ఇక ప్రాదేశిక పోరు
జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై దృష్టి సారించిన నేతలు
సాక్షి, అనంతపురం : వరుస ఎన్నికలు రాజకీయ పార్టీల నాయకులకు ఊపిరి ఆడనివ్వడం లేదు. ఒకేసారి మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సార్వత్రిక ఎన్నికలు.. ఒకదాని తర్వాత మరొకటి రావడంతో నేతలు బిజీబిజీగా ఉన్నారు. పార్టీ గుర్తులతో జరిగే ఈ ఎన్నికలపై వైఎస్సార్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు ప్రధానంగా దృష్టి సారించాయి. జిల్లాలోని అనంతపురం నగర పాలక సంస్థతో పాటు హిందూపురం, గుంతకల్లు, తాడిపత్రి, ధర్మవరం, కదిరి, రాయదుర్గం, మడక శిర, పుట్టపర్తి, గుత్తి, పామిడి, కళ్యాణదుర్గం మున్సిపాలిటీ, నగర పంచాయతీలలో ఆదివారం నిర్వహించిన పోలింగ్ చెదురుమదురు సంఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది.
పట్టణ శివారు ప్రాంతాల్లో నివసిస్తున్న వారిలో సుమారు 50 శాతం మందికి పైగా ఇటు పట్టణాల్లోనూ అటు గ్రామీణ ప్రాంతాల్లోనూ ఓట్లు ఉన్నాయి. బుక్కరాయసముద్రం, శింగనమల మండలాల్లోని సుమారు 200 మంది ఆదివారం నిర్వహించిన అనంతపురం నగర పాలక సంస్థలోని 20వ డివిజన్‌లో ఓటు వేసేందుకు వచ్చారు. వీరందరి పేర్లు ఆ డివిజన్‌లోని తెలుగుదేశం పార్టీ అభ్యర్థి స్వరూప ఓటరు జాబితాలో చేర్చారనే ఆరోపణలు బలంగా విన్పిస్తున్నాయి. 20వ డివిజన్‌లోని దాదాపు 200 మంది పేర్లు అటు గ్రామాల్లోనూ ఇటు పట్టణాల్లోనూ ఉన్నట్లు గుర్తించారు. అయినప్పటికీ ఎన్నికల అధికారులు వారిని అడ్డుకోలేకపోయారు.
అన్ని మున్సిపాలిటీల్లో కూడా ఇదే పరిస్థితి ఉండటంతో అలాంటి వారిని గుర్తించి.. వారితో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ఓట్లు వేయించుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు మున్సిపల్, ప్రాదేశిక ఎన్నికల్లో లబ్ధి పొందాలనే ఉద్దేశంతో కొందరి పేర్లను రెండు చోట్లా చేర్పించినట్లు తెలుస్తోంది. మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంతో ఇక రాజకీయ నాయకులు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ ఎన్నికలు రెండు విడతలుగా నిర్వహిస్తారు. వచ్చే నెల 6వ తేదీన మొదటి విడతలో 31 మండలాలు, 11వ తేదీన రెండవ విడతలో 32 మండలాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు.
మొత్తం 63 జెడ్పీటీసీ స్థానాలకు గాను 239 మంది పోటీలో ఉన్నారు. 849 ఎంపీటీసీ స్థానాలకు నోటిఫికేషన్ ఇవ్వగా వీటిలో 12 ఎంపీటీసీ స్థానాల్లో అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగిలిన 837 స్థానాలకు గాను 808 మంది పోటీలో ఉన్నారు. మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో పేదల కోసం పలు సంక్షేమ పథకాలు అమలు చేసినా ఆ తర్వాత వచ్చిన పాలకులు వాటిని అమలు చేయకుండా చేతులెత్తేశారు. తిరిగి ఆ పథకాలన్నీ పేదల దరి చేరాలంటే యువ నాయకత్వం అవసరం వుందని గుర్తించి గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లు బహిరంగంగా వైఎస్సార్ కాంగ్రెస్‌కు ఓటు వేస్తామని తమ మనోగతాన్ని వెల్లడిస్తున్నారు.
దీంతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు చేసేది ఏమీ లేక పోటీలో ఉన్న స్వతంత్ర అభ్యర్థుల వెంట పడుతున్నారు. ప్రచారం చేయకుండా తమకు మద్దతు తెలుపాలని కోరుతున్నారు. ఇప్పటికే చాలా చోట్ల కాంగ్రెస్ అభ్యర్థుల మద్దతు కోరినట్లు తెలుస్తోంది. ఎంపీటీసీ ఎన్నికల్లో 201 మంది, జెడ్పీటీసీ ఎన్నికల్లో 55 మంది స్వతంత్ర అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వీరందరినీ వ్యక్తిగతంగా కలిసి తెలుగుదేశం పార్టీ నేతలు మద్దతు కోరుతున్నట్లు సమాచారం