కర్నూలు(అర్బన్), న్యూస్‌లైన్: జిల్లాలో తొలి విడత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈనెల 6వ తేదీన పోలింగ్‌ను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ముందస్తు చర్యలు చేపట్టింది. కర్నూలు, నంద్యాల డివిజన్లలోని 36 మండలాల్లో 36 జెడ్పీటీసీ, 512 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికల దృష్ట్యా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత కల్పించారు.
మొత్తం 2,434 పోలింగ్ కేంద్రాల్లో 162 కేంద్రాలను అత్యంత సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. ఆయా పోలింగ్ కేంద్రాల్లో 400 మంది ఇంజనీరింగ్ విద్యార్థులచే వెబ్‌క్యాస్టింగ్‌కు ఏర్పాట్లు చేశారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో పరిశీలనకు 400 మంది సూక్ష్మ పరిశీలనకులను నియమించారు. ఎన్నికలు జరగనున్న మండలాలకు ఇప్పటికే బ్యాలెట్ బాక్సులను, బ్యాలెట్ పేపర్లను అవసరమైన మేరకు తరలించారు.
ఇప్పటికే పోలింగ్ సిబ్బందికి అవసరమైన శిక్షణనిచ్చారు. ఇకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపోటములను మహిళా ఓటర్లే నిర్దేశించనున్నారు. మార్చి 10, 2014 నాటి కి సేకరించిన లెక్కల ప్రకారం జిల్లాలో గ్రామీణ ఓటర్లు 20,21,330 మంది కాగా.. పురుషులు 10,05,352, మహిళలు 10,15,976 మంది ఉన్నారు. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు మహిళా ఓటర్లపైనే అత్యధికంగా దృష్టి సారించారు.
రేపు తొలి విడత ‘స్థానిక’ పోరు
Published Sat, Apr 5 2014 2:20 AM | Last Updated on Mon, Sep 17 2018 6:08 PM
Advertisement