుండడంతో అందరి దృష్టి జనగామపైనే ఉంది. అదేవిధంగా.. కేబినేట్ హోదా కలిగిన గండ్ర వెంకటరమణారెడ్డికి భూపాలపల్లి మునిసిపల్ ఎన్నికల్లో విజయం కీలకంగా మారింది.
ఇక్కడ టీఆర్‌ఎస్ పార్టీకి ఆధిక్యం దక్కకుండా ఉండేందుకు ఆయన రెండు నెలలకు పైగా స్థానికంగా ఉంటూనే అనేక ఎత్తులు వేశారు. వైస్ చైర్మన్ ఇస్తామంటూ సీపీఐతో స్థానికంగా పొత్తు కుదుర్చుకున్నారు. టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా కూటమిని ఏర్పాటు చేశారు. ఆయన వ్యూహం ఫలించి భూపాలపల్లి మునిసిపాలిటీలో కాంగ్రెస్, సీపీఐ కూటమి విజయం సాధిస్తే... సార్వత్రిక ఎన్నికల్లో సానుకూల ఫలితాలను ఆయన ఆశించవచ్చు. లేనిపక్షంలో అక్కడ కూడా చివరి నిమిషం వరకు ఏమవుతుందో... ఏమోననే అనిశ్చితి నెలకొనే అవకాశం ఉంది.
సిట్టింగ్‌లకు సంకటం
పరకాల నగర పంచాయతీలో టీఆర్‌ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే మొలుగూరి బిక్షపతికి ఆ పార్టీ నాయకత్వం ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ నిరాకరించింది. ఇక... నర్సంపేట, మహబూబాబాద్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్న రేవూరి ప్రకాశ్‌రెడ్డి, మాలోతు కవిత ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేశారు. దీంతోమునిసిపల్ పోలింగ్ సరళి ఏ విధంగా జరిగిందనే అంశంపై వీరిద్దరూ ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. పరకాల నగర పంచాయతీ పోలింగ్ జరిగే సమయానికి ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి దిశానిర్ధేశం చేసే నాయకులు కరువయ్యారు. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఇక్కడ త్రిముఖ పోరు నెలకొంది. టీఆర్‌ఎస్ అభ్యర్థి సహోదర్‌రెడ్డి, టీడీపీ అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి ఇనుగాల వెంకట్రాంరెడ్డి పోటీపడ్డారు. మునిసిపల్ ఎన్నికల్లో వచ్చే ఓట్లు, గెలిచే వార్డు మెంబర్ల సంఖ్యను బట్టి ఈ ముగ్గురు తమ విజయావకాశాలపై ఓ అంచనాకు వచ్చే అవకాశం ఉంది.