ఓటెత్తారు
సాక్షి, కరీంనగర్ : చెదురుమదురు సంఘటనలు మినహా.. జిల్లాలో రెండో విడత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. కరీంనగర్, సిరిసిల్ల రెవెన్యూ డివిజన్లలో శుక్రవారం జరిగిన పోలింగ్‌కు ఓటర్లు పోటెత్తారు. మొత్తం 10,16,928 మందికి గాను 8,26,578 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. రెండు డివిజన్లలో కలిపి 81.19 శాతం పోలింగ్ నమోదైంది. కరీంనగర్ డివిజన్‌లో 82.33 శాతం, సిరిసిల్ల డివిజన్‌లో 78.58 శాతం ఓటింగ్ నమోదైంది. మండలాల్లో అత్యధికంగా హుజూరాబాద్‌లో 86.90 శాతం, తక్కువగా గంభీరావుపేటలో 71.97 శాతం పోలింగ్ జరిగింది.
తొలి విడత ఎన్నికల్లో మాదిరిగానే రెండో విడతలోనూ మహిళా చైతన్యం వెల్లివిరిసింది. ఉద యం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. వృద్ధులు, వికలాంగులు మండుటెండను సైతం లెక్కచేయకుండా ఓటు హక్కు వినియోగించుకున్నారు. సిరిసిల్ల మండలం రాజీవ్‌నగర్, పెద్దూరులో పోలింగ్ ముగింపు సమయంలో ఒకేసారి మూడొందల మంది ఓటేసేందుకు రావడంతో అందరికీ అవకాశం కల్పించారు. దీంతో రాత్రి 6.30 గంటల దాకా పోలింగ్ జరిగింది. కరీంనగర్ మండలం బాహుపేటలో సాయంత్రం 5.30 వరకు ఓటేశారు. పోలింగ్ అనంతరం జిల్లా యంత్రాం గం బ్యాలెట్ బాక్సులను డివిజన్ కేంద్రాలకు తరలించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఓట్ల లెక్కింపు, ఫలితాలు వచ్చే నెలలో ప్రకటించనున్నారు. అప్పటిదాకా ఉత్కంఠ తప్పదు.
ఓట్ల గల్లంతు!
కరీంనగర్ డివిజన్‌లో 18 జె డ్పీటీసీ, 282 ఎంపీటీసీ స్థానా లు, సిరిసిల్లలో 09 జెడ్పీటీసీ, 126 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. చాలా మండలాల్లో ఓటరు జాబితా నుంచి తమ పేర్లు గల్లంతవడంతో ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద ఆందోళనకు దిగారు. తిమ్మాపూర్ మండలం రామకృష్ణాపూర్‌కాలనీలో బుడిగజంగాల కులస్తులవి 400 మందికి పైగా ఓట్లు గల్లంతు కావడంతో రాజీవ్ రహదారిపై బైఠాయించారు. పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు. అక్కడికి వచ్చిన తహశీల్దార్ రజనిని బాధితులు నిలదీశారు. స్థానికంగా ఉండకపోవడంతో తొలగించామని, మళ్లీ చేర్చామని ఆమె సుముదాయించారు. కొత్త జాబితా రెండు రోజు ల్లో ప్రకటిస్తామని, 30న అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు ఓటు వేసే అవకాశం కల్పిస్తామని చెప్పడంతో శాంతించారు. ఒక్క ముస్తాబాద్ మండలంలోనే 2వేలకు పైగా ఓట్లు గల్లంతయ్యాయి.
తెర్లుమద్దిలో 250, పోత్గల్‌లో 200, ముస్తాబాద్‌లో 300, చిప్పలపల్లిలో 50, బందనకల్‌లో 360 ఓట్లు గల్లంతయ్యాయి. చీకోడులో 270 మంది ఓట్ల జాడే లేదు. ఎల్లారెడ్డిపేటలో 87, వీణవంక మండలంలో 60 ఓట్లు, కరీంనగర్ మండలంలో సుమారు 200కు పైగా ఓట్లు గల్లంతు కావడం తో బాధితులు ఆందోళనకు దిగారు. పోల్ చీటీలు సరిగా అందక మొదటి విడత ఎన్నికల్లో ఇబ్బందులు ఎదురైనా... రెండో విడతకు కూడా పరిస్థితి మారలేదు. బెజ్జంకి మండలం గన్నేరువరం పోలింగ్ కేంద్రంలో ఓటర్ల రద్దీ ఎక్కువవడంతో.. వారిని ‘క్యూ’లో నిలబట్టేందుకు పోలీసులు ఓటర్లను వెనకకు తోయగా క్యూలో నిల్చున ఎల్లవ్వ అనే వృద్ధురాలు కిందపడడంతో కాలు విరిగింది.
ఓటేసిన ప్రముఖులు
మానకొండూర్‌లో ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కమలాపూర్‌లో హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్, హుజూరాబాద్ మండలం జూపాకాలో అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి కేతిరి సుదర్శన్‌రెడ్డి, సింగాపూర్‌లో మాజీ మంత్రి కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఓటు వేశారు. కోనరావుపేట మండలం నాగారంలో కేంద్ర మాజీ మంత్రి చెన్నమనేని విద్యాసాగర్‌రావు, చందుర్తి మండలం రుద్రంగిలో నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి ఆది శ్రీనివాస్ ఓటుహక్కు వినియోగించుకున్నారు.