విజయవాడ సిటీ, న్యూస్‌లైన్ : జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల భవితవ్యం మంగళవారం తేలనుంది. గత నెలలో రెండు విడతలుగా జరిగిన పోలింగ్‌కు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియ కోసం అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. జిల్లాలో 49 జెడ్పీటీసీ, 812 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. మరోపక్క జెడ్పీటీసీ, ఎంపీటీసీల్లో కైవసం చేసుకునే స్థానాలపై ప్రధాన పార్టీలు ఇప్పటికే అంచనాలు వేస్తున్నాయి. తద్వారా జెడ్పీ చైర్‌పర్సన్, మండల అధ్యక్ష పదవులను దక్కించుకునేందుకు వైఎస్సార్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు వ్యూహాలు సిద్ధం చేస్తున్నాయి.
ఇందుకోసం ఆయా మండలాల్లో నాయకులు ఇప్పటికే నడుంబిగించినట్లు సమాచారం. జెడ్పీ చైర్‌పర్సన్, ఎంపీపీల ఎన్నిక ప్రక్రియ కోసం నోటిఫికేషన్ విడుదల కాకముందే తమ బలాబలాలను ఆయా పార్టీల నాయకులు అంచనా వేసుకుంటున్నారు. ఆధిపత్యం నిలుపుకోవటం కోసం ఫిరాయింపులు అవకాశం ఉండే ప్రాంతాలలో అవసరమైతే క్యాంపులు నిర్వహించే ప్రతిపాదనలపై కూడా చర్చలు జరుగుతున్నట్లు సమాచారం.
నాలుగు డివిజన్‌లలో కౌంటింగ్...
జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి జిల్లాలో నాలుగు డివిజన్ కేంద్రాల్లో ఆయా డివిజన్ల పరిధిలోని మండలాలకు సంబంధించి కౌంటింగ్ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో 12 మండలాలకు సంబంధించి కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తయ్యాయి. మచిలీపట్నం వరలక్ష్మి పాలిటెక్నిక్ కళాశాలలో కృతివెన్ను, బంటుమిల్లి, పెడన, గూడూరు, బందరు, చల్లపల్లి, మోపిదేవి, ఘంటసాల, మొవ్వ, అవనిగడ్డ, కోడూరు, నాగాయలంక మండలాలకు సంబంధించి కౌంటింగ్ జరుపుతారు. గుడివాడ ఏఎన్‌ఆర్ కళాశాలలో తొమ్మిది మండలాలకు సంబంధించి కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక్కడ గుడివాడ, నందివాడ, గుడ్లవల్లేరు, పెదపారుపూడి, పామర్రు, ముదినేపల్లి, మండవల్లి, కైకలూరు, కలిదిండి మండలాల ఓట్ల లెక్కింపు చేపడతారు. నూజివీడులో 14 మండలాలకు సంబంధించి కౌంటింగ్ కోసం సారథి ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాట్లు చేశారు.
ఇక్కడ తిరువూరు, గంపలగూడెం, ఎ.కొండూరు, రెడ్డిగూడెం, విస్సన్నపేట, చాట్రాయి, ముసునూరు, నూజివీడు, ఆగిరిపల్లి, బాపులపాడు, ఉంగుటూరు, గన్నవరం, ఉయ్యూరు, పమిడిముక్కల మండలాలకు సంబంధించి కౌంటింగ్ జరుపుతారు. విజయవాడలో సిద్ధార్థ మహిళా కళాళాలలో డివిజన్‌లోని 14 మండలాల కౌంటింగ్ నిర్వహిస్తారు. ఇక్కడ విజయవాడ రూరల్, మైలవరం, ఇబ్రహీంపట్నం, జి.కొండూరు, జగ్గయ్యపేట, వత్సవాయి, పెనుగంచిప్రోలు, నందిగామ, చందర్లపాడు, కంచికచర్ల, వీరులపాడు మండలాలకు కౌంటింగ్ జరుపుతారు.
భారీ బందోబస్తు
కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. కౌంటింగ్ కేంద్రాలలో అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని జిల్లా కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు ఓ ప్రకటనలో తెలిపారు.
జెడ్పీ పీఠం దక్కేదెవరికో...
జెడ్పీ చైర్‌పర్సన్ పదవి జనరల్ మహిళకు కేటాయించారు. వైఎస్సార్‌సీపీ తరఫున తాతినేని పద్మావతి, టీడీపీ తరఫున గద్దె అనురాధ చైర్‌పర్సన్ అభ్యర్థులుగా బరిలో దిగారు. జిల్లాలోని 49 జెడ్పీటీసీలలో అత్యధిక స్థానాలు గెలిచిన పార్టీ అభ్యర్థి చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యే అవకాశముంది. దీంతో ప్రధాన పార్టీలు జెడ్పీ చైర్‌పర్సన్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు పావులు కదుపుతున్నాయి. ఇప్పటికే ఉభయ పార్టీల నాయకులు జెడ్పీటీసీలుగా గెలుపొందే తమ అభ్యర్థుల గురించి ఆరా తీస్తున్నారు.
జెడ్పీటీసీ, ఎంపీటీసీల కౌంటింగ్ రేపే
Published Mon, May 12 2014 1:44 AM | Last Updated on Tue, May 29 2018 4:06 PM
Advertisement