‘స్థానిక’ వీరుడు ఎవరో?
చిత్తూరు(అర్బన్), న్యూస్‌లైన్: జిల్లాలో మున్సిపల్ ఎన్నికలఫలితాలు వెలువడ్డాయి. ఇక రెండో అంకం స్థానిక సంస్థల ఫలితాలు. జిల్లాలోని 65 జెడ్పీటీసీ, 887 ఎంపీటీసీ స్థానాలకు ప్రజలు ఇచ్చిన తీర్పు మంగళవారం బహిర్గతం కానుంది. జెడ్పీ పీఠాన్ని అధిరోహించాలంటే 33 జెడ్పీటీసీ స్థానాలను కైవశం చేసుకోవాల్సి ఉంటుంది. బ్యాలెట్‌పత్రాల రూపంలో ఇచ్చిన తీర్పును లెక్కించడానికి అధికారులు ఆరుచోట్ల కేంద్రాలు ఏర్పాటు చేశారు.
35 లక్షలకు పైగా ఓట్లు
జిల్లాలో స్థానిక సంస్థలకు సంబంధించి గతనెల మదనపల్లె, తిరుపతి, చిత్తూరు డివిజన్లకు రెండు విడతలుగా ఎన్నికలు నిర్వహించిన విషయం తెలిసిందే. మదనపల్లె డివిజన్‌లోని 31 మండలాల్లో జెడ్పీటీసీ స్థానాలకు 144 మంది పోటీ చేయగా 8,74,292 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎంపీటీసీలకు 8,78,339 మంది బ్యాలెట్ ద్వారా ఓట్లు వేశారు. తిరుపతి డివిజన్‌లో 9,19,978 మంది, చిత్తూరులో 8,98,184 మంది ఓట్లు వేశారు. మొత్తం 35,70,793 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఓట్లన్నీ బ్యాలెట్ పత్రాల రూపంలో ఉండటంతో లెక్కింపునకు ఎక్కువ సమయం పట్టే అవకాశముంది. పూర్తిస్థాయి ఫలితాలు రాత్రి 10 గంటలకు తెలిసే అవకాశముందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
మ్యాజిక్ ఫిగర్ ఎవరికో?
జెడ్పీ చైర్‌పర్సన్ స్థానం ఈసారి మహిళలకు కేటాయించిన విషయం తెలిసిందే. ఓసీ మహిళకు రావడంతో ఈ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ, టీడీపీ మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. జెడ్పీ పీఠాన్ని దక్కించుకోవాలంటే జిల్లాలోని 65 స్థానాలకుగానూ 33 ఏ పార్టీ అయితే గెలుస్తుందో ఆ పార్టీకే చైర్‌పర్సన్ స్థానం దక్కుతుంది.
కౌంటింగ్ జరిగే ప్రాంతాలివే
చిత్తూరు మండలంలోని చిత్తూరు, గుడిపాల, యాదమరి, గంగాధరనెల్లూరు, పూతలపట్టు, పెనుమూరు, బంగారుపాళెం, తవణంపల్లె, ఐరాల, ఎస్‌ఆర్.పురం, వెదురుకుప్పం, రామచంద్రాపురం, వడమాలపేట, పుత్తూరు, పాలసముద్రం, కార్వేటినగరం, నారాయణవనం, నగరి, నిండ్ర, విజయపురానికి చెందిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ బ్యాలెట్ పత్రాలను పూతలపట్టు మండల సమీపంలోని వేము ఇంజనీరింగ్ కళాశాలలో లెక్కిస్తారు.
పలమనేరులో రామకుప్పం, గుడుపల్లె, శాంతిపురం, కుప్పం, పలమనేరు, గంగవరం, బెరైడ్డిపల్లె, వీ.కోట, రామసముద్రం, పెద్దపంజాణి, పుంగనూరు, చౌడేపల్లె, పీలేరు, ఎర్రావారిపాలెం, చిన్నగొట్టిగల్లు, కేవీ.పల్లె, రొంపిచెర్ల, సదుం, సోమల మండలాలకు చెందిన బ్యాలెట్ పత్రాలను పలమనేరులోని మదర్ థెరిస్సా జూనియర్ కళాశాలలో లెక్కిస్తారు.
మదనపల్లెలోని మాచిరెడ్డిగారిపల్లెలో ఉన్న కేశవరెడ్డి పాఠశాలలో నిమ్మనపల్లె, కలికిరి, కలకడ, వాల్మీకిపురం, గుర్రంకొండ మండలాలకు చెందిన బ్యాలెట్ పత్రాలను లెక్కిస్తారు.
వశిష్ట పాఠశాలలో మదనపల్లె, కురబలకోట, బీ.కొత్తకోట, పెద్దమండ్యం, తంబళ్లపల్లె, పీటీఎం, ములకలచెరువు మండలాలకు సంబంధించి ఓట్లను లెక్కిస్తారు.
తిరుపతిలోని శ్రీపద్మావతి డిగ్రీ కళాశాలలో పాకాల, చంద్రగిరి, తిరుపతి, రేణిగుంట, ఏర్పేడు, పులిచెర్ల, శ్రీకాళహస్తి, తొట్టంబేడు మండలాలకు సంబంధించి ఓట్ల లెక్కింపు జరుగుతుంది. శ్రీ వేంకటేశ్వర ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో సత్యవేడు, నాగలాపురం, పిచ్చాటూరు, బీఎన్.కండ్రిగ, కేవీబీ.పురం, వరదయ్యపాళెం మండలాలకు సంబంధించి బ్యాలెట్ పత్రాలను లెక్కిస్తారు.