నేడే తొలి విడత ప్రాదేశిక పోరు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: తొలివిడత ‘ప్రాదేశిక’ పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. ఆదివారం మల్కాజిగిరి, రాజేంద్రనగర్, వికారాబాద్ డివిజన్లలోని 303 ఎంపీటీసీ స్థానాలు, 16 జెడ్పీటీసీ స్థానాలకు ఓటింగ్ నిర్వహించనున్నారు.
ఇందుకు జిల్లా యంత్రాంగం 1,110 పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి చేసింది. తొలివిడత ప్రాదేశిక ఎన్నికల్లో 16,43,681 మంది ఓటర్లు తమ ఓటు హక్కును విని యోగించుకోనున్నారు. ఇందు లో 8,45,218 మంది పురుషులు, 7, 98,463 మంది మహిళలున్నారు.
ఈ మండలాల్లోనే..
తొలివిడతలో భాగంగా జిల్లాలోని 16 మండలాల్లో ఆదివారం ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5 గంటలవరకు పోలింగ్ కొనసాగనుంది. బంట్వారం, బషీరాబాద్, ధారూరు, ఘట్‌కేసర్, కీసర, మర్పల్లి, మేడ్చల్, మోమీన్‌పేట, పెద్దేముల్, కుత్బుల్లాపూర్, రాజేంద్రనగర్, శామీర్‌పేట, శంషాబాద్, తాండూరు, వికారాబాద్, యాలాల మండలాల్లో ఓటింగ్‌కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు.
శనివారం సాయంత్రానికే సిబ్బంది పోలింగ్ సామగ్రి, బ్యాలెట్ బాక్సులతో సహా వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. తొలివిడత పోలింగ్ ప్రక్రియలో 5,550 మంది సిబ్బందిని వినియోగించనున్నారు. మరో పది శాతం మంది ఉద్యోగులను రిజర్వులో ఉంచారు. జిల్లాలో 215 సున్నితమైన, 165 అతి సున్నిత పోలింగ్ కేంద్రాలున్నాయి. వీటి పరిధిలో వెబ్‌కాస్టింగ్‌తోపాటు వీడియో చిత్రీకరణకు అధికారులు ఏర్పాట్లు చేశారు.
బరిలో 1,291 మంది అభ్యర్థులు
ప్రాదేశిక ఎన్నికల్లో భాగంగా తొలివిడతలో జరుగుతున్న మండలాల్లో మొత్తం 1,291 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో 303 ఎంపీటీసీ స్థానాలకు 1,211 మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా, 16 జెడ్పీటీసీ స్థానాలకు 80 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వికారాబాద్ డివిజన్‌లోని 9 జెడ్పీటీసీ స్థానాలకు 36 మంది పోటీలో ఉండగా.. రాజేంద్రనగర్ డివిజన్‌లోని రెండు స్థానాలకు 12 మంది బరిలో ఉన్నారు. మల్కాజిగిరి డివిజన్‌లోని ఐదు స్థానాలకు 32 మంది పోటీ పడుతున్నారు.
నెల తర్వాతే ఫలితాలు
ప్రాదేశిక ఎన్నికలు నిర్వహిస్తున్నప్పటికీ ఫలితాలు మాత్రం ఇప్పట్లో వెల్లడికావు. ఫలితాలు ప్రకటిస్తే వాటి ప్రభావం సార్వత్రిక ఎన్నికలపై పడుతుందని పేర్కొంటూ పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో.. ఫలితాలను సార్వత్రిక ఎన్నికలు పూర్తయిన తర్వాతే వెల్లడించాలని న్యాయస్థానం ఆదేశించింది. దీంతో ఎన్నికలు నిర్వహించడంతో సరిపెట్టనున్న యంత్రాంగం.. ఫలితాలను మాత్రం వచ్చేనెలలో ప్రకటించనుంది.