రేపే తొలి విడత
కరీంనగర్ సిటీ, న్యూస్‌లైన్ : జెడ్పీటీసీ, ఎంపీటీసీ తొలి విడత ఎన్నికల ప్రచారానికి శుక్రవారం తెరపడింది. పెద్దపల్లి, మంథని, జగిత్యాల డివిజన్లలోని 30 జెడ్పీటీసీ, 409 ఎంపీటీసీ స్థానాలకు ఈ నెల 6న పోలింగ్ జరగనుంది. ఆదివారం ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటలకు పోలింగ్ జరగనుంది. శుక్రవారం సాయంత్రమే ప్రచారానికి తెరపడడంతో ఓటర్లకు గాలం వేయడంలో అభ్యర్థులు బిజీ అయ్యారు. యువజన సంఘాలు, మహిళా సంఘాలు, కుల సంఘాల వారీగా రాత్రి నుంచే ప్రత్యేక సమావేశాలు గుట్టుగా నిర్వహిస్తున్నారు.
పార్టీల అభ్యర్థుల తరఫున ఇప్పటికే ప్రధాన నాయకులు జిల్లా అంతటా ప్రచారం సాగించారు. ఎక్కడి ఎమ్మెల్యేలు అక్కడే తమ అభ్యర్థుల తరఫున ఊరూరూ తిరిగారు. టీఆర్‌ఎస్ అభ్యర్థుల పక్షాన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మంథని, వెల్గటూరు, కథలాపూర్, ఇబ్రహీంపట్నం తదితర ప్రాంతాల్లో సుడిగాలి పర్యటన చేశారు. ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్‌ను ఎండగడుతూ ఆమె ప్రచారం సాగింది. కాంగ్రెస్ పార్టీ తరఫున మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఎంపీ పొన్నం ప్రభాకర్‌తో పాటు స్థానికంగా మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జీలు ప్రచారం చేపట్టారు.
కాంగ్రెస్‌తోనే తెలంగాణ రాష్ట్ర కల సాకారమైందనే అంశానికే ప్రచారంలో వారు ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చారు. సీట్ల అవగాహనతో పోటీ చేసిన బీజేపీ, టీడీపీ నేతలు ప్రాదేశిక ఎన్నికలను పెద్దగా పట్టించుకోలేదు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల తరపున ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు సింగిరెడ్డి భాస్కర్‌రెడ్డి ప్రచారం చేపట్టారు.
కీలకస్థానాలు ఇక్కడే..
తొలివిడత ఎన్నికల్లో జిల్లా పరిషత్ చైర్మన్ పీఠం పై గురిపెట్టిన అభ్యర్థుల స్థానాలే ఎక్కువగా ఉన్నాయి. తొలిసారి జెడ్పీ చైర్‌పర్సన్ పదవి మహిళకు రిజర్వ్ కావడంతో, కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ల నుంచి మహిళా నాయకులు, నేతల భార్యలు బరిలోకి దిగారు. ఆయా పార్టీలు అధికారికంగా చైర్‌పర్సన్ అభ్యర్థులను ప్రకటించకున్నా, టీఆర్‌ఎస్ తరపున ఆ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు తుల ఉమ, యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వీర్ల వెంకటేశ్వర్‌రావు భార్య వీర్ల కవిత, కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్యే కొడూరి సత్యనారాయణగౌడ్ భార్య కోడూరి అరుణ ప్రచారంలో ఉన్నారు.
తుల ఉమ కథలాపూర్ నుంచి పోటీలో ఉండగా, వీర్ల కవిత రామడుగు నుంచి పోటీ చేస్తున్నారు. టీఆర్‌ఎస్ ముఖ్యనేతల ఆశీస్సులు తమకే ఉన్నాయనే భరోసాతో ఇద్దరూ ప్రచార బరిలో దూసుకుపోతున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ తరఫున మాజీ ఎమ్మెల్యే కోడూరి సత్యనారాయణగౌడ్ భార్య కోడూరి అరుణ గంగాధర స్థానం నుంచి పోటీలో ఉన్నారు. గతంలో కరీంనగర్ మేయర్ విషయంలో తనకు అన్యాయం జరిగినందున ఈ సారి జెడ్పీ చైర్‌పర్సన్ స్థానం తమకే దక్కుతుందనే ధీమాతో ఉన్నారు.
పార్టీ ప్రధాన నాయకుల హామీతోనే పోటీకి దిగినట్లు శ్రేణులు చెబుతున్నాయి. చైర్‌పర్సన్ అభ్యర్థులు సొంత పార్టీలతోపాటు ఇతర పార్టీల నేతలను, ఇండిపెండెంట్ అభ్యర్థులను కూడా మచ్చిక చేసుకొనే పనిలో పడ్డారు. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాని పక్షంలో అవసరం పడతారనే ముందుచూపుతో ఇప్పటినుంచే మంతనాలు సాగిస్తున్నారు.