ఏకపక్షం
సాక్షి ప్రతినిధి, కడప, ఎన్నికలు ఏవైనా సరే ప్రజల లక్ష్యం ఒక్కటే. పార్టీ రహిత ఎన్నికలైనా, పార్టీ గుర్తులతో పోటీ చేసినా అంతిమ విజయం ప్రజాపక్షానిదేనని రుజువు చేస్తున్నారు. ప్రజానీకానికి అండదండగా నిలుస్తున్న వారికే పట్టం కడుతున్నారు. వరుసగా విజయాలను అప్పగిస్తూ ఏకపక్ష తీర్పుకు మొగ్గుచూపుతున్నారు. మూడేళ్లుగా జిల్లాలో చోటు చేసుకున్న ప్రతి ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకే అండగా ఫలితాలు నిలుస్తున్నాయి. జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా అదే ఊపు కన్పిస్తోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. జిల్లాలో 2011 నుంచి ప్రత్యక్ష ఎన్నికలు ఏవైనా అంతిమ విజయం వైఎస్సార్‌సీపీదేనని ఫలితాలు రుజువు చేస్తున్నాయి. 2011 మేనెల 8న కడప పార్లమెంటుకు ఎన్నికలు నిర్వహించారు.
ఆ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీచేసిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి 6,92,251 ఓట్లు లభించాయి. ప్రత్యర్థుల కంటే అత్యధికంగా 5,45,672 ఓట్ల మెజార్టీని కడప పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల ఓటర్లు కట్టబెట్టారు. 2012 మే12న చోటు చేసుకున్న ఉప ఎన్నికల్లో కూడా జిల్లా ప్రజలు వైఎస్సార్‌సీపీ కి అండగా నిలిచారు. రాయచోటిలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసిన గడికోట శ్రీకాంత్‌రెడ్డికి 56,891 ఓట్ల మెజార్టీ సమకూరింది. రైల్వేకోడూరు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ కొరముట్ల శ్రీనివాసులుకు 31,991 ఓట్ల మెజార్టీ లభించింది. రాజంపేట నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఆకేపాటికి 38,732 ఓట్ల మెజార్టీ దక్కింది. ఉప ఎన్నికల్లో జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ తన ఆధిపత్యాన్ని చాటుకుంది.
సహకార, పంచాయితీ ఎన్నికల్లోనూ...
ఎన్నికలు ఏవైనా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ కుటుంబానికి అండగా నిల్చిన వ్యక్తులకే ఓటర్లు మద్దతు పలుకుతున్నారు. అందుకు సహకార సంఘాలు, పంచాయితీ ఎన్నికలు దర్పం పడుతున్నాయి. జిల్లాలో 77 సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించగా 57 పాలక మండళ్లను వైఎస్సార్‌సీపీ మద్దతు దారులు దక్కించుకున్నారు. తద్వారా డీసీసీబీ, డీసీఎంఎస్ పీఠాలు వైఎస్సార్‌సీపీ నేతలకు దక్కాయి. ఆ తర్వాత చోటు చేసుకున్న పంచాయితీ ఎన్నికల్లో సైతం ఆపార్టీ మద్దతుదారులు విజయబావుటా ఎగురవేశారు. 783 పంచాయితీలకు ఎన్నికలు నిర్వహిస్తే అందులో 453 సర్పంచ్ స్థానాలను వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు దక్కించుకున్నారు.
152చోట్ల కాంగ్రెస్ పార్టీ వర్గీయులు, 143 స్థానాలను తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు దక్కించుకున్నారు. ఇటీవల జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా వైఎస్సార్‌సీపీకి అండగా ప్రజానీకం నిలిచినట్లు తెలుస్తోంది. కడప కార్పొరేషన్‌తో బాటు, పులివెందుల, ఎర్రగుంట్ల, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, రాయచోటి, బద్వేలు మున్సిపాలిటీలను కైవ సం చేసుకోనున్నట్లు విశ్లేషకులు అంచనాకు వచ్చారు. మైదుకూరు మున్సిపాలిటీలో మాత్రమే నువ్వానేనా అన్నట్లుగా పోటీ ఉందని అభిప్రాయ పడుతున్నారు. జిల్లాలో ఎన్నికలు అంటే వైఎస్సార్‌సీపీ నేతలదే విజయం అన్నట్లుగా ప్రజానీకం తీర్పు కట్టబెడుతున్నట్లు పరిశీలకులు పేర్కొంటున్నారు.
జెడ్పీటీసీ ఎన్నికల్లో సైతం...
ఇప్పటి వరకూ ఏకపక్ష తీర్పును కట్టబె డుతున్న ప్రజానీకం మరోమారు జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ అంతే ఉత్సాహాన్ని ప్రదర్శించనున్నారని పరిశీలకులు పేర్కొంటున్నారు. ఏకగ్రీవంగా 24 ఎంపీటీసీలు ఎంపికైతే 16చోట్ల వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు, ఒక చోట ఆపార్టీ సానుభూతి పరుడు స్వతంత్రుడుగాను ఎంపికయ్యారు. 6 స్థానాలను తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు దక్కించుకోగా, రైల్వేకోడూరు మండలంలో మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఒక స్థానాన్ని దక్కించుకోగల్గింది.
ఆదివారం జిల్లాలో తొలివిడతగా 29 మండలాల్లో ఎన్నికలు చోటుచేసుకోనున్నాయి. అందులో 80శాతం జెడ్పీటీసీలు వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు దక్కనున్నట్లు పరిశీలకులు పేర్కొంటున్నారు. ఓటరు నాడి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు అనుకూలంగా ఉందని, ఈపరిస్థితుల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా ఆపార్టీ విజయఢంకా మోగించనున్నట్లు పలువురు భావిస్తున్నారు.
ఎన్నికల్లో పోటీ చేయడమే మినహా అధికారిక పగ్గాలు చేజిక్కించుకోలేకున్నామనే బెంగ తెలుగుదేశం పార్టీ నేతలకు పట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికల్లోనైనా సత్తా చాటుదామనుకుంటే పాచికలు పారడంలేదని ఆపార్టీ సీనియర్ నేతలు బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నట్లు సమాచారం.