నేడు ‘పల్లె’ ఫలితాలు
జిల్లా పరిషత్, న్యూస్‌లైన్: నెల రోజులపాటు కొనసాగిన ఉత్కంఠకు తెరపడనుంది. సార్వత్రిక ఎన్నికలకు ముందు సెమీస్‌గా సాగిన పల్లె పోరులో పోటీ పడిన నేతల భవితవ్యం మంగళవారం తేలనుంది. ఉదయం 8 గంటలకు ప్రాదేశిక ఓట్ల లెక్కింపు మొదలుకానుంది. జిల్లా, మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ స్థానాలకు ఈ ఏడాది ఏప్రిల్ 6, 11వ తేదీల్లో రెండు విడతలుగా ఎన్నికలు జరిగారుు. జిల్లాలోని 50 జెడ్పీటీసీ స్థానాల్లో 337 మంది... 705 ఎంపీటీసీ స్థానాల్లో నాలుగు ఏకగ్రీవం కాగా, విగిలిన వాటిలో 2,989 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. ఈ మేరకు ఓట్ల లెక్కింపు కోసం జిల్లాలోని ఐదు డివిజన్ల పరిధిలో ఏడు కేంద్రాలు కేటారుుంచారు.
వరంగల్, నర్సంపేట, జనగామ డివిజన్లకు ఒకటి చొప్పున, మహబూబాబాద్, ములుగు డివిజన్లకు రెండు చొప్పున కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో భాగంగా మొత్తం 2,214 మంది అధికారులను నియమించారు. కౌంటింగ్‌కు మొత్తం 491 టేబుళ్లను ఏర్పాటు చేశారు. ముందుగా ఎంపీటీసీ ఫలితాలు వెల్లడించిన అనంతరం జెడ్పీటీసీ ఫలితాలు వెలువడనున్నారుు. బ్యాలెట్ పద్ధతిన పోలింగ్ జరిగిన నేపథ్యంలో ఫలితాలు ఆలస్యంగా వెలువడే అవకాశాలున్నారుు. బ్యాలెట్ బాక్స్‌లను తెరిచి 25 చొప్పున కట్టలు కట్టడం మధ్యాహ్నం వరకు సాగుతుంది. ఆ తర్వాతే ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుండడంతో పూర్తి స్థాయిలో ఫలితాలు కోసం అర్ధరాత్రి వరకు వేచి చూడాల్సిందే.
మండలాలవారీగా కౌంటింగ్ కేంద్రాలు...
ములుగు రెవెన్యూ డివిజన్ పరిధిలో ఏటూరునాగారం, మంగపేట, తాడ్వాయి, గోవిందరావుపేట, ములుగు, వెంకటాపురం మండలాల ఓట్ల లెక్కింపునకు ములుగులోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో కేంద్రం ఏర్పాటు చేశారు. అదేవిధంగా.. భూపాలపల్లి, మొగుళ్లపల్లి, శాయంపేట, గణపురం, చిట్యాల, పరకాల, రేగొండ మండలాల ఓట్ల లెక్కింపును పరకాలలోని గణపతి ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించనున్నారు.
నర్సంపేట రెవెన్యూ డివిజన్ పరిధిలోని చెన్నారావుపేట, దుగ్గొండి, గూడూరు, ఖానాపురం, కొత్తగూడ, నల్లబెల్లి, నర్సంపేట మండలాల ఓట్ల లెక్కింపు కోసం నర్సంపేట ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో కేంద్రం ఏర్పాటు చేశారు.
జనగామ డివిజన్ పరిధిలో స్థానిక ప్రసాద్ ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన కేంద్రంలో బచ్చన్నపేట, చేర్యాల, దేవరుప్పుల, జనగామ, కొడకండ్ల, లింగాల ఘనపురం, మద్దూరు, నర్మెట, పాలకుర్తి, రఘునాథపల్లి మండలాల ఓట్లను లెక్కించనున్నారు.
మహబూబాబాద్ డివిజన్ పరిధిలోని కేసముద్రం, కురవి, మహబూబాబాద్, నర్సింహులపేట, నెల్లికుదురు మండలాల్లోని ఓట్ల లెక్కింపు కోసం ఏపీ మోడల్ స్కూల్(అనంతారం)లో... మరిపెడ, తొర్రూరు, నెక్కొండ, డోర్నకల్ మండలాల ఓట్ల లెక్కింపునకు మానుకోటలోని ఫాతిమా హైస్కూల్‌లో కేంద్రం ఏర్పాటు చేశారు.
వరంగల్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఆత్మకూరు, ధర్మసాగర్, గీసుకొండ, స్టేషన్‌ఘన్‌పూర్, హన్మకొండ, హసన్‌పర్తి, పర్యతగిరి, రాయపర్తి, సంగెం, వర్ధన్నపేట, జఫర్‌గఢ్ మండలాల ఓట్ల లెక్కింపు కోసం జిల్లాకేంద్రంలోని నిట్‌లో కౌంటింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు.